ఘరోసా | Parents Responsibility To Raise Children Carefully | Sakshi
Sakshi News home page

ఘరోసా

Published Fri, Oct 18 2019 1:22 AM | Last Updated on Fri, Oct 18 2019 4:44 AM

 Parents Responsibility To Raise Children Carefully - Sakshi

కడుపున మోస్తున్నప్పుడే కాదు, కన్న తర్వాత కూడా బిడ్డను కడుపులో పెట్టుకునే పెంచుతుంది తల్లి! నవమాసాలూ ఎంత భద్రంగా పొదవి పట్టుకుంటుందో.. కౌమారంలో అంతకు మించిన జాగ్రత్తతో కనురెప్పల మధ్య పెట్టుకుంటుంది. అయినప్పటికీ జరగరానిది జరిగితే? బిడ్డకెంత బాధో తల్లికీ అంతే వేదన. ఆ గాయం నుంచి ఊరటను కలిగించి న్యాయం జరిగేలా సాయం అందించే ఇల్లే.. ‘భరోసా’. ఆత్మ స్థైర్యాన్ని పెంచే ఘరోసా.

‘‘రెండేళ్ల కిందట.. ఒకరోజు రాత్రి ఎనిమిదిన్నరకు అనుకుంటా..‘అమ్మా.. ఓనర్‌ తాత పిలుస్తున్నాడు..’’ అంటూ పైన అంతస్తులో ఉండే మా ఇంటి ఓనర్‌ వాళ్లింటికి వెళ్లింది పాప. పదిహేను నిమిషాలైనా కిందకి రాలేదు. ఎక్కడినుంచో ఏడుపు వినిపించింది. తర్వాత గమనిస్తే మా పాప ఏడుపే అని అర్థమై.. గబగబా పైకి వెళ్లాను. వీధి గుమ్మం గడియ వేసి ఉంది. ఆ గుమ్మం పక్కనే ఉన్న కిటికీ అద్దమొకటి  పగిలిపోయి ఉంది. పాపను పిలుస్తూ అందులోంచి  చూశా. లోపలి బెడ్‌రూమ్‌ కనపడుతోంది. నా గొంతు వినేసరికి మా పాప ఏడుస్తూనే అరిచేసింది ‘‘మమ్మీ ..’’ అంటూ! నేనూ గట్టిగా అరుస్తూ  మళ్లీ తలుపు దబాదబా బాదా. పాప పరిగెత్తుకుంటూ లోపల్నించి వచ్చి తలుపు తీసింది.

57 ఏళ్ల మా ఓనర్‌ దాదాపు న్యూడ్‌గా ఉన్నాడు.. ఏడేళ్ల మా పాపను..’’ చెప్పలేక రెండు చేతుల్లో తల దాచుకొని ఏడ్చేసింది ఆ అమ్మ.ఆ వార్డ్‌ కౌన్సిలర్‌ అయిన ఆ ఇంటి ఓనర్‌  భార్య తన పలుకుబడితో తన భర్త నిర్దోషని, ఆ పాప తల్లే తన ఇంట్లో వెండి సామాను, డబ్బులు దొంగిలించిందని తప్పుడు కేసులు పెట్టింది. బ్లాక్‌మెయిల్, వేధింపులకూ గురిచేసింది. అయినా అవన్నీ వీగిపోయి.. ఆ ఓనర్‌ చేసిన తప్పు రుజువై పదేళ్ల జైలు శిక్ష పడింది.ఓ జంటకు పాప పుట్టింది. ఆ చంటిపిల్లకు మూడోనెల రాగానే ‘‘పాపకు నేనే స్నానం చేయిస్తాను’’ అంటూ భర్తే స్నానం చేయించడం మొదలుపెట్టాడు. అలా బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చేదాకా అతనే స్నానం చేయించాడు.

ఒకరోజు తల్లి స్నానం చేయిస్తుంటే.. ‘‘అమ్మా.. స్నానం చేయించేటప్పుడు నాన్న ఇలా చేస్తాడు.. నువ్వు చేయట్లేదు’’ అని వచ్చీరాని మాటల్తో పాప చెబుతుంటే హతాశురాలైంది తల్లి. ‘‘బాధ్యతల్లో పాలుపంచుకుంటున్న అతణ్ణి ఇన్నిరోజులు మంచి భర్తగా భావించా  కానీ అతని మనసులో ఉన్న రోతను గమనించలేకపోయానే’’ అని గుండె పగిలేలా ఏడ్చింది. భర్త మీద కేసు పెట్టింది. అతని నేరం  రుజువు చేయడానికి నానాకష్టాలు పడ్డది. అలాంటి తండ్రికి బిడ్డ పట్ల విజిటింగ్‌ హక్కు ఇవ్వకూడదని కోర్ట్‌లో  ఒక పోరాటమే చేసింది. ‘‘ఈపాటికల్లా  పాల ప్యాకెట్లు వేసేసి పిల్లాడు ఇంటికి రావాల్నే.. ఇంకా రాలేదేంటి?’’ అనుకుంటూ పదకొండేళ్ల కొడుకును వెదుక్కుంటూ వెళ్లాడు తండ్రి. దార్లోనే కనిపించాడు కొడుకు పైజామా అంతా రక్తసిక్తమై.

అది చూసిన ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. ‘‘ఏమైంది బేటా..’’ అని తండ్రి అడిగేలోపే.. వణుక్కుంటూ ‘‘ఫలానా వీధిలో ఉండే అంకుల్‌ లోపలికి పిలిచి..’’ అంటూ జరిగిన దారుణం చెప్పాడు.దేవుడా..! అయినా ఇప్పుడెందుకు ఇవన్నీ ఏకరువు పెట్టారు? మన చుట్టూ జరుగుతున్న దారుణాల గురించి చెప్పడానికి వారం, వర్జ్యం, సందర్భం కావాలా? ఈ నేరాలు తెలిస్తేనే కదా.. మన పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిని ఎంతలా గమనించాలి అన్న సత్యాలు బోధపడేవి! కరెక్ట్‌ ..ఇలాంటి అవగాహన, చైతన్యం కల్పించే కార్యక్రమాన్నే నిన్న హైదరాబాద్‌లో  చేపట్టింది ‘‘భరోసా సెంటర్‌’’. ఈ కార్యక్రమంలో బాధితులు పంచుకున్న వెతలే అవి. తెలంగాణ పోలీస్‌ సహకారం, ఆడపిల్లల రక్షణకోసం పనిచేస్తున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ టెక్నికల్‌ సపోర్ట్‌తో నడుస్తున్నదే ‘భరోసా’. 

బాలల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి, దానికోసం ఉన్న చట్టాల గురించి తెలియజేయడానికి, జరిగిన నేరానికి సంబంధించి హెల్ప్‌లైన్,  కేసు నమోదు చేయడం నుంచి తీర్పు వరకు సమస్తం ఒకేచోట అందించడానికి ఏర్పడిందే ‘భరోసా’. లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన పిల్లలు.. పోలీసులు, కేసులు, కోర్టులు, నిందితుల గుర్తింపు.. మొదలైన ప్రక్రియలో మానసికంగా మరింత నలిగిపోయే ప్రమాదం ఉంది.పోలీస్‌ యూనిఫామ్, గంభీరమైన కోర్ట్‌ హాలు, తికమక పెట్టే డిఫెన్స్‌ వాదన, నిందితుడి చూపులు, ఆసుపత్రికి వెళ్లడాలు వంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా.. ఇంటిలాంటి వాతావరణంలో అమరుస్తోంది భరోసా.

ఇందులో పిల్లలకు సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌ కూడా ఉంటుంది ఆ ట్రామా నుంచి బయటపడేందుకు. న్యాయవిచారణలో సహకరించేందుకు. కోర్ట్‌ ప్రొసీడింగ్స్‌ జరుగుతున్నప్పుడు నిందితుడు పిల్లలకు కనిపించకుండా ఉండే  ఏర్పాటూ ఉంటుంది. అవసరమైన పిల్లలకు పునరావాసమూ ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం.. ఈ భరోసా సెంటర్‌కు రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం కేవలం జడ్జి, బాధిత పిల్లలకు మాత్రమే. మరో ద్వారం మిగిలిన అందరికోసం. అంటే ఎక్కడా పిల్లలు నిందితుల కంటపడరన్నమాట. ‘‘భరోసా సెంటర్‌లు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్‌లో పెట్టాం. త్వరలోనే నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, రాచకొండ కమిషనరేట్‌లలోనూ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు తెలంగాణ రాష్ట్ర విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఐజీ స్వాతి లక్రా.

భరోసాకు ప్రేరణ..
అమెరికా, కాలిఫోర్నియాలోని శాండియాగోలో ఉన్నది రిహాబిలిటేషన్‌ సెంటర్‌. అక్కడ లైంగిక దాడి, అబ్యూస్‌కు గురైన పిల్లలను నేరుగా ఈ సెంటర్‌కే తీసుకొస్తారు. వాళ్లు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యవంతులైన తర్వాతే ఇంటికి పంపిస్తారు. ఇక్కడైతే కోర్ట్‌ ప్రొసీడింగ్స్‌ కూడా పిల్లలకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఒక గ్లాస్‌ విండో ఉన్న హాలులో పిల్లలతో కౌన్సెలర్‌ ఆడుకుంటూ జరిగిన విషయాలు నెమ్మదిగా చెప్పిస్తూ ఉంటాడు. ఈ విండోకి ఆవల కోర్ట్‌ హాల్‌ ఉంటుంది. అది పిల్లలకు కనిపించదు, వినిపించదు. కాని ఆ కోర్ట్‌కు మాత్రం పిల్లలు, కౌన్సెలర్‌ సంభాషణ వినపడ్తూంటుంది. అలా ప్రొసీడింగ్స్‌ సాగి తీర్పు వెలువడుతుంది.
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

ఇంటి నుంచే...
‘‘పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి కొత్త చట్టాలు వచ్చాయి. దురదృష్టమేమంటే అందులో పేర్కొన్న విధానాల్లో కూడా పిల్లల మీద అఘాయిత్యాలు జరగడం. అయినా పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌) దాదాపు అలాంటివన్నిటినీ కవర్‌ చేస్తోంది. చట్టాలు రావడం, అమలు చేయడం ఒకెత్తయితే.. పిల్లలను జాగ్రత్తగా పెంచడం మరో ఎత్తు. ఇది  తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా మగపిల్లల పెంపకంలో ఇంటినుంచే జాగ్రత్త మొదలైతే సమాజం, దేశం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ చట్టం గురించి తల్లిదండ్రులతో పాటు  ప్రతి స్కూల్లో, ప్రతి విద్యార్థికి, టీచర్‌కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భరోసాతోపాటు, తరుణి సంస్థ ద్వారా కూడా’’
– మమతా రఘువీర్, న్యాయవాది, తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు.


►కొన్ని రాష్ట్రాల్లో ని పేద తల్లిదండ్రులు తమకు తెలిసే తమ పిల్లలను పోర్న్‌కు టూల్స్‌గా మారుస్తున్నారట.  గుడిసెల్లో కెమెరాలుంటాయిట. విదేశాల నుంచి క్లయింట్స్‌ ఎప్పుడు పింగ్‌ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి.. క్లయింట్స్‌ ఎలా కావాలంటే అలా యాక్ట్‌ చేస్తూంటారుట ఆ పిల్లలు.

►పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల మీద అఘాయిత్యం జరిగినా, లేదా వాళ్లే ఏదైనా నేరం చేసినా.. వాళ్ల పేర్లు, వ్యక్తిగత వివరాలేవీ కూడా రికార్డుల్లో నమోదు చేయకూడదు. మూడేళ్ల వరకు మాత్రమే ఆ నేరం గురించి రికార్డుల్లో ఉండాలి. తర్వాత తీసేయాలి.

►ఎస్సీ, ఎస్టీ బాలికలకు లేదా దారుణమైన స్థితిలో ఉన్న బాలికలకు ఆయా పరిస్థితులను బట్టి ఈ నష్టపరిహారం 3 లక్షల నుంచి 8 లక్షల రూపాయల  దాకా ఉండొచ్చు.

►బాధిత బాలికలకు నష్టపరిహారం ఉంటుంది.  ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగానే 25 వేలు, చార్జిషీట్‌ వేశాక 50 వేలు, తీర్పు వెలువడ్డాక 25 వేలు ..  ఇలా మొత్తం లక్ష రూపాయలదాకా  ఆ నష్టపరిహారం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement