మత్స్యకార సంఘాల సభ్యత్వాల్లో రాజకీయం
అక్కడ ఆయన చెప్పిందే వేదం. ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. అలా ఎదురు చెప్తే వారిని మూడో కంటికి తెలియకుండా మట్టికరిపించేస్తాడు. ఇదేదో ఇటీవల వచ్చిన సినీమా కథలా ఉంది కదూ. అంత కాకున్నా... అలాంటి విధానమే ప్రస్తుతం మత్స్యకార సంఘాల్లోనూ నడుస్తోంది. వారికి నచ్చకపోతే సంఘంలో సభ్యత్వం ఉండదు. అది లేకుంటే ఎలాంటి ప్రభుత్వ పథకమూ లభించదు. మరి సభ్యత్వం పొందాలంటే వారిని ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆదేశాలకు ఎదురు చెప్పకూడదు. లేదంటే అంతేమరి.
బొబ్బిలికి చెందిన మత్స్యకారులైన వీరిపేర్లు ములముంతల తులసి, శ్రీను, గురువులు, పైడిరాజు, సురేష్, గోవింద, పైడిశెట్టి, శేఖర్‌బాబు, త్రినాథ. పదేళ్లనుంచి వీరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదు. కారణం ఏమిటంటే వీరికి సంఘాల్లో సభ్యత్వం లేదు. వీరికి సభ్యత్వం ఇచ్చేందుకు స్థానిక సంఘ అధ్యక్షుడు ఒప్పుకోవడం లేదని వీరి ఆరోపణ. సభ్యత్వం కావాలంటే ఖర్చవుతుందనీ, అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందనీ సంఘ సమావేశంలోనే చెప్పడంతో లంచం ఎందుకివ్వాలని వీరు నిలదీయడంతో సభ్యత్వం ఇవ్వట్లేదంట. గతంలో జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే సంఘాల్లో చేర్చుకోవాలంటూ సిఫార్సు లేఖ రాశారు. వీరు చూపిస్తున్నది ఆ లేఖే! దీనిని పట్టుకుని తిరగని ప్రాంతం లేదు. కలవని అధికారులు లేరు. అయినా వీరికి సభ్యత్వం ఇవ్వలేదు. సభ్యత్వం కావాలంటే రూ.70వేలు ఖర్చవుతుందని బొబ్బిలి సంఘ అధ్యక్షుడు చెప్పారు. ఆ డబ్బులు అధికారులకు ఇవ్వాలని చెప్పారంట.
బొబ్బిలి : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఏ విధమైన ప్రయోజనం కల్పించాలన్నా... అందరికీ అది అందడంలేదు. కారణం ప్రయోజనం పొందాలంటే సంఘంలో సభ్యత్వం ఉండాలి మరి. అలా సభ్యత్వం లేనివారు ఇప్పుడు వేరే కూలి పనిచేసుకుని గడపాల్సిన దస్థితి దాపురించింది. ఇదీ బొబ్బిలిలో సంఘం పరిస్థితి. ఎన్నాళ్ల నుంచో సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉన్న స్థానిక అధ్యక్షుడు ఏం చెబితే అంతే అన్న స్థాయిలో మత్స్యకారుల పరిస్థితి ఉంది. సంఘాల్లో ఉంటే ఏటా సబ్సిడీ వలలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, గూడ్స్ ఆటోలతో పాటు వివిధ సబ్సిడీ రుణాలు అందుతాయి.
అవి అందాలంటే మత్స్యకార సంఘాల అధ్యక్షులను ప్రసన్నం చేసుకోవాలి. జిల్లాలో సుమారు 74 సంఘాలున్నాయి. అందులో ఉన్న సభ్యులు గాకుండా ఇతర ప్రాంతాల్లో సుమారు 10వేల మందికి పైగా ఉన్న మత్స్యకారులకు ఎలాంటి సంక్షేమ పథకమూ దక్కడం లేదు. ఎందుకంటే వీరికి సభ్యత్వం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభావితం చూపిస్తున్నారు. దీనివల్ల మత్స్యకార కుటుంబాలకు కనీసం ఆర్థిక సహకారం అందడం లేదు. ఆయా నాయకుల చేతుల్లోనే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంది.
పరిహారానికి ‘పచ్చ’రంగు
మరో పక్క తీరప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటి రేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులకు చేపల వేట నిషేధ రోజుల్లో ఇవ్వాల్సిన రూ.4 వేల భృతికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చరంగు పులుముతోంది. నిషేధ సమయాల్లో ఉన్న 450 బోట్లకు పసుపు రంగు వేయాలని వాటికి ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో మత్స్య శాఖాధికారులు ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో పడవలకు పసుపు రంగు వేయని మత్స్య కారులను గుర్తిస్తారు. రంగు వేసిన వారి వివరాలతో పాటు పసుపు రంగేయని వారి వివరాలనూ నెట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ వివరాలను కైజాల యాప్‌లో అప్‌లోడ్ చేయాలనే ఉత్తర్వులున్నాయని మత్స్య శాఖాధికారులు చెబుతున్నారు.
తీరప్రాంత మండలాల్లో సుమారు 30వేల మంది మత్స్య కారులున్నారు. వీరికి ఏప్రిల్ నుంచి వేట నిషేధ సమయంలో నెలకు రూ.4వేలు చొప్పున జూలై వరకూ జీవన భృతిగా ఇవ్వనున్నారు. ఈ భృతి అందాలంటే వారి పడవలకు పసుపు రంగేయాలి. రాజకీయాలు అటు సంఘాధ్యక్షుల పరిధిలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వ తీరులోనూ నడుస్తుండబట్టే నిరుపేదలయిన గంగపుత్రులకు న్యాయం జరగడం లేదన్నది ఈ తీరును బట్టే తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్య కారులకు రాజకీయాలతో ప్రమేయం లేకుండా వారికి భృతినిచ్చి ఆదుకోవాలనీ, సంక్షేమ పథకాలను అమలు చేయాలనీ కోరుతున్నారు.
అవి ప్రభుత్వ నిబంధనలే
జిల్లాలో ఉన్న మత్స్యకారులు తమ బోట్లకు పసుపు రంగువేయాలి. అది ప్రభుత్వ నిబంధన. లేకపోతే అవ్వదు. రంగు వేయని మత్స్య కారుల వివరాలను కైజాలా యాప్‌లో పెట్టాలని ప్రభుత్వ ఆదేశం. సంఘాల్లో చేర్పించాలంటే డబ్బులు ఇవ్వనక్కర లేదు. అక్కడున్న సంఘాలకు దరఖాస్తు చేయాలి. లేదా మాకు రాస్తే మేం కమిషనర్‌కు లేఖ రాసి సంఘంలో చోటు కల్పించాలని కోరుతాం.
– కె.కనక రాజు, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment