
గ్రీస్ ఎన్నికల్లో సిప్రాస్ గెలుపు
ఏథెన్స్: గ్రీస్ మధ్యంతర ఎన్నికల్లో వామపక్ష పార్టీ సిరిజా నేత అలెక్సిస్ సిప్రాస్ మళ్లీ గెలుపొందారు. పెను రుణ సంక్షోభం నేపథ్యంలో గత నెల రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లిన అలెక్సిస్.. ఆదివారం నాటి ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చారు. బుధవారం నాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. సమీప ప్రత్యర్థి పార్టీ న్యూ డెమొక్రసీ అధ్యక్షుడు వాంగెలిస్ మీమరాకిస్ ఓటమిని అంగీకరించారు.
పార్లమెంట్‌లో 300 సీట్లు ఉండగా.. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీకి అదనంగా 50 సీట్లు లభిస్తాయి. ఆదివారం రాత్రి తుది వార్తలు అందేవరకూ సగం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. సిరిజా పార్టీకి 35 శాతం ఓట్లతో 150 స్థానాలు, న్యూ డెమొక్రసీ పార్టీకి 28 శాతం ఓట్లతో 75 స్థానాలు, మూడో స్థానంలో ఉన్న గోల్డెన్ డాన్ పార్టీకి 7 శాతం ఓట్లతో 19 సీట్లు వస్తాయని అంచనా.