జాంగ్ జాన్ (ఫైల్ ఫొటో)
బీజింగ్: కరోనా మహమ్మారి వ్యాప్తి గురించి ప్రపంచానికి వెల్లడించిన చైనా సిటిజన్ జర్నలిస్ట్ జాంగ్ జాన్.. చావుబతుకుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. న్యాయవాదిగా పనిచేసిన 38 ఏళ్ల జాంగ్ జాన్.. గతేడాది ఫిబ్రవరిలో వుహాన్ వెళ్లారు. కరోనా వ్యాప్తి గురించి అక్కడి అధికారులను నిలదీశారు. తన స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసిన ఈ వీడియోలు బయటకు రావడంతో గత సంవత్సరం మే నెలలో ఆమెను అరెస్ట్ చేశారు. ఘర్షణలు రేకెత్తించడానికి ప్రయత్నించారన్న అభియోగాలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అసమ్మతి వాదులను అణచివేసేందుకు చైనాలో సాధారణంగా ఇలాంటి అభియోగాలు మోపుతారన్న ఆరోపణలు ఉన్నాయి.
జైల్లో నిరాహారదీక్ష
కాగా, షాంఘై జైలులో జాంగ్ జాన్.. నిరాహారదీక్షకు దిగినట్టు ఆమె తరపు న్యాయబృందం ఈ సంవత్సరం ప్రారంభంలో వెల్లడించింది. నాసికా రంధ్రాల ద్వారా బలవంతంగా ఆమెకు ఆహారం అందిస్తున్నారని, జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని ‘ఏఎఫ్‌పీ’ వార్తా సంస్థకు న్యాయబృందం తెలిపింది.
ఎక్కువ కాలం బతక్కపోవచ్చు
‘ఆమె ఇప్పుడు చాలా తక్కువ బరువుతో ఉంది. ఎక్కువ కాలం జీవించకపోవచ్చు. చలికాలంలో ఆమె జీవించడం కష్టం. తన ఆరోగ్యాన్ని తానే కాపాడుకోవాలని ఆమె రాసిన ఉత్తరాల్లో కోరాను. తాను నమ్మిన దేవుడు, విశ్వాసాలను తప్పా మిగతా వాటిని నా సోదరి లెక్కచేయద’ని ఆమె సోదరుడు జాంగ్ జు గత వారం ట్విటర్‌లో పేర్కొన్నారు.
అవమానకర దాడి
జాంగ్ జాన్‌కు తక్షణమే వైద్య చికిత్స అవసరమని, ఆమెను వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ గురువారం చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జాంగ్ జాన్ అరెస్ట్‌ను ‘మానవ హక్కులపై అవమానకర దాడి’గా అమ్నెస్టీ ప్రచారకర్త గ్వెన్ లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. (చదవండి: చైనా దుశ్చర్య: అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్ల నిర్మాణం)
సమాధానం లేదు
షాంఘై మహిళా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న జాంగ్‌ను కలిసేందుకు మూడు వారాల క్రితం కుటుంబ సభ్యులు ప్రయత్నించినా అధికారుల నుంచి స్పందన రాలేదని పేరు వెల్లడించడానికి భయపడిన ఆమె సన్నిహితుడొకరు ‘ఏఎఫ్‌పీ’కి చెప్పారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జాంగ్ తల్లి నిరాకరించారని.. షాంఘై జైలు నుంచి కూడా సమాధానం రాలేదని ‘ఏఎఫ్‌పీ’తెలిపింది.
చైనా వ్యతిరేక రాజకీయ కుట్ర
జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అయితే ఆమె విడుదల కోసం మానవ హక్కుల సంఘాలు చేస్తున్న ప్రయత్నాలను ‘చైనా వ్యతిరేక రాజకీయ కుట్రలు’గా వర్ణించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్టప్రకారం శిక్షకు గురికాక తప్పదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్.. మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. (చదవండి: మీది గొప్ప మనసు ...ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!)
చైనాపై ఒత్తిడి తేవాలి
జాంగ్ జాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. మరొకరి సహాయం కూడా ఆమె నడవలేకపోతున్నారని, కనీసం తల కూడా కదపలేకపోతున్నారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) వెల్లడించింది. పరిస్థితి మరింత విషమించక ముందే చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొచ్చి జాంగ్ జాన్‌ను విడుదలయ్యేలా చూడాలని ఆర్‌ఎస్‌ఎఫ్ విజ్ఞప్తి చేసింది. కాగా, వుహాన్‌లో కరోనా వ్యాప్తి గురించి ప్రపంచానికి వెల్లడించిన మరో ముగ్గురు పౌర పాత్రికేయులు చెన్ క్యుషి, ఫాంగ్ బిన్, లి జెహువా కూడా నిర్బంధానికి గురయ్యారు. (చదవండి: బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు)
Comments
Please login to add a commentAdd a comment