కలాలతో కలలకు ఊపిరి..! | Kerala Students Losed Books With Floods | Sakshi
Sakshi News home page

కలాలతో కలలకు ఊపిరి..!

Published Wed, Sep 5 2018 12:08 PM | Last Updated on Wed, Sep 5 2018 12:08 PM

Kerala Students Losed Books With Floods - Sakshi

కేరళ విద్యార్థులపై వరదలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు చెరిపేసే ఈ కార్యక్రమం వినూత్నమేకాదు అందరి ప్రశంసలనూ అందుకుంటోంది.  భారీ వర్షాలు, వరదల తదనంతర పరిణామాల్లో భాగంగా ఆ విద్యార్థులు తమకిష్టమైన చదువును కొనసాగించేందుకు భరోసా ఇస్తోంది. వరదనీళ్లలో వారు కోల్పోయిన క్లాస్‌ పుస్తకాలు, వివిధ సబ్జెకుల వారీగా ఇప్పటికే పూర్తయిన క్లాస్‌లకు నోట్స్‌లు (స్టడీమెటీరియల్‌) రాసి అందించడం ద్వారా వారి చదువులకు ఊపిరిపోస్తున్నారు. అనాథశరణాలయానికి చెందిన పిల్లలిచ్చిన సలహాలు, సూచనలతో కాలికట్‌కు చెందిన  ‘ఇన్‌క్యుబేషన్‌’ స్వచ్ఛంద సంస్థ ఈ పనిని భుజానవేసుకుంది  ప్రభుత్వ పాఠశాలల్లోని  విద్యార్థులు చదువు నష్టపోకుండా ఉండేందుకు వరదల్లో వారు  కోల్పోయిన క్లాస్‌ నోట్స్‌ను అందించేందుకు నడుం బిగించారు.

ముందుగా వివిధ తరగతుల విద్యార్థులకు సంబంధించిన క్లాస్‌నోట్స్‌ రాసివ్వాలంటూ సామాజికమాధ్యమాల ద్వారా మెసేజ్‌ పంపించారు. అది వైరల్‌గా మారింది. ఈ ఆలోచననను వ్యక్తులు, కంపెనీలు, విద్యాసంస్థలు స్వాగతించాయి. వివిధ తరగతులు,సబ్జెక్టుల వారీగా సోషల్‌ మీడియా వేదికగా పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో నోట్స్‌ పంపిణీలోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి ఇవి ఫార్వర్డ్‌ అయ్యాయి. దీనిపై ఇతరజిల్లాల నుంచి స్పందించే వారి సంఖ్య పెరిగింది. ఒక్క కేరళకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఈ వినూత్న  అభ్యర్థన చేరుకుంది. ఫలితంగా వేలాది పుస్తకాలు గవర్నమెంట్‌ స్కూళ్ల విద్యార్థులకు పంపిణీ అయ్యాయి. దాదాపు రెండువారాల పాటు కొనసాగించిన క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా  తమ సంస్థ వివిధ జిల్లాల్లో దాదాపు పదివేలకు పైగా నోట్‌పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేసినట్టు ‘ఇన్‌క్యుబేషన్‌’కు చెదిన నాబీల్‌ మహ్మద్‌ తెలియజేశారు.

‘జిరాక్సో, ప్రింట్‌  చేసిన నోట్‌ పుస్తకాల కంటే  చేతిరాతతో రాసిన పుస్తకాల ద్వారా ప్రేమాభిమానాలు పంచాలనేది మా అభిప్రాయం ’ అని ఈ సంస్థ సమన్వయకర్త ఇల్యాస్‌ జాన్‌ తెలిపారు. అనారోగ్యం బారిన పడిన కొందరు ఎంబీబీఎస్‌ విద్యార్థులు కూడా ఈ  నోట్స్‌రాసి రాయడం ఒక ఎత్తయితే. ఓ శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న నమితా హర్ష్‌ అనే మాజీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కూడా ఎనిమిది నోట్‌పుస్తకాలు రాయడం మరో విశేషం. ఈ నోట్‌పుస్తకాలను కేరళలోని వివిధ ప్రాంతాలకు ఉచితంగా అందించడానికి కొన్ని కొరియర్‌ కంపెనీలు  ముందుకొచ్చాయి. ఇక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థయితే పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని ›ప్రాంతాలకు రవాణా చేసింది. దీని కోసం వివిధ జిల్లాల్లోని తమ బస్సుడిపోల్లో  ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. నోట్స్‌ రాసే కార్యక్రమంలో తాము పాలుపంచు కుంటామంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి  ఇప్పటికీ ఈ సంస్థలకు విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement