- రైతులకు వామపక్ష పార్టీల భరోసా
- గజ్వేల్‌లో రైతు భరోసా యాత్ర ప్రారంభం
గజ్వేల్: రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఇకముందు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. తాము బాసటగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ‘రైతు ఆత్మహత్యలు నివారించండి-ఆర్థిక భద్రత కల్పించండి’ అనే నినాదంతో పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా యాత్ర (జాతా) శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీ నామమాత్రంగానే అమలు చేయడం వల్ల రైతులకు చేయూత కరువైందన్నారు. రూ.లక్ష రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైపు నుంచి మద్ధతు లభించకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 500 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనూ అన్నదాతలు వరుసగా బలవన్మరణాలకు పాల్పడటం వారి దయనీయస్థితిని చాటుతున్నాయన్నారు. జీవో.421ను సవరించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశలో ఈనెల 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బాధిత కుటుంబాలతో కలసి పెద్దఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో కరువు విలయతాండవం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. వెంటనే రాష్ట్రంలోని 338 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు. సభలో వామపక్ష పార్టీల నేతలు పశ్య పద్మ, భట్టు దయానందరెడ్డి, రాజయ్య, జంగం నాగరాజు, జోగు చలపతిరావు, వెంకన్న, నర్సయ్య, మురహరి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.