Fishermen Association
-
సీఎం మా జీవితాల్లో వెలుగులు నింపారు
-
‘చేప’కు చేయూత...
చేప విత్తనాలు దొరకక.. ఎదిగిన చేపలు పట్టేందుకు వలలు లేక.. రవాణా, మార్కెటింగ్ సౌకర్యం లేక.. ధర గిట్టుబాటు కాక.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న మత్స్యకారులు. చేసేది లేక కొందరు వృత్తినే మానుకుని బతుకు దెరువు కోసం మరో బాట పట్టారు. వారి కష్టాలను, ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించడంతోపాటు మరింత ప్రోత్సాహం అందిస్తోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నాణ్యమైన చేప విత్తనాలను పంపిణీ చేస్తూ.. రాయితీపై వలలు, వాహనాలు, చేపలు నిల్వ చేసే బాక్సులను సమకూరుస్తోంది. మార్కెటింగ్‌కు చేయూతనందిస్తోంది. మత్స్య సహకార సంఘాల ద్వారా ప్రభుత్వ రాయితీలను, సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న మత్స్యకారులు ఆర్థికంగా బలపడటంతోపాటు కుటుంబాలను పోషించుకుంటున్నారు. సాక్షి, ఖమ్మం: జిల్లావ్యాప్తంగా 662 చెరువులు ఉండగా.. 183 మత్స్య సహకార సంఘాలు, 14,494 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులపై ఆధారపడి జీవిస్తుండగా.. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేయూతనందిస్తుండటంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గతంలో చేప విత్తనాలు కొనుగోలు చేసేందుకు సంఘ సభ్యులందరూ తలాకొంత వేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసేవారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ పిల్లలు నాణ్యతగా లేకపోవడం.. మరో ప్రాంతం నుంచి కొనుగోలు చేసి తీసుకొస్తున్న క్రమంలో కొన్ని చనిపోవడం.. చెరువులో వదిలిన తర్వాత మరికొన్ని ప్రాణాలు విడవడం.. వర్షాలు పూర్తిస్థాయిలో కురవక.. చెరువుల్లో నీరులేక చేప ఎదగకపోవడం.. ఇలా మత్స్యకారులు తీరొక్క సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలాగోలా ఎదిగి ఎంతో కొంత చేతికొచ్చిన సరుకుకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం.. దళారుల వల్ల కొంత నష్టపోవడం జరుగుతుండేది. ఈ క్రమంలో చాలా మంది మత్స్యకారులు ఎన్నేళ్లయినా మన బతుకులు బాగుపడవనే ఉద్దేశంతో ఆ వృత్తికి దూరం కావడం.. మరో వృత్తిని ఎంచుకున్న సందర్భాలున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి మారింది. వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన ప్రభుత్వం వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు పూనుకుంది. ఉచితంగా చేప పిల్లలు.. జిల్లాలో ఇప్పటివరకు 2.25 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందించింది. వాటిని జిల్లాలో ఎంపిక చేసిన చెరువులు, రిజర్వాయర్లలో పోసుకుని మత్స్యకారులు అభివృద్ధి చేస్తున్నారు. అయితే గత పాలకులు మత్స్యకారుల పట్ల చిన్నచూపు చూడడంతో చాలా మంది మత్స్యకారులు ఇతర వృత్తులు, పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందించడంతో పలువురు మత్స్యకారులు మళ్లీ పాత వృత్తిని స్వీకరించారు. జిల్లాలోని వైరా, పాలేరు, చెరువు మధారం, లంకపల్లి వంటి పెద్ద చెరువులపై వందలాది మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ బలోపేతం అవుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. చేపలు పట్టేందుకు వలలు, వాటిని మార్కెటింగ్ చేసేందుకు వాహనాలు 75 శాతం సబ్సిడీపై అందించింది. జిల్లాలో 2.25 కోట్ల చేప పిల్లలు.. రవ్వు, బొచ్చె, బంగారు తీగ, గ్యాస్కట్ తదితర రకాలను 662 చెరువుల్లో విడుదల చేసింది. చేపలను మార్కెటింగ్ చేసేందుకు మోపెడ్లు, ప్లాస్టిక్ బాక్స్‌లు, ట్రేలు, బొలెరో వాహనాలు, వలలు, రవాణాకు ఉపయోగించే యంత్ర పరికరాలను ప్రభుత్వం మత్స్యకారులకు అందించింది. దీంతో మత్స్యకారులు చెరువుల్లో వలలతో పట్టిన చేపలను అమ్ముకునేందుకు సులభతరంగా మారింది. వ్యాపారం బాగుంది.. ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేశాం. అవి ఎదిగిన తర్వాత చేపల వేటతో మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి రోజు వివిధ ప్రాంతాల చెరువుల నుంచి చేపలు తెచ్చి విక్రయిస్తున్నాం. విక్రయించేందుకు ప్రభుత్వం వాహనాలు కూడా అందించింది. – చెరకు వెంకటేశ్వర్లు, సొసైటీ కార్యదర్శి, నేలకొండపల్లి ప్రభుత్వం సహకరిస్తోంది.. మత్స్యకారులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మత్స్యకారులు ఆర్థికంగా లాభపడుతున్నారు. ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. చేప పిల్లలతోపాటు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. సీఎం కేసీఆర్‌కు మత్స్యకారుల కుటుంబాలు రుణపడి ఉంటాయి. – యడవల్లి చంద్రయ్య, మత్స్య సొసైటీ జిల్లా అధ్యక్షుడు -
గంగస్థలం
అక్కడ ఆయన చెప్పిందే వేదం. ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. అలా ఎదురు చెప్తే వారిని మూడో కంటికి తెలియకుండా మట్టికరిపించేస్తాడు. ఇదేదో ఇటీవల వచ్చిన సినీమా కథలా ఉంది కదూ. అంత కాకున్నా... అలాంటి విధానమే ప్రస్తుతం మత్స్యకార సంఘాల్లోనూ నడుస్తోంది. వారికి నచ్చకపోతే సంఘంలో సభ్యత్వం ఉండదు. అది లేకుంటే ఎలాంటి ప్రభుత్వ పథకమూ లభించదు. మరి సభ్యత్వం పొందాలంటే వారిని ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆదేశాలకు ఎదురు చెప్పకూడదు. లేదంటే అంతేమరి. బొబ్బిలికి చెందిన మత్స్యకారులైన వీరిపేర్లు ములముంతల తులసి, శ్రీను, గురువులు, పైడిరాజు, సురేష్, గోవింద, పైడిశెట్టి, శేఖర్‌బాబు, త్రినాథ. పదేళ్లనుంచి వీరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదు. కారణం ఏమిటంటే వీరికి సంఘాల్లో సభ్యత్వం లేదు. వీరికి సభ్యత్వం ఇచ్చేందుకు స్థానిక సంఘ అధ్యక్షుడు ఒప్పుకోవడం లేదని వీరి ఆరోపణ. సభ్యత్వం కావాలంటే ఖర్చవుతుందనీ, అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందనీ సంఘ సమావేశంలోనే చెప్పడంతో లంచం ఎందుకివ్వాలని వీరు నిలదీయడంతో సభ్యత్వం ఇవ్వట్లేదంట. గతంలో జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే సంఘాల్లో చేర్చుకోవాలంటూ సిఫార్సు లేఖ రాశారు. వీరు చూపిస్తున్నది ఆ లేఖే! దీనిని పట్టుకుని తిరగని ప్రాంతం లేదు. కలవని అధికారులు లేరు. అయినా వీరికి సభ్యత్వం ఇవ్వలేదు. సభ్యత్వం కావాలంటే రూ.70వేలు ఖర్చవుతుందని బొబ్బిలి సంఘ అధ్యక్షుడు చెప్పారు. ఆ డబ్బులు అధికారులకు ఇవ్వాలని చెప్పారంట. బొబ్బిలి : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఏ విధమైన ప్రయోజనం కల్పించాలన్నా... అందరికీ అది అందడంలేదు. కారణం ప్రయోజనం పొందాలంటే సంఘంలో సభ్యత్వం ఉండాలి మరి. అలా సభ్యత్వం లేనివారు ఇప్పుడు వేరే కూలి పనిచేసుకుని గడపాల్సిన దస్థితి దాపురించింది. ఇదీ బొబ్బిలిలో సంఘం పరిస్థితి. ఎన్నాళ్ల నుంచో సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉన్న స్థానిక అధ్యక్షుడు ఏం చెబితే అంతే అన్న స్థాయిలో మత్స్యకారుల పరిస్థితి ఉంది. సంఘాల్లో ఉంటే ఏటా సబ్సిడీ వలలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, గూడ్స్ ఆటోలతో పాటు వివిధ సబ్సిడీ రుణాలు అందుతాయి. అవి అందాలంటే మత్స్యకార సంఘాల అధ్యక్షులను ప్రసన్నం చేసుకోవాలి. జిల్లాలో సుమారు 74 సంఘాలున్నాయి. అందులో ఉన్న సభ్యులు గాకుండా ఇతర ప్రాంతాల్లో సుమారు 10వేల మందికి పైగా ఉన్న మత్స్యకారులకు ఎలాంటి సంక్షేమ పథకమూ దక్కడం లేదు. ఎందుకంటే వీరికి సభ్యత్వం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభావితం చూపిస్తున్నారు. దీనివల్ల మత్స్యకార కుటుంబాలకు కనీసం ఆర్థిక సహకారం అందడం లేదు. ఆయా నాయకుల చేతుల్లోనే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. పరిహారానికి ‘పచ్చ’రంగు మరో పక్క తీరప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటి రేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులకు చేపల వేట నిషేధ రోజుల్లో ఇవ్వాల్సిన రూ.4 వేల భృతికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చరంగు పులుముతోంది. నిషేధ సమయాల్లో ఉన్న 450 బోట్లకు పసుపు రంగు వేయాలని వాటికి ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో మత్స్య శాఖాధికారులు ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో పడవలకు పసుపు రంగు వేయని మత్స్య కారులను గుర్తిస్తారు. రంగు వేసిన వారి వివరాలతో పాటు పసుపు రంగేయని వారి వివరాలనూ నెట్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ వివరాలను కైజాల యాప్‌లో అప్లోడ్ చేయాలనే ఉత్తర్వులున్నాయని మత్స్య శాఖాధికారులు చెబుతున్నారు. తీరప్రాంత మండలాల్లో సుమారు 30వేల మంది మత్స్య కారులున్నారు. వీరికి ఏప్రిల్ నుంచి వేట నిషేధ సమయంలో నెలకు రూ.4వేలు చొప్పున జూలై వరకూ జీవన భృతిగా ఇవ్వనున్నారు. ఈ భృతి అందాలంటే వారి పడవలకు పసుపు రంగేయాలి. రాజకీయాలు అటు సంఘాధ్యక్షుల పరిధిలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వ తీరులోనూ నడుస్తుండబట్టే నిరుపేదలయిన గంగపుత్రులకు న్యాయం జరగడం లేదన్నది ఈ తీరును బట్టే తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్య కారులకు రాజకీయాలతో ప్రమేయం లేకుండా వారికి భృతినిచ్చి ఆదుకోవాలనీ, సంక్షేమ పథకాలను అమలు చేయాలనీ కోరుతున్నారు. అవి ప్రభుత్వ నిబంధనలే జిల్లాలో ఉన్న మత్స్యకారులు తమ బోట్లకు పసుపు రంగువేయాలి. అది ప్రభుత్వ నిబంధన. లేకపోతే అవ్వదు. రంగు వేయని మత్స్య కారుల వివరాలను కైజాలా యాప్‌లో పెట్టాలని ప్రభుత్వ ఆదేశం. సంఘాల్లో చేర్పించాలంటే డబ్బులు ఇవ్వనక్కర లేదు. అక్కడున్న సంఘాలకు దరఖాస్తు చేయాలి. లేదా మాకు రాస్తే మేం కమిషనర్‌కు లేఖ రాసి సంఘంలో చోటు కల్పించాలని కోరుతాం. – కె.కనక రాజు, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ, విజయనగరం -
లక్ష్యం చేరేనా?
మోమిన్‌పేట: అనుకున్నది ఒక్కటైతే, అయ్యింది మరొకటి అన్న చందంగా తయారైంది మత్స్యశాఖ పరిస్థితి. జిల్లాలోని చెరువుల్లో 94.68లక్షల చేప పిల్లలు వదలాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నా అందుకు తగినట్లుగా మత్య్స సహకార సంఘాల సభ్యులు ముందుకురావడంలేదు. వర్షాలు కురిసి జిల్లాలోని అన్ని చెరువులు, ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో మత్స్యశాఖ రూ.లక్షలు వెచ్చించి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నా సంఘం సభ్యులు స్పందించడంలేదు. ఇప్పటి వరకు 50 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసిన అధికారులు ఇంకా లక్ష్యం చేరుకునేందుకు 44.68 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. మూడు రకాల చేప పిల్లలను ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు నుంచి నాణ్యమైన రహు, బంగారు తీగ, బొచ్చ రకాలు తెప్పిస్తున్నారు. ఒక్కో చేప పిల్లను 0.56 పైసలకు కొంటోంది. మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. అయినా సంఘ సభ్యులు చేపల పంపకం పట్ల ఆసక్తి చూపడంలేదు. దీంతో ఆ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 93 సహకార సంఘాలు, అందులో 4380 మంది సభ్యులు ఉన్నారు. 92 నీటి పారుదల శాఖ పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులుండగా పంచాయతీల పరిధిలో మరో 600ల చెరువులు ఉన్నాయి. మత్స్య సహకార సంఘాలతో పాటు సభ్యులను అభివృద్ధి చేయాలని ఒక పక్క, ఇతర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు చెరువుల్లో చేపలను వదులితేనే అవి ఆరు నెలల్లో పెద్దవిగా పెరిగి అమ్మకానికి వస్తాయని, లేనిఎడల వేసవిలో చెరువుల్లో నీరు ఎండిపోయి చేపల ఎదుగుదల మందగిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అందుకోసం సహకార సంఘం సభ్యులను అప్రమత్తం చేస్తున్నామని జిల్లా మత్య్సశాఖ అధికారి రజని చెబుతున్నారు. రెండు లక్షలు తీసుకెళ్తున్నా.. దౌల్తాబాద్ పెద్ద చెరువులో నీరు నిండుగా ఉంది. మూడు రకాలైన రహు, బంగారు తీగ, బొచ్చలను చేప పిల్లలు రెండు లక్షలు తీసుకెళ్తున్నా. మా చెరువులో పెరిగిన చేప బహు రుచిగా ఉండడంతో పాటు తొందరగా ఎదుగుతుంది. – బీమప్ప పెద్ద చెరువు సహకార సంఘం సభ్యుడు, దౌల్తాబాదు అప్రమత్తం చేస్తున్నా.. లక్ష్యాన్ని చేరుకునేందుకు మత్స్య సహకార సభ్యులను అప్రమత్తం చేస్తు న్నా. వారికి వీలున్నప్పు డే వస్తున్నారు. వర్షాలు అలస్యంగా కురవడంతో ఇప్పుడిప్పుడే చెరువుల్లోకి నీరు వçచ్చి చెరుతోంది. చేప పిల్లలను వేయాల్సిన సమయం వచ్చింది. ఆలస్యమైతే వేసవిలో ఇబ్బందులు తప్ప వు. లక్ష్యాన్ని చేరుకొంటాం. – రజని, జిల్లా మత్స్యశాఖ అధికారి -
శ్రీలంక దాడులతో.. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న మత్య్సకారులు
రామేశ్వరం: శ్రీలంక సరిహద్దు జలశయాల్లో చేపల వేటకు వెళ్లుతున్న మత్స్యకారులపై శ్రీలంక నావికా దళం తరుచూ దాడులకూ పాల్పడుతుండటంతో మత్య్సకారులంతా తమ వృత్తులను వదిలేసి బ్రతుకుదెరువు కోసం ప్రక్కప్రాంతాలైన కేరళ, కర్ణాటక ప్రాంతాలకు వలస వెళుతున్నారని మత్య్సకారుల సంఘం పేర్కొంది. శ్రీలంక దాడులకు భయపడి 3వేల మంది మత్య్సకారులు తమ వృత్తిని వదిలివేశారు. చేపలు పట్టడమే తమ నిత్యకృత్యమై జీవనం సాగిస్తున్న జాలర్లంతా ఆ వృత్తిపైనే ఆధారపడ్డారు. రామేశ్వరం తీరప్రాంతాల్లో తమిళ జాలర్లు తమ పడవల సహాయంతో చేపల వేటకు వెళుతుంటారు. ఈ సమయంలో సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న శ్రీలంక నావికాదళం వారిపై దాడులుకూ పాల్పడటం పరిపాటైంది. దీంతో మత్య్సకారులంతా భయాందోళనలతో తమ జీవనాన్ని నెట్టుకుస్తున్నారు. ఇలా అయితే తాము చేపల వేటకు వెళ్లి బ్రతికి బట్టకట్టడం కష్టమంటూ వారూ వాపోతున్నారంటూ మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు ఎమీరిట్ పిటిఐకి తెలిపారు. గడిచిన కొన్నిరోజుల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లడం మానివేయడంతో చేపల దిగుమతి 90శాతానికి పడిపోయిందన్నారు. అక్కడి తీరప్రాంతాల ద్వీపాలలో దాదాపు 4వేల మంది మత్య్సకారులుంటారని ఎమీరెట్ పేర్కొన్నారు. చేపల పడవలను అద్దెకిచ్చే యాజమానులు జాలర్ల కుటుంబాలకు సహాయం అందించేందుకు విముఖుత చూపిస్తున్నారు. శ్రీలంక జైల్లో నిర్భందానికి గురైన మత్య్సకారుల సంఘం సహాయకుడు ఫెలోమెన్ త్యాగరాజన్ తమ ఆవేధనను వెల్లబుచ్చారు. ఈ సమస్యపై ఇరుదేశాల మధ్య సానుకూల మార్పు రావాల్సిన అవసరం ఎంతైన వుందని ఎమీరిట్ చెప్పారు. దీనిపై కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని సమాలోచన చేసి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని అప్పడే భారత జాలర్లు నిర్భయంగా భారత జలశయాల్లోకి వెళ్లగలరని అన్నారు. చేపలు పట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో హక్కు కల్పించాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇరుదేశాల ఒప్పందం ప్రకారమే కాథేచ్చివ్ ద్వీప సరిహద్దులో చేపలు వేటడేందుకు అనుమతి ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ కూడా శ్రీలంక నావికా దళం ఒప్పందాన్ని విస్మరించి తరుచూ దాడులకు పాల్పడుతుండటం సరికాదని అన్నారు. తాజాగా శ్రీలంక హై కమీషనర్ వెల్డడించిన వివరాల ప్రకారం.. భారత జాలర్లు దాదాపు 114మంది లంక జైల్లో మగ్గుతున్నారని, అంతర్గతంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. కానీ ఇలాంటి దుశ్చర్యలను భారత జాలర్లు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారని ఆయన తెలిపారు.