ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు | Kondaveedu Will Be Transformed Into A World Tourist Destination Said Minister Buggana | Sakshi
Sakshi News home page

ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు

Published Sun, Oct 13 2019 12:38 PM | Last Updated on Sun, Oct 13 2019 12:38 PM

Kondaveedu Will Be Transformed Into A World Tourist Destination Said Minister Buggana - Sakshi

కొండవీడు నమూనాను తిలకిస్తున్న మంత్రులు రామచంద్రారెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి తదితరులు

సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడును మారుస్తామని రాష్ట్ర ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొం దించేందుకు రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 18న సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యడ్లపాడు మండలంలోని కొండవీడు సమీపంలో రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల ప్రారంభానికి విచ్చేసిన ఆయన కొండవీడు కోటను శనివారం సందర్శించారు. ఎమ్మెల్యే విడదల రజని, మాజీ ఎమ్మెల్సీ జి.వి.కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యుల్‌ ఆనంద్‌ కుమార్, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డితో కలిసి ఘాట్‌ రోడ్డు, మహాద్వారం, కొండపై ఉన్న శివాలయం, మూడు చెరువులను పరిశీలించారు. ఇప్పటివరకు కొండవీడులో చేసిన పనుల వివరాలను కలెక్టర్‌ మంత్రికి తెలియజేశారు.

కొండవీడు అభివృద్ధికి సంబంధించి చిన్నారుల పార్కు, వెహికల్‌ పార్కింగ్‌ల ఏర్పాటు, మూడు చెరువుల అభివృద్ధి, తూర్పువైపు ప్రధాన ద్వారం అభివృద్ధితో పాటు 0.75 కి.మి ఘాట్‌ రోడ్డు రెండో దశ పనులు, కొండలపై 20 కి.మి మేర ఉన్న కోటగోడ, శిథిలమైన బురుజులను, విద్యుత్తు సబ్‌స్టేషన్, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్యే విడదల రజని లిఖిత పూర్వకంగా రాసిన లేఖను మంత్రికి అందించారు. నాటి చారిత్రాక అంశాలను, జాతి సంపదకు దుండగుల బారి నుంచి రక్షణ కల్పించాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కె.శివారెడ్డి మంత్రిని కోరారు. కొండవీడు అభివృద్ధికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజని, అన్నిశాఖల ఉన్నతాధికారులతో ఈ నెల 18న సమీక్షను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. తొలుత జరిగిన మ్యూజియం ప్రారంభోత్సవ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా..

ప్రపంచపటంలో వై.ఎస్‌.జగన్‌ నిలుపుతారు : ఎమ్మెల్యే రజని
కొండవీడు అభివృద్ధికి తొలి సంతకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దేనని ఎమ్మెల్యే విడదల రజని చెప్పారు. ఘాట్‌రోడ్డుతోనే ప ర్యాటక రంగంగా మారుతుందని గ్రహించి ని ధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ము ఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హ యాంలో కొండవీడు పర్యాటక రంగంలో ప్ర పంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్నారు. ప్రాచీన సంపదను భావితరాలకు చూపించాలని ప్రైవేటు సంస్థ ఇంతటి బాధ్యత తీసుకొని దిగ్విజయంగా పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోయే అంశం అన్నారు. 

ఆంధ్ర చారిత్రక దినంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే గోపిరెడ్డి 
కొండవీటి చరిత్రను తెలుగులోకి అనువదించిన ప్రముఖ రచయిత మల్లంపల్లి సోమశేఖరశర్మ జయంతి (డిసెంబర్‌ 9)ని ఆంధ్ర చారిత్రక దినంగా ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. నాటి సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యం, పాలనా వైభవాన్ని మాతృభాషలో అందరికీ అందించిన శర్మ జయంతిని చారిత్రక దినంగా ప్రకటించాలని ప్రభుత్వానికి గతంలోనే నివేదించామన్నారు. అనేక ప్రాంతాల్లో రెడ్ల సమాఖ్య పలు కార్యక్రమాలు నిర్వహించిందని, మన ప్రాంతంలో మ్యూజియం నిర్మించడం అభినందనీయమన్నారు.

మ్యూజియం ఏర్పాటుకు పట్టుబట్టా : ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీదేవి
కొండవీటి రెడ్డిరాజుల చరిత్రను భావితరాలకు అందించేందుకు ఏర్పాటు చేసిన వారసత్వ మ్యూజియంను నాడు అంతా అమీనా బాద్‌లో ఏర్పాటు చేయాలని సూచిం చినా, చిన్న గ్రామమైన హౌస్‌ గణేష్‌పాడులో ఏర్పా టు చేయాలని తాను కోరినట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. మ్యూజి యం అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి నిధులు ఇచ్చి మరింత అభివృద్ధి చేయాలని కోరారు. 

కొండవీడు రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, రజని, శ్రీదేవి తదితరులు  
భావితరాలకు చేరువ చేయండి : నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి
చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నించాలని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ పూర్వీకుల ఆదర్శాలకు నిదర్శంగా రెడ్డిరాజుల వారసత్వ ప్రదర్శనశాల నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గోల్కోండ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ చైర్మన్‌ నడికట్టు రామిరెడ్డి, సమాఖ్య పూర్వ అధ్యక్షుడు జంగం శ్రీనివాసరెడ్డి, వి.బాలమద్దిలేటిరెడ్డి, అధ్యక్షుడు వనం వెంకట రామిరెడ్డి, కార్యదర్శి తాతిరెడ్డి, కోశాధికారి తోడేటి నర్సింహ్మారెడ్డి, కల్లి శివారెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, నాయకులు బాలవిజయచంద్రారెడ్డి, బసెల శివరామకృష్ణ, జాకీర్, విడదల లక్ష్మీనారాయణ, బేరింగ్‌ మౌలాలి, సింగారెడ్డి కోటీరెడ్డి, కాట్రగడ్డ మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

తొలుత ప్రారంభోత్సవం ఇలా..
వేదపండితులు ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. ముందుగా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మ్యూ జియం భవనం ప్రారంభించారు. పల్నాటి నాగమ్మ విభాగాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రోలయవేమారెడ్డి విభాగం, కొండవీడు నమూనా విభాగాలను ఎమ్మెల్యే విడదల రజని, రేచర్ల రుద్రారెడ్డి విభాగాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, నంది విగ్రహాన్ని ఎంపీ బ్రహ్మానందరెడ్డి, గ్రంథాలయాన్ని గోల్కోండ గ్రూప్‌ హోటల్స్‌ చైర్మన్‌ నడికట్టు రామిరెడ్డి ప్రాంభించారు. అతిథులంతా ప్రత్యేక పూజలు చేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement