ISIS militants
-
ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రసంస్థ మొదట్నుంచీ సిరియా కేంద్రంగానే తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బషర్ అల్ అసద్ నియంత పాలనలో ఇన్నాళ్లూ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయి కటిక పేదరికంలో మగ్గిపోయిన సిరియన్లు ఇకనైనా మంచి రోజులు వస్తాయని సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందక్షణాలు కలకాలం అలాగే నిలిచి ఉంటాయో లేదోనన్న భయాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి.అసద్ పాలన అంతమయ్యాక పాలనాపగ్గాలు అబూ మొహమ్మద్ అల్ జొలానీ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈయన దేశాన్ని కర్కశపాలన నుంచి విముక్తి ప్రసాదించిన నేతగా ప్రస్తుతానికి స్థానికులు కీర్తిస్తున్నా ఆయన చరిత్రలో చీకటికోణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే జొలానీ మూలాలు అల్‌ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థతో మంచి దోస్తీ చేసి తర్వాత తెగదెంపులు చేసుకున్నా.. ఇప్పుడు మళ్లీ పాత మిత్రులకు ఆహ్వానం పలికితే సిరియాలో ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పుకుని కరాళ నృత్యం చేయడం ఖాయమని అంతర్జాతీయ యుద్ధ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జొలానీతో సుస్థిరత పాలన సాధ్యమా?ఉగ్రమూలాలున్న వ్యక్తికి యావత్‌దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. 2011లో వెల్లువలా విస్తరించిన అరబ్ ఇస్లామిక్ విప్లవం ధాటికి ఈజిప్ట్, లిబియా, టునీషియా, యెమెన్లలో ప్రభుత్వాలు కూలిపోయాయి. దేశ మత, విదేశాంగ విధానాలు మారిపోయాయి. ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) చీఫ్ హోదాలో జొలానీ సిరియాలోని తిరుగుబాటుదారులు, వేర్వేరు రెబెల్స్ గ్రూప్‌లను ఏకతాటి మీదకు తేగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అల్‌ఖైదాతో గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్‌టీఎస్‌ను అమెరికా, ఐక్యరాజ్యసమితి గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఉగ్రసంస్థగా ముద్రపడిన సంస్థ.. ఐసిస్‌ను నిలువరించగలదా అన్న మీమాంస మొదలైంది. రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 2019 నుంచి అమెరికా ఇచ్చిన సైనిక, ఆర్థిక సహకారంతో సిరియాలో పెద్దగా విస్తరించకుండా ఐసిస్‌ను బషర్ అసద్ కట్టడిచేయగలిగారు. సిరియా సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన అంతర్యుద్ధానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని మొహమ్మెద్ ఘాజీ జలానీ.. హెచ్‌టీఎస్ చీఫ్ జొలానీతో అధికార మార్పిడికి పూర్తి సుముఖత వ్యక్తంచేశారు.అయితే అధికారం చేతికొచ్చాక రెబెల్స్‌లో ఐక్యత లోపిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అంతా భయపడుతున్నారు. దేశం మొత్తమ్మీద జొలానీ పట్టుసాధించని పక్షంలో ఇన్నాళ్లూ దూరం దూరంగా చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమైన ఐసిస్ అత్యంత వేగంగా విస్తరించే సామర్థ్యాన్ని సముపార్జించగలదు. అసద్ పాలన అంతం తర్వాత ఆరంభమైన ఈ కొత్త శకం అత్యంత రిస్క్‌తో, ఏమౌతుందో తెలియని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు చూస్తుంటే క్షేత్రస్తాయిలో పరిస్థితి ఎంతటి డోలాయమానంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఐసిస్ ప్రభావమెంత?బషర్ అసద్ కాలంలోనూ ఆయనకు వాయవ్య సిరియాపై పట్టులేదు. అక్కడ ఐసిస్ ప్రభావం ఎక్కువ. ఈ వాయవ్య ప్రాంతంలో 900కుపైగా అమెరికా సైనికులు ఉన్నా సరిపోవడం లేదు. ఈ జనవరి–జూన్కాలంలో ఇరాక్, సిరియాల్లో ఐసిస్ 153 దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ గణాంకాల్లో వెల్లడైంది. ఐసిస్‌ను అంతమొందించేందుకు అమెరికా తరచూ గగనతల దాడులు చేస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులు, సానుభూతిపరులు, స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే 75 చోట్ల దాడులుచేసింది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీ ఎస్ తిరుగుబా టుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ఐసిస్ను ఎలా కట్టడిచేశారు?హెచ్‌టీఎస్ గ్రూప్‌కు మొదట్నుంచీ అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. అయితే 2016లో అల్‌ఖైదాతో హెచ్‌టీఎస్ తెగదెంపులు చేసుకుంది. అయితే 2011 నుంచే సిరియాలో ఐసిస్ విస్తరిస్తోంది. మాస్కులు ధరించిన ఐసిస్ ఉగ్రవాదులు అమాయక బందీలను తల నరికి చంపేసిన వీడియోలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాక ఐసిస్ ఎంత నిర్దయగల సంస్థో ప్రపంచానికి తెలిసివచ్చింది. 2014 నుంచే సిరియాలో ఐసిస్‌ను అంతం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో 2016లో అమెరికా కొంతమేర సఫలీకృతమైంది.కుర్ద్, తుర్కియే బలగాలకు ఆయుధ సాయం అందించి మరింత విస్తరించకుండా అమెరికా వాయవ్య సిరియాకు మాత్రమే ఐసిస్‌ను పరిమితం చేయగలిగింది. 2018లో ఐసిస్ పని అయిపోయిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ 2019లో మళ్లీ దాడులతో ఐసిస్ తనలో చావ చచ్చిపోలేదని నిరూపించుకుంది. అయితే ఐసిస్ ప్రభావం కొనసాగినంతకాలం అంతర్యుద్ధం తప్పదని మేధోసంస్థ గల్ఫ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అబ్దుల్అజీజ్ అల్ సగేర్ వ్యాఖ్యానించారు. 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పతనం, లిబియా నియంత గఢాఫీ 2011లో అంతం తర్వాత ఆయా దేశాల్లో పౌరయుద్ధాలు మొదలయ్యా యని ఆయన ఉదహరించారు.ఐసిస్‌ను నిలువరించే సత్తా జొలానీకి ఉందా?హెచ్‌టీఎస్ వంటి తిరుగుబాటు సంస్థకు నేతృత్వం వహించినా జొలానీ ఏనాడూ హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విప్లవయోధుడు చెగువేరా తరహాలో తానూ సిరియా విముక్తి కోసం పోరాడుతున్న ఆధునిక తరం యోధునిగా తన వేషభాషల్లో వ్యక్తంచేసేవారు. అతివాద సంస్థకు నేతృత్వం వహిస్తూనే ఉదారవాద నేతగా కనిపించే ప్రయత్నంచేశారు. ఐసిస్ వంటి ముష్కరమూకతో పోరాడాలంటే మెతక వైఖరి పనికిరాదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ ఐసిస్ అధీనంలోని వాయవ్య సిరియాలో ఎవరైనా తమను విమర్శిస్తే వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైళ్లో పడేయడం, చంపేయడం అక్కడ మామూలు.ఈ దారుణాలను సిరియా పగ్గాలు చేపట్టాక జొలానీ నిలువరించగలగాలి’’ అని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సోఫాన్ గ్రూప్ ఉగ్రవ్యతిరేక వ్యవహారాల నిపుణుడు కోలిన్ అన్నారు. ‘‘ అసద్‌ను గద్దె దింపేందుకు అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చుచేసింది. ఇప్పుడు కొత్త ఆశలు చిగురించినా ఐసిస్ నుంచి సవాళ్లు ఉన్నాయి’’ అని ట్రంప్ అన్నారు. జొలానీ పాలనాదక్షత, అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక, ఆయుధ అండదండలు అందితే, వాటిని సద్వినియోగం చేసుకుంటే సిరియాలో మళ్లీ శాంతికపోతాలు ఎగురుతాయి. లేదంటే మళ్లీ ఐసిస్ ముష్కరమూకలు సిరియన్ల కలలను కకావికలం చేయడం ఖాయం. -
ఐఎస్ ఉగ్రవాదుల అతి కిరాతకచర్య
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్ ప్రజలపై అతి కిరాతక చర్యకు పాల్పడ్డారు. ఇరాక్‌లోని మోసుల్ సమీపంలో ఉగ్రవాదులు 232 మంది ప్రజలను ఉరితీశారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేగాక ఐఎస్ ఉగ్రవాదులు వేలాదిమంది ప్రజలను బందీలుగా చేసుకుని, ఇరాక్ భద్రత బలగాలపై పోరాటంలో వారిని మానవ కవచల్లా వాడుకుంటున్నారు. ఉగ్రవాదుల ఆదేశాలను ధిక్కరించినవారిని దారుణంగా చంపేస్తున్నారు. ‘గత బుధవారం మోసుల్కు దక్షిణాదిన ఉన్న హమ్మమ్ అల్-అలీల్లో ఉగ్రవాదులు 42 మంది పౌరులను ఉరితీశారు. అదే రోజు మోసుల్ సమీపంలోని అల్ ఘజ్లానిలో ఐఎస్ సంస్థలో చేరేందుకు నిరాకరించిన 190 మంది ఇరాక్ మాజీ భద్రత అధికారులను చంపేశారు’ అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ హై కమిషనర్ రవీనా శందాసని చెప్పారు. ఉగ్రవాదులు వేలాదిమంది ప్రజలను మోసుల్ నగరంలోకి బందీలుగా తీసుకువచ్చారని, వీళ్లలో పిల్లలు, మహిళలు ఉన్నారని తెలిపారు. ఇరాక్ భద్రత బలగాలపై వారిని మానవ కవచాల్లో ప్రయోగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మోసుల్ నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరాక్ భద్రత బలగాలు పోరాడుతున్నాయి. మోసుల్కు సమీపంలోని అతిపెద్ద పట్టణం హమ్మమ్ అల్-అలీల్ను 90 శాతం స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా సంకీర్ణ సేనలు చేసిన దాడిలో దాదాపు 800 నుంచి 900 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. -
నాలుగేళ్ల పిల్లాడిని బాంబుతో పేల్చేశారు!
బాగ్దాద్ : పదేళ్లు కూడా సరిగ్గా నిండని బాలికలను సెక్స్ బానిసలుగా చేసుకొని వారిపై సామూహిక అత్యాచారాలు జరుపుతున్న ఐసిస్ ముష్కర మూకల రాక్షసత్వానికి పరాకాష్ట ఈ సంఘటన. నాలుగేళ్ల బ్రిటిష్ బాలుడి నడుముకు బాంబును కట్టి రిమోట్ కంట్రోలర్‌తో దాన్ని పేల్చివేశారు ఆ ముష్కరులు. ఆ పేలుడు ధాటికి గాలిలోకి రక్తం విరజిమ్మడమే కాకుండా ఆ బాలుడి శరీరంలో అంతర్గత అవయవాలు ముక్కలు ముక్కలై నేలంతా చెల్లాచెదురయ్యాయని ఆ ముష్కర మూకలకు వ్యతిరేకంగా పోరాడుతున్న 'పాపులర్ మొబలైజేషన్' బుధవారం వెల్లడించింది. తమ తోటి సైనికులను ఇద్దరిని చంపారన్న ఆక్రోశంతో ఆ పిల్లాడి తండ్రిని బహిరంగంగా హత్య చేసిన రెండు రోజులకే పిల్లాడిని ఇలా పేల్చివేశారని, ఈ సంఘటన ఐసిస్ స్వాధీనంలో వున్న ఉత్తర ఇరాక్‌లోని అల్ షీర్కత్ జిల్లాలో జరిగిందని ఆ గ్రూప్ వివరించింది. బ్రిటిష్ పౌరులనుద్దేశించి 'వారినందరిని చంపేస్తా' అన్న ఓ నాలుగేళ్ల పిల్లాడు హెచ్చరించిన ప్రాపగాండ వీడియోను టెర్రరిస్టులు విడుదల చేసిన అనంతరం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుందని ఆ రెబల్ గ్రూప్ తెలిపింది. చంపేస్తానన్న నాలుగేళ్ల పిల్లాడు ఇసాడేర్ కూడా బ్రిటీష్ పౌరుడేనని, ఆ బాలుడిని కిడ్నాప్ చేసి కొంతకాలం తమ నిర్బంధంలో ఉంచుకున్న టెర్రరిస్టులు ఆ బాలుడికి బ్రెయిన్ వాష్ చేసి అలా చెప్పించారని, అంతకు రెండు రోజుల ముందే ' తాతయ్యా, నన్ను రక్షించవా!' అంటూ టెర్రరిస్టులు తనకు ఫోన్ చేయించినప్పుడు తనను వేడుకున్నాడని ఇసాడేర్ తాత 59 ఏళ్ల హెన్రీ మంగళవారం బ్రిటీష్ మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. -
