Proper planning
-
రేట్ల పెంపు రూటు..ఇంటికి దారెటు
సొంతింటి కలను రుణం సాకారం చేస్తుంది. రుణం తీసుకోకపోయినా సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. కాకపోతే మధ్య తరగతి వాసులు రుణం జోలికి వెళ్లకుండా ఉండాలంటే.. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పొదుపు, మదుపు చేసినప్పుడే ఇంటి కొనుగోలుకు కావాల్సినంత సమకూరుతుంది. అదే గృహ రుణం అయితే, కొన్నేళ్ల ముందుగానే ఇంటి కల నెరవేరుతుంది. పైగా రుణం తీసుకున్న తర్వాత ఎలా అయిన తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక దానికి కట్టుబడి ఉంటాం. కానీ, 20–30 ఏళ్లపాటు ఇంటి కోసం పొదుపు చేసే క్రమంలో.. జీవితంలో వచ్చే ముఖ్యమైన అవసరాల కోసం గృహ రుణ నిధి విషయంలో రాజీపడే ప్రమాదం ఉంటుంది. కనుక గృహ రుణం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. కాకపోతే, గృహ రుణం విషయంలో సరైన ప్రణాళిక, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలూ, ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. గృహ రుణం అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కనుక దీనిపై వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువే. గత 10 నెలలుగా వడ్డీ రేట్లు అసాధారణంగా పెరిగాయి. రుణం తీసుకున్న వారు, తీసుకోబోయే వారు ఈ రిస్క్‌లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకునే ముందు తప్పకుండా గమనించాల్సిన అంశాలేంటో ఈ కథనంలో చూద్దాం... గృహ రుణంపై ఫ్లోటింగ్ రేటు చాలా తక్కువ రేటు ఆప్షన్లలో ఒకటి. అదే ఫిక్స్డ్ రేటు (స్థిరంగా ఉండే వడ్డీ రేటు, అదీ కొన్నేళ్ల పాటే) అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఫ్లోటింగ్ రేటు కంటే ఫిక్స్డ్ వడ్డీ రేటు 2 శాతం అధికంగా ఉంటుంది. గృహ రుణం తీసుకునే వారిలో ఎక్కువ మంది ఫ్లోటింగ్ రేటును ఎంపిక చేసుకోవడానికి ఈ వ్యత్యాసమే కారణం. కానీ, ఫ్లోటింగ్ రేటు అన్నది రెండు వైపులా పదునున్న కత్తి మాదిరే అనుకోవాలి. వడ్డీ రేట్లు తగ్గిపోయే క్రమంలో ఫ్లోటింగ్ రేటు వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. కానీ, అదే వడ్డీ రేట్లు పెరిగిపోయే తరుణంలో రుణ గ్రహీతలను మరింతగా బాధిస్తుంది. ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాలు తీసుకుంటే, అవి రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. అందుకని ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణం తీసుకునే వారు, వడ్డీ రేట్లు పెరిగే సమయంలో అదనంగా చెల్లించేందుకు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. రేట్లు ఇంకా పెరగొచ్చు సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సాధారణంగా అవి తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటారు. కానీ, వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఇలాంటి కోరికలు నెరవేరవు. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం పెంచింది. రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. చాలా మంది నిపుణులు రెపో రేటు 6.5 శాతానికి చేరిన వెంటనే వడ్డీ రేట్ల పెంపు ముగుస్తుందని లోగడ అంచనా వేశారు. కానీ, పరిస్థితులు తర్వాత మారిపోయాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సమస్యాత్మకంగా తయారైంది. అందుకే అన్ని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రుణ గ్రహీతలు మరో విడత లేదంటే, మరిన్నిసార్లు రెపో రేటు పెంపును చూడాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు. చాలా సైకిల్స్ వడ్డీ రేట్లన్నవి ఆర్థిక చక్ర భ్రమణాల మాదిరే ఉంటాయి. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. మరి గృహ రుణం అంటే ఎంత లేదన్నా 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటూ ఉంటారు. దీంతో వడ్డీ రేట్ల సైకిల్స్ ఎన్నో వచ్చి పోతుంటాయి. దీనిపై రుణం తీసుకునే వారు ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. గృహ రుణం ఈఎంఐ అనేది ఆర్జించే వేతనంలో 40 శాతం మించకుండా చూసుకుంటే, ఇలాంటి ఆర్థిక అనిశ్చితులు, వడ్డీ రేట్ల పెరుగుదలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సరైన సమయం కోసం వేచి చూడొద్దు ఏదీ శాత్వతం కాదు. కనిష్ట వడ్డీ రేట్లు అయినా, గరిష్ట వడ్డీ రేట్లు అయినా ఒక నిర్ణీత కాలం పాటే కొనసాగుతాయి. ఉదాహరణకు 20 ఏళ్ల గృహ రుణ కాలవ్యవధిలో ఒకటి నుంచి రెండు సైకిల్స్ అధిక వడ్డీ రేట్లు ఉండొచ్చు. కనుక కనిష్ట వడ్డీ రేట్లు ఉన్నప్పుడే గృహ రుణం తీసుకుందామని అనుకోవద్దు. దీనివల్ల విలువైన కాలం గడిచిపోతుంది. ఇంటి కొనుగోలు ధర కూడా పెరగొచ్చు. కనుక తక్కువ వడ్డీ రేట్ల కోసం చూస్తే, అందులో మిగిలేది, పెరిగే ఇంటి ధరతో పోలిస్తే తక్కువే ఉండొచ్చు. అవసరం, తక్కువ ధరలే ఇంటి కొనుగోలుకు ఆధారం కావాలి కానీ, వడ్డీ రేట్లు కాదని నిపుణుల సూచన. రేట్ల పెంపునకు సన్నద్ధం ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కొందరు తమ అభిరుచులకు అనుగుణంగా సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం అదనపు ఖర్చుకూ వెనుకాడరు. ఇంటి బడ్జెట్ పెంచుకోవడం అన్నది అదనపు భారానికి దారితీస్తుంది. తీసుకునే గృహ రుణం పెరుగుతుంది. దీంతో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో మరింత చెల్లించాల్సి రావచ్చు. కనుక అధిక మొత్తానికి గృహ రుణం తీసుకోవడం అన్నది పెద్ద సవాలు అవుతుందని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి. స్వామినాథన్ పేర్కొన్నారు. కనుక అవసరమైతే, వడ్డీ రేట్లు ఊహించని విధంగా పెరిగిపోతే, నెలవారీ ఈఎంఐ 20–25 శాతం అధికంగా చెల్లించేందుకు వీలుగా, నెలవారి ఆదాయంలో వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు నెలవారీ గరిష్టంగా రూ.40,000ను ఈఎంఐ కింద చెల్లించే సామర్థ్యం ఉంటే, అప్పుడు రూ.30,000–32,000 ఈఎంఐకి పరిమితమై గృహ రుణం తీసుకోవాలి. దీంతో వడ్డీ రేట్లు పెరిగినా, ఇబ్బంది లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కాలవ్యవధి పెంపు వడ్డీ రేట్లు పెరిగిన ప్రతీ సందర్భంలోనూ రుణమిచ్చిన సంస్థలు రుణగ్రహీతల ఈఎంఐ పెంపు కంటే, కాల వ్యవధిని పెంచేందుకు మొగ్గు చూపిస్తుంటాయి. అయితే, దీనికీ పరిమితి ఉంది. రుణ గ్రహీతలు పదవీ విరమణకు ఇంకా ఎన్నేళ్లు ఉందన్న అంశాన్ని బ్యాంకులు చూస్తాయి. సాధారణంగా గృహ రుణ కాలాన్ని బ్యాంకులు రుణ గ్రహీతల వయసు, ఆర్జన ఆధారంగా నిర్ణయిస్తుంటాయి. అదే పనిగా వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో.. బ్యాంకులు రేటు పెరిగినప్పుడల్లా ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకుంటూ పోతే, తిరిగి చెల్లింపుల కాలం రిటైర్మెంట్ వయసుకు త్వరగా చేరిపోవచ్చు. ఇక ఆ తర్వాత కాలవ్యవధి పెంచుకోవడానికి ఉండదు. దీనికి బదులు ఈఎంఐ మొత్తాన్ని పెంచుతుంటాయి బ్యాంకులు. దీంతో అదనపు భారం పడుతుంది. రుణ కాల వ్యవధి పెంచుకోవడం వల్ల అంతిమంగా చెల్లించే వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక రుణదాత కాల వ్యవధి పెంచేందుకు ఆసక్తి చూపించినా.. రుణ గ్రహీతలు దీనికి మొగ్గు చూపకపోవడమే మంచిది. కాల వ్యవధి పెంచుకోవద్దంటే, పెరిగిన వడ్డీ రేట్ల మేర అదనపు ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధం కావాలి. నెలవారీ చెల్లించే ఈఎంఐని పెంచడం వల్ల గృహ రుణాన్ని త్వరగా తీర్చేయవచ్చు. అందుకే గృహ రుణ గ్రహీతలకు నెలవారీ మిగులు ఉండాలి. దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అదనంగా చెల్లించే సామర్థ్యం ఉంటుంది. దీంతో కాల వ్యవధి పెంచుకోవడం కంటే ఈఎంఐ పెంపునకే మొగ్గు చూపుతారు. ఫలితంగా అదనపు వడ్డీ భారం పడదు. ముందస్తు చెల్లింపులు వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకనే గృహ రుణం తీసుకున్న తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పాక్షిక చెల్లింపులకు మొగ్గు చూపించడం మెరుగైన ఆప్షన్ అవుతుంది. దీనివల్ల గృహ రుణం బకాయిని వేగంగా తగ్గించుకోవచ్చు. నిర్ణీత కాలం కంటే ముందుగానే తీర్చివేయవచ్చు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగినా పెద్ద భారం పడకుండా ఉంటుంది. ఉద్యోగులు అయితే బోనస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని గృహ రుణానికి చెల్లింపులు చేసుకోవచ్చు. అదే మాదిరి, ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనంలో సగ భాగాన్ని గృహ రుణ ఈఎంఐ పెంచి కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. క్రెడిట్ స్కోరు అనుకూలత వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అప్పుడు ఫ్లోటింగ్ రేటును ఎంచుకోవడమే మార్గం. అప్పటికే తీసుకున్న గృహ రుణానికి సంబంధించి వడ్డీ భారాన్ని భరించలేకపోతుంటే.. దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే బ్యాంకుకు లేదా ఇతర సంస్థకు బదిలీ చేసుకోవడం ఒక మార్గం. సేవలు బాగుండి, తక్కువ రేటుకు ఆఫర్ చేసే సంస్థకు నిశ్చింతంగా మారిపోవచ్చు. గృహ రుణ బ్యాలన్స్‌ను బదిలీ చేసుకునే ముందు, కొత్తగా రుణం ఇచ్చే బ్యాంకులో ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీలను కూడా చూడాలి. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే కాస్త డిమాండ్ చేసి రేటును తగ్గించుకోవచ్చు. బ్యాలన్స్ బదిలీ విషయంలోనూ మెరుగైన క్రెడిట్ స్కోరు ఉపయోపడుతుంది. -
Zerodha ceo Nithin Kamath: ముందు చూపుతోనే.. హాయిగా ‘విశ్రాంతి’!
‘‘వాతావరణంలో మార్పులు మానవాళిని అంతం చేయకపోతే.. ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లలో చాలా దేశాలకు రిటైర్మెంట్ సంక్షోభం పెద్ద సమస్యగా మారుతుంది. గత తరాలకు దీర్ఘకాలం పాటు రియల్ ఎస్టేట్, ఈక్విటీ బుల్ మార్కెట్లు రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి సాయపడ్డాయి. కానీ, భవిష్యత్తులో ఇలా ఉండకపోవచ్చు’’. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జీరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన నితిన్ కామత్ నేటి యువతరాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. సాంకేతిక పురోగతితో పదవీ విరమణ కాలం తగ్గిపోతుంటే, వైద్య రంగంలో పురోగతితో జీవించే కాలం పెరుగుతుందని అంచనా వేశారు. వచ్చే 20 ఏళ్లకు పదవీ విరమణ వయసు 50కు తగ్గి.. 80 ఏళ్ల వరకు జీవిస్తామని.. రిటైర్మెంట్ తర్వాత కూడా 30 ఏళ్ల పాటు జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జీవితంలో పదవీ విరమణ తర్వాత దశను సరైన ప్రణాళికతోనే సుఖవంతం చేసుకోగలరంటూ కామత్ ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు. వయసు సహకరించి పనిచేస్తున్న దశలోనే.. పనిచేయని దశ కోసం ప్రణాళిక వేసుకోకపోతే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాము పిల్లలకు భారం కాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. అలా కోరుకునే వారు ఆ దిశగా ముందు నుంచే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. మరి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఎంత కావాలి? అందుకు ఎంత పెట్టుబడులు పెట్టాలి..? ఈ అంశాలపై అవగాహన కల్పించే కథనం ఇది. అవసరాల్లో రాజీ పడలేం మనలో ఒక్కొక్కరు ఒక్కో జీవిత దశలో ఉండొచ్చు. కొందరు ఇప్పుడే ఉద్యోగం ఆరంభిస్తే, మరికొందరు ఇప్పటికే కొన్నేళ్ల ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకుని ఉండొచ్చు. సంపాదించే వయసులో మన అవసరాలు ఏదో రకంగా తీరిపోతుంటాయి. ఒక విధమైన జీవనశైలికి అలవాటు పడి ఉంటాం. కోరుకున్న మాదిరి జీవితాన్ని కొనసాగిస్తాం. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే మాదిరి జీవితాన్ని సాఫీగా కొనసాగించడమే అసలైన సవాలు. ఇందుకోసం ఇప్పుడు నెలవారీ జీవనానికి ఎంత అయితే ఖర్చు చేస్తున్నామో.. పదవీ విరమరణ అనంతరం కూడా ప్రతి నెలా అంతే మొత్తం ఖర్చు చేసేందుకు సరిపడా పొదుపు చేసుకోవాలి. ముందుగా మొదలు పెడితే ఈజీ 25 ఏళ్లకు కెరీర్ మొదలు పెట్టారని అనుకుంటే, 55–60 ఏళ్లకు రిటైర్ అవుతారని అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి 30–35 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక నెలకు రూ.10వేల చొప్పున, ఏటేటా దీనిపై 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుతూ వెళితే 30 ఏళ్లకే రూ.6.91 కోట్లు (ఏటా 11 శాతం కాంపౌండెడ్ వృద్ధి అంచనా ప్రకారం) సమకూరుతుంది. అందుకే విశ్రాంత జీవన నిధి కోసం పెట్టుబడికి కెరీర్ ఆరంభంలోనే శ్రీకారం చుట్టాలి. దానివల్ల ఓ పెద్ద లక్ష్యం తేలిక అవుతుంది. 25 ఏళ్లలో రూ.7 కోట్లు సమకూరేందుకు ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి (ఏటాటా 10 శాతం పెంచుతూ) ఉంటే, 30 ఏళ్ల సమయం ఉన్న వారు ఇందులో సగం రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా 35 ఏళ్ల వ్యవధి ఉంటే ఇంకా తక్కువే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకే ఈ కాంపౌండింగ్ మహిమను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. నిపుణుల సాయం అవసరమే రిటైర్మెంట్ అవసరాలన్నవి ప్రత్యేకమైనవి. ఇక్కడి నుంచి మరో 25–35 ఏళ్ల తర్వాతి జీవనం కోసం నిధిని సమకూర్చుకోవాలి. అలా ఏర్పడే నిధి అక్కడి నుంచి మరో 20–30 ఏళ్ల పాటు మన జీవితానికి ఆధారంగా నిలబడాలి. కనుక ప్రతి నెలా ఆర్జన ఎంత? పదవీ విరమణకు ఉన్న కాలం ఎంత? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? పెట్టుబడుల పరంగా రిస్క్ తీసుకోగలరా? ఆశిస్తున్న రాబడులు ఏ మేరకు? ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి తర్వాత ప్రతి నెలా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలో అంచనాకు రావాలి. ఆశిస్తున్న రాబడులకు తగిన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే, అందులోనూ ఎన్నో విభాగాలున్నాయి. వాటిల్లో రాబడులు, రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. పైగా రిటైర్మెంట్ ఒక్కటే కాదు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా కీలకమే. అందుకే కెరీర్ ఆరంభించిన వారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు, లేదా ఫైనాన్షియల్ ప్లానర్ సాయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతైనా అవసరం ఎంత కావాలి? ఇప్పుడు ప్రతి నెలా కుటుంబ అవసరాల కోసం నికరంగా రూ.50,000 ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇప్పటి నుంచి పదవీ విరమణకు మరో 25 ఏళ్ల కాలం మిగిలి ఉంది. రిటైర్మెంట్ తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామని అంచనా వేసుకునేట్టు అయితే.. ఆ 20 ఏళ్ల కాలానికి కూడా ప్రతి నెలా రూ.50,000 కావాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు అవసరపడతాయి. రిటైర్మెంట్ విషయంలో కొందరికి భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు ఇప్పటికంటే వృద్ధాప్యంలో ఇంకా మెరుగ్గా జీవించాలని కోరుకోవచ్చు. అటువంటి వారి విషయంలో ఈ అంచనాలు మారిపోతాయి. కనుక అందరికీ అర్థమయ్యేందుకే దీన్ని ఓ ప్రామాణిక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రణాళికలో ముందు రెండు అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. 1. ఇప్పటి నెలవారీ అవపసరాల ఆధారంగా రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి. ఇప్పుడు నెలకు రూ.50,000 ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. పదవీ విరమణ తర్వాత కూడా ఏటా రూ.6 లక్షలు ఆదాయాన్ని ఇచ్చేంత నిధిని సమకూర్చుకోవాలి. 2. ఇంత మేర నిధి పోగు చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత మేర ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలన్నది మరో ముఖ్యమైన విషయం. ∙ రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామనే అంచనా ప్రకారం.. ఏటా రూ.6 లక్షల చొప్పున 20 ఏళ్ల కోసం మొత్తం రూ.1.2 కోట్లు కావాల్సి ఉంటుంది. 2047 నాటికి ఈ మేరకు నిధి మనకు కావాలి. కానీ, రూ.50,000 అన్నది నేటి కరెన్సీ విలువ ప్రకారం జీవనానికి అవుతున్న వ్యయం. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటేటా కరెన్సీ విలువ తగ్గుతూ, జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ నిధికి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా జోడించాలి. దీర్ఘకాలంలో సగటున 5 శాతం వార్షిక ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత రూ.6 లక్షలు ఏమూలకూ సరిపోవు. ఇప్పటి నుంచి 25 ఏళ్ల పాటు రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకుంటాం కనుక అన్నేళ్ల కాలానికి ఏటా 5 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిపి చూస్తే.. ఇప్పుడు ఏడాది జీవనానికి రూ.6 లక్షలు అవుతుంటే, 2047లో ఇది రూ.2,031,813 అవుతుంది. అంటే అప్పుడు ఒక ఏడాది జీవనానికి రూ.20.31 లక్షలు కావాలి. అంతేకాదు, అప్పటి నుంచి ఏటేటా ఇది మరో 5 శాతం (ద్రవ్యోల్బణం మేర) పెరుగుతుందని భావించొచ్చు. ఈ ప్రకారం 2048లో రూ.21.33 లక్షలు కావాలి. 2067వ సంవత్సరంలో జీవన వ్యయం రూ.రూ.53.91 లక్షలుగా ఉంటుంది. ఇక 2047 నుంచి 2067 సంవత్సరం వరకు, 20 ఏళ్ల కాలానికి జీవన వ్యయం కోసం (5 శాతం ద్రవ్యోల్బణం కలిపి) మొత్తం రూ.7.25 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే మన చేతిలో సంపాదన కోసం మిగిలిన ఈ 25 ఏళ్లలో.. విశ్రాంత జీవనం కోసం రూ7.25 కోట్ల నిధిని సమకూర్చుకోవాలన్నది అంచనా. నిధిని ఎలా సమకూర్చుకోవాలి? రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల జీవిత అవసరాలకు కావాల్సిన రూ.7.25 కోట్లు సమకూర్చుకోవడం ఎలా..? ఇందుకోసం ఈ రోజు నుంచే పెట్టుబడులు ఆరంభించాలి. ఒకటికి మించిన సాధనాలను ఇందుకోసం ఎంపిక చేసుకోవచ్చు. 50 శాతం రియల్ ఎస్టేట్‌పై, 10 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లలో, బంగారంలో 10 శాతం, ఈక్విటీల్లో 15 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతూ, 15 శాతం నగదుగా ఉంచుకునేట్టు (ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల పోర్ట్‌ఫోలియో విధానం) అయితే.. రాబడి ఏ మేరకు వస్తుందో చూద్దాం. రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో 8–10 శాతం, ఎఫ్డీలపై 6–7 శాతం, బంగారంపై 8–9 శాతం, ఈక్విటీల్లో 10–11 శాతం వస్తుందని అనుకుంటే.. అప్పుడు మొత్తం మీద అన్ని రకాల పెట్టుబడులపై సగటున 8.25 శాతం వార్షిక రాబడి వస్తుంది. ఇది కొంత రక్షణాత్మకంగా వేసిన అంచనాయే. ఈక్విటీల్లో 10 ఏళ్లకు మించిన కాలంలో రిస్క్ దాదాపు ఉండదు. సగటు రాబడి ఎంత లేదన్నా వార్షికంగా 11 శాతం చొప్పున వస్తుంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో రిటైర్మెంట్ కార్పస్‌ను సమకూర్చుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు అన్నింటిలోకి మెరుగైన మార్గం అవుతుంది. నెలవారీగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏటేటా పెరిగే ఆదాయానికి అనుగుణంగా ఈ పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు మొదటి నెల రూ.5,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే.. ఏటా 11 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి ప్రకారం 25 ఏళ్ల తర్వాత (300 నెలలకు) ఈ మొత్తం రూ.67,927 అవుతుంది. రెండో ఏడాది 10 శాతం అధికంగా రూ.5,500, మూడో ఏట రూ.6,050 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఇలా అయితే 25 ఏళ్లకు సమకూరే నిధి రూ.1.7 కోట్లుగా ఉంటుంది. కానీ, మనం చెప్పుకున్న ఉదాహరణ ఆధారంగా రిటైర్మెంట్ కోసం రూ.7.25 కోట్లు కావాలి. అందుకుని ప్రతి నెలా రూ.5 వేలకు బదులు.. రూ.20 వేల చొప్పున ఆరంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో 25 ఏళ్లకు రూ.7 కోట్ల నిధి ఏర్పడుతుంది. అంచనా మాత్రమే.. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో మన జీవన అవసరాలు ఇప్పటి మాదిరిగా ఉండవు. కొంత మారొచ్చు. ఖరీదైన డెనిమ్ వస్త్రాలు అవసరపడకపోవచ్చు. వినోదం, విహారం కోసం ఖర్చు పెరగొచ్చు. ఎందుకంటే అప్పుడు చేతిలో తగినంత ఖాళీ సమయం ఉంటుంది. అందుకుని అప్పటి అవసరాలు ఎలా ఉంటాయని ఇప్పుడే అంచనాకు రాలేం. ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్యం అవసరపడొచ్చు. అందుకే ఇప్పుడు నెలవారీ అవుతున్న వ్యయాన్ని ఓ ప్రామాణికంగా తీసుకున్నాం అంతే. రిటైర్మెంట్ తర్వాత ఫలానా విధంగా జీవితాన్ని కొనసాగించాలనే కచ్చితమైన స్పష్టత, ప్రణాళిక ఉన్న వారు ఆ మేరకు అంచనాకు వచ్చి నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.+ టిప్స్ ► చాలా ముందుగానే పెట్టుబడులు ఆరంభించాలి. ► పెట్టుబడి సాధనాల మధ్య వైవిధ్యం ఉండాలి. ► అన్నింటిలోకీ ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయి. ► అవసరం లేనివి, విలువ తరిగిపోయే వాటిని రుణాలపై కొనుగోలు చేయవద్దు. ► ఆర్జించే వ్యక్తి తనతోపాటు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రక్షణనిచ్చే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. లేకపోతే ఒక ఆరోగ్య సమస్య కారణంగా ఆర్థిక జీవితం తలకిందులు అయిపోవచ్చు. ► ఉద్యోగం శాశ్వతం కాదు. కనుక పనిచేసే చోట ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా కానీ, విడిగా ఆరోగ్య బీమా ప్లాన్ కూడా ఉండాలి. ► టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. అనుకోనిది జరిగితే వచ్చే బీమా పరిహారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే, నెలవారీ కుటుంబ అవసరాలను తీర్చేంత సరిపడా ఆదాయం ఆ నిధి నుంచి రావాలి. – నితిన్ కామత్, జీరోధా సీఈవో -
పక్కా ప్రణాళికతో భవితకు భరోసా
ఏదైనా లక్ష్యం సాధించాలంటే పక్కా ప్రణాళిక ఎలాగైతే కీలకమో.. భవిష్యత్‌లో ఆర్థిక భద్రత పొందాలంటే కచ్చితమైన ప్లానింగ్ కూడా అంతే అవసరం. సాధారణంగా చిన్న చిన్న వాటికి కూడా ఆచితూచి ఖర్చు చేసే వారు సైతం.. భారీ పెట్టుబడుల విషయంలో కాస్త అశ్రద్ధ చూపుతుంటారు. ఆర్థిక లక్ష్యాలు, సాధనాలు మొదలైన వాటిపై పెద్దగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే సరైన ఆర్థిక ప్రణాళికతో లక్ష్యాలను చేరగలిగే తీరును వివరించేదే ఈ కథనం. ప్రణాళికకు కీలకమైనవి.. సాధారణంగా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక దశలో ఏదో ఒక ఆర్థిక లక్ష్యం ఉంటుంది. సొంత ఇల్లు తీసుకోవడమో లేదా వాహనం కొనుక్కోవడమో లేదా పిల్లల చదువులు/వారి వివాహాలు, రిటైర్మెంట్ వంటి అవసరాలు ఉంటాయి. వీటిని ముందుగా గుర్తించి, ఆయా అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవడంలో ఈ కింది అంశాలు తోడ్పడతాయి. * ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి * కాలవ్యవధి నిర్ణయించుకోవాలి * రిస్కు సామర్ధ్యాలను బేరీజు వేసుకోవాలి * రిస్కు సామర్ధ్యాన్ని బట్టి పెట్టుబడి సాధనాలకు నిధులు కేటాయించుకోవాలి * కెరియర్ తొలినాళ్లలో కాస్త రిస్కు తీసుకునే సామర్ధ్యం ఉంటుంది. ఎక్కువ రిస్కు ఉన్నా, అధిక వృద్ధికీ అవకాశముండే షేర్లు/మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్వల్పకాలానికి ఇవి కాస్త రిస్కీయే అయినప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులే అందించగలవు. ఇక, తర్వాత కాలంలో రిస్కు సామర్ధ్యం తగ్గుతూ రిటైర్మెంట్కు దగ్గరయ్యే కొద్దీ షేర్లు వంటి రిస్కీ సాధనాల్లో తగ్గిస్తూ.. స్థిరమైన రాబడులు ఇచ్చే డెట్ ఫండ్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటివైపు మొగ్గు చూపవచ్చు. ఈ క్రమంలో పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. * కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేలా జీవిత బీమా పాలసీ తీసుకోవడం * తగినంత వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవడం * రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసుకోవడం * వీలునామా కూడా రాసి ఉంచడం పెట్టుబడుల పరమార్థం .. ఏదైనా సాధనంలో మనం పెట్టుబడి పెట్టినప్పుడు ఆశించేవి కొన్ని ఉంటాయి. అవి.. * స్థిరంగా రాబడులు * సదరు అసెట్ విలువ పెరగడం * అవసరమైన వెంటనే నగదుగా మార్చుకోగలిగే వీలు ఉండటం (లిక్విడిటీ) * భద్రత. పెట్టుబడుల విషయంలో రాబడులతోపాటు భద్రతకూ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. * పన్నులపరమైన ప్రయోజనాలు * ప్రయోజనాలన్నీ అందించే సాధనాలు చాలా తక్కువ ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లు స్థిరమైన ఆదాయం ఇస్తాయి కానీ వాటి విలువ పెరగదు. బంగారం, స్థలం విలువ దీర్ఘకాలంలో పెరుగుతుంది కానీ, స్థిరమైన ఆదాయం, పన్నుపరమైన ప్రయోజనాలూ పెద్దగా ఉండవు. రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ లిక్విడిటీ అంతగా ఉండదు. ఇక కొన్ని స్కీములు అత్యధిక రాబడులు ఇచ్చినా, అంత సురక్షితమైనవి కావు. మెరుగైన షేర్లు, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లాంటివి అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తాయి. కానీ స్వల్పకాలికంగా మాత్రం వీటిలో రిస్కులు ఉంటాయి. పెట్టుబడి సాధనాలు.. * ఇన్వెస్ట్ చేసేందుకు అనేక సాధనాలు ఉన్నాయి. * బ్యాంక్ డిపాజిట్లు, ఎన్నారై డిపాజిట్లు: ఎఫ్సీఎన్ఆర్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో * నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో డిపాజిట్లు, ఇతరత్రా కంపెనీ డిపాజిట్లు * నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు * పసిడి, ఇతర విలువైన లోహాలు * నేషనల్ పెన్షన్ స్కీమ్ * పీపీఎఫ్, జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ), పోస్టాఫీస్ డిపాజిట్లు * షేర్లు, ఫండ్స్, ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు * రియల్ ఎస్టేట్ వీటన్నింటిలో బ్యాంకు డిపాజిట్లు, ఇతర డిపాజిట్లు, పీపీఎఫ్, ఎన్ఎస్సీల్లో రిస్కు చాలా తక్కువ. అలాగే రాబడులూ తక్కువగానే ఉంటాయి. ఇక స్టాక్స్, ఫండ్స్ లాంటి వాటిల్లో స్వల్పకాలికంగా రిస్కు ఉన్నా.. దీర్ఘకాలికంగా రాబడులు మెరుగ్గానే ఉండగలవు. గత పదేళ్ల చరిత్రను చూస్తే మిగతా సాధనాలను పోల్చి చూసినప్పుడు స్టాక్సే అధిక రాబడులు ఇచ్చినట్లు తెలుస్తుంది. స్టాక్స్‌లో దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌కి పన్నుపరమైన మినహాయింపులు లభిస్తాయి. కేటాయింపులు ఇలా.. రిస్కు సామర్ధ్యాలు, కెరియర్ దశలను బట్టి పెట్టుబడులకు కేటాయింపులు జరపాలి. కెరియర్ తొలినాళ్లలో అంటే దాదాపు 35 ఏళ్ల దాకా కాస్త దూకుడుగా, ఆ తర్వాత 50 ఏళ్ల దాకా కొంత బ్యాలెన్స్డ్గా, అటుపైన రిస్కులు మరింత తగ్గించుకునేలా పెట్టుబడులు ఉండాలి. షేర్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికాంశాలపై పట్టు ఉండాలి కాబట్టి.. అంతగా అనుభవం లేని వారు ఫండ్స్ ద్వారా పరోక్షంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) ఇందుకు అనువైనవి. బంగారం విషయానికొస్తే గోల్డ్ బాండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాంక్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులనేవి.. అప్పటి వడ్డీ రేట్ల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్ల కన్నా డెట్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక వీటన్నింటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా కనీసం ఆరు నెలల ఖర్చుల మొత్తాన్ని సేవింగ్స్ అకౌంటులోనో లేదా లిక్విడ్ ఫండ్స్‌లోనో ఉంచుకోవడం శ్రేయస్కరం. - వీకే విజయకుమార్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ బీఎన్పీ పారిబా -
పుస్తకాలు చూపని ప్రపంచం...
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... పరీక్షల భయంతోనే రోజులు గడచిపోతున్నాయి. ఇంకో వారం రోజులు గడిస్తే చాలు.. పుస్తకాల్లేని ప్రపంచంలో కొన్నాళ్లపాటు ఉల్లాసంగా గడపవచ్చు అనే ఆలోచన పిల్లల మెదళ్లలో తొంగిచూస్తూనే ఉంది. సెలవుల్లో వారి ఉల్లాసపు స్థాయిని పెంచాలంటే ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక అవసరం. లేదంటే, బద్దకంతో అమూల్యమైన వేసవి దినాలు ఇట్టే గడిచిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కిక్కిరిసిన తరగతి గదుల్లో విద్యార్థులు ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టారు. పుస్తకాల్లో చదివి కంఠతా పట్టిన పాఠాలను ఇక ఆరుబయట సమాజాన్ని చూసి నేర్చుకునే అవకాశం వస్తే.. ప్రపంచమనే కుటుంబంలో రేపటి తరం చేరాలనుకుంటే పుస్తకాలు చూపని లోకంలోకి నేడే ప్రయాణానికి సిద్ధపడాలి. హెరిటేజ్ వాక్... హెరిటేజ్ క్లబ్... మన జాతి వారసత్వ సంపదను తిలకించేందుకు, తెలుసుకునేందుకు, సంరక్షించేందుకు పయనమైతే అదే ‘హెరిటేజ్ వాక్’ అవుతుంది. ఇందుకోసం కొంతమంది ఒక సమూహంగా ఏర్పడితే ‘హెరిటేజ్ క్లబ్’ అవుతుంది. ఇప్పుడు చరిత్ర పండితులు కొత్తమార్గాలను ఎంచుకున్నారు. వందల ఏళ్ల నాటి అద్భుత కట్టడాలను చూసేందుకే కాదు, అందమైన ప్రకృతిసిద్ధ ప్రదేశాలను సందర్శించడానికీ సమూహాలుగా సిద్ధపడుతున్నారు. ఇందులో టీనేజర్స్నీ భాగస్థులను చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పటికే హెరిటేజ్ క్లబ్స్ పేరిట ఆన్లైన్ సాయంతో కలుసుకునేవారి సంఖ్యా పెరుగుతోంది. సామాజికంగా ఎంతో మేలు... ఇంట్లో ఒకరు లేక ఇద్దరు ఉన్న నేటి కాలంలో సామాజికస్పృహ తగ్గుతుందనే చెప్పాలి. బంధుమిత్రులు కలుసుకోవడం కూడా తగ్గిపోతున్న ఈ రోజుల్లో కొంత మంది ఒకే అంశంపై ఒకే చోట కలుసుకోవడం, చర్చించుకోవడం, ఒక నూతన ప్రదేశాన్ని చూడటానికి వెళ్లడం వల్ల కొత్త పరిచయాలు పెరుగుతాయి. మానసిక పరిణతి వికసిస్తుంది. హెరిటేజ్ వాక్‌లలో పాల్గొనడం వల్ల ఆర్థిక అవగాహన, కార్యక్రమ నిర్వహణ చాతుర్యం, సృజనాత్మకత.. ఇవన్నీ పెరుగతాయి. నలుగురితో కలిసి తిరగడం వల్ల సామాజిక బాధ్యత కూడా అలవడుతుంది. చర్చలు, వినోదకార్యక్రమాల వల్ల ఏర్పడిన వాతావరణం మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేస్తుంది. అనారోగ్యానికి దూరం దూరం... అంతర్జాలంతో ప్రపంచం కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు యువతను గడపదాటనీయడం లేదు. అదేపనిగా టీవీ, ఇంటర్నెంట్, ఫోన్లతో కాలక్షేపం చేయడం వల్ల ఊబకాయం తద్వారా అది తెచ్చే అనారోగ్యం బాధించకుండా ఉండదు. అదే ఇలాంటి హిస్టారికల్ వాక్స్‌లో నడక, సైక్లింగ్ వంటివి తప్పనిసరి అవుతాయి. దీంతో దేహదారుఢ్యం పెరిగే అవకాశం ఉంది. కెనడాలో హిస్టారికల్ వాక్స్ వల్ల అన్ని వయసుల వారిలో స్పృహ పెరిగింది. అక్కడ ప్రతి ముగ్గురు టీనేజర్లలో ఒకరు యూత్ మీట్లలో పాల్గొంటున్నారు. దీని వల్ల యువతరంలో ఆరోగ్యకరమైన ఎదుగుదల పెరుగుతుందన్నది స్పష్టమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కౌమారంలో ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లేకపోవడం వల్ల ఎన్నో రోగాలకు చేరువవుతున్నారని దీంట్లో టైప్ 2 డయాబెటిస్ ప్రధానంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వీరిలో హైపర్‌టెన్షన్, ఉబకాయం, ఆందోళన, ఒత్తిడులూ పెరుగుతున్నాయి. వీటన్నింటికీ ముగింపు పలకాలంటే హిస్టారికల్ వాక్స్ పట్ల సరైన అవగాహన పెరగాలంటున్నారు నిపుణులు. మనదైన సంపదకు రక్షణ... మన దేశంలో అందమైన పచ్చని మైదానాలు, గొప్పదైన సంస్కృతి, వారసత్వ సంపద.. ఎంతగానో ఉంది. అంతేనా, నాటి రాచప్రభను కళ్లకు కట్టే పట్టణాలు, విభిన్న ఆచారాలు అబ్బురపరుస్తాయి. యంత్రపరికరాలు లేని రోజుల్లో కట్టిన భవన నిర్మాణాల ఆకృతులు, అక్కడి సంస్కృతిని కళ్లకు కట్టినట్టు తెలియజేవచ్చు. వెళ్లిన ప్రాంతం, అక్కడి చారిత్రక నేపథ్యం, నేటి సంస్కృతి, నిర్మాణ కౌశలం, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర, భాష, వేషధారణ.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆ విద్యార్థిలో సంరక్షరణ చర్యలవైపూ దృష్టి మళ్లుతుంది. పల్లె పట్టణంగా మారిన వైనం, లేదా పూర్తిగా ధ్వంసమైన శిథిల నిర్మాణాలు, సంస్కృతి, సంప్రదాయం, తత్వం, మూఢనమ్మకాల మీదా అవగాహన కలుగుతుంది. వీటి నుంచి నేర్చుకోదగిన అంశాలెన్నో ఉంటాయి. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి... విద్యార్థులు గ్రూప్‌ల ప్రకారం కలవాలి. ఇందుకు స్కూల్, కాలేజీ స్థాయిలో ఉన్న స్నేహబృందాలు కలిస్తే మరీ మంచిది. ముందుగా సందర్శించవలసిన స్థలాల జాబితాను తయారుచేసుకోవాలి. ఆ తర్వాత వాటి ప్రాధాన్యత గురించి కొంత ముందే అవగాహన ఏర్పరుచుకోవాలి. ఏదో ఒక వర్క్‌షాప్, ఒక వాక్ అని సంప్రదాయ ధోరణిలో గ్రూప్‌గా ఏర్పడితే చాలదు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇందుకు తమ టీచర్లు, తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి. అవగాహన కోసం కార్యక్రమాలు... మన చారిత్రక కట్టడాలు, సంస్కృతిని నేరుగా చూస్తే పిల్లల్లో ఎంతో ఆసక్తి పుడుతుంది. అలాగే పల్లెలకు ప్రయాణం అవ్వాలి. మనకే సొంతమైన చేనేత, అక్కడి జీవనశైలిని తెలుసుకోవాలంటే వీవర్స్ కమ్యూనిటీ ఉన్న పల్లెలను సందర్శించాలి. విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమాలను ఈ వేసవికి రూపొందించబోతున్నాం. వర్క్‌షాప్స్ నిర్వహించబోతున్నాం. దీంట్లో భాగంగా చారిత్రక కట్టడాల సందర్శన, సంస్కృతి, మ్యూజియమ్ గైడింగ్.. వంటి వాటిపై అవగాహన కల్పిస్తాం. వారి వారి ఆసక్తులను విద్యార్థులు ఒక గ్రూప్‌గా ఏర్పడి తమ సంఖ్య ఎంత ఉందో తెలిపితే దానిని బట్టి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఇన్టాక్ నుంచి ఇన్నాళ్లూ ఇతర రాష్ట్రాలలో హెరిటేజ్ వాక్స్ చేశాం. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో చేయాలని నిశ్చయించాం. ఇందుకు ఆసక్తిగలవారు సంప్రదించవచ్చు. దాదాపుగా అన్నీ ఒక రోజు కార్యక్రమాలే ఉంటాయి. స్పందనను బట్టి రోజులను పెంచుతాం. విద్యార్థులు ఎవరైనా చారిత్రక నేపథ్యంతో డాక్యుమెంటరీలు తీస్తే వాటిలో సరైనవి ఎంపిక చేసి జజీఝజ్టీజీఛీజ్చీ ఆన్లైన్ పోర్టల్‌కు అప్లోడ్ చేస్తాం. - అనురాధారెడ్డి, హైదరాబాద్ ఇన్టాక్ కన్వినర్