ఒకరు తెలిసీ తెలియని వయస్సులో సమాజ మార్పు కోసం తుపాకీ పట్టారు. అడవుల్లో తిరిగారు. పాటలతో ప్రభావితమైన సాయుధ సమరంలో భాగస్వామ్యమయ్యారు. మరొకరు తల్లిదండ్రుల వారసత్వంతో విప్లవోద్యం వైపు అడుగులు వేశారు. అడవి తల్లి ఒడిలో కలిసి ప్రయాణిస్తూ జీవితాన్ని పంచుకున్నారు. అనుకోని సందర్భంలో పోలీసుల చేతికి చిక్కి జైలు జీవితాన్ని అనుభవించారు. ఇప్పుడు అనాథలకు అమ్మనాన్నలుగా మారారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నీ తామై సాకుతున్నారు. పోరుబాటను వదిలి నేడు అనాథలకు తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. సొంత ఖర్చులతో అనాథల జీవితాల్లో వెలుగులు నింపడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వారే.. మాజీ నక్సలైట్ దంపతులు కత్తుల లక్ష్మి, రవీందర్.బాల్యంలోనే పోరుబాట వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన కత్తుల కట్టయ్య, ఉపేంద్ర దంపతుల కుమారుడు కత్తుల రవీందర్. రాంపేట గ్రామం నాడు పీపుల్స్ వార్ ఉద్యమానికి కంచుకోటగా ఉంది. ఉద్యమ నేపథ్యం కలిగిన గ్రామం కావడంతో రవీందర్‌పై ఆ ప్రభావం పడింది. దీనితో పదో తరగతి పూర్తి చేసిన వెంటనే 1992లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆకిటి నర్సిరెడ్డి, అనసూర్య దంపతుల కుమార్తె లక్ష్మి. నర్సిరెడ్డి, అనసూర్య దంపతులు అప్పటికే పార్టీ కంట్రోల్‌లో పని చేస్తున్నారు. లక్ష్మి రామన్నగూడెంలో 7వ తరగతి చదువుతోంది. మీ తల్లిదండ్రుల జాడ చెప్పమని పోలీసులు వేధించారు. దీనితో లక్ష్మి చదువును ఆపేసి 1996లోనే పోరుబాట పట్టింది. రవీందర్, లక్ష్మిలు ఇద్దరూ పాలకుర్తి ఏరియాలోనే పనిచేయడంతో పార్టీ అనుమతిలో 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
అరెస్టుతో ఉద్యమానికి స్వస్తి
ఉద్యమంలోనే దంపతులుగా మారిన లక్ష్మి, రవీందర్‌లు అరెస్టు కావడంతో పోరుబాటకు స్వస్తి చెప్పారు. పార్టీ విస్తరణలో భాగంగా లక్ష్మి, రవీందర్‌లను మహారాష్ట్రకు పంపించారు. అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. పోలీసులు అరెస్టు చేశారు. దీనితో 2000 నుంచి 2002 వరకు వరంగల్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు. విడుదలైన తరువాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. లక్ష్మి తీవ్రంగా అనారోగ్యానికి గురి కావడంతో 2004లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్య లొంగిపోయిన 6 నెలల తరువాత భర్త రవీందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలు జీవితం అనుభవించి ఉద్యమ పంథాకు స్వస్తి చెప్పి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు.
మనసు చలించి..!
ఉద్యమం బాట నుంచి బయటకు వచ్చిన లక్ష్మీ రవీందర్ దంపతులు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవితంలో ఎదిగేందుకు అష్టకష్టాలు పడ్డారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుందామని కాజీపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అనాథ పిల్లలు పైసలు అడుక్కుంటూ కన్పించారు. ఈ దృశ్యాన్ని చూసిన లక్ష్మి మనస్సు మార్చుకుని తిరిగి ఇంటికి వచ్చారు. ఆలోచనను మార్చిన అనాథల కోసం ఏమైనా చేయాలనే నిర్ణయించుకున్న ఆమె భర్త రవీందర్ సహకారంతో ముందు చీరెల అమ్మకం ప్రారంభించారు.. 15 ఏళ్లపాటు చీరెల అమ్మకం చేసి ఆర్థికంగా స్థిరపడ్డారు.
దృష్టి సారించి..
ఆర్థికంగా నిలబడిన తరువాత లక్ష్మి, రవీందర్ దంపతులు సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. 2013 లోనే కుమారుడు జన్మించారు. కుమారుడి పేరు మీద ‘వర్ధన్ స్వచ్ఛంద సంస్థ’ను ప్రారంభించారు. ఏజెన్సీ ఏరియాలో ఇల్లు కాలిపోయిన బాధితులకు బియ్యం, బట్టలు, నిత్యావసర వస్తువులను అందించారు. నిరుపేద మహిళలకు చీరెలు దానం చేయడం, అనాథ ఆశ్రమాల్లో అన్నదానాలు నిర్వహించారు. వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు.
.. అనాథలకు చేయూత
సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిన లక్ష్మి రవీందర్ దంపతులు 2017 అక్టోబర్‌లో జనగామ జిల్లా కేంద్రంలో ‘వర్ధన్ అనాథ ఆశ్రమం’ ప్రారంభించారు. రెడ్డి సంక్షేమ భవనాన్ని అద్దెకు తీసుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో 30మంది అనాథ పిల్లలు ఆశ్రయంపొందుతున్నారు. పిల్లలను పోషిస్తూనే విద్యను చెప్పిస్తున్నారు. అలనాపాలన మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు.
‘అమ్మ’కు కర్మకాండ
ఆరు మాసాల కింద గుర్తు తెలియని అనాథ వృద్ధురాలు నర్సమ్మ ఆశ్రమంలో చేరింది. అయితే నర్సమ్మ ఆగస్టు 1వ తేదీన మృతి చెందింది. దీనితో నర్సమ్మకు లక్ష్మి రవీందర్ దంపతులు అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మి కర్మకాండ చేయడం పలువురిని కదిలించింది.
బంగారు భవిష్యత్తు ఇవ్వడమే ధ్యేయం
కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమయంలో ఎన్నో కష్టాలను అనుభవించాం. కనీసం తినడానికి అన్నం లేదు. ఉండటానికి ఇల్లు లేదు. బయటకు వచ్చిన తరువాత ఎవరూ తెలియదు. ఎలా బతకాలో తెలియదు. వరంగల్‌లో చిరు వ్యాపారం చేసి ఈ స్థాయికి వచ్చాం. అనాథలకు బంగారు భవిష్యత్ ఇవ్వడమే ధ్యేయంగా ఆశ్రమాన్ని నిర్వహించాం. ఆశ్రమానికి వచ్చే పిల్లలకు తల్లిదండ్రుల్లా సేవ చేస్తాం. దాతలు అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ఆడపిల్లలను బతికించుకుందామనే కార్యక్రమంతో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నాం. అనాథలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో సేవలను మరింతగా విస్తరిస్తాం. మాకు చేయూతగా మానవత్వవాదులు ముందుకు రావాలని కోరుతున్నాం.
– కత్తుల లక్ష్మి
– ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ
Comments
Please login to add a commentAdd a comment