ప్రతీ కార్యకర్తకు భరోసా!
చెక్ పెడుతున్నారు.
టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు న్యాయపోరాటానికి దిగుతున్నారు.
రాష్ట్ర స్థాయి త్రిసభ్య కమిటీ సభ్యులు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో మనోధైర్యం నింపే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు, నియోజకవర్గాల్లో తమ కంట్లో నలుసుగా ఉంటారనే ఉద్దేశంతో కొందరు వైఎస్సార్ సీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారు. మరి కొందరిపై హత్యాయత్నాలకు దిగారు. ఇంకా దాడులకు తెగబడుతూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశం నేతల ఆగడాలను అరికట్టేందుకు వైఎస్సార్ సీపీపెద్ద ప్రయత్నమే ప్రారంభించింది.
జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో మంగళగిరి, గుంటూరు తూర్పు, బాప ట్ల, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్ల, గురజాల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వేధింపులు ఎక్కువగా ఉన్నాయి.
నిబంధనల పేరుతో వైఎస్సార్ సీపీ కార్యకర్తల పింఛన్లు, రేషన్‌కార్డులను తొలగించడమే కాకుండా గెలిచిన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ గౌరవం కల్పించకుండా అవమాన పరుస్తున్నారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం సైతం ప్రేక్షక పాత్ర వహిస్తోంది.
ఈ విషయాలన్నిటినీ వైఎస్సార్ సీపీ నేతలు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
నరసరావుపేట నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణకు ఏ పదవీ లేకపోయినా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంటే కోడెల కుమారునికే ప్రొటోకాల్ గౌరవ మర్యాదలు కల్పించడంతో పార్టీ దానిని నిలువరించే ప్రయత్నం చేసింది.
సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తల కిడ్నాప్, దాడులపై హైకోర్టు సీరియస్ కావడంతో దోషులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
సరస్వతి సిమెంట్స్ భూముల విషయంలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులపై పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. రిమాండ్‌లో ఉన్న బాధితులను పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సోమవారం గురజాలలోని సబ్‌జైలులో కలుసుకుని ధైర్యం చెప్పారు. ‘ మీకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది.’ అని భరోసా ఇచ్చారు.
సిమెంట్స్ భూముల్లో వివాదం జరిగినప్పుడు అక్కడ లేకపోయినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పార్టీ న్యాయపోరాటం చేస్తోంది.
{పత్తిపాడు నియోజకవర్గంలోనూ పరిస్థితులు ఇందుకు మినహాయింపు కాదు. మంత్రి అండదండలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు.
పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఇప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ టీడీపీ దాడులను నిలువరించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
కమిటీల ఏర్పాటుతో నూతన ఉత్తేజం ...
అధికార పార్టీ అక్రమాలకు కళ్లం వేయడంతోపాటు బూత్‌స్థాయిలో పార్టీని పటిష్టపరిచేందుకు వీలుగా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కమిటీల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు, అధికార పార్టీ అక్రమాలను ఎండగట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని నేతలు భావిస్తున్నారు.