వీవీ ప్రాణాలు కాపాడాలి | Leaders Of Left Wing Parties Demanding To Release Varavara Rao | Sakshi
Sakshi News home page

వీవీని విడుదల చేసి.. ఆయన ప్రాణాలు కాపాడాలి

Published Sat, Jul 18 2020 3:32 AM | Last Updated on Sat, Jul 18 2020 3:34 AM

Leaders Of Left Wing Parties Demanding To Release Varavara Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్‌ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విజ్ఞప్తిచేశారు. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్‌ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడే బెయిల్‌ ఇచ్చి ఉంటే ఆయనకు కోవిడ్‌ సోకేది కాదన్నారు.

వెంటనే ఆయనను విడుదల చేసి డాక్టర్లు, కుటుంబసభ్యుల సంరక్షణలో హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని పేర్కొన్నారు.  శుక్రవారం మఖ్దూంభవన్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, ఎన్‌.బాలమల్లేష్‌ (సీపీఐ), డీజీ నర్సింహా రావు, బి.వెంకట్‌ (సీపీఎం), కె. గోవర్థన్‌. కె.రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), ఉపేందర్‌ రెడ్డి (ఎంసీపీఐ–యూ), సీహేచ్‌ మురహరి (ఎస్‌యూసీఐ–సీ),డి.రాజేశ్‌ (లిబరేషన్‌) పాల్గొన్నారు.

ప్రజాసంఘాల ర్యాలీ 
విరసం నేత వరవరరావుతోపాటు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని పీడీఎస్‌యూ, పీవోడబ్లు్య, ఐఎఫ్‌టీయూ, ఏఐకేఎంఎస్, ప్రజా సంఘాలు శుక్రవారం విద్యానగర్‌ నుంచి హిందీ మహావిద్యాలయ వరకు ర్యాలీ నిర్వహించాయి. పీవోడబ్లు్య జాతీయ అధ్యక్షురాలు వి.సంధ్య మాట్లాడుతూ వరవరరావు, సాయిబాబాలకు కరోనా సోకడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుత రామారావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి. అనురాధ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్, నగర అధ్యక్షుడు రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement