టెర్రరిస్టుల బందిఖానాలు
రక్కా: ఐఎస్‌ఐఎస్ టెర్రిస్టులు తమ రాకాసి మూకలో చేరని మహిళలను కిడ్నాప్‌లు చేయడం, రోజుల తరబడి వారిని సామూహికంగా రేప్‌లు చేయడం లాంటి దారుణ సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. అదే కోవకు చెందిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యాజిది తెగకు చెందిన మహిళలను భూగర్భంలో నిర్బంధించిన అగ్గిపెట్టెలాంటి బందిఖానాలు ఓ మీడియా దర్యాప్తులో బయటపడ్డాయి.
సిరియాకు ఉత్తరానున్న ఎడారిలో ఈ బందిఖానాలు వెలుగు చూశాయి. సొరంగ మార్గంలో వరుసగా నిర్మించినట్లున్న ఈ బందిఖానాలపై డ్రైనేజీ మూతల్లాగా తలుపులున్నాయి. వాటికున్నా సన్నటి కన్నాల గుండా లోపలికి సోకే వెలుతురు తప్పా లోపలంతా చీకటిగానే ఉంది. నెలల తరబడి అక్కడే యాజిది మహిళలను నిర్బంధించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారేమయ్యారో కూడా తెలియదు. ఇదివరకు పట్టుబడ్డ యాజిదీ తెగకు చెందిన మహిళలను ఇనుప బోనుల్లో నిలబెట్టి నీట ముంచి టెర్రరిస్టులు హత్య చేసిన విషయం తెల్సిందే.