ప్రాణాలు లెక్కచేయని అక్కాచెల్లెళ్లు
ఇరాక్: రాక్షసత్వానికి కూడా అర్థం మార్చిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల కబంధ హస్తాల నుంచి తప్పించుకున్న యాజిదీ అమ్మాయిల ముందు ఆమె ఎన్నడూ ఏడ్వదల్చుకోలేదు. కేవలం ఒక్క సిగరెట్ కోసం టెర్రరిస్టుల ఒకరి నుంచి ఒకరు తమను కొనుక్కున్నారనే దారుణ సన్నివేశాల గురించి బాధితుల నుంచి విన్నప్పుడూ ఆమె ఎప్పుడూ ఏడ్వలేదు. ఆరుగురు పైశాచికానందానికి బలైన బాలిక కన్నీటి గాథను విన్నప్పుడూ ఆమె ఏడ్వలేదు. తొమ్మిదేళ్ల బాలిక రేప్‌కు గురై రక్తస్రావంతో చనిపోయిన సంఘటన గురించి విన్నప్పుడూ కూడా ఆమె ఏడ్వలేదు. ఆమెకు జాలి లేదని కాదు, కళ్లలో కన్నీళ్లు లేవని కాదు. బాధితులు కుమిలిపోకూడదని, వారి మానసిక స్థైర్యం దెబ్బతినకూడదని ఉద్దేశంతోనే ఆమె తన మనసును నిబ్బరం చేసుకొంది. ఆమె యాజిదీ బాధితులకు సేవలందిస్తున్న 25 ఏళ్ల డాక్టర్ డీలన్ డాకిల్. టెర్రరిస్టుల చేతుల్లో నరకం అనుభవించిన బాధితుల ముందు డాక్టర్ డీలన్ ఏడ్వకపోయినా ఒంటిరిగా ఉన్నప్పుడు వెక్కివెక్కి ఏడుస్తోంది. బాధితుల అనుభవాలను బహిరంగంగా ప్రజా వేదిక ముందు వెల్లడించినప్పుడూ విలపిస్తోంది. బాధితులను ఆదుకునేందుకు తనతోపాటు కలసిరావాల్సిందిగా ప్రపంచానికి గద్గద స్వరంతో పిలుపునిచ్చినప్పుడు ఆమె ఏడుస్తోంది. టైస్టుల చెర నుంచి తప్పించుకున్న యాజిదీ మహిళల శిబిరంలో ఆమె డాక్టర్‌గా పనిచేస్తోంది. తన జీవితం బాధితుల సేవకు, వారికి అండగా పోరాడేందుకే అంకితమని చెబుతోంది. దుర్నీతి, దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడేతత్వం ఆమె రక్తంలోనే ఉందేమో! ఆమె అక్క వియాన్ డాకిల్ ఇరాక్ పార్లమెంట్ సభ్యురాలు. ఇద్దరు యాజిదీ ఎంపీల్లో ఆమె ఒకరు. ఐఎస్ఎస్ టైస్టులను సమూలంగా నాశనం చేయాలంటూ ఇరాక్ పార్లమెంట్ వేదికగా ప్రపంచానికి రణన్నినాదం మొట్టమొదటి సారితా ఇచ్చిందీ వియాన్ డాకిలే. ఇప్పుడు వీరిద్దరూ ఐఎస్ఐఎస్ ‘మోస్ట్టార్గెట్’ జాబితాలో ముందు పేర్లలో ఉన్నారు. టెర్రరిస్టుల నుంచి వియాన్కున్న ప్రాణాపాయం గురించి మీడియా ఆమెను ప్రశ్నించినప్పుడు వేలాది మంది యాజిదీ మహిళలను నిర్దాక్షిణ్యంగా హింసించి చంపుతుంటే వారితో పోలిస్తే తన ప్రాణం ఏపాటిదని చెబుతారు. మానవ హక్కులకు సంబంధించి ఇటీవల లండన్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో కూడా వియాన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐఎస్ఐఎస్ ముష్కరుల నుంచి పారిపోయిన మహిళల కన్నీటి గాధల ముందు తన ప్రాణానికి లెక్కలేదన్నారు. టైస్టుల చెరలో ముక్కుపచ్చలారని బాలికలు ఎదుర్కొంటున్న దారుణాల ముందు తన ప్రాణాలు పోతే ఎంతా? అని ఆమె ప్రశ్నించారు. పదాలు వేరైనా అదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ డీలన్ డాకిల్. -
మూడు నెలలపాటు గ్యాంగ్ రేప్...
వాషింగ్టన్: చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా యాజిది యువతులపై సామూహిక అత్యాచారాలు కొనసాగిస్తున్న ఐఎస్ఐఎస్ ముష్కర మూకల పైశాచికత్వ పరాకాష్టకు ప్రత్యక్ష బాధితురాలు ఆమె. అందమైన జీవితం గురించి కలలు కంటున్న వయస్సులో కన్యత్వాన్నే కాకుండా జీవితాన్నే చిదిమేసిన రాక్షస క్రీడకు ప్రత్యక్ష సాక్షి ఆమె. మూడు నెలల పాటు టెర్రరిస్టులు కబంధ హస్తాల్లో నలిగిపోయిన 21 ఏళ్ల నాదియా మురాద్ బాసీ తహా తనకు జరిగిన ఘోరాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా నేడు ప్రపంచానికి వివరించారు. ఇరాక్‌లోని ఓ గ్రామంలో నివసిస్తున్న యాజిదీ కుటుంబానికి చెందిన నదియాను గతేడాది ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఎత్తుకెళ్లారు. ఆమెతో పాటు మరికొంత మంది మహిళలను, పిల్లలను ఆయుధాలు ఎక్కుపెట్టి కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులు బస్సులో వారి ప్రాబల్యం ఎక్కువగావున్న మోసూల్ నగరానికి తీసుకెళ్లారు. అక్కడ తనకెదురైన అనుభవాన్ని నాదియా 15 దేశాల సభ్యత్వం గల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో తీవ్రంగా కదిలిపోతూ వెల్లడించింది. ఆమె చెప్పింది ఆమె మాటల్లోనే..... 'మేమంతా దాదాపు 150 మంది ఉన్నాం. బస్సులో వెళుతున్నప్పుడు కూడా వారు మమ్మల్ని వదిలి పెట్టలేదు. మమ్మల్ని తాకారు. అసభ్యంగా ప్రవర్తించారు. దిగాక ఓ భవనంలోకి తీసుకెళ్లారు. అక్కడ వేలాది మంది యాజిదీ కుటుంబాల వారు ఉన్నారు. అందరిని వరుసగా నిలబెట్టి ఎవరికి కావాల్సిన వారిని ఎన్నుకొనే పద్ధతి అనుసరించారు. నేనైతే ఏం జరుగుతుందో తెలియని దశలో నిశ్చల విగ్రహంలా నిలిచుండిపోయాను. తలపైకైత్తి చూడగా, ఎదురుగా ఓ భారీ విగ్రహం నిలబడి ఉంది. అచ్చం రాక్షసుడిలానే ఉన్నాడు. భయమేసింది. ఏడుపాగలేదు. ఎంతో ఏడ్చాను. నేను చిన్న పిల్లను నన్ను వదిలేయండంటూ వేడుకున్నాను. ఆ రాక్షసుడు నన్ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. తన్నాడు. ఇంతలో అతను పోయి మరో వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డాడు. అతను కొంత చిన్నగా ఉన్నాడు. ముందొచ్చిన రాక్షసుడు మళ్లీ ఎక్కడొస్తాడోనన్న భయంతో నన్ను తీసుకెళ్లాల్సిందిగా అతన్ని వేడుకున్నాను. మతం మార్చుకుంటావా, పెళ్లి చేసుకుంటానని చె ప్పాడు. మతం మార్చుకోవడానికి నేను ఇష్టపడలేదు. నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. బట్టలిప్పాల్సిందంటూ కొట్టాడు. అతనితోపాటు మరికొంత మంది టెర్రరిస్టులు వరుసగా నన్ను రేప్ చేశారు. నేను స్పృహతప్పి పోయేవరకు వదిలి పెట్టలేదు. అలా మూడు నెలలపాటు వారి కబంధ హస్తాల్లో నరకం చూశాను. ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న ఐఎస్ఐస్ టెర్రరిస్టులు సమూలంగా నిర్మూలించాలని మిమ్మల్ని, ఈ ప్రపంచ దేశాలను వేడుకొంటున్నాను' అంటూ నాదియా గద్గద స్వరంతో చెప్పింది. మూడు నెలల అనంతరం టెర్రరిస్టుల చెర నుంచి ఎలాగో బయటపడిన నాదియా స్వచ్ఛంద సంస్థల సాయంతో జర్మనీ చేరుకుంది. ప్రస్తుతం అక్కడే ఉంటోంది. ఆమె గాథ విన్న 15 దేశాల ప్రతినిధులు చలించిపోయారు. తన అనుభవాన్ని ప్రపంచానికి వెల్లడించిన ఆమె మనోధైర్యాన్ని ప్రశంసించారు. ఇది కచ్చితంగా మానవ హననంలాంటి దారుణమేనని వారు అభిప్రాయపడ్డారు. యుద్ధ నేరాల కింద ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను శిక్షించాల్సిందేనన్నారు. -
టెర్రరిస్టుల బందిఖానాలు
రక్కా: ఐఎస్ఐఎస్ టెర్రిస్టులు తమ రాకాసి మూకలో చేరని మహిళలను కిడ్నాప్‌లు చేయడం, రోజుల తరబడి వారిని సామూహికంగా రేప్‌లు చేయడం లాంటి దారుణ సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. అదే కోవకు చెందిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యాజిది తెగకు చెందిన మహిళలను భూగర్భంలో నిర్బంధించిన అగ్గిపెట్టెలాంటి బందిఖానాలు ఓ మీడియా దర్యాప్తులో బయటపడ్డాయి. సిరియాకు ఉత్తరానున్న ఎడారిలో ఈ బందిఖానాలు వెలుగు చూశాయి. సొరంగ మార్గంలో వరుసగా నిర్మించినట్లున్న ఈ బందిఖానాలపై డ్రైనేజీ మూతల్లాగా తలుపులున్నాయి. వాటికున్నా సన్నటి కన్నాల గుండా లోపలికి సోకే వెలుతురు తప్పా లోపలంతా చీకటిగానే ఉంది. నెలల తరబడి అక్కడే యాజిది మహిళలను నిర్బంధించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారేమయ్యారో కూడా తెలియదు. ఇదివరకు పట్టుబడ్డ యాజిదీ తెగకు చెందిన మహిళలను ఇనుప బోనుల్లో నిలబెట్టి నీట ముంచి టెర్రరిస్టులు హత్య చేసిన విషయం తెల్సిందే. -
ప్రొఫెసర్ల విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్ విడుదలపై స్పష్టత కొరవడింది. వీరిద్దరినీ ఉగ్రవాదులు విడిచిపెట్టారని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ప్రకటించారు. వీరిద్దరూ లిబియాలోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారని చెప్పారు. అయితే బలరాం, గోపీకృష్ణలను వదిలేశారన్న సమచారం తమకు లేదని లిబియాలోని భారత రాయబారి ఎస్ డి శర్మ తెలిపారు. వీరిద్దరూ ఇంకా సురక్షిత ప్రాంతానికి రాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ప్రభుత్వ ప్రతినిధుల గందరగోళ ప్రకటనలతో బలరాం, గోపీకృష్ణ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
'తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్ సుఖాంతం'
న్యూఢిల్లీ: లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్ సురక్షితంగా బయటపడ్డారని ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. వీరిని లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి తరలించారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎంబసీ అధికారులు ధ్రువీకరిస్తారని చెప్పారు. గురువారం సాయంత్రానికి వీరిని ఇండియాకు తీసుకొస్తామన్నారు. గోపీకృష్ణ, బలరాం విడుదలయ్యారన్న సమాచారంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గోపీకృష్ణ, బలరాంతో పాటు కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను లిబియాలో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. వీరు నలుగురు యూనివర్సిటీ ఆఫ్ సిర్త్ లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లక్ష్మీకాంత్ మంగళవారం హైదరాబాద్ చేరుకుని తర్వాత కర్ణాటక వెళ్లారు.