జెనీవా: కరోనా మూలాలను కనుగొనడం నైతికావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. అప్పుడు మున్ముందు ఇతర వైరస్‌లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలమని తెలిపింది. కోవిడ్–19ని మహమ్మారిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసెస్ మాట్లాడారు. కరోనాతో లక్షలాది మంది మరణించారని, కొన్ని కోట్ల మంది లాంగ్ కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనాల్సిన నైతిక బాధ్యత ఉందని అన్నారు.
కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం 2021లోనే కొన్ని వారాలు గడిపి గబ్బిలాల నుంచి మనుషులకి ఈ వైరస్ సోకిందని నివేదిక సమర్పించింది. మరోవైపు అమెరికా అధ్యయనంలో ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని తేలింది. ఇలా రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు ప్రచారంలో ఉండడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది.అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ చెప్పారు. అత్యంత ప్రమాదకర వైరస్‌లపై అధ్యయనానికి డబ్ల్యూహెచ్‌ఒ ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అడ్వయిజరీ గ్రూప్ కూడా ఇప్పటివరకు కరోనా వైరస్ పుట్టుకపై ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. కీలకమైన డేటా కనిపించడం లేదని కమిటీ అంటోంది.
భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 113 రోజుల తర్వాత ఒకే రోజు 524 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,618కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment