Zerodha ceo Nithin Kamath: ముందు చూపుతోనే.. హాయిగా ‘విశ్రాంతి’! | Zerodha ceo Nithin Kamath shares tips to evade retirement crisis | Sakshi
Sakshi News home page

Zerodha ceo Nithin Kamath: ముందు చూపుతోనే.. హాయిగా ‘విశ్రాంతి’!

Published Mon, Nov 14 2022 4:45 AM | Last Updated on Mon, Nov 14 2022 4:45 AM

Zerodha ceo Nithin Kamath shares tips to evade retirement crisis - Sakshi

‘‘వాతావరణంలో మార్పులు మానవాళిని అంతం చేయకపోతే.. ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లలో చాలా దేశాలకు రిటైర్మెంట్‌ సంక్షోభం పెద్ద సమస్యగా మారుతుంది. గత తరాలకు దీర్ఘకాలం పాటు రియల్‌ ఎస్టేట్, ఈక్విటీ బుల్‌ మార్కెట్లు రిటైర్మెంట్‌ నిధి సమకూర్చుకోవడానికి సాయపడ్డాయి. కానీ, భవిష్యత్తులో ఇలా ఉండకపోవచ్చు’’. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జీరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన నితిన్‌ కామత్‌ నేటి యువతరాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. సాంకేతిక పురోగతితో పదవీ విరమణ కాలం తగ్గిపోతుంటే, వైద్య రంగంలో పురోగతితో జీవించే కాలం పెరుగుతుందని అంచనా వేశారు.

వచ్చే 20 ఏళ్లకు పదవీ విరమణ వయసు 50కు తగ్గి.. 80 ఏళ్ల వరకు జీవిస్తామని.. రిటైర్మెంట్‌ తర్వాత కూడా 30 ఏళ్ల పాటు జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జీవితంలో పదవీ విరమణ తర్వాత దశను సరైన ప్రణాళికతోనే సుఖవంతం చేసుకోగలరంటూ కామత్‌ ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు. వయసు సహకరించి పనిచేస్తున్న దశలోనే.. పనిచేయని దశ కోసం ప్రణాళిక వేసుకోకపోతే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాము పిల్లలకు భారం కాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. అలా కోరుకునే వారు ఆ దిశగా ముందు నుంచే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. మరి రిటైర్మెంట్‌ తర్వాత జీవితానికి ఎంత కావాలి? అందుకు ఎంత పెట్టుబడులు పెట్టాలి..? ఈ అంశాలపై అవగాహన కల్పించే కథనం ఇది.

అవసరాల్లో రాజీ పడలేం
మనలో ఒక్కొక్కరు ఒక్కో జీవిత దశలో ఉండొచ్చు. కొందరు ఇప్పుడే ఉద్యోగం ఆరంభిస్తే, మరికొందరు ఇప్పటికే కొన్నేళ్ల ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకుని ఉండొచ్చు. సంపాదించే వయసులో మన అవసరాలు ఏదో రకంగా తీరిపోతుంటాయి. ఒక విధమైన జీవనశైలికి అలవాటు పడి ఉంటాం. కోరుకున్న మాదిరి జీవితాన్ని కొనసాగిస్తాం. రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఇదే మాదిరి జీవితాన్ని సాఫీగా కొనసాగించడమే అసలైన సవాలు. ఇందుకోసం ఇప్పుడు నెలవారీ జీవనానికి ఎంత అయితే ఖర్చు చేస్తున్నామో.. పదవీ విరమరణ అనంతరం కూడా ప్రతి నెలా అంతే మొత్తం ఖర్చు చేసేందుకు సరిపడా పొదుపు చేసుకోవాలి.

ముందుగా మొదలు పెడితే ఈజీ
25 ఏళ్లకు కెరీర్‌ మొదలు పెట్టారని అనుకుంటే, 55–60 ఏళ్లకు రిటైర్‌ అవుతారని అనుకుంటే ఇన్వెస్ట్‌ చేయడానికి 30–35 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక నెలకు రూ.10వేల చొప్పున, ఏటేటా దీనిపై 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుతూ వెళితే 30 ఏళ్లకే రూ.6.91 కోట్లు (ఏటా 11 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి అంచనా ప్రకారం) సమకూరుతుంది. అందుకే విశ్రాంత జీవన నిధి కోసం పెట్టుబడికి కెరీర్‌ ఆరంభంలోనే శ్రీకారం చుట్టాలి. దానివల్ల ఓ పెద్ద లక్ష్యం తేలిక అవుతుంది. 25 ఏళ్లలో రూ.7 కోట్లు సమకూరేందుకు ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఇన్వెస్ట్‌ చేయాల్సి (ఏటాటా 10 శాతం పెంచుతూ) ఉంటే, 30 ఏళ్ల సమయం ఉన్న వారు ఇందులో సగం రూ.10వేలు ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోతుంది. ఇంకా 35 ఏళ్ల వ్యవధి ఉంటే ఇంకా తక్కువే ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అందుకే ఈ కాంపౌండింగ్‌ మహిమను ప్రతి ఒక్కరూ
గుర్తించాల్సిందే.

నిపుణుల సాయం అవసరమే
రిటైర్మెంట్‌ అవసరాలన్నవి ప్రత్యేకమైనవి. ఇక్కడి నుంచి మరో 25–35 ఏళ్ల తర్వాతి జీవనం కోసం నిధిని సమకూర్చుకోవాలి. అలా ఏర్పడే నిధి అక్కడి నుంచి మరో 20–30 ఏళ్ల పాటు మన జీవితానికి ఆధారంగా నిలబడాలి. కనుక ప్రతి నెలా ఆర్జన ఎంత? పదవీ విరమణకు ఉన్న కాలం ఎంత? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? పెట్టుబడుల పరంగా రిస్క్‌ తీసుకోగలరా? ఆశిస్తున్న రాబడులు ఏ మేరకు? ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి తర్వాత ప్రతి నెలా ఎంత చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలో అంచనాకు రావాలి. ఆశిస్తున్న రాబడులకు తగిన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అయితే, అందులోనూ ఎన్నో విభాగాలున్నాయి. వాటిల్లో రాబడులు, రిస్క్‌ వేర్వేరుగా ఉంటుంది. పైగా రిటైర్మెంట్‌ ఒక్కటే కాదు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా కీలకమే. అందుకే కెరీర్‌ ఆరంభించిన వారు పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు, లేదా ఫైనాన్షియల్‌ ప్లానర్‌ సాయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతైనా అవసరం

ఎంత కావాలి?
ఇప్పుడు ప్రతి నెలా కుటుంబ అవసరాల కోసం నికరంగా రూ.50,000 ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇప్పటి నుంచి పదవీ విరమణకు మరో 25 ఏళ్ల కాలం మిగిలి ఉంది. రిటైర్మెంట్‌ తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామని అంచనా వేసుకునేట్టు అయితే.. ఆ 20 ఏళ్ల కాలానికి కూడా ప్రతి నెలా రూ.50,000 కావాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు అవసరపడతాయి. రిటైర్మెంట్‌ విషయంలో కొందరికి భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు ఇప్పటికంటే వృద్ధాప్యంలో ఇంకా మెరుగ్గా జీవించాలని కోరుకోవచ్చు. అటువంటి వారి విషయంలో ఈ అంచనాలు మారిపోతాయి. కనుక అందరికీ అర్థమయ్యేందుకే దీన్ని ఓ ప్రామాణిక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రణాళికలో ముందు రెండు అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. 1. ఇప్పటి నెలవారీ అవపసరాల ఆధారంగా రిటైర్మెంట్‌ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి. ఇప్పుడు నెలకు రూ.50,000 ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. పదవీ విరమణ తర్వాత కూడా ఏటా రూ.6 లక్షలు ఆదాయాన్ని ఇచ్చేంత నిధిని సమకూర్చుకోవాలి. 2. ఇంత మేర నిధి పోగు చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత మేర ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలన్నది మరో ముఖ్యమైన విషయం.   
   ∙
రిటైర్మెంట్‌ తర్వాత 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామనే అంచనా ప్రకారం.. ఏటా రూ.6 లక్షల చొప్పున 20 ఏళ్ల కోసం మొత్తం రూ.1.2 కోట్లు కావాల్సి ఉంటుంది. 2047 నాటికి ఈ మేరకు నిధి మనకు కావాలి. కానీ, రూ.50,000 అన్నది నేటి కరెన్సీ విలువ ప్రకారం జీవనానికి అవుతున్న వ్యయం. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటేటా కరెన్సీ విలువ తగ్గుతూ, జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ నిధికి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా జోడించాలి. దీర్ఘకాలంలో సగటున 5 శాతం వార్షిక ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత రూ.6 లక్షలు ఏమూలకూ సరిపోవు. ఇప్పటి నుంచి 25 ఏళ్ల పాటు రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకుంటాం కనుక అన్నేళ్ల కాలానికి ఏటా 5 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిపి చూస్తే.. ఇప్పుడు ఏడాది జీవనానికి రూ.6 లక్షలు అవుతుంటే, 2047లో ఇది రూ.2,031,813 అవుతుంది. అంటే అప్పుడు ఒక ఏడాది జీవనానికి రూ.20.31 లక్షలు కావాలి. అంతేకాదు, అప్పటి నుంచి ఏటేటా ఇది మరో 5 శాతం (ద్రవ్యోల్బణం మేర) పెరుగుతుందని భావించొచ్చు. ఈ ప్రకారం 2048లో రూ.21.33 లక్షలు కావాలి. 2067వ సంవత్సరంలో జీవన వ్యయం రూ.రూ.53.91 లక్షలుగా ఉంటుంది. ఇక 2047 నుంచి 2067 సంవత్సరం వరకు, 20 ఏళ్ల కాలానికి జీవన వ్యయం కోసం (5 శాతం ద్రవ్యోల్బణం కలిపి) మొత్తం రూ.7.25 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే మన చేతిలో సంపాదన కోసం మిగిలిన ఈ 25 ఏళ్లలో.. విశ్రాంత జీవనం కోసం రూ7.25 కోట్ల నిధిని సమకూర్చుకోవాలన్నది అంచనా.

నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
రిటైర్మెంట్‌ తర్వాత 20 ఏళ్ల జీవిత అవసరాలకు కావాల్సిన రూ.7.25 కోట్లు సమకూర్చుకోవడం ఎలా..? ఇందుకోసం ఈ రోజు నుంచే పెట్టుబడులు ఆరంభించాలి. ఒకటికి మించిన సాధనాలను ఇందుకోసం ఎంపిక చేసుకోవచ్చు. 50 శాతం రియల్‌ ఎస్టేట్‌పై, 10 శాతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో, బంగారంలో 10 శాతం, ఈక్విటీల్లో 15 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతూ, 15 శాతం నగదుగా ఉంచుకునేట్టు (ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల పోర్ట్‌ఫోలియో విధానం) అయితే.. రాబడి ఏ మేరకు వస్తుందో చూద్దాం. రియల్‌ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో 8–10 శాతం, ఎఫ్‌డీలపై 6–7 శాతం, బంగారంపై 8–9 శాతం, ఈక్విటీల్లో 10–11 శాతం వస్తుందని అనుకుంటే.. అప్పుడు మొత్తం  మీద అన్ని రకాల పెట్టుబడులపై సగటున 8.25 శాతం వార్షిక రాబడి వస్తుంది. ఇది కొంత రక్షణాత్మకంగా వేసిన అంచనాయే. ఈక్విటీల్లో 10 ఏళ్లకు మించిన కాలంలో రిస్క్‌ దాదాపు ఉండదు. సగటు రాబడి ఎంత లేదన్నా వార్షికంగా 11 శాతం చొప్పున వస్తుంది. కనుక ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్గంలో రిటైర్మెంట్‌ కార్పస్‌ను సమకూర్చుకోవడం రిటైల్‌ ఇన్వెస్టర్లకు అన్నింటిలోకి మెరుగైన మార్గం అవుతుంది.  
   
నెలవారీగా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఏటేటా పెరిగే ఆదాయానికి అనుగుణంగా ఈ పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు మొదటి నెల రూ.5,000 ఇన్వెస్ట్‌ చేసినట్టయితే.. ఏటా 11 శాతం చొప్పున కాంపౌండెడ్‌ వృద్ధి ప్రకారం 25 ఏళ్ల తర్వాత (300 నెలలకు) ఈ మొత్తం రూ.67,927 అవుతుంది. రెండో ఏడాది 10 శాతం అధికంగా రూ.5,500, మూడో ఏట రూ.6,050 చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలి. ఇలా అయితే 25 ఏళ్లకు సమకూరే నిధి రూ.1.7 కోట్లుగా ఉంటుంది. కానీ, మనం చెప్పుకున్న ఉదాహరణ ఆధారంగా రిటైర్మెంట్‌ కోసం రూ.7.25 కోట్లు కావాలి. అందుకుని ప్రతి నెలా రూ.5 వేలకు బదులు.. రూ.20 వేల చొప్పున ఆరంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో 25 ఏళ్లకు రూ.7 కోట్ల నిధి ఏర్పడుతుంది.

అంచనా మాత్రమే..
పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో మన జీవన అవసరాలు ఇప్పటి మాదిరిగా ఉండవు. కొంత మారొచ్చు. ఖరీదైన డెనిమ్‌ వస్త్రాలు అవసరపడకపోవచ్చు. వినోదం, విహారం కోసం ఖర్చు పెరగొచ్చు. ఎందుకంటే అప్పుడు చేతిలో తగినంత ఖాళీ సమయం ఉంటుంది. అందుకుని అప్పటి అవసరాలు ఎలా ఉంటాయని ఇప్పుడే అంచనాకు రాలేం. ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్యం అవసరపడొచ్చు. అందుకే ఇప్పుడు నెలవారీ అవుతున్న వ్యయాన్ని ఓ ప్రామాణికంగా తీసుకున్నాం అంతే. రిటైర్మెంట్‌ తర్వాత ఫలానా విధంగా జీవితాన్ని కొనసాగించాలనే కచ్చితమైన స్పష్టత, ప్రణాళిక ఉన్న వారు ఆ మేరకు అంచనాకు వచ్చి నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.+

టిప్స్‌
► చాలా ముందుగానే పెట్టుబడులు ఆరంభించాలి.  
► పెట్టుబడి సాధనాల మధ్య వైవిధ్యం ఉండాలి.  
► అన్నింటిలోకీ ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయి.  
► అవసరం లేనివి, విలువ తరిగిపోయే వాటిని రుణాలపై కొనుగోలు చేయవద్దు.
► ఆర్జించే వ్యక్తి తనతోపాటు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రక్షణనిచ్చే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. లేకపోతే ఒక ఆరోగ్య సమస్య కారణంగా ఆర్థిక జీవితం తలకిందులు అయిపోవచ్చు.
► ఉద్యోగం శాశ్వతం కాదు. కనుక పనిచేసే చోట ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా కానీ, విడిగా ఆరోగ్య బీమా ప్లాన్‌ కూడా ఉండాలి.
► టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అవసరం. అనుకోనిది జరిగితే వచ్చే బీమా పరిహారాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే, నెలవారీ కుటుంబ అవసరాలను తీర్చేంత సరిపడా ఆదాయం ఆ నిధి నుంచి రావాలి.


– నితిన్‌ కామత్, జీరోధా సీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement