Alexis Tsipras
-
గ్రీస్ ఎన్నికల్లో సిప్రాస్ గెలుపు
ఏథెన్స్: గ్రీస్ మధ్యంతర ఎన్నికల్లో వామపక్ష పార్టీ సిరిజా నేత అలెక్సిస్ సిప్రాస్ మళ్లీ గెలుపొందారు. పెను రుణ సంక్షోభం నేపథ్యంలో గత నెల రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లిన అలెక్సిస్.. ఆదివారం నాటి ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. బుధవారం నాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. సమీప ప్రత్యర్థి పార్టీ న్యూ డెమొక్రసీ అధ్యక్షుడు వాంగెలిస్ మీమరాకిస్ ఓటమిని అంగీకరించారు. పార్లమెంట్లో 300 సీట్లు ఉండగా.. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీకి అదనంగా 50 సీట్లు లభిస్తాయి. ఆదివారం రాత్రి తుది వార్తలు అందేవరకూ సగం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. సిరిజా పార్టీకి 35 శాతం ఓట్లతో 150 స్థానాలు, న్యూ డెమొక్రసీ పార్టీకి 28 శాతం ఓట్లతో 75 స్థానాలు, మూడో స్థానంలో ఉన్న గోల్డెన్ డాన్ పార్టీకి 7 శాతం ఓట్లతో 19 సీట్లు వస్తాయని అంచనా. -
అధికారపార్టీలో భారీ చీలిక
ఎథెన్స్: ఆర్థిక సంక్షభం అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభం గ్రీస్‌ను అతలాకుతలం చేస్తున్నది. ప్రధాని పదవికి రాజీనామాచేసి, మరోసారి ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రకటించిన సిరిజా పార్టీ అధ్యక్షుడు అలెక్సిస్ సైప్రస్‌కు శుక్రవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీలో సైప్రస్ వ్యతిరేకులుగా ముద్రపడ్డ దాదాపు 25 మంది ఎంపీలు.. సిరిజా పార్టీని వీడి వేరు కుంపటిపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టా నియా డైలీ పత్రిక సైతం ఈ విషయాన్ని నిర్ధారించింది. చీలిక ఎంపీల బృందం.. లెయికీ అనోటితా (ప్రఖ్యాత కూటమి) పేరుతో కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయింది. దీనికి మాజీ విద్యుత్ శాఖ మంత్రి పానజియోటిస్ లఫాజనిస్ నేతృత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో 300 స్థానాలున్న గ్రీక్ పార్లమెంట్లో సిరిజా పార్టీకి 149 స్థానాలు రాగా, 76 స్థానాలతో న్యూ డెమోక్రసీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. లెయికీ లనోటితా పార్టీ ఏర్పాటుతో గ్రీస్ రాజకీయ గమనం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. యూరోజోన్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో గ్రీసు ప్రధాని అలెక్సిస్ సైప్రస్ గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మెత్తం ప్రక్రియలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని ప్రజలకు వివరించిన ఆయన.. తర్వాతి ఎన్నికలు సెప్టెంబర్ 20న నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ఓ ప్రధాని తల్లి ఆవేదన...
కొడుకు రాజైనా.. బంట్రోతైనా తల్లి మనసుకు తేడాలేదు. పంచే ప్రేమకు అవధిలేదు. ఇక బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడైతే ఆ తల్లి వ్యధ అనంతం. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తన దేశాన్ని ఓ తీరానికి చేర్చేందుకు కంటిమీద కునుకులేకుండా ప్రయత్నిస్తోన్న గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సైప్రస్ తల్లిది కూడా అలాంటి బాధే. ప్రస్తుతం సైప్రస్ ఎదుర్కొంటున్న కష్టాలను తనవిగా భావిస్తూ కొడుకు బాగుండాలని కోరుకుంటున్నది.. అలిక్సిస్ సైప్రస్ మాతృమూర్తి అరిస్ట్రి సైప్రస్. శనివారం ఏథెన్స్ లోని ఓ స్థానిక పత్రికకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అలెక్సిస్ ఒత్తిడిలో ఉండటం తనను బాధిస్తున్నదని చెప్పారు. 'కొద్ది రోజులుగా నాకు నిద్ర పట్టడంలేదు. ఎప్పుడూ నా కొడుకు గురించిన ఆలోచనలే. దేశ భారాన్నంతా తానొక్కడే మోస్తున్నాడనిపిస్తుంటుంది. నిజానికి వాడు నా దగ్గరకొచ్చి సేదతీరాలని కోరుకుంటాను. కానీ ప్రధానిగా ప్రతిక్షణం బిజీగా ఉండటంవల్ల సైప్రస్‌కు ఆ అవకాశం రావడంలేదు. కనీసం తన పిల్లల్ని కలుసుకునే తీరిక కూడా లేకుండాపోయింది వాడికి. పని ఒత్తిడిలో సరిగా తినట్లేదు. నిద్ర కూడా పోవట్లేదు. ఏం చేస్తాం.. ప్రస్తుతం అలెక్సిస్‌కి వేరే దారి లేదనేది స్పష్టం' అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చిన గ్రీస్ ప్రధాని తల్లి. చిన్నవయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్న తన కొడుకు.. భవిష్యత్ లో గ్రీస్ ను ఉన్నతంగా నిలబెడతాడనే నమ్మకం ఉందని చెప్పింది.