‘చేప’కు చేయూత...  | Khammam District Fisherman Is Happy | Sakshi
Sakshi News home page

‘చేప’కు చేయూత... 

Published Thu, Apr 25 2019 6:59 AM | Last Updated on Thu, Apr 25 2019 6:59 AM

Khammam District Fisherman Is Happy - Sakshi

చేప విత్తనాలు దొరకక.. ఎదిగిన చేపలు పట్టేందుకు వలలు లేక.. రవాణా, మార్కెటింగ్‌ సౌకర్యం లేక.. ధర గిట్టుబాటు కాక.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న మత్స్యకారులు. చేసేది లేక కొందరు వృత్తినే మానుకుని బతుకు దెరువు కోసం మరో బాట పట్టారు. వారి కష్టాలను, ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించడంతోపాటు మరింత ప్రోత్సాహం అందిస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నాణ్యమైన చేప విత్తనాలను పంపిణీ చేస్తూ.. రాయితీపై వలలు, వాహనాలు, చేపలు నిల్వ చేసే బాక్సులను సమకూరుస్తోంది. మార్కెటింగ్‌కు చేయూతనందిస్తోంది. మత్స్య సహకార సంఘాల ద్వారా ప్రభుత్వ రాయితీలను, సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న మత్స్యకారులు ఆర్థికంగా బలపడటంతోపాటు కుటుంబాలను పోషించుకుంటున్నారు. 

సాక్షి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా 662 చెరువులు ఉండగా.. 183 మత్స్య సహకార సంఘాలు, 14,494 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులపై ఆధారపడి జీవిస్తుండగా.. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేయూతనందిస్తుండటంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గతంలో చేప విత్తనాలు కొనుగోలు చేసేందుకు సంఘ సభ్యులందరూ తలాకొంత వేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసేవారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ పిల్లలు నాణ్యతగా లేకపోవడం.. మరో ప్రాంతం నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్న క్రమంలో కొన్ని చనిపోవడం.. చెరువులో వదిలిన తర్వాత మరికొన్ని ప్రాణాలు విడవడం.. వర్షాలు పూర్తిస్థాయిలో కురవక.. చెరువుల్లో నీరులేక చేప ఎదగకపోవడం.. ఇలా మత్స్యకారులు తీరొక్క సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలాగోలా ఎదిగి ఎంతో కొంత చేతికొచ్చిన సరుకుకు మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం.. దళారుల వల్ల కొంత నష్టపోవడం జరుగుతుండేది. ఈ క్రమంలో చాలా మంది మత్స్యకారులు ఎన్నేళ్లయినా మన బతుకులు బాగుపడవనే ఉద్దేశంతో ఆ వృత్తికి దూరం కావడం.. మరో వృత్తిని ఎంచుకున్న సందర్భాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి మారింది. వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన ప్రభుత్వం వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు పూనుకుంది.

ఉచితంగా చేప పిల్లలు.. 
జిల్లాలో ఇప్పటివరకు 2.25 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందించింది. వాటిని జిల్లాలో ఎంపిక చేసిన చెరువులు, రిజర్వాయర్లలో పోసుకుని మత్స్యకారులు అభివృద్ధి చేస్తున్నారు. అయితే గత పాలకులు మత్స్యకారుల పట్ల చిన్నచూపు చూడడంతో చాలా మంది మత్స్యకారులు ఇతర వృత్తులు, పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందించడంతో పలువురు మత్స్యకారులు మళ్లీ పాత వృత్తిని స్వీకరించారు. జిల్లాలోని వైరా, పాలేరు, చెరువు మధారం, లంకపల్లి వంటి పెద్ద చెరువులపై వందలాది మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ బలోపేతం అవుతున్నాయి.
     
ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు.. 
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. చేపలు పట్టేందుకు వలలు, వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు వాహనాలు 75 శాతం సబ్సిడీపై అందించింది. జిల్లాలో 2.25 కోట్ల చేప పిల్లలు.. రవ్వు, బొచ్చె, బంగారు తీగ, గ్యాస్‌కట్‌ తదితర రకాలను 662 చెరువుల్లో విడుదల చేసింది. చేపలను మార్కెటింగ్‌ చేసేందుకు మోపెడ్‌లు, ప్లాస్టిక్‌ బాక్స్‌లు, ట్రేలు, బొలెరో వాహనాలు, వలలు, రవాణాకు ఉపయోగించే యంత్ర పరికరాలను ప్రభుత్వం మత్స్యకారులకు అందించింది. దీంతో మత్స్యకారులు చెరువుల్లో వలలతో పట్టిన చేపలను అమ్ముకునేందుకు సులభతరంగా మారింది.

వ్యాపారం బాగుంది.. 
ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేశాం. అవి ఎదిగిన తర్వాత చేపల వేటతో మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మార్కెట్‌లో చేపలకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రతి రోజు వివిధ ప్రాంతాల చెరువుల నుంచి చేపలు తెచ్చి విక్రయిస్తున్నాం. విక్రయించేందుకు ప్రభుత్వం వాహనాలు కూడా అందించింది. – చెరకు వెంకటేశ్వర్లు, సొసైటీ కార్యదర్శి, నేలకొండపల్లి 

ప్రభుత్వం సహకరిస్తోంది.. 
మత్స్యకారులకు కేసీఆర్‌ ప్రభుత్వం చేయూతనిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మత్స్యకారులు ఆర్థికంగా లాభపడుతున్నారు. ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. చేప పిల్లలతోపాటు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తోంది. సీఎం కేసీఆర్‌కు మత్స్యకారుల కుటుంబాలు రుణపడి ఉంటాయి. – యడవల్లి చంద్రయ్య, మత్స్య సొసైటీ జిల్లా అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement