పుస్తకాలు చూపని ప్రపంచం... | A world without books ... | Sakshi
Sakshi News home page

పుస్తకాలు చూపని ప్రపంచం...

Published Fri, Apr 3 2015 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

పుస్తకాలు చూపని ప్రపంచం...

పుస్తకాలు చూపని ప్రపంచం...

13-19
కేరెంటింగ్

 
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
 
పరీక్షల భయంతోనే రోజులు గడచిపోతున్నాయి. ఇంకో వారం రోజులు గడిస్తే చాలు..  పుస్తకాల్లేని ప్రపంచంలో కొన్నాళ్లపాటు ఉల్లాసంగా గడపవచ్చు అనే ఆలోచన పిల్లల మెదళ్లలో తొంగిచూస్తూనే ఉంది. సెలవుల్లో వారి ఉల్లాసపు స్థాయిని పెంచాలంటే
 ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక అవసరం. లేదంటే, బద్దకంతో అమూల్యమైన వేసవి దినాలు ఇట్టే గడిచిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కిక్కిరిసిన తరగతి గదుల్లో విద్యార్థులు ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టారు. పుస్తకాల్లో చదివి కంఠతా పట్టిన పాఠాలను ఇక ఆరుబయట సమాజాన్ని చూసి నేర్చుకునే అవకాశం వస్తే.. ప్రపంచమనే కుటుంబంలో రేపటి తరం చేరాలనుకుంటే పుస్తకాలు చూపని లోకంలోకి నేడే ప్రయాణానికి సిద్ధపడాలి.

హెరిటేజ్ వాక్... హెరిటేజ్ క్లబ్...

మన జాతి వారసత్వ సంపదను తిలకించేందుకు, తెలుసుకునేందుకు, సంరక్షించేందుకు పయనమైతే అదే ‘హెరిటేజ్ వాక్’ అవుతుంది. ఇందుకోసం కొంతమంది ఒక సమూహంగా ఏర్పడితే ‘హెరిటేజ్ క్లబ్’ అవుతుంది. ఇప్పుడు చరిత్ర పండితులు కొత్తమార్గాలను ఎంచుకున్నారు. వందల ఏళ్ల నాటి అద్భుత కట్టడాలను చూసేందుకే కాదు, అందమైన ప్రకృతిసిద్ధ ప్రదేశాలను సందర్శించడానికీ సమూహాలుగా సిద్ధపడుతున్నారు. ఇందులో టీనేజర్స్‌నీ భాగస్థులను చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పటికే హెరిటేజ్ క్లబ్స్ పేరిట ఆన్‌లైన్ సాయంతో కలుసుకునేవారి సంఖ్యా పెరుగుతోంది.

సామాజికంగా ఎంతో మేలు...

ఇంట్లో ఒకరు లేక ఇద్దరు ఉన్న నేటి కాలంలో సామాజికస్పృహ తగ్గుతుందనే చెప్పాలి. బంధుమిత్రులు కలుసుకోవడం కూడా తగ్గిపోతున్న ఈ రోజుల్లో కొంత మంది ఒకే అంశంపై ఒకే చోట కలుసుకోవడం, చర్చించుకోవడం, ఒక నూతన ప్రదేశాన్ని చూడటానికి వెళ్లడం వల్ల కొత్త పరిచయాలు పెరుగుతాయి. మానసిక పరిణతి వికసిస్తుంది. హెరిటేజ్ వాక్‌లలో పాల్గొనడం వల్ల  ఆర్థిక అవగాహన, కార్యక్రమ నిర్వహణ చాతుర్యం, సృజనాత్మకత.. ఇవన్నీ పెరుగతాయి. నలుగురితో కలిసి తిరగడం వల్ల సామాజిక బాధ్యత కూడా అలవడుతుంది. చర్చలు, వినోదకార్యక్రమాల వల్ల ఏర్పడిన వాతావరణం మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేస్తుంది.
 
అనారోగ్యానికి దూరం దూరం...

అంతర్జాలంతో ప్రపంచం కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు యువతను గడపదాటనీయడం లేదు. అదేపనిగా టీవీ, ఇంటర్నెంట్, ఫోన్‌లతో కాలక్షేపం చేయడం వల్ల ఊబకాయం తద్వారా అది తెచ్చే అనారోగ్యం బాధించకుండా ఉండదు. అదే ఇలాంటి హిస్టారికల్ వాక్స్‌లో నడక, సైక్లింగ్ వంటివి తప్పనిసరి అవుతాయి. దీంతో దేహదారుఢ్యం పెరిగే అవకాశం ఉంది. కెనడాలో హిస్టారికల్ వాక్స్ వల్ల అన్ని వయసుల వారిలో స్పృహ పెరిగింది. అక్కడ ప్రతి ముగ్గురు టీనేజర్లలో ఒకరు యూత్ మీట్‌లలో పాల్గొంటున్నారు. దీని వల్ల యువతరంలో ఆరోగ్యకరమైన ఎదుగుదల పెరుగుతుందన్నది స్పష్టమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కౌమారంలో ఉన్న పిల్లల్లో శారీరక చురుకుదనం లేకపోవడం వల్ల ఎన్నో రోగాలకు చేరువవుతున్నారని దీంట్లో టైప్ 2 డయాబెటిస్ ప్రధానంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వీరిలో హైపర్‌టెన్షన్, ఉబకాయం, ఆందోళన, ఒత్తిడులూ పెరుగుతున్నాయి. వీటన్నింటికీ ముగింపు పలకాలంటే హిస్టారికల్ వాక్స్ పట్ల సరైన అవగాహన పెరగాలంటున్నారు నిపుణులు.
 
