ట్రక్కు బాంబు పేలుళ్లు : 60 మంది దుర్మరణం
బీరూట్ : సిరియా ఈశాన్య ప్రాంతంలో హస్కా ప్రావిన్స్‌లో తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మారణహోమం సృష్టించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని ట్రక్కు బాంబులు పేల్చింది. ఈ ఘటనలో 60 మందికిపైగా మరణించారు. మరో 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ మేరకు కుర్దిష్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
హస్కా పట్టణంలోని ఆసుపత్రి, మార్కెట్ వద్ద శుక్రవారం ఈ దాడులు జరగగా... మరోకటి గురువారం ఆర్థరాత్రి టెల్ టమర్ పట్టణంలోని నివాస ప్రాంతాల సమీపంలో ఈ ట్రక్కు పేలుడు సంభవించిందని చెప్పారు. సిరియాలోని యూఎస్ సంకీర్ణ దళాలకు స్థానిక కుర్ధిష్ మిలటరీ సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఈ దాడికి తెగబడిందని ఉన్నతాధికారి వివరించారు.