
అధికారపార్టీలో భారీ చీలిక
ఎథెన్స్: ఆర్థిక సంక్షభం అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభం గ్రీస్ను అతలాకుతలం చేస్తున్నది. ప్రధాని పదవికి రాజీనామాచేసి, మరోసారి ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రకటించిన సిరిజా పార్టీ అధ్యక్షుడు అలెక్సిస్ సైప్రస్కు శుక్రవారం మరో ఎదురుదెబ్బ తగిలింది.
అధికార పార్టీలో సైప్రస్ వ్యతిరేకులుగా ముద్రపడ్డ దాదాపు 25 మంది ఎంపీలు.. సిరిజా పార్టీని వీడి వేరు కుంపటిపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టా నియా డైలీ పత్రిక సైతం ఈ విషయాన్ని నిర్ధారించింది.
చీలిక ఎంపీల బృందం.. లెయికీ అనోటితా (ప్రఖ్యాత కూటమి) పేరుతో కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయింది. దీనికి మాజీ విద్యుత్ శాఖ మంత్రి పానజియోటిస్ లఫాజనిస్ నేతృత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో 300 స్థానాలున్న గ్రీక్ పార్లమెంట్లో సిరిజా పార్టీకి 149 స్థానాలు రాగా, 76 స్థానాలతో న్యూ డెమోక్రసీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. లెయికీ లనోటితా పార్టీ ఏర్పాటుతో గ్రీస్ రాజకీయ గమనం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.
యూరోజోన్తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో గ్రీసు ప్రధాని అలెక్సిస్ సైప్రస్ గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మెత్తం ప్రక్రియలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని ప్రజలకు వివరించిన ఆయన.. తర్వాతి ఎన్నికలు సెప్టెంబర్ 20న నిర్వహించనున్నట్లు చెప్పారు.