నాలుగేళ్ల పిల్లాడిని బాంబుతో పేల్చేశారు!
బాగ్దాద్ : పదేళ్లు కూడా సరిగ్గా నిండని బాలికలను సెక్స్ బానిసలుగా చేసుకొని వారిపై సామూహిక అత్యాచారాలు జరుపుతున్న ఐసిస్ ముష్కర మూకల రాక్షసత్వానికి పరాకాష్ట ఈ సంఘటన. నాలుగేళ్ల బ్రిటిష్ బాలుడి నడుముకు బాంబును కట్టి రిమోట్ కంట్రోలర్తో దాన్ని పేల్చివేశారు ఆ ముష్కరులు. ఆ పేలుడు ధాటికి గాలిలోకి రక్తం విరజిమ్మడమే కాకుండా ఆ బాలుడి శరీరంలో అంతర్గత అవయవాలు ముక్కలు ముక్కలై నేలంతా చెల్లాచెదురయ్యాయని ఆ ముష్కర మూకలకు వ్యతిరేకంగా పోరాడుతున్న 'పాపులర్ మొబలైజేషన్' బుధవారం వెల్లడించింది. తమ తోటి సైనికులను ఇద్దరిని చంపారన్న ఆక్రోశంతో ఆ పిల్లాడి తండ్రిని బహిరంగంగా హత్య చేసిన రెండు రోజులకే పిల్లాడిని ఇలా పేల్చివేశారని, ఈ సంఘటన ఐసిస్ స్వాధీనంలో వున్న ఉత్తర ఇరాక్లోని అల్ షీర్కత్ జిల్లాలో జరిగిందని ఆ గ్రూప్ వివరించింది.
బ్రిటిష్ పౌరులనుద్దేశించి 'వారినందరిని చంపేస్తా' అన్న ఓ నాలుగేళ్ల పిల్లాడు హెచ్చరించిన ప్రాపగాండ వీడియోను టెర్రరిస్టులు విడుదల చేసిన అనంతరం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుందని ఆ రెబల్ గ్రూప్ తెలిపింది. చంపేస్తానన్న నాలుగేళ్ల పిల్లాడు ఇసాడేర్ కూడా బ్రిటీష్ పౌరుడేనని, ఆ బాలుడిని కిడ్నాప్ చేసి కొంతకాలం తమ నిర్బంధంలో ఉంచుకున్న టెర్రరిస్టులు ఆ బాలుడికి బ్రెయిన్ వాష్ చేసి అలా చెప్పించారని, అంతకు రెండు రోజుల ముందే ' తాతయ్యా, నన్ను రక్షించవా!' అంటూ టెర్రరిస్టులు తనకు ఫోన్ చేయించినప్పుడు తనను వేడుకున్నాడని ఇసాడేర్ తాత 59 ఏళ్ల హెన్రీ మంగళవారం బ్రిటీష్ మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.