'తెలుగు ప్రొఫెసర్ల కిడ్నాప్ సుఖాంతం'
న్యూఢిల్లీ: లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్ సురక్షితంగా బయటపడ్డారని ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. వీరిని లిబియాలోని భారత దౌత్య కార్యాలయానికి తరలించారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎంబసీ అధికారులు ధ్రువీకరిస్తారని చెప్పారు. గురువారం సాయంత్రానికి వీరిని ఇండియాకు తీసుకొస్తామన్నారు. గోపీకృష్ణ, బలరాం విడుదలయ్యారన్న సమాచారంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
గోపీకృష్ణ, బలరాంతో పాటు కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను లిబియాలో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ లను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. వీరు నలుగురు యూనివర్సిటీ ఆఫ్ సిర్త్ లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లక్ష్మీకాంత్ మంగళవారం హైదరాబాద్ చేరుకుని తర్వాత కర్ణాటక వెళ్లారు.