ensuring
-
బ్రాండ్ సిరిసిల్ల కావాలి
సిరిసిల్ల/తంగళ్లపల్లి: దేశంలోనే సిరిసిల్ల వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా నాణ్యత, నవ్యతతో వస్త్రాలను ఉత్పత్తి చేయాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కులో రూ.14.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, శిక్షణ కేంద్రం, పరిపాలనా భవనం, క్యాంటీన్ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నడూలేని విధంగా సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకగా ఆడపడచులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ ఉండేలా ఆధునికతను సంతరించుకునేలా వస్త్రాలు తయారు చేయాలని మంత్రి కోరారు. నేత కార్మికులు ఆత్మగౌరవంతో జీవించే విధంగా వేతనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తోందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల మహిళలకు ఉపాధి కల్పించేందుకు రెడీమేడ్ వస్త్రాల తయారీ కేంద్రాన్ని (అపెరల్ పార్కు) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, ఈ విషయాన్ని ఏ నేత కార్మికుడిని అడిగినా చెబుతాడని కేటీఆర్ పేర్కొన్నారు. పవర్లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు, జౌళి రంగానికి చేయూత అందించాలని కేంద్ర మంత్రికి లేఖ రాశామన్నారు. కార్యక్రమంలో జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. మంత్రి పర్యటనలో పలువురి నిరసన కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో వెంకటేశ్ టెక్స్టైల్స్ యజమాని దొంతుల నరహరి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లను, పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు మంత్రి తంగళ్లపల్లిలో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మీడియాను అనుమతించక పోవడంతో పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు. -
ఘరోసా
కడుపున మోస్తున్నప్పుడే కాదు, కన్న తర్వాత కూడా బిడ్డను కడుపులో పెట్టుకునే పెంచుతుంది తల్లి! నవమాసాలూ ఎంత భద్రంగా పొదవి పట్టుకుంటుందో.. కౌమారంలో అంతకు మించిన జాగ్రత్తతో కనురెప్పల మధ్య పెట్టుకుంటుంది. అయినప్పటికీ జరగరానిది జరిగితే? బిడ్డకెంత బాధో తల్లికీ అంతే వేదన. ఆ గాయం నుంచి ఊరటను కలిగించి న్యాయం జరిగేలా సాయం అందించే ఇల్లే.. ‘భరోసా’. ఆత్మ స్థైర్యాన్ని పెంచే ఘరోసా. ‘‘రెండేళ్ల కిందట.. ఒకరోజు రాత్రి ఎనిమిదిన్నరకు అనుకుంటా..‘అమ్మా.. ఓనర్ తాత పిలుస్తున్నాడు..’’ అంటూ పైన అంతస్తులో ఉండే మా ఇంటి ఓనర్ వాళ్లింటికి వెళ్లింది పాప. పదిహేను నిమిషాలైనా కిందకి రాలేదు. ఎక్కడినుంచో ఏడుపు వినిపించింది. తర్వాత గమనిస్తే మా పాప ఏడుపే అని అర్థమై.. గబగబా పైకి వెళ్లాను. వీధి గుమ్మం గడియ వేసి ఉంది. ఆ గుమ్మం పక్కనే ఉన్న కిటికీ అద్దమొకటి పగిలిపోయి ఉంది. పాపను పిలుస్తూ అందులోంచి చూశా. లోపలి బెడ్రూమ్ కనపడుతోంది. నా గొంతు వినేసరికి మా పాప ఏడుస్తూనే అరిచేసింది ‘‘మమ్మీ ..’’ అంటూ! నేనూ గట్టిగా అరుస్తూ మళ్లీ తలుపు దబాదబా బాదా. పాప పరిగెత్తుకుంటూ లోపల్నించి వచ్చి తలుపు తీసింది. 57 ఏళ్ల మా ఓనర్ దాదాపు న్యూడ్‌గా ఉన్నాడు.. ఏడేళ్ల మా పాపను..’’ చెప్పలేక రెండు చేతుల్లో తల దాచుకొని ఏడ్చేసింది ఆ అమ్మ.ఆ వార్డ్ కౌన్సిలర్ అయిన ఆ ఇంటి ఓనర్ భార్య తన పలుకుబడితో తన భర్త నిర్దోషని, ఆ పాప తల్లే తన ఇంట్లో వెండి సామాను, డబ్బులు దొంగిలించిందని తప్పుడు కేసులు పెట్టింది. బ్లాక్మెయిల్, వేధింపులకూ గురిచేసింది. అయినా అవన్నీ వీగిపోయి.. ఆ ఓనర్ చేసిన తప్పు రుజువై పదేళ్ల జైలు శిక్ష పడింది.ఓ జంటకు పాప పుట్టింది. ఆ చంటిపిల్లకు మూడోనెల రాగానే ‘‘పాపకు నేనే స్నానం చేయిస్తాను’’ అంటూ భర్తే స్నానం చేయించడం మొదలుపెట్టాడు. అలా బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చేదాకా అతనే స్నానం చేయించాడు. ఒకరోజు తల్లి స్నానం చేయిస్తుంటే.. ‘‘అమ్మా.. స్నానం చేయించేటప్పుడు నాన్న ఇలా చేస్తాడు.. నువ్వు చేయట్లేదు’’ అని వచ్చీరాని మాటల్తో పాప చెబుతుంటే హతాశురాలైంది తల్లి. ‘‘బాధ్యతల్లో పాలుపంచుకుంటున్న అతణ్ణి ఇన్నిరోజులు మంచి భర్తగా భావించా కానీ అతని మనసులో ఉన్న రోతను గమనించలేకపోయానే’’ అని గుండె పగిలేలా ఏడ్చింది. భర్త మీద కేసు పెట్టింది. అతని నేరం రుజువు చేయడానికి నానాకష్టాలు పడ్డది. అలాంటి తండ్రికి బిడ్డ పట్ల విజిటింగ్ హక్కు ఇవ్వకూడదని కోర్ట్‌లో ఒక పోరాటమే చేసింది. ‘‘ఈపాటికల్లా పాల ప్యాకెట్లు వేసేసి పిల్లాడు ఇంటికి రావాల్నే.. ఇంకా రాలేదేంటి?’’ అనుకుంటూ పదకొండేళ్ల కొడుకును వెదుక్కుంటూ వెళ్లాడు తండ్రి. దార్లోనే కనిపించాడు కొడుకు పైజామా అంతా రక్తసిక్తమై. అది చూసిన ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. ‘‘ఏమైంది బేటా..’’ అని తండ్రి అడిగేలోపే.. వణుక్కుంటూ ‘‘ఫలానా వీధిలో ఉండే అంకుల్ లోపలికి పిలిచి..’’ అంటూ జరిగిన దారుణం చెప్పాడు.దేవుడా..! అయినా ఇప్పుడెందుకు ఇవన్నీ ఏకరువు పెట్టారు? మన చుట్టూ జరుగుతున్న దారుణాల గురించి చెప్పడానికి వారం, వర్జ్యం, సందర్భం కావాలా? ఈ నేరాలు తెలిస్తేనే కదా.. మన పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిని ఎంతలా గమనించాలి అన్న సత్యాలు బోధపడేవి! కరెక్ట్ ..ఇలాంటి అవగాహన, చైతన్యం కల్పించే కార్యక్రమాన్నే నిన్న హైదరాబాద్‌లో చేపట్టింది ‘‘భరోసా సెంటర్’’. ఈ కార్యక్రమంలో బాధితులు పంచుకున్న వెతలే అవి. తెలంగాణ పోలీస్ సహకారం, ఆడపిల్లల రక్షణకోసం పనిచేస్తున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ టెక్నికల్ సపోర్ట్‌తో నడుస్తున్నదే ‘భరోసా’. బాలల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి, దానికోసం ఉన్న చట్టాల గురించి తెలియజేయడానికి, జరిగిన నేరానికి సంబంధించి హెల్ప్‌లైన్, కేసు నమోదు చేయడం నుంచి తీర్పు వరకు సమస్తం ఒకేచోట అందించడానికి ఏర్పడిందే ‘భరోసా’. లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన పిల్లలు.. పోలీసులు, కేసులు, కోర్టులు, నిందితుల గుర్తింపు.. మొదలైన ప్రక్రియలో మానసికంగా మరింత నలిగిపోయే ప్రమాదం ఉంది.పోలీస్ యూనిఫామ్, గంభీరమైన కోర్ట్ హాలు, తికమక పెట్టే డిఫెన్స్ వాదన, నిందితుడి చూపులు, ఆసుపత్రికి వెళ్లడాలు వంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా.. ఇంటిలాంటి వాతావరణంలో అమరుస్తోంది భరోసా. ఇందులో పిల్లలకు సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది ఆ ట్రామా నుంచి బయటపడేందుకు. న్యాయవిచారణలో సహకరించేందుకు. కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు నిందితుడు పిల్లలకు కనిపించకుండా ఉండే ఏర్పాటూ ఉంటుంది. అవసరమైన పిల్లలకు పునరావాసమూ ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం.. ఈ భరోసా సెంటర్‌కు రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం కేవలం జడ్జి, బాధిత పిల్లలకు మాత్రమే. మరో ద్వారం మిగిలిన అందరికోసం. అంటే ఎక్కడా పిల్లలు నిందితుల కంటపడరన్నమాట. ‘‘భరోసా సెంటర్లు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్‌లో పెట్టాం. త్వరలోనే నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, రాచకొండ కమిషనరేట్లలోనూ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు తెలంగాణ రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా. భరోసాకు ప్రేరణ.. అమెరికా, కాలిఫోర్నియాలోని శాండియాగోలో ఉన్నది రిహాబిలిటేషన్ సెంటర్. అక్కడ లైంగిక దాడి, అబ్యూస్‌కు గురైన పిల్లలను నేరుగా ఈ సెంటర్‌కే తీసుకొస్తారు. వాళ్లు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యవంతులైన తర్వాతే ఇంటికి పంపిస్తారు. ఇక్కడైతే కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా పిల్లలకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఒక గ్లాస్ విండో ఉన్న హాలులో పిల్లలతో కౌన్సెలర్ ఆడుకుంటూ జరిగిన విషయాలు నెమ్మదిగా చెప్పిస్తూ ఉంటాడు. ఈ విండోకి ఆవల కోర్ట్ హాల్ ఉంటుంది. అది పిల్లలకు కనిపించదు, వినిపించదు. కాని ఆ కోర్ట్‌కు మాత్రం పిల్లలు, కౌన్సెలర్ సంభాషణ వినపడ్తూంటుంది. అలా ప్రొసీడింగ్స్ సాగి తీర్పు వెలువడుతుంది. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇంటి నుంచే... ‘‘పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి కొత్త చట్టాలు వచ్చాయి. దురదృష్టమేమంటే అందులో పేర్కొన్న విధానాల్లో కూడా పిల్లల మీద అఘాయిత్యాలు జరగడం. అయినా పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) దాదాపు అలాంటివన్నిటినీ కవర్ చేస్తోంది. చట్టాలు రావడం, అమలు చేయడం ఒకెత్తయితే.. పిల్లలను జాగ్రత్తగా పెంచడం మరో ఎత్తు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా మగపిల్లల పెంపకంలో ఇంటినుంచే జాగ్రత్త మొదలైతే సమాజం, దేశం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ చట్టం గురించి తల్లిదండ్రులతో పాటు ప్రతి స్కూల్లో, ప్రతి విద్యార్థికి, టీచర్‌కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భరోసాతోపాటు, తరుణి సంస్థ ద్వారా కూడా’’ – మమతా రఘువీర్, న్యాయవాది, తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ►కొన్ని రాష్ట్రాల్లో ని పేద తల్లిదండ్రులు తమకు తెలిసే తమ పిల్లలను పోర్న్‌కు టూల్స్‌గా మారుస్తున్నారట. గుడిసెల్లో కెమెరాలుంటాయిట. విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు పింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి.. క్లయింట్స్ ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తూంటారుట ఆ పిల్లలు. ►పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల మీద అఘాయిత్యం జరిగినా, లేదా వాళ్లే ఏదైనా నేరం చేసినా.. వాళ్ల పేర్లు, వ్యక్తిగత వివరాలేవీ కూడా రికార్డుల్లో నమోదు చేయకూడదు. మూడేళ్ల వరకు మాత్రమే ఆ నేరం గురించి రికార్డుల్లో ఉండాలి. తర్వాత తీసేయాలి. ►ఎస్సీ, ఎస్టీ బాలికలకు లేదా దారుణమైన స్థితిలో ఉన్న బాలికలకు ఆయా పరిస్థితులను బట్టి ఈ నష్టపరిహారం 3 లక్షల నుంచి 8 లక్షల రూపాయల దాకా ఉండొచ్చు. ►బాధిత బాలికలకు నష్టపరిహారం ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే 25 వేలు, చార్జిషీట్ వేశాక 50 వేలు, తీర్పు వెలువడ్డాక 25 వేలు .. ఇలా మొత్తం లక్ష రూపాయలదాకా ఆ నష్టపరిహారం ఉంటుంది. -
ఓటమి టీడీపీకి కొత్తేమీ కాదు: చంద్రబాబు
సాక్షి, ధర్మవరం: ఓటమి అనేది టీడీపీకి కొత్తేమి కాదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. గతంలో కూడా టీడీపీ ఓటమి పాలై మళ్లీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంగా పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడకూడదని అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారని, మృతుల కుటుంబసభ్యులను పరామర్శించేందుకు భరోసా యాత్ర చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల, బండారు శ్రావణి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామలింగారెడ్డి పాల్గొన్నారు. అనంతరం తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో చింతా భాస్కరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటాం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణ వివాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబాన్ని మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మృతుడి భార్య వరలక్ష్మికి రూ. 5లక్షల చెక్కును అందించారు. పిల్లలు వినయ్, ఆనంద్, అవంతిను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామన్నారు. ఇదే ఘర్షణలో గాయపడ్డ మరో ఆరుగురికి రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. హత్యారాజకీయాలకు తాము భయపడమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడం దురదృష్టకరమన్నారు. త్వరలో ధర్మవరంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ను ప్రకటిస్తామన్నారు. -
‘చేప’కు చేయూత...