మనదైన సంపదకు రక్షణ...


మన దేశంలో అందమైన పచ్చని  మైదానాలు, గొప్పదైన సంస్కృతి, వారసత్వ సంపద.. ఎంతగానో ఉంది. అంతేనా, నాటి రాచప్రభను కళ్లకు కట్టే పట్టణాలు, విభిన్న ఆచారాలు అబ్బురపరుస్తాయి. యంత్రపరికరాలు లేని రోజుల్లో కట్టిన భవన నిర్మాణాల ఆకృతులు, అక్కడి సంస్కృతిని కళ్లకు కట్టినట్టు తెలియజేవచ్చు. వెళ్లిన ప్రాంతం, అక్కడి చారిత్రక నేపథ్యం, నేటి సంస్కృతి, నిర్మాణ కౌశలం, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర, భాష, వేషధారణ.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆ విద్యార్థిలో సంరక్షరణ చర్యలవైపూ దృష్టి మళ్లుతుంది. పల్లె పట్టణంగా మారిన వైనం, లేదా పూర్తిగా ధ్వంసమైన శిథిల నిర్మాణాలు, సంస్కృతి, సంప్రదాయం, తత్వం, మూఢనమ్మకాల మీదా అవగాహన కలుగుతుంది. వీటి నుంచి నేర్చుకోదగిన అంశాలెన్నో ఉంటాయి.

 ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి...

 విద్యార్థులు గ్రూప్‌ల ప్రకారం కలవాలి. ఇందుకు స్కూల్, కాలేజీ స్థాయిలో ఉన్న స్నేహబృందాలు కలిస్తే మరీ మంచిది. ముందుగా సందర్శించవలసిన స్థలాల జాబితాను తయారుచేసుకోవాలి. ఆ తర్వాత వాటి ప్రాధాన్యత గురించి కొంత ముందే అవగాహన ఏర్పరుచుకోవాలి. ఏదో ఒక వర్క్‌షాప్, ఒక వాక్ అని సంప్రదాయ ధోరణిలో గ్రూప్‌గా ఏర్పడితే చాలదు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇందుకు తమ టీచర్లు, తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలి.
 
 అవగాహన కోసం కార్యక్రమాలు...


 మన చారిత్రక కట్టడాలు, సంస్కృతిని నేరుగా చూస్తే పిల్లల్లో ఎంతో ఆసక్తి పుడుతుంది. అలాగే పల్లెలకు ప్రయాణం అవ్వాలి. మనకే సొంతమైన చేనేత, అక్కడి జీవనశైలిని తెలుసుకోవాలంటే వీవర్స్ కమ్యూనిటీ ఉన్న పల్లెలను సందర్శించాలి. విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమాలను ఈ వేసవికి రూపొందించబోతున్నాం. వర్క్‌షాప్స్ నిర్వహించబోతున్నాం. దీంట్లో భాగంగా చారిత్రక కట్టడాల సందర్శన, సంస్కృతి, మ్యూజియమ్ గైడింగ్.. వంటి వాటిపై అవగాహన కల్పిస్తాం. వారి వారి ఆసక్తులను విద్యార్థులు ఒక గ్రూప్‌గా ఏర్పడి తమ సంఖ్య ఎంత ఉందో తెలిపితే దానిని బట్టి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఇన్‌టాక్ నుంచి ఇన్నాళ్లూ ఇతర రాష్ట్రాలలో హెరిటేజ్ వాక్స్ చేశాం. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో చేయాలని నిశ్చయించాం. ఇందుకు ఆసక్తిగలవారు సంప్రదించవచ్చు. దాదాపుగా అన్నీ ఒక రోజు కార్యక్రమాలే ఉంటాయి. స్పందనను బట్టి రోజులను పెంచుతాం. విద్యార్థులు ఎవరైనా చారిత్రక నేపథ్యంతో డాక్యుమెంటరీలు తీస్తే వాటిలో సరైనవి ఎంపిక చేసి జజీఝజ్టీజీఛీజ్చీ ఆన్‌లైన్ పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తాం.
 - అనురాధారెడ్డి, హైదరాబాద్ ఇన్‌టాక్ కన్వినర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement