ఐఎస్ ఉగ్రవాదుల అతి కిరాతకచర్య
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్ ప్రజలపై అతి కిరాతక చర్యకు పాల్పడ్డారు. ఇరాక్లోని మోసుల్ సమీపంలో ఉగ్రవాదులు 232 మంది ప్రజలను ఉరితీశారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేగాక ఐఎస్ ఉగ్రవాదులు వేలాదిమంది ప్రజలను బందీలుగా చేసుకుని, ఇరాక్ భద్రత బలగాలపై పోరాటంలో వారిని మానవ కవచల్లా వాడుకుంటున్నారు. ఉగ్రవాదుల ఆదేశాలను ధిక్కరించినవారిని దారుణంగా చంపేస్తున్నారు.
‘గత బుధవారం మోసుల్కు దక్షిణాదిన ఉన్న హమ్మమ్ అల్-అలీల్లో ఉగ్రవాదులు 42 మంది పౌరులను ఉరితీశారు. అదే రోజు మోసుల్ సమీపంలోని అల్ ఘజ్లానిలో ఐఎస్ సంస్థలో చేరేందుకు నిరాకరించిన 190 మంది ఇరాక్ మాజీ భద్రత అధికారులను చంపేశారు’ అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్ధ హై కమిషనర్ రవీనా శందాసని చెప్పారు. ఉగ్రవాదులు వేలాదిమంది ప్రజలను మోసుల్ నగరంలోకి బందీలుగా తీసుకువచ్చారని, వీళ్లలో పిల్లలు, మహిళలు ఉన్నారని తెలిపారు. ఇరాక్ భద్రత బలగాలపై వారిని మానవ కవచాల్లో ప్రయోగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మోసుల్ నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ఇరాక్ భద్రత బలగాలు పోరాడుతున్నాయి. మోసుల్కు సమీపంలోని అతిపెద్ద పట్టణం హమ్మమ్ అల్-అలీల్ను 90 శాతం స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా సంకీర్ణ సేనలు చేసిన దాడిలో దాదాపు 800 నుంచి 900 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.