చేప విత్తనాలు దొరకక.. ఎదిగిన చేపలు పట్టేందుకు వలలు లేక.. రవాణా, మార్కెటింగ్ సౌకర్యం లేక.. ధర గిట్టుబాటు కాక.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న మత్స్యకారులు. చేసేది లేక కొందరు వృత్తినే మానుకుని బతుకు దెరువు కోసం మరో బాట పట్టారు. వారి కష్టాలను, ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించడంతోపాటు మరింత ప్రోత్సాహం అందిస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నాణ్యమైన చేప విత్తనాలను పంపిణీ చేస్తూ.. రాయితీపై వలలు, వాహనాలు, చేపలు నిల్వ చేసే బాక్సులను సమకూరుస్తోంది. మార్కెటింగ్‌కు చేయూతనందిస్తోంది. మత్స్య సహకార సంఘాల ద్వారా ప్రభుత్వ రాయితీలను, సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న మత్స్యకారులు ఆర్థికంగా బలపడటంతోపాటు కుటుంబాలను పోషించుకుంటున్నారు. సాక్షి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా 662 చెరువులు ఉండగా.. 183 మత్స్య సహకార సంఘాలు, 14,494 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులపై ఆధారపడి జీవిస్తుండగా.. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేయూతనందిస్తుండటంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గతంలో చేప విత్తనాలు కొనుగోలు చేసేందుకు సంఘ సభ్యులందరూ తలాకొంత వేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసేవారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ పిల్లలు నాణ్యతగా లేకపోవడం.. మరో ప్రాంతం నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్న క్రమంలో కొన్ని చనిపోవడం.. చెరువులో వదిలిన తర్వాత మరికొన్ని ప్రాణాలు విడవడం.. వర్షాలు పూర్తిస్థాయిలో కురవక.. చెరువుల్లో నీరులేక చేప ఎదగకపోవడం.. ఇలా మత్స్యకారులు తీరొక్క సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలాగోలా ఎదిగి ఎంతో కొంత చేతికొచ్చిన సరుకుకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం.. దళారుల వల్ల కొంత నష్టపోవడం జరుగుతుండేది. ఈ క్రమంలో చాలా మంది మత్స్యకారులు ఎన్నేళ్లయినా మన బతుకులు బాగుపడవనే ఉద్దేశంతో ఆ వృత్తికి దూరం కావడం.. మరో వృత్తిని ఎంచుకున్న సందర్భాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి మారింది. వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన ప్రభుత్వం వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు పూనుకుంది. ఉచితంగా చేప పిల్లలు.. జిల్లాలో ఇప్పటివరకు 2.25 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందించింది. వాటిని జిల్లాలో ఎంపిక చేసిన చెరువులు, రిజర్వాయర్లలో పోసుకుని మత్స్యకారులు అభివృద్ధి చేస్తున్నారు. అయితే గత పాలకులు మత్స్యకారుల పట్ల చిన్నచూపు చూడడంతో చాలా మంది మత్స్యకారులు ఇతర వృత్తులు, పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందించడంతో పలువురు మత్స్యకారులు మళ్లీ పాత వృత్తిని స్వీకరించారు. జిల్లాలోని వైరా, పాలేరు, చెరువు మధారం, లంకపల్లి వంటి పెద్ద చెరువులపై వందలాది మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ బలోపేతం అవుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. చేపలు పట్టేందుకు వలలు, వాటిని మార్కెటింగ్ చేసేందుకు వాహనాలు 75 శాతం సబ్సిడీపై అందించింది. జిల్లాలో 2.25 కోట్ల చేప పిల్లలు.. రవ్వు, బొచ్చె, బంగారు తీగ, గ్యాస్కట్ తదితర రకాలను 662 చెరువుల్లో విడుదల చేసింది. చేపలను మార్కెటింగ్ చేసేందుకు మోపెడ్లు, ప్లాస్టిక్ బాక్స్‌లు, ట్రేలు, బొలెరో వాహనాలు, వలలు, రవాణాకు ఉపయోగించే యంత్ర పరికరాలను ప్రభుత్వం మత్స్యకారులకు అందించింది. దీంతో మత్స్యకారులు చెరువుల్లో వలలతో పట్టిన చేపలను అమ్ముకునేందుకు సులభతరంగా మారింది. వ్యాపారం బాగుంది.. ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేశాం. అవి ఎదిగిన తర్వాత చేపల వేటతో మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి రోజు వివిధ ప్రాంతాల చెరువుల నుంచి చేపలు తెచ్చి విక్రయిస్తున్నాం. విక్రయించేందుకు ప్రభుత్వం వాహనాలు కూడా అందించింది. – చెరకు వెంకటేశ్వర్లు, సొసైటీ కార్యదర్శి, నేలకొండపల్లి ప్రభుత్వం సహకరిస్తోంది.. మత్స్యకారులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మత్స్యకారులు ఆర్థికంగా లాభపడుతున్నారు. ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. చేప పిల్లలతోపాటు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. సీఎం కేసీఆర్‌కు మత్స్యకారుల కుటుంబాలు రుణపడి ఉంటాయి. – యడవల్లి చంద్రయ్య, మత్స్య సొసైటీ జిల్లా అధ్యక్షుడు -
సేవాభావం వర్ధిల్లాలి
ఒకరు తెలిసీ తెలియని వయస్సులో సమాజ మార్పు కోసం తుపాకీ పట్టారు. అడవుల్లో తిరిగారు. పాటలతో ప్రభావితమైన సాయుధ సమరంలో భాగస్వామ్యమయ్యారు. మరొకరు తల్లిదండ్రుల వారసత్వంతో విప్లవోద్యం వైపు అడుగులు వేశారు. అడవి తల్లి ఒడిలో కలిసి ప్రయాణిస్తూ జీవితాన్ని పంచుకున్నారు. అనుకోని సందర్భంలో పోలీసుల చేతికి చిక్కి జైలు జీవితాన్ని అనుభవించారు. ఇప్పుడు అనాథలకు అమ్మనాన్నలుగా మారారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నీ తామై సాకుతున్నారు. పోరుబాటను వదిలి నేడు అనాథలకు తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. సొంత ఖర్చులతో అనాథల జీవితాల్లో వెలుగులు నింపడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వారే.. మాజీ నక్సలైట్ దంపతులు కత్తుల లక్ష్మి, రవీందర్.బాల్యంలోనే పోరుబాట వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన కత్తుల కట్టయ్య, ఉపేంద్ర దంపతుల కుమారుడు కత్తుల రవీందర్. రాంపేట గ్రామం నాడు పీపుల్స్ వార్ ఉద్యమానికి కంచుకోటగా ఉంది. ఉద్యమ నేపథ్యం కలిగిన గ్రామం కావడంతో రవీందర్‌పై ఆ ప్రభావం పడింది. దీనితో పదో తరగతి పూర్తి చేసిన వెంటనే 1992లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆకిటి నర్సిరెడ్డి, అనసూర్య దంపతుల కుమార్తె లక్ష్మి. నర్సిరెడ్డి, అనసూర్య దంపతులు అప్పటికే పార్టీ కంట్రోల్లో పని చేస్తున్నారు. లక్ష్మి రామన్నగూడెంలో 7వ తరగతి చదువుతోంది. మీ తల్లిదండ్రుల జాడ చెప్పమని పోలీసులు వేధించారు. దీనితో లక్ష్మి చదువును ఆపేసి 1996లోనే పోరుబాట పట్టింది. రవీందర్, లక్ష్మిలు ఇద్దరూ పాలకుర్తి ఏరియాలోనే పనిచేయడంతో పార్టీ అనుమతిలో 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అరెస్టుతో ఉద్యమానికి స్వస్తి ఉద్యమంలోనే దంపతులుగా మారిన లక్ష్మి, రవీందర్‌లు అరెస్టు కావడంతో పోరుబాటకు స్వస్తి చెప్పారు. పార్టీ విస్తరణలో భాగంగా లక్ష్మి, రవీందర్లను మహారాష్ట్రకు పంపించారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. పోలీసులు అరెస్టు చేశారు. దీనితో 2000 నుంచి 2002 వరకు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు. విడుదలైన తరువాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. లక్ష్మి తీవ్రంగా అనారోగ్యానికి గురి కావడంతో 2004లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్య లొంగిపోయిన 6 నెలల తరువాత భర్త రవీందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలు జీవితం అనుభవించి ఉద్యమ పంథాకు స్వస్తి చెప్పి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. మనసు చలించి..! ఉద్యమం బాట నుంచి బయటకు వచ్చిన లక్ష్మీ రవీందర్ దంపతులు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవితంలో ఎదిగేందుకు అష్టకష్టాలు పడ్డారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుందామని కాజీపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అనాథ పిల్లలు పైసలు అడుక్కుంటూ కన్పించారు. ఈ దృశ్యాన్ని చూసిన లక్ష్మి మనస్సు మార్చుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఆలోచనను మార్చిన అనాథల కోసం ఏమైనా చేయాలనే నిర్ణయించుకున్న ఆమె భర్త రవీందర్ సహకారంతో ముందు చీరెల అమ్మకం ప్రారంభించారు.. 15 ఏళ్లపాటు చీరెల అమ్మకం చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు. దృష్టి సారించి.. ఆర్థికంగా నిలబడిన తరువాత లక్ష్మి, రవీందర్ దంపతులు సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. 2013 లోనే కుమారుడు జన్మించారు. కుమారుడి పేరు మీద ‘వర్ధన్ స్వచ్ఛంద సంస్థ’ను ప్రారంభించారు. ఏజెన్సీ ఏరియాలో ఇల్లు కాలిపోయిన బాధితులకు బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులను అందించారు. నిరుపేద మహిళలకు చీరెలు దానం చేయడం, అనాథ ఆశ్రమాల్లో అన్నదానాలు నిర్వహించారు. వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. .. అనాథలకు చేయూత సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిన లక్ష్మి రవీందర్ దంపతులు 2017 అక్టోబర్‌లో జనగామ జిల్లా కేంద్రంలో ‘వర్ధన్ అనాథ ఆశ్రమం’ ప్రారంభించారు. రెడ్డి సంక్షేమ భవనాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయంపొందుతున్నారు. పిల్లలను పోషిస్తూనే విద్యను చెప్పిస్తున్నారు. అలనాపాలన మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. ‘అమ్మ’కు కర్మకాండ ఆరు మాసాల కింద గుర్తు తెలియని అనాథ వృద్ధురాలు నర్సమ్మ ఆశ్రమంలో చేరింది. అయితే నర్సమ్మ ఆగస్టు 1వ తేదీన మృతి చెందింది. దీనితో నర్సమ్మకు లక్ష్మి రవీందర్ దంపతులు అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మి కర్మకాండ చేయడం పలువురిని కదిలించింది. బంగారు భవిష్యత్తు ఇవ్వడమే ధ్యేయం కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించాం. కనీసం తినడానికి అన్నం లేదు. ఉండటానికి ఇల్లు లేదు. బయటకు వచ్చిన తరువాత ఎవరూ తెలియదు. ఎలా బతకాలో తెలియదు. వరంగల్‌లో చిరు వ్యాపారం చేసి ఈ స్థాయికి వచ్చాం. అనాథలకు బంగారు భవిష్యత్ ఇవ్వడమే ధ్యేయంగా ఆశ్రమాన్ని నిర్వహించాం. ఆశ్రమానికి వచ్చే పిల్లలకు తల్లిదండ్రుల్లా సేవ చేస్తాం. దాతలు అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ఆడపిల్లలను బతికించుకుందామనే కార్యక్రమంతో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నాం. అనాథలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో సేవలను మరింతగా విస్తరిస్తాం. మాకు చేయూతగా మానవత్వవాదులు ముందుకు రావాలని కోరుతున్నాం. – కత్తుల లక్ష్మి – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ -
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భరోసా
ఎంజీఎం : వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో పేద రోగులను సేవలను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సర్జరీ విభాగంలో మరో 30 పడకల సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ అకిడేషన్ బోర్డు ఫర్ సర్టిఫికేషన్ లక్ష్యంగా ముందుకెళ్తూ.. రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజ్జ్ లాండ్రి పరికరాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు. ఈ 6న వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ దొడ్డ రమేశ్ తెలిపారు. గతంలో బీబ్రా కంపెనీతో కుదిరిన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిన కొనసాగతున్న 14 డయాలసిస్ యూనిట్ ఒప్పందన ముగిసినా.. క్రమంలో మరో 14 యూనిట్ల డీ మేడ్ కంపెనీ పీపీపీ పద్ధతిన ఒప్పందం నూతన సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఎంజీఎం ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు మెరగపడనున్నట్లు ఆయన తెలిపారు. ‘ఆరోగ్యశ్రీ’ లేకున్నా సేవలు.. గతంలో ఎంజీఎంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే డయాలసిస్ సేవలు ఉచితంగా చేసేవారు. 6వ తేదీ నుంచి అందుబాటులోని రానున్న నూతన డయాలసిస్ యూనిట్లతో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా.. లేకున్నా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సూపరిండెంట్ రమేశ్ పేర్కొన్నారు. గతంలో బీ బ్రాన్ యూనిట్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రమే డయాలసిస్ సేవలు అందేవి, అయితే ఆ కంపెనీతో గత ఏడాదిలోనే ఒప్పందం ముగిసిన నేపథ్యంలో డయాలసిస్‌ను ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారులే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 14 యూనిట్ల డీ మేడ్ కంపెతో ఒప్పందం కుదుర్చుకోగా ఈ యూనిట్లలో ఆరోగ్యశ్రీ సేవలందిస్తూ, ఎంజీఎంలో కొనసాగతున్న డయాలసిస్ యూనిట్లతో పేద రోగులకు సేవలందించనున్నట్లు సూపరిండెంట్ తెలిపారు. ఎన్ఏబీహెచ్లో మొదటి అడుగు... ఎంజీఎం ఆస్పత్రికి నేషనల్ అకిడేషన్ బోర్డు సర్టిఫికేషన్ లక్ష్యంగా వైద్యాధికారులు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన నూతన మెకానైజ్డ్ లాండ్రి పరికరాన్ని 6న ప్రారంభించనున్నారు. 60 కేజీల ఈ పరికరం 250 పడకల బెడ్ షీట్లను శుభ్రం చేసేందుకు ఉపయోగపడుతుంది. అతి త్వరలోనే మరో 60 కేజీల లాండ్రి పరికరాన్ని సైతం అందుబాటులోకి తేనున్నారు. సర్జరీలో విభాగంలో... ఎంజీఎం సర్జరీ విభాగంలో ఏడో యూనిట్ నూతన భవనం ద్వారా మరో 30 పడకల నూతన సేవలు అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. వైద్య నిబంధనల ప్రకారం ఈ భవనంలో అందుబాటులోకి రావడం పేద ప్రజలకు సేవలు మెరుగపడనున్నట్లు పేర్కొన్నారు. 6న ప్రారంభోత్సవం ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్‌తో పాటు ఆస్పత్రిలోని నూతన భవనాలను 6న వైదారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. ఈ వేడుకలకు జిల్లాలోని వివిధ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. – దొడ్డ రమేష్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
భద్రత... శుభ్రత
సాక్షి, సిటీబ్యూరో: మ్యాన్‌హోళ్లలోకి దిగి మృత్యువాతపడుతోన్న సీవరేజి కార్మికుల ప్రాణాలకు భరోసానిచ్చేందుకు జలమండలి మినీ ఎయిర్‌టెక్ యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు ఒక్కొక్క యంత్రాన్ని చొప్పున 24 గంటల పాటు నిరంతరాయంగా అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేపట్టింది. వీటితో మ్యాన్‌హోళ్లు, పైపులైన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఆధునిక జెట్టింగ్ యంత్రాలతో తొలగించి సమూలంగా ప్రక్షాళన చేయనున్నారు. అద్దె ప్రాతిపదికన వీటిని తీసుకునేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు జలమండలి ఎం.డి. దానకిశోర్ తెలిపారు. మినీ ఎయిర్‌టెక్ తీరిదీ రెండువేల సీసీ ఇంజిన్ సామర్థ్యంగల మినీ ఎయిర్‌టెక్ వాహనానికి రెండువేల లీటర్ల మురుగు నీటిని తోడే ట్యాంక్, 70 హార్స్పవర్ సామర్థ్యంగల జెట్టింగ్ యంత్రం,మురుగునీటిని తోడేందుకు వీలుగా పైపు, మోటార్, ఇతర ఉపకరణాలు ఉంటాయి. దీని బరువు సుమారు 6 టన్నుల లోపే. ఖరీదు సుమారు రూ.10 లక్షలు ఉంటుంది. డివిజన్‌కు ఒకటి చొప్పున వీటిని అందుబాటులో ఉంచి కాలనీలు, బస్తీల్లో నిత్యం ఉప్పొంగుతున్న మ్యాన్‌హోల్‌లను శుభ్రం చేయనున్నారు. ఇరుకు వీధుల్లోకి కూడా ఈ వాహనం చొచ్చుకొని వెళ్లగలదు. వ్యర్థాలను బట్టి మీటరుకు రూ.10 చొప్పున అద్దె చెల్లించనున్నట్లు సమాచారం. -
కౌలు ధరలకు రెక్కలు
ఎకరాకు భూముల వారీగా రూ. 25 వేల నుంచి 50 వేలు ఖరారవుతున్న ఒప్పందాలు.. ఖరీఫ్‌పై చిగురిస్తున్న ఆశలు పశ్చిమ డెల్టాలో కౌలు ధరలకు రెక్క లొచ్చాయి. భూముల వారీగా ఎకరాకు రూ.25 వేల నుంచి రూ. 50 వేల వరకు కౌలు ఖరారు చేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు ప్రకృతి అనుకూలిస్తుందన్న భరోసా, అపరాలకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉంటుందన్న విశ్వాసం రైతుల్ని సాగుకు సమాయత్తం చేస్తోంది. ముఖ్యంగా నల్లరేగడి, వాణిజ్య పంటలు పండే మెట్ట భూముల్లో కౌలు రేట్లు హెచ్చుగా ఉంటున్నాయి. తెనాలి : గత ఏడాది జిల్లాలోని రైతులు ఎన్నడూ లేని విధంగా నష్టాలు చవిచూశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జలశయాలు వట్టిపోయి పంటల సాగుకు నానా కష్టాలు ఎదుర్కొన్నారు. సాగునీటి కొరత కారణంగా ప్రధానమైన వరి పైరును జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో సాగుచేయలేకపోయారు. ఈ విస్తీర్ణం సగం పశ్చిమ డెల్టాలోనే ఉంది. అపరాలకు మార్కెట్ ధరలు బాగుండటం రైతులకు కలిసొచ్చింది. పెసర క్వింటాలు రూ.6550-రూ.7600 మధ్య నడిచింది. ప్రస్తుతం రూ.5200 పలుకుతున్నాయి. మినుములు రూ.5800తో ప్రారంభించి, రూ.12,500 వరకు అమ్మకాలు సాగాయి. ఇప్పటికీ రూ.11 వేల వరకు ధర ఉండటం ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో ఆశావహ దృక్పథానికి దారితీసింది. భూముల వారీగా ధరలు ఇలా.... ప్రస్తుత పరిస్థితుల మేరకు కౌలు రేట్లు కొంచెం హెచ్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. మొక్కజొన్న పండే చేలపై వేచిచూసే ధోరణిలో ఉంటూ మినుము/ పెసలుకు అనుకూలమైన నల్లరేగడి భూములకు హెచ్చు ధరను పెడుతున్నారు. ప్రధానంగా అమృతలూరు, చుండూరు మండలాల్లో ఎకరాకు నగదు కౌలు రూ.25-30 వేల వరకు ఖరారు చేసుకుంటున్నారు. చుండూరు మండలం మండూరులో ఇటీవల దేవాలయ భూములు బహిరంగ వేలంలో రూ.33 వేల వరకు పాట పలకటం డిమాండును తెలియజేస్తుంది. కొల్లిపరలో మాగాణి కౌలు ఇంకా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇక్కడి మెట్ట భూముల్లో కౌలు ధర రూ.45-55 వేలు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. పసుపు, అరటి, కంద వేసే చేలల్లో పసుపు ఊట ఎక్కువగా వస్తుందన్న భావన కలిగితే గరిష్టంగా రూ.55 వేల కౌలుకు వెనుకాడటం లేదు. తెనాలి మండలంలో ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. మాగాణికి గరిష్టంగా రూ.25 వేలు, పసుపు పండే మెట్టకయితే రూ.30 వేల వరకు కౌలు ఒప్పందాలు కుదురుతున్నాయి. కూరగాయ పంటలు ఆకుకూరలు సాగుకు అనుకూలమైన చేలల్లో విద్యుత్ మోటారు షెడ్డు ఉంటే ఎకరాకు రూ.50 వేలు, లేకుంటే రూ.45 వేలకు కౌలు చెల్లింపులు ఖరారు చేసుకుంటున్నారు. -
పక్కా ప్రణాళికతో భవితకు భరోసా
ఏదైనా లక్ష్యం సాధించాలంటే పక్కా ప్రణాళిక ఎలాగైతే కీలకమో.. భవిష్యత్‌లో ఆర్థిక భద్రత పొందాలంటే కచ్చితమైన ప్లానింగ్ కూడా అంతే అవసరం. సాధారణంగా చిన్న చిన్న వాటికి కూడా ఆచితూచి ఖర్చు చేసే వారు సైతం.. భారీ పెట్టుబడుల విషయంలో కాస్త అశ్రద్ధ చూపుతుంటారు. ఆర్థిక లక్ష్యాలు, సాధనాలు మొదలైన వాటిపై పెద్దగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే సరైన ఆర్థిక ప్రణాళికతో లక్ష్యాలను చేరగలిగే తీరును వివరించేదే ఈ కథనం. ప్రణాళికకు కీలకమైనవి.. సాధారణంగా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక దశలో ఏదో ఒక ఆర్థిక లక్ష్యం ఉంటుంది. సొంత ఇల్లు తీసుకోవడమో లేదా వాహనం కొనుక్కోవడమో లేదా పిల్లల చదువులు/వారి వివాహాలు, రిటైర్మెంట్ వంటి అవసరాలు ఉంటాయి. వీటిని ముందుగా గుర్తించి, ఆయా అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవడంలో ఈ కింది అంశాలు తోడ్పడతాయి. * ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి * కాలవ్యవధి నిర్ణయించుకోవాలి * రిస్కు సామర్ధ్యాలను బేరీజు వేసుకోవాలి * రిస్కు సామర్ధ్యాన్ని బట్టి పెట్టుబడి సాధనాలకు నిధులు కేటాయించుకోవాలి * కెరియర్ తొలినాళ్లలో కాస్త రిస్కు తీసుకునే సామర్ధ్యం ఉంటుంది. ఎక్కువ రిస్కు ఉన్నా, అధిక వృద్ధికీ అవకాశముండే షేర్లు/మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్వల్పకాలానికి ఇవి కాస్త రిస్కీయే అయినప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులే అందించగలవు. ఇక, తర్వాత కాలంలో రిస్కు సామర్ధ్యం తగ్గుతూ రిటైర్మెంట్కు దగ్గరయ్యే కొద్దీ షేర్లు వంటి రిస్కీ సాధనాల్లో తగ్గిస్తూ.. స్థిరమైన రాబడులు ఇచ్చే డెట్ ఫండ్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటివైపు మొగ్గు చూపవచ్చు. ఈ క్రమంలో పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. * కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేలా జీవిత బీమా పాలసీ తీసుకోవడం * తగినంత వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవడం * రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసుకోవడం * వీలునామా కూడా రాసి ఉంచడం పెట్టుబడుల పరమార్థం .. ఏదైనా సాధనంలో మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఆశించేవి కొన్ని ఉంటాయి. అవి.. * స్థిరంగా రాబడులు * సదరు అసెట్ విలువ పెరగడం * అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు ఉండటం (లిక్విడిటీ) * భద్రత. పెట్టుబడుల విషయంలో రాబడులతోపాటు భద్రతకూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. * పన్నులపరమైన ప్రయోజనాలు * ప్రయోజనాలన్నీ అందించే సాధనాలు చాలా తక్కువ ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లు స్థిరమైన ఆదాయం ఇస్తాయి కానీ వాటి విలువ పెరగదు. బంగారం, స్థలం విలువ దీర్ఘకాలంలో పెరుగుతుంది కానీ, స్థిరమైన ఆదాయం, పన్నుపరమైన ప్రయోజనాలూ పెద్దగా ఉండవు. రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ లిక్విడిటీ అంతగా ఉండదు. ఇక కొన్ని స్కీములు అత్యధిక రాబడులు ఇచ్చినా, అంత సురక్షితమైనవి కావు. మెరుగైన షేర్లు, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లాంటివి అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తాయి. కానీ స్వల్పకాలికంగా మాత్రం వీటిలో రిస్కులు ఉంటాయి. పెట్టుబడి సాధనాలు.. * ఇన్వెస్ట్ చేసేందుకు అనేక సాధనాలు ఉన్నాయి. * బ్యాంక్ డిపాజిట్లు, ఎన్నారై డిపాజిట్లు: ఎఫ్సీఎన్ఆర్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో * నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో డిపాజిట్లు, ఇతరత్రా కంపెనీ డిపాజిట్లు * నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు * పసిడి, ఇతర విలువైన లోహాలు * నేషనల్ పెన్షన్ స్కీమ్ * పీపీఎఫ్, జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ), పోస్టాఫీస్ డిపాజిట్లు * షేర్లు, ఫండ్స్, ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు * రియల్ ఎస్టేట్ వీటన్నింటిలో బ్యాంకు డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు, పీపీఎఫ్, ఎన్ఎస్సీల్లో రిస్కు చాలా తక్కువ. అలాగే రాబడులూ తక్కువగానే ఉంటాయి. ఇక స్టాక్స్, ఫండ్స్ లాంటి వాటిల్లో స్వల్పకాలికంగా రిస్కు ఉన్నా.. దీర్ఘకాలికంగా రాబడులు మెరుగ్గానే ఉండగలవు. గత పదేళ్ల చరిత్రను చూస్తే మిగతా సాధనాలను పోల్చి చూసినప్పుడు స్టాక్సే అధిక రాబడులు ఇచ్చినట్లు తెలుస్తుంది. స్టాక్స్‌లో దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌కి పన్నుపరమైన మినహాయింపులు లభిస్తాయి. కేటాయింపులు ఇలా.. రిస్కు సామర్ధ్యాలు, కెరియర్ దశలను బట్టి పెట్టుబడులకు కేటాయింపులు జరపాలి. కెరియర్ తొలినాళ్లలో అంటే దాదాపు 35 ఏళ్ల దాకా కాస్త దూకుడుగా, ఆ తర్వాత 50 ఏళ్ల దాకా కొంత బ్యాలెన్స్డ్గా, అటుపైన రిస్కులు మరింత తగ్గించుకునేలా పెట్టుబడులు ఉండాలి. షేర్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికాంశాలపై పట్టు ఉండాలి కాబట్టి.. అంతగా అనుభవం లేని వారు ఫండ్స్ ద్వారా పరోక్షంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) ఇందుకు అనువైనవి. బంగారం విషయానికొస్తే గోల్డ్ బాండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాంక్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులనేవి.. అప్పటి వడ్డీ రేట్ల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్ల కన్నా డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక వీటన్నింటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా కనీసం ఆరు నెలల ఖర్చుల మొత్తాన్ని సేవింగ్స్ అకౌంటులోనో లేదా లిక్విడ్ ఫండ్స్‌లోనో ఉంచుకోవడం శ్రేయస్కరం. - వీకే విజయకుమార్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ బీఎన్పీ పారిబా -
ధైర్యం కోల్పోకండి
⇒ రమణమూర్తి కుటుంబానికి జగన్ పరామర్శ ⇒ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ⇒ శ్రీకాకుళం నుంచి కాకినాడ వచ్చిన జననేత ⇒ నేటి ఉదయం హైదరాబాద్ పయనం కాకినాడ : కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆత్మబలిదానం చేసిన చీకట్ల వెంకటరమణమూర్తి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ర్ట ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ జ్యోతుల నెహ్రూ, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కాకినాడ రాజీవ్ గృహకల్ప సమీపంలో ఉంటున్న రమణమూర్తి కుటుంబాన్ని మంగళవారం రాత్రి పరామర్శించారు. జగన్‌ను చూడగానే రమణమూర్తి భార్య పార్వతి, కుమారుడు రాజేష్, కుమార్తెలు రాజేశ్వరి, చాముండేశ్వరి బోరున విలపించారు. జగన్ వీరి కన్నీళ్లు తుడిచి ధైర్యంగా ఉండాలని చెప్పి ఓదార్చారు. కుమారుడు రాజేష్‌తో మాట్లాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమణమూర్తి భార్య పార్వతితో జగన్ మాట్లాడారు. కాపుల కోసమే తన భర్త ప్రాణాలను పణంగా పెట్టారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబానికి ఇప్పుడు దిక్కెవరంటూ ఆవేదన చెందారు. రమణమూర్తి కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ధైర్యం కోల్పోవద్దని సూచించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి రాక చీకట్ల వెంకటరమణమూర్తి ఆత్మబలిదానంతో చలించిపోయిన జగన్ కాకినాడకు వచ్చి కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా సాధించాల్సిన ఆవశ్యకతపై యువతలో చైతన్యం తేవడానికి శ్రీకాకుళంలో మంగళవారం నిర్వహించిన యువభేరిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగన్, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో కాకినాడ వచ్చారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో కాకినాడకు చేరుకున్న జగన్ నేరుగా రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి వచ్చారు. అక్కడ నివాసం ఉంటున్న రమణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. కాపు ఐక్యగర్జన సభ నేపథ్యంలో విధ్వంసం చోటుచేసుకోవడం, రిజర్వేషన్ల కల్పన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం వంటి పరిణామాలతో కలత చెంది వెంకటరమణమూర్తి బలిదానం చేసుకున్న ఘటన వివరాలను ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తూ జగన్‌కు తెలియజేశారు. తర్వాత పార్టీ నాయకులతో కలిసి ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి బయల్దేరి వెళ్లనున్నారు.జగన్ వెంట ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, పినిపే విశ్వరూప్, కొత్తపల్లి సుబ్బారాయుడు, ముత్తా గోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి, గిరిజాల వెంకటస్వామినాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, తోట నాయుడు, అనంత ఉదయభాస్కర్, ముత్తా శశిధర్, ధర్మాన కృష్ణదాసు, ఆర్‌వీజేఆర్ కుమార్, అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, చెల్లుబోయిన వేణు, యనమదల మురళీకృష్ణ దంపతులు, పలువురు నాయకులు ఉన్నారు. -
మా ఇంటికి రాని మహాలక్ష్మి
భ్రూణహత్యలను నివారించేందుకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు, వారు ఉన్నత చదువులు చదువుకొనేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రస్తుతం ఆడబిడ్డలకు అక్కరకు రావటం లేదు. పథకాన్ని టీడీపీ ప్రభుత్వం సక్రమంగా అమలుచేయలేకపోతుంది. ఈ పథకానికి ‘మా ఇంటి మహాలక్ష్మిగా’ పేరు మార్చినప్పటికీ పథకం నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఫలితంగా వేలమంది ఆడపిలల్లకు రక్షణ లేకుండా పోతుంది. * బంగారు తల్లి పథకానికి మా ఇంటి మహాలక్ష్మిగా పేరుమార్చిన టీడీపీ ప్రభుత్వం * ఆన్లైన్లో లోగోకే పరిమితం ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్టమెంట్ ద్వారా పథకం అమలు చేయాలని వచ్చిన ఉత్తర్వులను పట్టించుకోని వైనం * కమిషనర్ల స్థాయిలోనే ఉత్తర్వులు నిలిచిపోయాయని చెబుతున్న ఐసీడీఎస్ సిబ్బంది పొందూరు: మా ఇంటి మహాలక్ష్మి పథకంపై నీలి నీడలు అలముకొన్నాయి. మే 5, 2013 తర్వాత పుట్టిన బాలికలకు మా ఇంటి మహాలక్ష్మిగా మారిన బంగారు తల్లి పథకం వర్తిస్తుంది. సమర్థంగా అమలు జరగాల్సిన ఈ పథకం ప్రభుత్వం చేతిలో బందీగా ఉంది. నిర్వహణ సరిగా లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. దీనిపై స్పందించాల్సిన మంత్రులు, అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించడం దురదృష్టకరం. మా ఇంటి మహాలక్ష్మి పథకంలో చిన్నారుల నమోదు బాధ్యత ఎవరిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పుట్టిన బాలికల వివరాలను వెలుగు కార్యాలయంలో నమోదు చేసేవారు. ప్రస్తుతం వారు కొనసాగించటం లేదు. ఆ పథకం వెలుగు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారని వెలుగు అధికారులు జీవోలు చూపిస్తున్నారు. 2015 ఫిబ్రవరి 18న బంగారు తల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా మార్చినట్టు సింగిల్ ఫైల్ నంబర్ 15 తెలుపుతుంది. 2015 ఏప్రిల్ 30న విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 50 ప్రకారం వెలుగు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలెప్మెంట్ డిపార్టమెంట్‌కు బదిలీ చేసినట్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇవన్నీ పక్కాగా ఆన్లైన్లో పొందుపరచినప్పటికీ ఉమెన్ అండ్ చైల్డ్ డవలప్మెంట్ అధికారులు మాత్రం ఉత్తర్వులు కమిషనర్లు వరకే పరిమితమయ్యాయని, పథకంలో ఆడపిల్లల నమోదుపై ఎటువంటి ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మహాలక్ష్మిలకు భరోసా ఏది? పుట్టిన ఆడబిడ్డలకు భరోసా లేకుండా పోయింది. మా ఇంటి మహాలక్ష్మి పథకం ఉన్నప్పటికీ అరకొరగానే బాలికల నమోదు జరిగింది. నమోదు చేసిన వారిలో కొందరి ఆధార్ కార్డు అప్లోడ్ జరగలేదని, ఏపీఎం, డీపీఎంలు అప్లోడ్ చేయాల్సి ఉందని వారిని అర్హత లేకుండా చేశారు. బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టిన నుంచి ఇప్పటివరకూ శ్రీకాకుళం జిల్లాలో 15,658 బాలికలను నమోదు చేశారు. వారిలో 14,865 మందిని అర్హులుగా గుర్తించారు. 793 మందిని వివిధ కారణాలతో అర్హత లేదని పెండింగ్‌లో పెట్టారు. గత రెండేళ్లలో పుట్టిన బాలికలను ఈ పథకంలో నమోదు చేసేందుకు వేలాది మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. వెలుగు, ఐసీడీఎస్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆడ శిశువు పుట్టిన నుంచి డిగ్రీ చదువుకొనేంత వరకు ఈ పథకం కింద వారికి రూ. 2.15 లక్షలను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఆడబిడ్డను పథకంలో నమోదు చేసేందుకు తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరగా ఈ పథకం పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఆడపిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మీ వాళ్లు క్షేమమే.. త్వరలోనే విడుదలవుతారు
‘లిబియా’ బందీల కుటుంబాలతో ప్రధాని మోదీ, సుష్మాస్వరాజ్ * ఉత్తరప్రత్యుత్తరాల్లో ఆలస్యం వల్లే సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: ‘మీ వాళ్లు పూర్తి క్షేమంగా ఉన్నట్లు సమాచారం ఉంది. వారి విడుదలకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. త్వరలో మీకు శుభవార్త అందుతుంది’ అని లిబియాలో కిడ్నాప్‌నకు గురైన ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కిషన్ కుటుంభసభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు భరోసానిచ్చారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో గోపీకృష్ణ భార్య కల్యాణి, బలరాం భార్య శ్రీదేవీ, బంధువులు మురళీకృష్ణ, రంగాచారి ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలిశారు. తమవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. బందీల విడుదలకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని వారితో పేర్కొన్నారు. అనంతరం బందీల కుటుంబసభ్యులతో సుష్మాస్వరాజ్ దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు. బందీలు కిడ్నాప్‌నకు గురైన ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఉత్తరప్రత్యుత్తరాలకు ఆలస్యం అవుతోందని, వారు క్షేమంగానే ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఆమె తెలిపారు. తమ వారిని విడిపించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను తమకు వివరించారని మోదీ, సుష్మా స్వరాజ్‌ను కలిసిన అనంతరం కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి వారు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. -
ఆత్మహత్యలొద్దు.. బాసటగా ఉంటాం
రైతులకు వామపక్ష పార్టీల భరోసా గజ్వేల్‌లో రైతు భరోసా యాత్ర ప్రారంభం గజ్వేల్: రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఇకముందు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. తాము బాసటగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ‘రైతు ఆత్మహత్యలు నివారించండి-ఆర్థిక భద్రత కల్పించండి’ అనే నినాదంతో పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా యాత్ర (జాతా) శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీ నామమాత్రంగానే అమలు చేయడం వల్ల రైతులకు చేయూత కరువైందన్నారు. రూ.లక్ష రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైపు నుంచి మద్ధతు లభించకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 500 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనూ అన్నదాతలు వరుసగా బలవన్మరణాలకు పాల్పడటం వారి దయనీయస్థితిని చాటుతున్నాయన్నారు. జీవో.421ను సవరించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశలో ఈనెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బాధిత కుటుంబాలతో కలసి పెద్దఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కరువు విలయతాండవం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. వెంటనే రాష్ట్రంలోని 338 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. సభలో వామపక్ష పార్టీల నేతలు పశ్య పద్మ, భట్టు దయానందరెడ్డి, రాజయ్య, జంగం నాగరాజు, జోగు చలపతిరావు, వెంకన్న, నర్సయ్య, మురహరి, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ కార్యకర్తకు భరోసా!
చెక్ పెడుతున్నారు. టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు న్యాయపోరాటానికి దిగుతున్నారు. రాష్ట్ర స్థాయి త్రిసభ్య కమిటీ సభ్యులు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో మనోధైర్యం నింపే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు, నియోజకవర్గాల్లో తమ కంట్లో నలుసుగా ఉంటారనే ఉద్దేశంతో కొందరు వైఎస్సార్ సీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారు. మరి కొందరిపై హత్యాయత్నాలకు దిగారు. ఇంకా దాడులకు తెగబడుతూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశం నేతల ఆగడాలను అరికట్టేందుకు వైఎస్సార్ సీపీపెద్ద ప్రయత్నమే ప్రారంభించింది. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో మంగళగిరి, గుంటూరు తూర్పు, బాప ట్ల, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్ల, గురజాల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. నిబంధనల పేరుతో వైఎస్సార్ సీపీ కార్యకర్తల పింఛన్లు, రేషన్‌కార్డులను తొలగించడమే కాకుండా గెలిచిన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ గౌరవం కల్పించకుండా అవమాన పరుస్తున్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం సైతం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఈ విషయాలన్నిటినీ వైఎస్సార్ సీపీ నేతలు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. నరసరావుపేట నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణకు ఏ పదవీ లేకపోయినా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంటే కోడెల కుమారునికే ప్రొటోకాల్ గౌరవ మర్యాదలు కల్పించడంతో పార్టీ దానిని నిలువరించే ప్రయత్నం చేసింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తల కిడ్నాప్, దాడులపై హైకోర్టు సీరియస్ కావడంతో దోషులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సరస్వతి సిమెంట్స్ భూముల విషయంలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులపై పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. రిమాండ్‌లో ఉన్న బాధితులను పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సోమవారం గురజాలలోని సబ్‌జైలులో కలుసుకుని ధైర్యం చెప్పారు. ‘ మీకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.’ అని భరోసా ఇచ్చారు. సిమెంట్స్ భూముల్లో వివాదం జరిగినప్పుడు అక్కడ లేకపోయినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. {పత్తిపాడు నియోజకవర్గంలోనూ పరిస్థితులు ఇందుకు మినహాయింపు కాదు. మంత్రి అండదండలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఇప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ టీడీపీ దాడులను నిలువరించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కమిటీల ఏర్పాటుతో నూతన ఉత్తేజం ... అధికార పార్టీ అక్రమాలకు కళ్లం వేయడంతోపాటు బూత్‌స్థాయిలో పార్టీని పటిష్టపరిచేందుకు వీలుగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కమిటీల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు, అధికార పార్టీ అక్రమాలను ఎండగట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని నేతలు భావిస్తున్నారు.