సకాలంలో..సాధ్యమేనా..?
సకాలంలో..సాధ్యమేనా..?
Published Mon, Mar 27 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
- ఏటా ఇదే మాట ... చేతికి అందని పుస్తకం
- ఏ పుస్తకం లేకుండానే నెలలతరబడి కాలక్షేపం
- అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ కృషి ఫలితం
2014లో మాత్రమే నెరవేరిన లక్ష్యం
- ఈ విద్యా సంవత్సరంలోనూ ఎండమావేనా...?
- జిల్లాలో 3,190 ప్రాథమిక, 361 ప్రాథమికోన్నత, 634 ఉన్నత పాఠశాలలు, 14 హయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి.
- ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న సుమారు నాలుగు లక్షల మంది తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఈ ఏడాది 24 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రతిపాదన.
- ఇప్పటికే పుస్తక డిపోలో 1.40 లక్షల పుస్తకాలున్నాయి. ఇందులో 40శాతం ఇంగ్లిషు మీడియం, 60 శాతం తెలుగు మీడియం పుస్తకాలు అవసరం.
- మార్చి 20తో విద్యా సంవత్సంర ముగుస్తోంది. ఇప్పటి వరకూ కానరాని కొత్త స్టాకు
రాయవరం: విద్యార్థికి, ఉపాధ్యాయుడికి పాఠ్య పుస్తకం ఎంతో అవసరం. అటువంటి పాఠ్య పుస్తకాలను సకాలంలో అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం మార్చి 20తోనే ముగుస్తోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేస్తామని ప్రభుత్వం చెప్పే మాట. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా అవి సకాలంలో చేరుకుంటాయా అనేది సందేహాస్పదంగా ఉంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ నెలాఖరుకు పుస్తకాల గోదాంకు చేరే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి.
ఏటా ప్రహసనమే..
ప్రతి ఏటా పాఠ్య పుస్తకాలు సమయానికి విద్యార్థులకు అందడం లేదు. 2014లో మాత్రమే ఫిబ్రవరి నెలలో పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరి పంపినీ ప్రహసనంగా మారుతోంది. విద్యా సంవత్సరం ముగియడానికి ముందుగానే పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అప్పుడే విద్యా సంవత్సరాన్ని క్రమపద్ధతిలో ప్రారంభించడానికి వీలవుతుందన్నది సుస్పష్టం. పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాఠ్య పుస్తకాలు సకాలంలో విద్యార్థులకు చేరడం లేదు. 2014లో మాత్రమే బడులు తెరిచిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేశారు. అప్పట్లో రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన పూనం మాలకొండయ్య ముందుచూపుతో వ్యవహరించినందునే పిల్లలకు ప్రయోజనం చేకూరింది. 2015లో ఆగస్టు నాటికి కూడా పాఠశాలలకు పూర్తి స్థాయిలో పుస్తకాలు సమకూరకపోగా, 2016లోనూ అదే పరిస్థితి. ఈ ఏడాదైనా పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
24 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం..
జిల్లాలో 3,190 ప్రాథమిక, 361 ప్రాథమికోన్నత, 634 ఉన్నత పాఠశాలలు, 14 హయ్యర్ సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ప్రతీఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లాలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న సుమారు నాలుగు లక్షల మంది తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఈ ఏడాది 24 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఇప్పటికే పుస్తక డిపోలో 1.40 లక్షల పుస్తకాలున్నాయి. ఇందులో 40శాతం ఇంగ్లిషు మీడియం, 60 శాతం తెలుగు మీడియం పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు.
జిల్లాకు ఒక్క పుస్తకం రాలేదు..
రాజమహేంద్రవరంలో ఉన్న పుస్తక డిపోకు ఇప్పటి వరకు సంబంధించి ఒక్క పుస్తకం కూడా రాలేదు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 164 టైటిల్స్ రావాల్సి ఉంది. తెలుగు, ఇంగ్లిషు మీడియంలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఇంకా డిపోలకు చేరాల్సి ఉన్నట్లు డిపో మేనేజర్ జేమ్స్‌వేరీ ‘సాక్షి’కి తెలిపారు. జిల్లా డిపోకు చేరిన అనంతరం పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరవేయాల్సి ఉంటుంది. మండల కేంద్రాలకు పుస్తకాలను చేరవేసేందుకు ప్రతి ఏటా టెండర్ ప్రక్రియను నిర్వహిస్తారు. టెండర్ దక్కించుకున్న వారు పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు చేరవేస్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే సమయానికి పూర్తి స్థాయిలో సరఫరా చేస్తే పాఠశాలలు ప్రారంభం తేదీనే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందజేసేందుకు వీలుంటుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పుస్తకాల ముద్రణ ప్రారంభం కాలేదని సమాచారం. పుస్తకాల ముద్రణ అనంతరం వచ్చే నెలాఖరుకు జిల్లాలోని పుస్తక డిపోకే చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారులకు నివేదించాం...
జిల్లాకు 24 లక్షల పుస్తకాలు అవసరమని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ నెలాఖరుకు పుస్తక డిపోకు పుస్తకాలు చేరతాయని భావిస్తున్నాం. పుస్తకాలు డిపోకే చేరిన వెంటనే మండల కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. – ఎస్.అబ్రహం, డీఈవో, కాకినాడ
Advertisement