పక్కా ప్రణాళికతో భవితకు భరోసా
ఏదైనా లక్ష్యం సాధించాలంటే పక్కా ప్రణాళిక ఎలాగైతే కీలకమో.. భవిష్యత్‌లో ఆర్థిక భద్రత పొందాలంటే కచ్చితమైన ప్లానింగ్ కూడా అంతే అవసరం. సాధారణంగా చిన్న చిన్న వాటికి కూడా ఆచితూచి ఖర్చు చేసే వారు సైతం.. భారీ పెట్టుబడుల విషయంలో కాస్త అశ్రద్ధ చూపుతుంటారు. ఆర్థిక లక్ష్యాలు, సాధనాలు మొదలైన వాటిపై పెద్దగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే సరైన ఆర్థిక ప్రణాళికతో లక్ష్యాలను చేరగలిగే తీరును వివరించేదే ఈ కథనం.
ప్రణాళికకు కీలకమైనవి..
సాధారణంగా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక దశలో ఏదో ఒక ఆర్థిక లక్ష్యం ఉంటుంది. సొంత ఇల్లు తీసుకోవడమో లేదా వాహనం కొనుక్కోవడమో లేదా పిల్లల చదువులు/వారి వివాహాలు, రిటైర్మెంట్ వంటి అవసరాలు ఉంటాయి. వీటిని ముందుగా గుర్తించి, ఆయా అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవడంలో ఈ కింది అంశాలు తోడ్పడతాయి.
* ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
* కాలవ్యవధి నిర్ణయించుకోవాలి
* రిస్కు సామర్ధ్యాలను బేరీజు వేసుకోవాలి
* రిస్కు సామర్ధ్యాన్ని బట్టి పెట్టుబడి సాధనాలకు నిధులు కేటాయించుకోవాలి
* కెరియర్ తొలినాళ్లలో కాస్త రిస్కు తీసుకునే సామర్ధ్యం ఉంటుంది. ఎక్కువ రిస్కు ఉన్నా, అధిక వృద్ధికీ అవకాశముండే షేర్లు/మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్వల్పకాలానికి ఇవి కాస్త రిస్కీయే అయినప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులే అందించగలవు. ఇక, తర్వాత కాలంలో రిస్కు సామర్ధ్యం తగ్గుతూ రిటైర్మెంట్‌కు దగ్గరయ్యే కొద్దీ షేర్లు వంటి రిస్కీ సాధనాల్లో తగ్గిస్తూ.. స్థిరమైన రాబడులు ఇచ్చే డెట్ ఫండ్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటివైపు మొగ్గు చూపవచ్చు. ఈ క్రమంలో పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
* కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేలా జీవిత బీమా పాలసీ తీసుకోవడం
* తగినంత వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవడం
* రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసుకోవడం
* వీలునామా కూడా రాసి ఉంచడం
పెట్టుబడుల పరమార్థం ..
ఏదైనా సాధనంలో మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఆశించేవి కొన్ని ఉంటాయి. అవి..
* స్థిరంగా రాబడులు
* సదరు అసెట్ విలువ పెరగడం
* అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు ఉండటం (లిక్విడిటీ)
* భద్రత. పెట్టుబడుల విషయంలో రాబడులతోపాటు భద్రతకూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
* పన్నులపరమైన ప్రయోజనాలు
* ప్రయోజనాలన్నీ అందించే సాధనాలు చాలా తక్కువ ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లు స్థిరమైన ఆదాయం ఇస్తాయి కానీ వాటి విలువ పెరగదు. బంగారం, స్థలం విలువ దీర్ఘకాలంలో పెరుగుతుంది కానీ, స్థిరమైన ఆదాయం, పన్నుపరమైన ప్రయోజనాలూ పెద్దగా ఉండవు. రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ లిక్విడిటీ అంతగా ఉండదు. ఇక కొన్ని స్కీములు అత్యధిక రాబడులు ఇచ్చినా, అంత సురక్షితమైనవి కావు. మెరుగైన షేర్లు, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లాంటివి అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తాయి. కానీ స్వల్పకాలికంగా మాత్రం వీటిలో రిస్కులు ఉంటాయి.
పెట్టుబడి సాధనాలు..
* ఇన్వెస్ట్ చేసేందుకు అనేక సాధనాలు ఉన్నాయి.
* బ్యాంక్ డిపాజిట్లు, ఎన్నారై డిపాజిట్లు: ఎఫ్‌సీఎన్‌ఆర్, ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో
* నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో డిపాజిట్లు, ఇతరత్రా కంపెనీ డిపాజిట్లు
* నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు
* పసిడి, ఇతర విలువైన లోహాలు
* నేషనల్ పెన్షన్ స్కీమ్
* పీపీఎఫ్, జాతీయ పొదుపు పత్రాలు (ఎన్‌ఎస్‌సీ), పోస్టాఫీస్ డిపాజిట్లు
* షేర్లు, ఫండ్స్, ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు
* రియల్ ఎస్టేట్
వీటన్నింటిలో బ్యాంకు డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీల్లో రిస్కు చాలా తక్కువ. అలాగే రాబడులూ తక్కువగానే ఉంటాయి. ఇక స్టాక్స్, ఫండ్స్ లాంటి వాటిల్లో స్వల్పకాలికంగా రిస్కు ఉన్నా.. దీర్ఘకాలికంగా రాబడులు మెరుగ్గానే ఉండగలవు. గత పదేళ్ల చరిత్రను చూస్తే మిగతా సాధనాలను పోల్చి చూసినప్పుడు స్టాక్సే అధిక రాబడులు ఇచ్చినట్లు తెలుస్తుంది. స్టాక్స్‌లో దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌కి పన్నుపరమైన మినహాయింపులు లభిస్తాయి.
కేటాయింపులు ఇలా..
రిస్కు సామర్ధ్యాలు, కెరియర్ దశలను బట్టి పెట్టుబడులకు కేటాయింపులు జరపాలి. కెరియర్ తొలినాళ్లలో అంటే దాదాపు 35 ఏళ్ల దాకా కాస్త దూకుడుగా, ఆ తర్వాత 50 ఏళ్ల దాకా కొంత బ్యాలెన్స్‌డ్‌గా, అటుపైన రిస్కులు మరింత తగ్గించుకునేలా పెట్టుబడులు ఉండాలి. షేర్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికాంశాలపై పట్టు ఉండాలి కాబట్టి.. అంతగా అనుభవం లేని వారు ఫండ్స్ ద్వారా పరోక్షంగా ఇన్వెస్ట్ చేయొచ్చు.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (సిప్) ఇందుకు అనువైనవి. బంగారం విషయానికొస్తే గోల్డ్ బాండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాంక్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులనేవి.. అప్పటి వడ్డీ రేట్ల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్ల కన్నా డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక వీటన్నింటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా కనీసం ఆరు నెలల ఖర్చుల మొత్తాన్ని సేవింగ్స్ అకౌంటులోనో లేదా లిక్విడ్ ఫండ్స్‌లోనో ఉంచుకోవడం శ్రేయస్కరం.
- వీకే విజయకుమార్
ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ బీఎన్‌పీ పారిబా