ఆ జైలులో 13 వేల మందికి దారుణ ఉరి | syria secret hanged 13 thousand Prisoners | Sakshi
Sakshi News home page

‘ఎంత మంది చచ్చార్రా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా!’

Published Wed, Feb 8 2017 10:36 AM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM

ఆ జైలులో 13 వేల మందికి దారుణ ఉరి - Sakshi

ఆ జైలులో 13 వేల మందికి దారుణ ఉరి

టెర్రరిస్టులకన్నా దారుణ హత్యలు

లండన్‌ : సిరియాలో టెర్రరిస్టులు సాగిస్తున్న దారుణ మారణకాండ గురించే ఇంతవరకు మనం విన్నాం. వీడియోల్లో చూశాం. అంతకంటే దారుణాతి దారుణంగా బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వ ప్రోద్బలంతో సాగించిన మూకుమ్మడి మానవ హననానికి సంబంధించిన ఘోర కత్యాల గురించి ఇప్పుడు ‘ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌’ వెలుగులోకి తెచ్చింది. ఆ జైలులో రోజూ అర్ధరాత్రి పూట యాభై నుంచి అరవై మంది ఖైదీలను విచారణ పేరిట బయటకు ఎక్కడికో తీసుకెళతారు. వారు ఎప్పటికి తిరిగిరారనే విషయం తోటి ఖైదీలతోపాటు అక్కడి వారందరికి తెల్సిందే. ఎవరికి వారు మనసులో వారి ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటారే తప్ప, ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితి వారిది.

అసలా అర్ధరాత్రి బయటకు వెళ్లినవారు ఏమవుతున్నారో తెలుసుకునేందుకు ఆమ్మెస్టీ జరిపిన దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూశాయి. ఖైదీలను చీకటి బ్యార క్స్‌లోకి తీసుకెళతారు. మెడలకు తాడేసి ఉరి తీస్తారు. అప్పటికే సరైన తిండీ, నిద్ర లేక బక్కచిక్కిన ఖైదీల శరీరాలు వేలాడదీసిన ఎక్కువ సందర్భాల్లో వారి ప్రాణంపోదు. అలాంటి సమయంలో గార్డులు ఆ జీవచ్ఛవాలను బలంగా పట్టుకొని కిందకు లాగుతారు. అప్పుడు వారి తలల నుంచి మొండాలు ఊడిపోయి వస్తాయి. వాటికి తీసుకెళ్లి సామూహికంగా చీకట్లో ఖననం చేస్తారు. తమను ఇంత దారుణంగా ఉరితీస్తారన్న విషయం ఖైదీలకుగానీ, వారు ఏమయ్యారోనన్న విషయం వారి కుటుంబాలకు కూడా ఎప్పటికీ తెలియదు.

రాత్రి పూట తీసే ఉరివల్ల ఒక్కసారే ప్రాణం పోతుంది. కానీ జైలు ఊచల గదుల్లో వారు క్షణం క్షణం మరణ వేదనను అనుభవించాల్సిందే. ఖైదీలను సైనికులే రేప్‌ చేస్తారు. తోటి ఖైదీలతోనీ రేప్‌ చేయిస్తారు. కర్రలు, రాడ్లతో చితకబాది రక్తం కక్కిస్తారు. రక్తం గడ్డకట్టిన, మురికితో కంపుకొడుతున్న నేలపైనే ఇన్ని మెతుకులేసి తినమని హుకుం జారీ చేశారు. తినకపోతే కొడతారు, తంతారు. పొద్దున లేవగానే విజిల్స్‌ వేసుకుంటూ సైనికులొస్తారు. ‘ఆ ఈ రోజు ఎంత మంది చచ్చార్రా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా!’ అంటూ ఖైదీలను ప్రశ్నిస్తారు. చనిపోయిన వారి శవాలను ట్రక్కులో చెత్తను మోసుకెళ్లినట్లు మోసుకెళతారు. ఇలా 2011 నుంచి 2015 సంవత్సరాల మధ్య 13వేల మందిని దారుణంగా హింసించి, ఉరితీసి చంపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది.

డమస్కస్‌ నగారానికి 30 కిలోమీటర్ల దూరంలోని  సయద్నాయ జైలులో జరిగిన ఈ దారుణాల గురించి మాజీ జడ్జీలు, మాజీ జైలు గార్డులు, తోటి ఖైదీలు సహా 84 మంది ప్రత్యక్షసాక్షుల ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్‌ సమాచారాన్ని సేకరించింది. ఇంతకుముందు దేశవ్యాప్తంగా 17,500 మందిని అన్యాయంగా ఉరితీశారన్ని ఆమ్నెస్టీ లెక్కవేసింది. ఇప్పుడు ఒక్క జైలులోనే 13వేల మందిని ఉరితీయడం గురించి తెలియడంతో తమ అంచనాలు సరిచేసుకోవాల్సి ఉందని ఆమ్నెస్టీ అభిప్రాయపడింది.

జైలు శిక్ష అనుభవిస్తున్నవారు, ఇలా దారుణంగా ఉరిశిక్షకు గురైన వారు టెర్రరిస్టులుకాదు, కరుడుకట్టిన నేరస్థులుకాదు. వారిలో దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలనను వ్యతిరేకిస్తున్న దేశ పౌరులు ఎక్కువ ‘ఖైదీలను ఉరి తీసినప్పుడు వారి బరువు సరిపోక ప్రాణం పోకపోతే గార్డులు వారి మోకాళ్లు పట్టుకొని కిందకు లాగేవారు. అలా లాగినప్పుడు కొన్నిసార్లు వారి మెడల నుంచి మొండాలి ఊడి వచ్చేవి. ఇలాంటివి నేను కళ్లారా చూశాను’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ మాజీ జడ్జీ ఆమ్నెస్టీ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ జైలుకు మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేసే వారని, ఖైదీలెవరూ ఎవరితో మాట్లాడకూడదని, గార్డులు వచ్చినప్పుడు ఎలాంటి పొజిషన్స్‌లో ఉండాలో కూడా నిబంధనలు ఉండేవని పదవి విరమణ చేసిన ఓ జైలు అధికారి తెలిపారు.

రోజూ తిండీ తిప్పలు లేక, చిత్ర హింసలకు గురై ఇద్దరు, ముగ్గురు చనిపోయేవారని, ఒకటో నెంబర్‌ సెల్‌లో ఎంత మంది చనిపోయారు, రెండో నెంబర్‌ సెల్‌లో ఎంత మంది చనిపోయారంటూ గార్డులు తోటి వారిని ప్రశ్నించడం  తాను వినేవాడినని జైలు నుంచి విడుదలైన నాదల్‌ తెలిపారు. ‘జైలు కింది గదుల్లో ఖైదీల మెడ నరాలు తెగిన శబ్దాలు, ప్రాణం పోతున్న మూలుగు వినిపించేది’ అని హమీద్‌ అనే మాజీ సైనికాధికారి తెలిపారు. తాము నివేదికలో పేర్కొన్న పేర్లు అసలు పేర్లుకాదని, వారి నిక్‌నేమ్‌లని, అసలు పేర్లు బయట పెట్టొద్దనే షరతుపైనే వారు ఈ విషయాలు వెల్లడించారని ఆమ్నెస్టీ తెలిపింది.

ఆమ్నెస్టీ ఇంటర్వ్యూ చేసిన 84 మందిలో న్యాయవాదులు కూడా ఉన్నారు. ఈ దారుణాలు ఇప్పటికీ కొనసాగుతుండవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 2011లోనే దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమై అది అంతర్యుద్ధానికి దారితీసిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో నాలుగు లక్షల మంది ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి లెక్కలు తెలియజేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement