మీ వాళ్లు క్షేమమే.. త్వరలోనే విడుదలవుతారు
‘లిబియా’ బందీల కుటుంబాలతో ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్
* ఉత్తరప్రత్యుత్తరాల్లో ఆలస్యం వల్లే సందిగ్ధం
సాక్షి, హైదరాబాద్: ‘మీ వాళ్లు పూర్తి క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఉంది. వారి విడుదలకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. త్వరలో మీకు శుభవార్త అందుతుంది’ అని లిబియాలో కిడ్నాప్‌నకు గురైన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కిషన్ కుటుంభసభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు భరోసానిచ్చారు.
మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో గోపీకృష్ణ భార్య కల్యాణి, బలరాం భార్య శ్రీదేవీ, బంధువులు మురళీకృష్ణ, రంగాచారి ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలిశారు. తమవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. బందీల విడుదలకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని వారితో పేర్కొన్నారు.
అనంతరం బందీల కుటుంబసభ్యులతో సుష్మాస్వరాజ్ దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు. బందీలు కిడ్నాప్‌నకు గురైన ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఉత్తరప్రత్యుత్తరాలకు ఆలస్యం అవుతోందని, వారు క్షేమంగానే ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఆమె తెలిపారు. తమ వారిని విడిపించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను తమకు వివరించారని మోదీ, సుష్మా స్వరాజ్‌ను కలిసిన అనంతరం కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి వారు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.