జర్మనీలో మరో ఉగ్రదాడి
బెర్లిన్: జర్మనీలో మరోసారి ఉగ్రదాడి కలకలం సృష్టించింది. బెర్లిన్లో సిరియా శరణార్థి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి(27) మృతి చెందాడు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ బార్ ప్రాంగణంలో జరుగుతున్న పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న 2,500 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
దక్షిణ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడో దాడి ఇది. ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిథి మైఖెల్ సిఫెనర్ వెల్లడించారు. మ్యూనిక్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. రైలులో ప్రయాణికులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసిన ఘటనలో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల జర్మనీలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.