Amnesty International
-
Iran anti-hijab protest: హిజాబ్ అల్లర్లతో...అట్టుడుకుతున్న ఇరాన్
దుబాయ్: ఇరాన్లో హిజాబ్ కల్లోలం చినికిచినికి గాలివానగా మారుతోంది. నిర్బంధ హిజాబ్ ధారణ నిబంధనను వ్యతిరేకిస్తూ వారం రోజులుగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు నానాటికీ మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు హిజాబ్‌లను చేబూని జెండాల మాదిరిగా ఊపుతూ భారీ సంఖ్యలో నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటంటూ నిరసిస్తున్నారు. ‘మాకు స్వేచ్ఛ కావాల్సిందే’ అంటూ వీధుల్లోకి వస్తున్నారు. ‘నియంత ఖొమేనీకి మరణమే’, ‘ముల్లాల పీడ వదలాల్సిందే’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బహిరంగంగా జుత్తు కత్తిరించుకోవడంతో పాటు హిజాబ్‌లను తగలబెడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని టెహ్రాన్‌లో ఆందోళనకారులు ఓ పోలీసు వాహనానికి నిప్పు పెడుతున్న వీడియోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. పలుచోట్ల ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతూ కన్పించారు. పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగి నిరసనకారులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోయాయి. ‘ఓ దేవుడా! వాళ్లు విచక్షణారహితంగా కాల్చి పారేస్తున్నారు’ అని ఆక్రోశిస్తూ జనం చెల్లాచెదురుగా పారిపోతున్న దృశ్యాలు కొన్ని వీడియోల్లో కన్పిస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటిదాకా 26 మంది దాకా మరణించారని దేశ అధికారిక మీడియా సంస్థ చెబుతున్నా శుక్రవారమే ఏకంగా 30 మందికి పైగా బలైనట్టు తెలుస్తోంది. ఆందోళనకారుల పట్ల పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వెలిబుచ్చింది. అతి సమీపం నుంచి కాల్పులకు పాల్పడుతున్నారని ఆక్షేపించింది. ఇరాన్‌పై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు అల్లర్లను నిరసిస్తూ ప్రభుత్వ అనుకూల ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. సర్కారు ఉక్కుపాదం నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ర్యాలీలు, ఆందోళనల పిలుపుకు ఆందోళనకారులు ప్రధానంగా ఆధారపడుతున్న ఇన్స్టాగ్రాం, వాట్సాప్ వంటివాటిపై ఆంక్షలను తీవ్రతరం చేసింది. అనుమానితుల కోసం పోలీసులు ఇంటింటి సోదాలకు దిగుతున్నారు! వందలాది మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. హిజాబ్ ధరించలేదంటూ మాసా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని మోరల్ పోలీసులు అరెస్టు చేయడం, ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించడం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ గత శనివారం నుంచి దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు రోడ్లెక్కుతున్నారు. హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ! ఇరాన్ పాలకవర్గంలో గూడుకట్టుకుపోయిన సంప్రదాయవాదానికి తార్కాణమీ ఫొటో. కుర్చీలో కూర్చున్నది సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ క్రిస్టియాన్ అమన్‌పోర్ (64). ఆమె ఎదురు చూస్తున్నది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కోసం. ఐరాస సర్వసభ్య ప్రతినిధి సభలో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన రైసీ ఇరాన్లో చెలరేగుతున్న హిజాబ్ హింసాకాండపై ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తీరా సమయానికి ఆమె హిజాబ్ ధరించాలంటూ పట్టుబట్టారు. అందుకు క్రిస్టియాన్ ససేమిరా అన్నారు. 1995 నుంచీ ఇరాన్ అధ్యక్షులందరినీ హిజాబ్ ధరించకుండానే ఇంటర్వ్యూ చేశానని గుర్తు చేశారు. ‘‘ఇంటర్వ్యూ కోసం వారాల ముందునుంచీ ఏర్పాట్లు చేసుకున్నాం. నేను షెడ్యూల్ ప్రకారం సిద్ధమై అధ్యక్షుని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ ఆయన జాడే లేదు. 40 నిమిషాల తర్వాత సహాయకుడొచ్చి నేను హిజాబ్ ధరించి తీరాల్సిందేనని ఆయన కోరుతున్నట్టు తెగేసి చెప్పాడు. అందుకు నిరాకరించి ఇంటర్వ్యూనే రద్దు చేసుకున్నా’’ అంటూ ఈ అనుభవాన్ని ఆమె ట్విట్టర్లో పంచుకున్నారు. ఇరాన్లో పుట్టిన క్రిస్టియానా 11 ఏళ్లొచ్చేదాకా టెహ్రాన్‌లోనే పెరిగారు. -
ఆమ్నెస్టీపై ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు
న్యూఢిల్లీ: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఏఐఐపీఎల్), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్(ఐఏఐటీ) తదితర సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రిన్సిపల్ సిటీ సివిల్, సెషన్స్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై సంబంధిత సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసిందని ఈడీ తెలిపింది. విదేశీ మారక ద్రవ్య చట్టం(ఫెమా)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమ్నెస్టీ ఇండియా, సంస్థ మాజీ చీఫ్ ఆకార్ పటేల్‌లకు శుక్రవారం ఈడీ రూ.61 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఈడీ ఆరోపణలపై ఆమ్నెస్టీ ఇండియా స్పందించింది. కఠిన చట్టాలతో విమర్శకులను అణచివేయడం ప్రస్తుత భారత ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆరోపించింది. మనీల్యాండరింగ్ ఆరోపణల విషయం కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపింది. -
చావుబతుకుల్లో ఆమె.. చైనాపై ఒత్తిడి పెంచండి
బీజింగ్: కరోనా మహమ్మారి వ్యాప్తి గురించి ప్రపంచానికి వెల్లడించిన చైనా సిటిజన్ జర్నలిస్ట్ జాంగ్ జాన్.. చావుబతుకుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. న్యాయవాదిగా పనిచేసిన 38 ఏళ్ల జాంగ్ జాన్.. గతేడాది ఫిబ్రవరిలో వుహాన్ వెళ్లారు. కరోనా వ్యాప్తి గురించి అక్కడి అధికారులను నిలదీశారు. తన స్మార్ట్‌ఫోన్ ద్వారా తీసిన ఈ వీడియోలు బయటకు రావడంతో గత సంవత్సరం మే నెలలో ఆమెను అరెస్ట్ చేశారు. ఘర్షణలు రేకెత్తించడానికి ప్రయత్నించారన్న అభియోగాలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అసమ్మతి వాదులను అణచివేసేందుకు చైనాలో సాధారణంగా ఇలాంటి అభియోగాలు మోపుతారన్న ఆరోపణలు ఉన్నాయి. జైల్లో నిరాహారదీక్ష కాగా, షాంఘై జైలులో జాంగ్ జాన్.. నిరాహారదీక్షకు దిగినట్టు ఆమె తరపు న్యాయబృందం ఈ సంవత్సరం ప్రారంభంలో వెల్లడించింది. నాసికా రంధ్రాల ద్వారా బలవంతంగా ఆమెకు ఆహారం అందిస్తున్నారని, జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని ‘ఏఎఫ్‌పీ’ వార్తా సంస్థకు న్యాయబృందం తెలిపింది. ఎక్కువ కాలం బతక్కపోవచ్చు ‘ఆమె ఇప్పుడు చాలా తక్కువ బరువుతో ఉంది. ఎక్కువ కాలం జీవించకపోవచ్చు. చలికాలంలో ఆమె జీవించడం కష్టం. తన ఆరోగ్యాన్ని తానే కాపాడుకోవాలని ఆమె రాసిన ఉత్తరాల్లో కోరాను. తాను నమ్మిన దేవుడు, విశ్వాసాలను తప్పా మిగతా వాటిని నా సోదరి లెక్కచేయద’ని ఆమె సోదరుడు జాంగ్ జు గత వారం ట్విటర్లో పేర్కొన్నారు. అవమానకర దాడి జాంగ్ జాన్‌కు తక్షణమే వైద్య చికిత్స అవసరమని, ఆమెను వెంటనే విడుదల చేయాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ గురువారం చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జాంగ్ జాన్ అరెస్ట్‌ను ‘మానవ హక్కులపై అవమానకర దాడి’గా అమ్నెస్టీ ప్రచారకర్త గ్వెన్ లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. (చదవండి: చైనా దుశ్చర్య: అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్ల నిర్మాణం) సమాధానం లేదు షాంఘై మహిళా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న జాంగ్‌ను కలిసేందుకు మూడు వారాల క్రితం కుటుంబ సభ్యులు ప్రయత్నించినా అధికారుల నుంచి స్పందన రాలేదని పేరు వెల్లడించడానికి భయపడిన ఆమె సన్నిహితుడొకరు ‘ఏఎఫ్‌పీ’కి చెప్పారు. ఈ విషయంపై మాట్లాడేందుకు జాంగ్ తల్లి నిరాకరించారని.. షాంఘై జైలు నుంచి కూడా సమాధానం రాలేదని ‘ఏఎఫ్‌పీ’తెలిపింది. చైనా వ్యతిరేక రాజకీయ కుట్ర జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అయితే ఆమె విడుదల కోసం మానవ హక్కుల సంఘాలు చేస్తున్న ప్రయత్నాలను ‘చైనా వ్యతిరేక రాజకీయ కుట్రలు’గా వర్ణించింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు చట్టప్రకారం శిక్షకు గురికాక తప్పదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్.. మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. (చదవండి: మీది గొప్ప మనసు ...ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) చైనాపై ఒత్తిడి తేవాలి జాంగ్ జాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. మరొకరి సహాయం కూడా ఆమె నడవలేకపోతున్నారని, కనీసం తల కూడా కదపలేకపోతున్నారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) వెల్లడించింది. పరిస్థితి మరింత విషమించక ముందే చైనాపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొచ్చి జాంగ్ జాన్‌ను విడుదలయ్యేలా చూడాలని ఆర్ఎస్ఎఫ్ విజ్ఞప్తి చేసింది. కాగా, వుహాన్‌లో కరోనా వ్యాప్తి గురించి ప్రపంచానికి వెల్లడించిన మరో ముగ్గురు పౌర పాత్రికేయులు చెన్ క్యుషి, ఫాంగ్ బిన్, లి జెహువా కూడా నిర్బంధానికి గురయ్యారు. (చదవండి: బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు) -
13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు
కైరో: అఫ్గాన్‌లోని హజారా వర్గానికి చెందిన 13 మందిని తాలిబన్లు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. వీరిలో ఎక్కువమంది తాలిబన్లకు లొంగిపోయిన అఫ్గాన్ సైనికులని వెల్లడించింది. డేకుండి ప్రావిన్స్‌లోని కహోర్ గ్రామంలో ఆగస్ట్ 30వ తేదీన ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది. మృతుల్లో 11 మంది అఫ్గాన్ భద్రతా సిబ్బంది కాగా 17 ఏళ్ల బాలిక సహా ఇద్దరు పౌరులున్నట్లు తెలిపింది. ఈ వార్తలపై వివరణ కోరేందుకు అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధి ఫోన్ ద్వారా యత్నించగా తాలిబన్లు స్పందించలేదు. ‘ఆగస్ట్ 14వ తేదీన డేకుండి ప్రావిన్స్ తాలిబన్ల హస్తగతమైంది. ఖిదిర్ జిల్లాలో 34 మంది సైనికులు తమ ఆయుధాలతో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆగస్ట్ 30న 300 మందితో కూడిన తాలిబన్ కాన్వాయ్ సైనికులున్న గ్రామానికి చేరుకుంది. కుటుంబాలతో పాటు కొందరు సైనికులు అక్కడి నుంచి వెళ్లిపో యేందుకు యత్నించగా తాలిబన్లు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు, మసుమా అనే బాలిక, మరో వ్యక్తి చనిపోయారు. మాజీ సైనికుడొకరు జరిపిన కాల్పుల్లో ఒక తాలిబన్ ఫైటర్ చనిపోగా మరొకరు గాయపడ్డారు. అనంతరం, లొంగిపోయిన సైనికుల్లో 9 మందిని తాలిబన్లు సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లి కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధా రాలు మా వద్ద ఉన్నాయి’ అని ఆమ్నెస్టీ తెలిపింది. ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ మాట్లాడుతూ.. ‘హజారాలను దారుణంగా చంపడం తాలిబన్లు మారలేదనడానికి నిదర్శనం. అఫ్గాన్‌లో గతంలో అధికారంలో ఉండగా పాల్పడిన అకృత్యాలను తిరిగి సాగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. -
మరో బాంబ్‌ను పేల్చిన అంతర్జాతీయ మానవ హక్కుల ఎన్జీవో!
ఇజ్రాయిల్ ఎన్ఎస్వోకు చెందిన పెగాసస్ మాల్వేర్ దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ మాల్వేర్తో పలు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, ఇతరులపై గూఢాచర్యం నిర్వహించినట్లుగా పలు ఆంగ్ల దినపత్రికల దర్యాప్తులో తేలింది. తాజాగా అంతర్జాతీయ మానవ హక్కుల ఎన్జీవో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరో బాంబును పేల్చింది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో నడుస్తున్న ఐఫోన్లు జీరో-క్లిక్ ఐమెసేజ్స్తో పెగాసస్ మాల్వేర్ చొరబడే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పలు ఐఫోన్ల లాగ్లను విశ్లేషించగా పలు భయంకర నిజాలు బయటకు వచ్చాయి. 2014 జూలై 14 నుంచి పలు ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌లను పెగాసస్ స్పైవేర్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. 2021 జూలైలో కూడా ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌లపై గూఢాచర్యం చేసినట్లు ఎన్జీవో గుర్తించింది. మీరు ఐఫోన్ యూజర్ల..ఐతే జరభద్రం..! పెగాసస్ స్పైవేర్ ప్రస్తుత ఐఫోన్లలో నడుస్తున్న ఐవోఎస్ 14.6 వర్షన్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినట్లుగా తాజా నివేదికలో తేలింది. అత్యంత భద్రత కల్గిన ఐఫోన్లను సింపుల్‌గా యూజర్ల ఎటువంటి చర్య లేకుండా పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయడానికి iMessageను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఆపిల్ కంపెనీ తన తదుపరి ఐవోస్ 14.7 వర్షన్‌ను మరికొద్ది రోజుల్లో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఉన్న బగ్‌ను గుర్తించడంలో ఆపిల్ విజయవంతమౌతుందనీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. -
ఏడేడు లోకాల ఎచటనుంటివో రాకుమారీ..!
మూడేళ్లుగా రాజుగారి కుమార్తె కనిపించడం లేదు. ఎక్కడుందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ఏ శత్రుదేశ సైనికులు ఆమెను అపహరించుకుని వెళ్లి ఉంటారు? శత్రుదేశ సైనికులు కాదు. ఏడు రాజ్యాల మహా సామ్రాజ్యాధీశుడే ఆమెను ఏడు లోకాల్లో ఎక్కడో నిర్బంధించాడు. ఆ రాకుమారి షేఖా లతీఫా. ఆ మహా సామ్రాజ్యాధీశుడు మొహమ్మద్ రషీద్. లతీఫా అతడి కుమార్తే. నిర్బంధించించి ఆ తండ్రే! ఇంతకీ ఆమె సజీవంగానే ఉందా? ఆ సంగతిని మొహమ్మద్ రషీదే చెప్పాలని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషల్’ అంటోంది! ‘పనోరమా’ అని.. బి.బి.సి. ఒక పరిశోధనాత్మక నిజ ఘటనల టీవీ సీరీస్‌ను ప్రసారం చేస్తుంటుంది. మొన్న మంగళవారం ఆ సీరీస్‌లో షేఖా లతీఫా తనే విడుదల చేసిన ఒక చిన్న వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ కనిపించారు! ‘ఓ మై గాడ్’ అనుకుంది ప్రపంచం ఒక్కసారిగా ఆమె తెరపై కనిపించగానే. వెంటనే ‘థ్యాంక్ గాడ్’ అని కూడా. ‘ఓ మై గాడ్’ అనుకోవడం ఎందుకంటే.. మూడేళ్ల క్రితం దుబాయ్‌లోని తన అంతఃపురం నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై, తండ్రి చేతికి చిక్కాక తిరిగి మళ్లీ ఆమె లోకానికి కనిపించలేదు. మనిషీ లేదు. మాటా లేదు. ఆ మనిషి గురించిన మాట కూడా రాజసౌధం నుంచి చిన్న శబ్దంగానైనా లేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా బి.బి.సి.లో కనిపించినందుకే ఆ ఆశ్చర్యం. అయితే ఆ క్లిప్‌లో లతీఫా హాయిగా లేదు. నవ్వుతూ లేదు. ప్రశాంతంగా లేదు. బిక్కుబిక్కుమంటూ.. ఎవరూ వినకుండా మాట్లాడినట్లుగా ఉంది. అలసిపోయినట్లుగా ఉంది. అచేతనత్వానికి ప్రారంభ దశలో ఉన్నట్లుగా ఉంది. మొత్తానికి ప్రాణాలతోనైతే ఉందన్న భావనే ప్రేక్షకులు ‘థ్యాంక్ గాడ్’ అనుకోడానికి కారణం. అయితే ఆ క్లిప్ 2019 నాటిదని బి.బి.సి. ప్రకటించగనే అనుమానాలు. లతీఫా బతికే ఉందా?! క్లిప్‌లో ఆమె బాత్రూమ్లోంచి మాట్లాడినట్లుగా ఉంది. ఆ బాత్రూమ్ ఒక ఆకాÔ¶ హర్మ్యంలో ఉన్నట్లుగా ఉంది. ఆ ఆకాశహర్మ్యం ఏ రాజ్యంలో ఉన్నదో తెలియడం లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యు.ఎ.ఇ.) ఏడు రాజ్యాల మహాసామ్రాజ్యం. వాటిల్లో ఒకటి దుబాయ్. ఆ దుబాయ్ పాలకుడే లతీఫా తండ్రి మొహమ్మద్ రషీద్. యు.ఎ.ఇ.కి ప్రధాని, ఉపాధ్యక్షుడు కూడా కనుక కూతుర్ని ఆయన ఈ ఏడు లోకాలలో ఎక్కడైనా నిర్బంధించి ఉంచవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషల్ సంస్థ అనుమానిస్తోంది. ‘ఒక జైలు లాంటి విల్లాలో ఆమె రెక్కలు తెగిన పక్షిలా పడివున్నారన్నది మాత్రం నిజం’ అని మేరీ రాబిన్సన్ అంటున్నారు. లతీఫా నుంచి తను సంపాదించిన ఆ బాత్రూమ్ క్లిప్‌తో పాటు, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు, యు.ఎన్.హ్యూమన్ రైట్స్ మాజీ హై కమిషనర్ అయిన రాబిన్సన్ ఇంటర్వ్యూని కూడా తన షోలో ప్రసారం చేసింది బి.బి.సి. ‘‘ఈ స్థితిలో ఆమె ఎంతకాలం జీవించి ఉండగలరో తెలియడం లేదు’’ అని ఆ ఇంటర్వ్యూలో రాబిన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ∙∙ ‘‘బయటికి వెళ్లి ఇంత స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి కూడా లేకుండా పోయింది’’ అని బి.బి.సి.కి అందిన క్లిప్‌లో ఆవేదన చెందుతూ కనిపించారు లతీఫా. ఆ ఎపిసోడ్ ప్రసారం అవగానే.. ‘రాకుమారి ఎలా ఉందో చెప్పండి’ అని ప్రపంచ మీడియా నుంచి దుబాయ్ ప్రభుత్వ మీడియాకు వెళ్లిన ఏ విజ్ఞప్తికీ జవాబు లేదు! ‘‘ఈ నిర్బంధం నుంచి నేను ఎప్పటికి బయటపడతానో, ఏ నిబంధనలను అంగీకరిస్తే నన్ను విడుదల చేస్తారో నాకు తెలియడం లేదు. నా భద్రత గురించి, నా జీవితం గురించీ రోజు రోజుకూ నాలో భయం పెరిగిపోతోంది’’ అని కూడా ఆ వీడియో ద్వారా తెలియజెప్పడంతో లతీఫా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారన్న దానిపై సందేహాలు మొదలయ్యాయి. మొహమ్మద్ రషీద్‌కు ఆరుగురు భార్యలు, ముప్పైమంది పిల్లలు. వారందరి సమాచారం ఎంతోకొంత బయటి ప్రపంచం వరకూ వస్తున్నా, గత మూడేళ్లుగా ఏ ఒక్కరి నోటి నుంచీ లతీఫా మాటే రాలేదు! 2018 ముందువరకు ఆమె గురించి తెలిసింది ఒక్కటే.. స్కై డైవింగ్ అంటే ఆమెకు ప్రాణమని! ∙∙ లతీఫా అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కారణం, కుటుంబ ఆంక్షల నుంచి స్వేచ్ఛను పొందేందుకు బయట పడాలని 2018లో ఆమె చేసిన ప్రయత్నమే. తన ఫిన్లాండ్ స్నేహితురాలు టీనా జౌహానియస్, దుబాయ్ పాలకుడి తరఫున పని చేస్తుండే అరవై ఏళ్ల ఫ్రెంచి నిఘా అధికారి హెర్వ్ జాబెర్ట్, మరో ముగ్గురి సహాయంతో రాజప్రాసాదం నుంచి తప్పించుకుని లండన్ పారిపోయే ప్రయత్నంలో వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి 20న గోవాలో భారత తీరప్రాంత గస్తీ దళాలకు చిక్కింది. ఆశ్రయం పొందాలని వచ్చామని ఎంత చెప్పినా వినకుండా మన కమాండోలు భారత ప్రభుత్వ ఆదేశాలపై లతీఫాను తిరిగి దుబాయ్‌కి అప్పగించారు. ఇలా తప్పించుకునిపోడానికి ముందు కూడా మూడేళ్లపాటు వెలుతురే లేని గదిలో ఆమె బందీగా ఉన్నారు. అందుకే స్వేచ్ఛ కోసం అంతగా అలమటించిపోయారు. ఇక లతీఫాను తిరిగి దుబాయ్‌కి అప్పగించడం వెనుక భారత్ ఆశించిన ప్రయోజనమూ ఉంది. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన క్రిస్టియన్ మిషెల్‌ను యు.ఎ.ఇ. ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తుందన్నదే ఆ ప్రయోజనం. అప్పటికి పందొమ్మిది నెలలుగా మిషెల్‌ను అప్పగించాలని భారత్ కోరుతున్నా స్పందించని దుబాయ్ ప్రభుత్వం, లతీఫాను వెనక్కి పంపించడంతో ప్రతిఫలంగా అతడిని భారత్ చేతుల్లో పెట్టింది! ఇలా ఏదో ఒక ‘దౌత్య’ కారణంతో ఈనాటికీ లతీఫా నిర్బంధాన్ని ఓ ఇంటి వ్యవహారంలా మాత్రమే దేశాలన్నీ చూస్తున్నాయి. కొన్ని దేశాలు అసలే పట్టనట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. ఘటనల కాలక్రమం రాకుమారి ‘ఎస్కేప్’కి ముందు, తర్వాత ► జూన్–2002 : లతీఫా 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయేందుకు తొలి ప్రయత్నం చేశారు. మధ్యలోనే పట్టుకుని మూడేళ్ల, నాలుగు నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ► 2010: లతీఫా 24 ఏళ్ల వయసులో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ టీనాతో సన్నిహితంగా ఉండటం చూసి ఆమె ద్వారా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుందేమోనన్న అనుమానంతో లతీఫాకు పాస్‌పోర్ట్ రాకుండా, డ్రైవింగ్ నేర్చుకోకుండా ఆ కుటుంబం జాగ్రత్తపడింది. ► 2018 ఫిబ్రవరి ప్రారంభం : లతీఫా తన 32 ఏళ్ల వయసులో ‘జస్ట్ ఇన్ కేస్’ అని తనపై ఒక వీడియో తీయించుకుని తన నమ్మకస్తులకు మెయిల్ చేశారు. ‘నేను అమెరికా పారిపోతున్నాను. మధ్యలో పట్టుపడితే కనుక ఈ వీడియోను మీడియాకు అందించండి..’ అని అందులో విజ్ఞప్తి చేశారు. ► 24 ఫిబ్రవరి 2018: రాజప్రాసాదం నుంచి తప్పించుకుని, ఇన్ఫ్లేటబుల్ బోట్ (గాలి నింపిన తేలికపాటి పడవ)లో, తర్వాత జెట్ స్కీ లో 24 మైళ్లు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించి, ఫ్రెంచి అధికారి జాబెర్ట్ సిద్ధంగా ఉంచిన అమెరికన్ యాట్‌లో ఇండియా చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో అమెరికా వెళ్లి ఆశ్రయం పొందాలని పథకం. అయితే గోవాలో భారత తీర ప్రాంత కమాండోలకు చిక్కడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది. ► 5 డిసెంబర్ 2018: లతీఫా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు బి.బి.సి. ప్రత్యేక కథనాన్ని ఇవ్వబోతున్నట్లు తెలియగానే లతీఫా తన ఇంట్లోనే సురక్షితంగా ఉందని దుబాయ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ► 24 డిసెంబర్ 2018 : యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్ మేరీ రాబిన్సన్ కలిసి డిసెంబర్ 15న లంచ్ చేస్తున్న లతీఫా ఫొటోను యూఏఈ విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా విడుదల చేసింది. నాటి నుంచి నేటి వరకు లతీఫా ఆచూకీకి సంబంధించిన ఒక్క వివరమూ లేదు! ► 16 ఫిబ్రవరి 2021: బి.బి.సి. ప్రసారం చేసిన ‘పనోరమా’ షో ఇంటర్వ్యూలో మాట్లాడిన మేరీ రాబిన్సన్.. ‘లతీఫా నాతో కలిసి లంచ్ చేస్తున్న ఫొటోను ప్రపంచానికి చూపి దుబాయ్ పాలకులు తమ గోప్యతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు’ అని వ్యాఖ్యానించారు. స్కై డైవింగ్ ప్రాణం, చిన్న పిల్ల మనసు బి.బి.సి. మంగళవారం ప్రసారం చేసిన వీడియో క్లిప్‌లో లతీఫా మేరీ రాబిన్సన్తో లతీఫా లంచ్ -
భారత్‌లో ఆమ్నెస్టి కార్యకలాపాలు బంద్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. భారత ప్రభుత్వం తమను వెంటాడి వేధిస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేయడంతో సిబ్బందిని బలవంతంగా విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆమ్నెస్టికి విదేశీ నిధులు చట్ట విరుద్ధంగా వస్తున్నాయని, ఆ సంస్థ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్టర్ చేసుకోలేదని చెబుతోంది. ‘‘ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా బ్యాంకు ఖాతాలన్నీ స్తంభించి పోయాయి. సెప్టెంబర్ 10న నుంచి అన్ని అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. దీంతో మా సంస్థ చేపట్టే పనులన్నీ ఆగిపోయాయి. సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది.’’అని ఆమ్నెస్టీ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండేళ్లుగా కేంద్రం వేధింపులు కేంద్రం తమ సంస్థని రెండేళ్లుగా వేధిస్తోందని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీ ఘర్షణలు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో అల్లర్లలో మానవ హక్కులకు విఘాతంపై తమ సంస్థ ప్రశ్నలు సంధించిందని, ఫలితంగా బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ జరిగిందన్నారు. ఆమ్నెస్టి అనుబంధ సంస్థపై విచారణ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థపై ఈడీ విచారణ చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు కంపెనీ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అండ్ ఇండియన్స్ ఫర్ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ట్రస్ట్‌ని మనీ ల్యాండరింగ్, ఫారెన్ ఎక్స్ఛేంజ్ నిబంధనల ఉల్లంఘనల కింద విచారిస్తున్నట్టుగా తెలిపాయి. అనుమతుల్లేకుండానే అందుకున్న రూ.51 కోట్లపై విచారిస్తున్నట్టు తెలిపింది. ఆరోపణలు దురదృష్టకరం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపణల్ని హోంశాఖ తిప్పికొట్టింది. ఆ ఆరోపణలు అవాస్తవం, అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. భారత చట్టాలను ఉల్లంఘించి నిధులు తెచ్చుకుంటున్న ఆ సంస్థ తాము చేస్తున్న పనుల నుంచి దృష్టి మరల్చడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా ఆమ్నెస్టీకి నిధులు అందుతున్నాయని, స్వచ్ఛంద సంస్థలకు అలా నిధులు రావడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. యూకే నుంచి 1.60 కోట్ల నిధుల కోసం 2011–12లో అప్పటి ప్రభుత్వం ఆమ్నెస్టీకి అనుమతులి చ్చిందని, 2013 నుంచే యూపీఏ హయాంలోనే అనుమతులు నిలిచి పోయాయని వెల్లడించింది. -
‘క్రూరంగా పశువులా ప్రవర్తించాడు.. అందుకే’
హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ యువతి రాసుకొచ్చిన పోస్టును ఎంతోమంది ప్రశంసిస్తూ ఉంటే..మరికొంత మంది మాత్రం ఎప్పటిలాగానే ఇప్పుడెందుకు.. అప్పుడేం చేశావు... నీకు నచ్చలేదు.. బాధ కలిగింది కాబట్టే ఇప్పుడు అతడి గురించి బయటపెట్టావా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ నెగటివ్ కామెంట్స్ చదువుతుంటే విషయమేంటో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్టే. గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక హింస, వేధింపుల గురించి శ్రుతీ చౌదరి అనే అమ్మాయి నిర్భయంగా అందరితో పంచుకుంది. అంతేకాదు తన #మీటూస్టోరీ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందని ధైర్యంగా ‘అతడి’ ముసుగును తొలగించింది. తనలా ఎవరూ మోసపోకూడదని.. అతడి బారి నుంచి కనీసం ఒక్కరిని కాపాడినా సరే తను విజయం సాధించినట్లేనని పేర్కొంది. ఆ పోస్టు సారాంశం ఇలా.. ‘అందరిలాగానే కలలు సాకారం చేసుకునేందుకు... చిన్న పట్టణం నుంచి ముంబై మహానగరానికి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాకే ఎన్నెన్నో సత్యాలు నాకు బోధపడ్డాయి. ఓరోజు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఓ వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో నా రాతలు చూసి తన దగ్గర రైటర్‌గా పనిచేయాలంటూ కోరాడు. సరే అన్నాను. కలిసి పనిచేస్తున్న క్రమంలో మా మధ్య స్నేహం చాలా బలపడింది. ఆత్మీయుడిగా భావించి నాకున్న అభద్రతా భావం గురించి, ఇతర సమస్యల గురించి అతడితో పంచుకోవడం ప్రారంభించాను. తరుచుగా కలుసుకునేవాళ్లం(అన్ని విధాలుగా). అయితే మా స్కాట్లాంట్ ట్రిప్ వరకు అంతా బాగానే జరిగింది. ఆరోజు రాత్రి మేము ఔటింగ్‌కు వెళ్లాల్సింది. కానీ అకస్మాత్తుగా వద్దన్నాడు. అయితే నేను అందుకు సిద్ధంగా లేనని చెప్పాను. కాసేపటి తర్వాత తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాతో కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాట్లాడటం మానేశాడు. దాంతో గిల్టీగా ఫీలయ్యాను. తన కోరిక కాదన్నందుకు బాధపడతాడేమోనని సరేనన్నాను. కానీ తను మాత్రం అలా అనుకోలేదు. చాలా కఠినంగా, పశువులా ప్రవర్తించాడు. ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలి కదా అన్నా వినలేదు. శారీరక హింసకు గురిచేశాడు. అలా చాలాసార్లు ఎంతగానో హింసించాడు. కొన్ని రోజుల తర్వాత తనతో ‘బంధం’ తెంచుకోవాలని అనుకున్నాను. తను కూడా సరేనన్నాడు. సహచర ఉద్యోగుల్లా మాత్రమే ఉన్నాము. కానీ ఓ రోజు నాకు వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాను. అతడు కేవలం నాతోనే కాదు చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు అని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. అతడి నిజస్వరూపం గురించి బయటపెట్టాలని భావించాను. నాలా ఎంతమంది అమ్మాయిలు ఈ లైంగిక హింసను ప్రేమలో భాగం అనుకుని పొరబడ్డారో తెలిసి, నా మూర్ఖత్వం గురించి తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాను. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో నా మీటూస్టోరీని బహిర్గతం చేశాను. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. మళ్లీ ఆన్ చేయగానే నా పోస్టు వైరల్‌గా మారడం చూసి ఆశ్చర్యపోయాను. పదుల కొద్ది సంఖ్యలో అమ్మాయిలు అతడిని నమ్మిన తీరు, ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తెలుసుకుని షాకయ్యాను. నేను అనుకున్న దానికన్నా కూడా అతడెంతో క్రూరుడు. మూర్ఖుడు. నేను ధైర్యంగా అతడి గురించి బయటపెట్టడం చూసి చాలా మంది కూడా పోరాడటానికి సిద్ధమయ్యారు. అందుకు ఫలితంగా అతడికి శిక్ష వేయించడంలో సఫలీకృతులమయ్యాం. ఈ రోజు నేను షేర్ చేసిన నా స్టోరీ ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తుందనుకుంటున్నాను. నాలా ఎంతో మంది భ్రమలో ఉండి మోసపోయి ఉంటారు. మీరెవ్వరూ ఒంటరివారు కాదు. ధైర్యంగా ముందుకురావాలి. ఇప్పుడెందుకంటే... హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీలో ‘ట్రిగ్గర్ వార్నింగ్’ పేరిట రాసుకొచ్చిన శ్రుతి చౌదరి మీటూస్టోరీ 24 గంటల్లోపే వేల కొద్దీ లైకులు, షేర్లతో దూసుకుపోయింది. ‘ హ్యాట్సాఫ్!!! మీలా ధైర్యంగా ముందుకు రాకపోవడం వల్ల ఎంతో మంది మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఇలా చెప్పడం ద్వారా మీరు కనీసం ఒక్కరినైనా అతడి నుంచి రక్షించిన వారవుతారు. అలాకాకుండా నాకెందుకులే అనుకుని ఉంటే మరెంతో మంది అతడి బారిన పడేవారు. మీరు చాలా ధైర్యవంతురాలు’ అంటూ వందల సంఖ్యలో పురుషులు, మహిళలు శ్రుతికి మద్దుతగా నిలుస్తూ, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వివాహిత మాత్రం.. ‘ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నా భర్త నిజస్వరూపం గురించి బయటపెట్టాలని అనుకున్నాను. కానీ ధైర్యం చేయలేకపోయా. అది నిజంగా ఎంతపెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు’ అని తన బాధను వ్యక్తపరిచారు. ‘ జెంటిల్‌మేన్ ఎప్పుడూ సమ్మతం లేకుండా ఏ మహిళను కనీసం తాకరు. నిజంగా జెంటిల్‌మేన్ అయితే భార్య అయినా గర్ల్‌ఫ్రెండ్ అయినా సరే వారి నిర్ణయాన్ని తప్పక గౌరవిస్తాడు’ అంటూ దేవ్ పత్ అనే ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హ్యూమన్స్ బాంబేతో పాటు నెటిజన్లు కూడా పాజిటివ్‌గా రియాక్టవ్వడం విశేషం. ఇది నాణేనికి ఒకవైపు. ఇప్పుడెందుకో.. మీ తప్పేం లేదా? ఎవరైనా ఒక అమ్మాయి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పగానే ఎదురయ్యే మొదటి, అతి సాధారణ ప్రశ్న. ఇప్పుడెందుకు ? అప్పుడేం చేశావు? అవును శ్రుతి చౌదరి చెప్పినట్టుగా ఎంతోమంది భ్రమలో పడి మోసానికి గురవుతున్నారు. తీరా ఆ విషయం గుర్తించే సరికి సమయం మించిపోవడంతో.. ఇలాంటి నెగటివిటీకి, సోకాల్డ్ పరువుకు భయపడి నోరు విప్పి నిజాలు చెప్పడం లేదు. చెబితే అప్పుడు అనుభవించిన శారీరక హింసకంటే కూడా... తనకు ఎదురవ్వబోయే మానసిక హింసను భరించడమెలాగో తెలియని భయం. ఎందుకంటే లైంగిక హింసకు గురైంది ఒక మహిళ అయితే, అత్యాచారానికి గురైంది ఓ ఆడపిల్ల అయితే సమాజం ఎప్పుడూ ఆమెను బాధితురాలిగా గుర్తించే కంటే.. ఏదో తప్పు చేసిన వ్యక్తులుగా చిత్రీకరించి ఆమెను మరింతగా కుంగదీసేందుకే ప్రయత్నిస్తోందనే భయం. కానీ శ్రుతి ఇలాంటివి చిన్న చిన్న విషయాలంటూ తేలికగా తీసుకుంది. అందరూ ఆమెలాగే ముందుకు వస్తే.. పశ్చాత్తాపం కంటే కూడా భయంతోనైనా అతడి లాంటి మేకతోలు వన్నె పులులు కాస్తైనా మారతాయనేది ఆమె ఉద్దేశం. ఒక్క శ్రుతిదే కాదు... భారత్‌లో మీటూ ఉద్యమాన్ని మొదలు పెట్టిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, దక్షిణాదిన ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న చిన్మయి శ్రీపాద వంటి వారి ఉద్దేశం కూడా ఇదేననేది మెజారిటీ వర్గాల అభిప్రాయం. వాళ్లే కదా జెంటిల్మెన్.. శ్రుతి పోస్టు ద్వారా చర్చనీయాంశంగా మారిన మరో అంశం వైవాహిక అత్యాచారం(మ్యారిటల్ రేప్). వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో శారీరక సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్ రేప్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ‘రేప్ కోసం బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్ రేప్‌ను వ్యతిరేకిస్తున్న ఓ పిటిషనర్ వాదించగా.. ఇన్ని చట్టాల్లో పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించిన తీరును పలువురు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. . మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభిప్రాయాన్ని.... రేప్ నిర్వచనం పూర్తిగా మారిపోయిందన్న విషయాన్ని గౌరవించాలంటున్నారు. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యతను ప్రతీ ఒక్కరు గుర్తించాలంటున్నారు. న్యాయం జరుగుతుంది కదా!! ‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చినపుడే న్యాయం జరుగుతుంది కదా’ - గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యూరోప్ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్ చేసిన వ్యాఖ్యలు -
‘వాళ్ల అమ్మ రమ్మంటేనే వెళ్లాను.. తను చాలా మంచిది’
గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన దుబాయ్ యువరాణి షికా లతీఫా ఇంటికి చేరుకున్నారన్న విషయం స్పష్టమైంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ హైకమిషనర్, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్సన్తో కలిసి లతీఫా భోజనం చేస్తున్న ఫొటోలను యూఏఈ అధికారులు ఇటీవల విడుదల చేశారు. ఈ నేపథ్యంలో లతీఫా మానసిక స్థితి గురించి రాబిన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బీబీసీ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ...‘ తమ కూతురు లతీఫా గురించి మాట్లాడాలని చెప్పి... దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మకతూమ్ భార్య హయా నన్ను వాళ్లింటికి ఆహ్వానించారు. కుటుంబ సమస్య గురించి చర్చించాలని చెప్పారు. నేను గమనించినంత వరకు లతీఫా దుర్భల మనస్తతత్వం కలది. అందుకే చాలా ఇబ్బందులు పడుతోంది. మొదట కుటుంబాన్ని విడిచి పారిపోవాలనుకుంది. కానీ ఇప్పుడు అందుకు తను పశ్చాత్తాపపడుతోంది. నేను తనతో కలిసి లంచ్ చేశాను. తను స్నేహ స్వభావం గల వ్యక్తి. అయితే ఆమెకు మానసిక చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తనకు సంబంధించిన ఏ విషయాన్నైనా ప్రపంచంతో పంచుకోవడానికి లతీఫా కుటుంబం సిద్ధంగా లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా యువరాణిగా పుట్టినందుకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడి, అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న లతీఫా ప్రయత్నాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో జీవించాలనుకున్న లతీఫా.. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన తన స్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్‌కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్ , మరో ముగ్గురు సిబ్బందితో కలిసి ఒక మరపడవలో గత ఫిబ్రవరిలో దుబాయ్ అధికారుల కళ్లుగప్పి పారిపోయారు. వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి14న భారత్‌లోని గోవా జలాల్లో ప్రవేశించింది. ఆ సమయంలో గోవాలోని భారత్ తీర ప్రాంత రక్షక దళం బలవంతంగా ఆ పడవలోకి ఎక్కి తుపాకులు చూపించి అందరినీ బెదిరించారని, యువరాణి షికా లతీఫాను బంధించి అప్పుడే హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న యూఏఈ అధికారులకు అప్పగించారని వార్తలు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని లతీఫా గతంలో రికార్డు చేసిన వీడియోను బ్రిటన్‌కు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. సోషల్ మీడియాలో హల్చల్ ‘నాకు స్వేచ్ఛ లేదు. సంకెళ్ల మధ్య జీవితాన్ని గడుపుతున్నాను. ఎక్కడికి వెళ్లినా నా వెంట ఒకరు ఉంటారు. నా కదలికల్ని అనుక్షణం గమనిస్తుంటారు. 2002లో కూడా ఒకసారి పారిపోవడానికి ప్రయత్నించా. కానీ సరిహద్దుల్లోనే నన్ను పట్టుకున్నారు. మూడేళ్ల పాటు గాలి, వెలుతురు కూడా రాని జైలులో పడేశారు. నా తండ్రికి కీర్తి ప్రతిష్టలంటే ఎనలేని మోజు. దాని కోసం ఎంతకైనా తెగిస్తాడు. మీరు ఈ వీడియో చూసే సమయానికి అయితే నేను చనిపోయి ఉంటాను. లేదంటే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాను. బహుశా ఇదే నా ఆఖరి వీడియో‘ అంటూ లతీఫా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆశ్రయం కోరి వచ్చిన లతీఫాను తిరిగి యూఏఈ పంపించడం ద్వారా భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరడంతో పాటుగా.. షికా లతీఫా ఎక్కడుందో బయట పెట్టి, ఆమె స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకోవాలంటూ యూఏఈని డిమాండ్ చేసింది. -
‘కాలం చెల్లిన చట్టాలను ఇకనైనా సవరించండి’
లండన్ : కాలం చెల్లిన చట్టాలను సవరించి ఇకనైనా లింగ వివక్షకు చరమగీతం పాడాలని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూరోపియన్ దేశాలకు విఙ్ఞప్తి చేసింది. మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని అభిప్రాయపడింది. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. ఐర్లాండ్, యూకే, బెల్జియం, సైప్రస్, జర్మనీ, ఐస్లాండ్, లక్సెంబర్గ్, స్వీడన్ మొదలగు ఎనిమిది దేశాలు మాత్రమే సమ్మతిలేని శృంగారాన్ని అత్యాచారంగా పరిగణిస్తున్నాయని తెలిపింది. మరో 31 యూరోపియన్ దేశాలు మాత్రం ఈ విధానాల్ని పాటించడం లేదని వెల్లడించింది. అత్యాచారం అనే పదానికి నిర్వచనం మార్చినపుడు మాత్రమే బాధితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. కాగా ‘ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ అగెనెస్ట్ వుమన్’ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యూరోపియన్ దేశాలకు ఈ విఙ్ఞప్తి చేసింది మీటూ లాంటి ఉద్యమాలు వచ్చిప్పటికీ... ‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యూరోప్ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
100 మంది హిందువుల ఊచకోత
యాంగూన్, మయన్మార్ : వందలాది మంది హిందువుల(మయన్మార్‌లో హిందువులు కూడా మైనారిటీలే)ను రోహింగ్యా మిలిటెంట్లు గతేడాది ఊచకోత కోసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆమ్నెస్టీ బుధవారం ఓ రిపోర్టును విడుదల చేసింది. మయన్మార్‌లో జాతుల(హిందువులు, రోహింగ్యాలు) మధ్య వైరాలను ఆమ్నెస్టీ రిపోర్టు తేటతెల్లం చేసింది. గతేడాది ఆగష్టు 25న పెద్ద ఎత్తున బౌద్ధులు, రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలపై విరుచుకుపడ్డారు. అదే రోజున రోహింగ్యా మిలిటెంట్లు సైతం హిందువుల ప్రాంతాలపై విరుచుకుపడి నరమేధం సృష్టించినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. ఈ ఘటన వల్లే మయన్మార్ సైన్యం రంగంలోకి దిగిందని, దీంతో 7 లక్షల మంది రోహింగ్యాలు దిక్కతోచని స్థితిలో పొరుగుదేశాలకు వలస బాట పట్టారని వివరించింది. రోహింగ్యా జాతిని అంతమొందించేందుకు బర్మా సైన్యం వారిపై పౌరుల హత్య, గ్రామాలకు నిప్పుపెట్టడం వంటి ఆరోపణలు చేసిందని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, రోహింగ్యా మిలిటెంట్లపై సైతం పలు ఆరోపణలు ఉన్నట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. హిందువుల కుటుంబాలపై దాడులు జరిపిన రోహింగ్యా మిలిటెంట్లు 53 మందిని ఉరి తీసినట్లు వెల్లడించింది. రఖైన్ రాష్ట్ర ఉత్తరభాగాన ఉన్న ఓ శ్మశానవాటికలో హిందువుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ(ఏఆర్ఎస్ఏ) పేర్కొంది. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది రోహింగ్యా మిలిటెంట్లేనని ఆమ్నెస్టీ పరిశోధనలో తేలింది. మరో గ్రామంలో కూడా 46 మంది హిందువులు మిస్సయ్యారని వారిని ఏఆర్ఎస్ఏ మిలిటెంట్లే హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చదవండి : 400 మంది ముస్లింలు ఊచకోత -
చెరసాలలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
టర్కీ ప్రభుత్వం ఆమ్నెస్టీ కార్యకర్తలపై మోపిన ఉగ్రవాద కేసు ఉత్త డొల్ల. విచారణను చూస్తే తీర్పు సత్యానికి అనుకూలంగా వస్తుందనిపించింది. కానీ తనెర్కు బెయిల్‌ను నిరాకరించారని విని నిర్ఘాంతపోయాం. చాలా ఏళ్లుగా నేను కోర్టు విలేకరిగా పని చేస్తున్నా మానవహక్కులు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకోసం పోరాడుతున్నవారిని ఇంత నిస్సిగ్గుగా అణచివేయడాన్ని ఎన్నడూ చూడలేదు. నేనీ వ్యాసాన్ని టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి రాస్తున్నాను. ఇక్కడి కోర్టులోని ఉగ్రవాద సంబం«ధమైన ఒక కేసు విచారణకు పరిశీలకునిగా నేను వచ్చాను. అంత ర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ టర్కీ శాఖ చైర్‌పర్సన్‌కు, డైరెక్టర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విచారణ అది. నేను కూడా ఈ అంతర్జాతీయ ఉద్యమంలో భాగంగా ఉన్నానని, ఆమ్నెస్టీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌నని పాఠ కుల్లో కొందరికి తెలిసి ఉండొచ్చు. ఇదిల్ ఆసెర్, తనెర్ కిలిక్ అనే నా సహచరులు ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులనే ఆరోపణతో ఆ విచారణ జరుగుతోంది. కొన్ని వారాల క్రితం బెయిల్ లభించిన ఇదిల్ను కోర్టు బయట కలుసుకున్నాను. తనెర్, జూన్ నుంచి ఇస్తాంబుల్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని ఇజ్మిర్ జైల్లో బందీగానే ఉన్నాడు. అక్కడి నుంచే అతడు వీడియో లింకు ద్వారా విచారణలో పాల్గొన్నాడు. డిజిటల్ భద్రతపై ఒక హోటల్లో జరిగిన వర్క్‌షాప్‌కు ఈ కార్యకర్తలిద్దరూ హాజరైన తర్వాత వారిపై ఈ ఆరోపణలను మోపారు. ఆ హోటల్ జరిగినది, గూఢ చార కార్యకలాపాలు, కుట్రలో పాల్గొనడం కోసం జరిపిన రహస్య సమావేశమని ప్రభుత్వం మూర్ఖంగా వాదిస్తోంది. జర్మనీ, స్వీడన్లకు చెందిన ఇద్దరు విదేశస్తులు కూడా ఈ వ్యవహారంలో విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే వారు బెయి ల్‌పై బయటే ఉన్నారు. ఈ కేసు మొత్తంగా ఉత్త డొల్ల. తన ఫోన్లోకి బైలాక్ అనే ఒక ఆప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడనేది తనెర్పై మోపిన ప్రధాన ఆరోపణ. ఎన్క్రిప్టెడ్ (నిక్షిప్త) సమాచార మార్పిడికి వాడే ఆప్ (వాట్సాప్ లాంటిది) అది. గత ఏడాది తిరుగుబాటుకు జరిగిన కుట్రకు ముందు, దాని మద్దతుదార్లు రహస్య సమాచా రాన్ని చేరవేయడానికి బైలాక్ను ఉపయోగించారని ప్రభుత్వ అరోపణ. తనెర్ ఆ ఆప్‌ను వాడాడనే ఆరోపణకు ఎలాంటి ఆధారమూ లేదు. ఆమ్మెస్టీ తనెర్ ఫోన్‌ను రెండు సార్లు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. రెండూ ఆ ఫోన్లో బైలాక్ ఉనికికి సంబంధించిన ఆనవాళ్లు సున్నా అన్ని తేల్చాయి. ఈ పరీక్షల్లో ఒకటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థ సెక్యూర్ వర్క్స్ నిర్వహించినది. కోర్టు విచారణలో ఒక నిపుణుడు ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆ రోజు ఉదయాన్నే మేం జస్టిస్ ప్యాలెస్ అని పిలిచే ఆధునిక వర్తులాకార భవనం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాం. ఆ భవనంలో చాలా కోర్టు గదు లున్నాయి. విపరీతంగా చలి, గాలులు ఉన్నా, మా నిరసనకు పలు పౌర సమాజ బృందాలు, వ్యక్తులు హాజరయ్యారు. విదేశీ పరిశీలకులలో ఆమ్నెస్టీ బ్రెజిల్, బ్రిటన్ శాఖల చైర్పర్సన్లు, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి దౌత్యవే త్తలు కూడా ఉన్నారు. ఆ మానవహక్కుల పరిరక్షకులకు మద్దతుగా చేసిన ప్రకట నను చదివి వినిపించారు. మాతోపాటూ తనెర్ 19 ఏళ్ల కుమార్తె గుల్నిహల్ కూడా ఉంది. మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. కోర్టులో లాయర్లు తదితర అధికా రులుగాక, 120 మంది పడతారు. గదంతా నిండిపోగా, చాలా మంది బయట నిల బడాల్సి వచ్చింది. కోర్టులో ముగ్గురు న్యాయమూర్తులున్నారు. వారికి ఒక పక్కన ప్రాసిక్యూటర్ కూడా కూర్చొని ఉండటం అసక్తికరంగా ఆనిపించింది. ఆరు గంట లకుపైగా సాగిన ఆ విచారణలో అతను ఒకే ఒక్క సారి, అదీ కొద్ది సేపే మాట్లాడాడు. ఎక్కువ సమయం తీసుకున్నది తనెర్ తర ఫు న్యాయవాదే. డిఫెన్స్ తరఫున నిపుణుడైన సాక్షి బైలాక్ ఆప్ సమస్య గురించి వివరంగా మాట్లాడాడు. తనెర్ ఫోన్ లోని సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేసుకున్నాక పోలీసులు తిరిగి ఇచ్చేశారు. తనెర్ ఎన్నడూ బైలాక్ను డౌన్లోడ్ చేసుకుని ఉండే అవకాశమే లేదని అతను నిర్ధారించాడు. కుట్ర యత్నం తర్వాతి వరకు తాను బైలాక్ గురించి వినలేదని తనెర్ సాక్షిగా చేసిన ప్రక టనలో తెలిపాడు. అయినా. మొదటి విచారణలో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు. ఆ విచారణ పూర్తయ్యాక నా సహచరుడు జాన్ డల్ హూసెన్ ‘‘ఏ ఆధా రాలూ లేకుండా రావడానికి ప్రాసిక్యూటర్‌కు మూడు నెలలకు పైగా పట్టింది. ఈ కేసును కొట్టి పారేయడానికి న్యాయమూర్తికి అరగంట కూడా పట్టదు’’ అన్నాడు. కానీ కేసును కొట్టేయలేదు. నేను ఇప్పుడు వర్ణిస్తున్నది రెండో దఫా విచా రణనే. మధ్యలో కూచున్న సీనియర్ న్యాయమూర్తి, నిపుణుణ్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. విచారణ జరుగుతున్నంత సేపూ సత్యానికి అనుకూలంగానే తీర్పు వస్తుందనే మాకు అనిపించింది. విచారణంతా టర్కిష్ భాషలోనే జరిగింది. నిపుణుడు చెప్పిన సాక్ష్యం కలిగించిన ప్రభావం ఎలాంటిదో అంచనా వేయడం కష్టం కాలేదు. తనెర్ సూటిగా, ఉద్వేగరహితంగా తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేనందున బెయిల్‌పై తనను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు. రోజంతటిలో ప్రాసిక్యూటర్ మాట్లాడిన ఏకైక వాక్యాన్ని విన్నాం. ప్రభుత్వం బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నది అని చెప్పాడు. ఆరు గంటలకు పైగా సాగిన విచారణ తర్వాత న్యాయవాదులు, నిందితులు తప్ప మిగతా అంతా ఖాళీ అయిపోయింది. మమ్మల్ని బయట వేచి ఉండమ న్నారు. ఆ తర్వాత బెయిల్ నిరాకరించారని మాకు చెప్పారు. ఆ వార్త మాకు అందరికీ దిగ్భ్రాంతిని కలుగచేసింది, చిన్న పిల్ల గుల్నిహల్ ఆ మాటకు గుండె చెదిరిపోయింది. చాలా ఏళ్లుగానే నేను కోర్టు విలేకరిగా పనిచేస్తున్నా మానవ హక్కుల కోసం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదంతో ముడి పెట్టి ఇంత నిస్సిగ్గుగా అణచివేయడాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదు. మన ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధిని పంపి ఉంటే బావుండేదని నా అభిప్రాయం. తదుపరి విచారణకైనా అ పనిచేస్తారని ఆశిస్తాను. ఇది, టర్కీతో మనం తప్పక ప్రస్తావించాల్సిన సమస్య. ఒక భారతీయునిగా, చరిత్ర విద్యార్థిగా నాకు టర్కీలో జరిగింది నిరుత్సాహం కలిగించింది. వెయ్యేళ్ల క్రితం తురుష్కులు మన దేశానికి రావడానికి ముందు నుంచీ టర్కీ ప్రజలతో మనకు సాంస్కృతిక సంబంధాలున్నాయి. మన దేశ ముస్లిం పాల కులలో పలువురు టర్కీకి చెందినవారు. మొహమ్మద్ గజినీ తురుష్క మూలాలు న్నవాడు. బాబర్, చంగ్తార్ తురుష్కుడు. మైసూర్ పాలకుడు టిప్పు కూడా తన పూర్వీకులు తురుష్కులేనని తనను ‘సుల్తాన్’గా పిలిపించుకునేవాడు. అటువంటి గొప్ప, సుప్రసిద్ధులైన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే టర్కీ ప్రభుత్వం నా సహచ రులపై విచారణను మరింత మెరుగైన పద్ధతిలో నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను. నా సహచరులు టర్కీ ప్రజల హక్కుల కోసం, వారి బాగు కోసం పనిచేస్తున్నవారు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘ aakar.patel@icloud.com -
చైనా ఫస్ట్.. టాప్-5 నుంచి అమెరికా అవుట్!
మరణశిక్షలు అమలు చేయడంలో చైనా ముందు ఉంది. గతేడాది చైనాలో వెయ్యి మందికి పైగా ఉరి తీశారని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 1,032 మందికి మరణ దండన విధించినట్టు తెలిపింది. 2015తో పోలిస్తే గతేడాది మరణశిక్షలను అమలు చేయడంలో 37 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొంది. మరణశిక్షల్లో 90 శాతం చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, పాకిస్తాన్ లోనే అమలవుతున్నాయన్న చేదు నిజాన్ని బయటపెట్టింది. ఆశ్చర్యకరంగా 2006 తర్వాత అమెరికా టాప్-5 నుంచి తప్పుకుంది. గతేడాది అగ్రరాజ్యంలో 20 మందికి మరణశిక్ష అమలు చేసినట్టు ఆమ్నెస్టీ తెలిపింది. 1991 తర్వాత అతి తక్కువ గణాంకాలు నమోదు కావడం ఇదే తొలిసారని వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పాకిస్తాన్ లో నిరుడు ఉరిశిక్షల అమలు గణనీయంగా తగ్గింది. 2015లో పాకిస్తాన్ లో 326 మందిని ఉరి తీయగా గతేడాది ఈ సంఖ్య 87కు పరిమితమైంది. 2014, డిసెంబర్ లో పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబాన్ల దాడి తర్వాత మరణశిక్షపై ఏడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయడంతో 2015లో ఉరిశిక్షల అమలు పెరిగింది. ఇరాన్ లోనూ ఉరిశిక్షలను అమలు చేయడం గణనీయంగా తగ్గింది. దీనికి గల కారణాలు వెల్లడించలేదు. ప్రపంచ దేశాలన్నిటీలో అమలైన వాటికంటే చైనాలో విధించబడ్డ మరణదండనలే ఎక్కువని ఆమ్నెస్టీ తెలిపింది. చైనాలో ఉరిశిక్షల అమలుకు సంబంధించి అధికార గణాంకాలు లేవని పేర్కొంది. -
ముజఫర్‌నగర్ అత్యాచారాలపై ఆమ్నెస్టీ నివేదిక
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 2013 నాటి అల్లర్ల సమయంలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాలపై జరుగుతున్న విచారణలో జాప్యం.. బాధితుల దయనీయ స్థితిని తెలియజేస్తోందంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత విభాగం గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. ‘లాసింగ్ ఫెయిత్: ద ముజఫర్‌నగర్ గ్యాంగ్‌రేప్ సరై్వవర్స్’పేరుతో తీసుకువచ్చిన ఈ నివేదిక, మహిళలను దాడుల నుంచి రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ఆ తర్వాత కేసుల విచారణ స్థితి గురించి బాధితులకు సమాచారం అందించడంలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆక్షేపించింది. మత, కుల ఘర్షణల్లో మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు కావడం ఇదే తొలిసారి కాబట్టి, ఈ కేసులను ప్రభుత్వమే నీరుగారుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. -
ఆ జైలులో 13 వేల మందికి దారుణ ఉరి
టెర్రరిస్టులకన్నా దారుణ హత్యలు లండన్ : సిరియాలో టెర్రరిస్టులు సాగిస్తున్న దారుణ మారణకాండ గురించే ఇంతవరకు మనం విన్నాం. వీడియోల్లో చూశాం. అంతకంటే దారుణాతి దారుణంగా బయటి ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వ ప్రోద్బలంతో సాగించిన మూకుమ్మడి మానవ హననానికి సంబంధించిన ఘోర కత్యాల గురించి ఇప్పుడు ‘ఆమ్నెస్టి ఇంటర్నేషనల్’ వెలుగులోకి తెచ్చింది. ఆ జైలులో రోజూ అర్ధరాత్రి పూట యాభై నుంచి అరవై మంది ఖైదీలను విచారణ పేరిట బయటకు ఎక్కడికో తీసుకెళతారు. వారు ఎప్పటికి తిరిగిరారనే విషయం తోటి ఖైదీలతోపాటు అక్కడి వారందరికి తెల్సిందే. ఎవరికి వారు మనసులో వారి ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటారే తప్ప, ఏమీ అనలేని నిస్సహాయ పరిస్థితి వారిది. అసలా అర్ధరాత్రి బయటకు వెళ్లినవారు ఏమవుతున్నారో తెలుసుకునేందుకు ఆమ్మెస్టీ జరిపిన దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగుచూశాయి. ఖైదీలను చీకటి బ్యార క్స్‌లోకి తీసుకెళతారు. మెడలకు తాడేసి ఉరి తీస్తారు. అప్పటికే సరైన తిండీ, నిద్ర లేక బక్కచిక్కిన ఖైదీల శరీరాలు వేలాడదీసిన ఎక్కువ సందర్భాల్లో వారి ప్రాణంపోదు. అలాంటి సమయంలో గార్డులు ఆ జీవచ్ఛవాలను బలంగా పట్టుకొని కిందకు లాగుతారు. అప్పుడు వారి తలల నుంచి మొండాలు ఊడిపోయి వస్తాయి. వాటికి తీసుకెళ్లి సామూహికంగా చీకట్లో ఖననం చేస్తారు. తమను ఇంత దారుణంగా ఉరితీస్తారన్న విషయం ఖైదీలకుగానీ, వారు ఏమయ్యారోనన్న విషయం వారి కుటుంబాలకు కూడా ఎప్పటికీ తెలియదు. రాత్రి పూట తీసే ఉరివల్ల ఒక్కసారే ప్రాణం పోతుంది. కానీ జైలు ఊచల గదుల్లో వారు క్షణం క్షణం మరణ వేదనను అనుభవించాల్సిందే. ఖైదీలను సైనికులే రేప్ చేస్తారు. తోటి ఖైదీలతోనీ రేప్ చేయిస్తారు. కర్రలు, రాడ్లతో చితకబాది రక్తం కక్కిస్తారు. రక్తం గడ్డకట్టిన, మురికితో కంపుకొడుతున్న నేలపైనే ఇన్ని మెతుకులేసి తినమని హుకుం జారీ చేశారు. తినకపోతే కొడతారు, తంతారు. పొద్దున లేవగానే విజిల్స్ వేసుకుంటూ సైనికులొస్తారు. ‘ఆ ఈ రోజు ఎంత మంది చచ్చార్రా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా!’ అంటూ ఖైదీలను ప్రశ్నిస్తారు. చనిపోయిన వారి శవాలను ట్రక్కులో చెత్తను మోసుకెళ్లినట్లు మోసుకెళతారు. ఇలా 2011 నుంచి 2015 సంవత్సరాల మధ్య 13వేల మందిని దారుణంగా హింసించి, ఉరితీసి చంపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. డమస్కస్ నగారానికి 30 కిలోమీటర్ల దూరంలోని సయద్నాయ జైలులో జరిగిన ఈ దారుణాల గురించి మాజీ జడ్జీలు, మాజీ జైలు గార్డులు, తోటి ఖైదీలు సహా 84 మంది ప్రత్యక్షసాక్షుల ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ సమాచారాన్ని సేకరించింది. ఇంతకుముందు దేశవ్యాప్తంగా 17,500 మందిని అన్యాయంగా ఉరితీశారన్ని ఆమ్నెస్టీ లెక్కవేసింది. ఇప్పుడు ఒక్క జైలులోనే 13వేల మందిని ఉరితీయడం గురించి తెలియడంతో తమ అంచనాలు సరిచేసుకోవాల్సి ఉందని ఆమ్నెస్టీ అభిప్రాయపడింది. జైలు శిక్ష అనుభవిస్తున్నవారు, ఇలా దారుణంగా ఉరిశిక్షకు గురైన వారు టెర్రరిస్టులుకాదు, కరుడుకట్టిన నేరస్థులుకాదు. వారిలో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనను వ్యతిరేకిస్తున్న దేశ పౌరులు ఎక్కువ ‘ఖైదీలను ఉరి తీసినప్పుడు వారి బరువు సరిపోక ప్రాణం పోకపోతే గార్డులు వారి మోకాళ్లు పట్టుకొని కిందకు లాగేవారు. అలా లాగినప్పుడు కొన్నిసార్లు వారి మెడల నుంచి మొండాలి ఊడి వచ్చేవి. ఇలాంటివి నేను కళ్లారా చూశాను’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ మాజీ జడ్జీ ఆమ్నెస్టీ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ జైలుకు మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేసే వారని, ఖైదీలెవరూ ఎవరితో మాట్లాడకూడదని, గార్డులు వచ్చినప్పుడు ఎలాంటి పొజిషన్స్‌లో ఉండాలో కూడా నిబంధనలు ఉండేవని పదవి విరమణ చేసిన ఓ జైలు అధికారి తెలిపారు. రోజూ తిండీ తిప్పలు లేక, చిత్ర హింసలకు గురై ఇద్దరు, ముగ్గురు చనిపోయేవారని, ఒకటో నెంబర్ సెల్లో ఎంత మంది చనిపోయారు, రెండో నెంబర్ సెల్లో ఎంత మంది చనిపోయారంటూ గార్డులు తోటి వారిని ప్రశ్నించడం తాను వినేవాడినని జైలు నుంచి విడుదలైన నాదల్ తెలిపారు. ‘జైలు కింది గదుల్లో ఖైదీల మెడ నరాలు తెగిన శబ్దాలు, ప్రాణం పోతున్న మూలుగు వినిపించేది’ అని హమీద్ అనే మాజీ సైనికాధికారి తెలిపారు. తాము నివేదికలో పేర్కొన్న పేర్లు అసలు పేర్లుకాదని, వారి నిక్‌నేమ్‌లని, అసలు పేర్లు బయట పెట్టొద్దనే షరతుపైనే వారు ఈ విషయాలు వెల్లడించారని ఆమ్నెస్టీ తెలిపింది. ఆమ్నెస్టీ ఇంటర్వ్యూ చేసిన 84 మందిలో న్యాయవాదులు కూడా ఉన్నారు. ఈ దారుణాలు ఇప్పటికీ కొనసాగుతుండవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 2011లోనే దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమై అది అంతర్యుద్ధానికి దారితీసిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో నాలుగు లక్షల మంది ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి లెక్కలు తెలియజేస్తున్నాయి. -
సైన్యాన్ని కించపరిచారని కశ్మీరీ యువకులపై కేసు
భారత సైన్యాన్ని కించపరిచేలా కొందరు యువకులు చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని జే.సీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ బెంగళూరులోని థియోలాజికల్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొంతమంది యువకులు ‘కాశ్మీర్‌లోని భారత సైన్యం వల్ల అక్కడి పండిట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే భారత సైన్యం అక్కడి నుంచి వెళ్లి పోవాలి’ అని నినదించారు. దీంతో అక్కడ కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఈ ఘటనపై ఏబీవీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా వాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొంటూ జే.సీ నగర్లో ఆదివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, భారత సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యాలను చేసింది బెంగళూరులో ఉంటూ చదువుకుంటున్న కొంతమంది కాశ్మీర్ యువకులని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన కాశ్మీర్ యువత ఇలాంటి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని రాజ్యసభ విపక్ష నేత గులాంనబీఆజాద్ ఢిల్లీలో వాఖ్యానించారు. -
'టర్కీ తిరుగుబాటుదారులను రేప్ చేస్తున్నారు'
లండన్: ప్రభుత్వంపై తిరుగుబాటుకు విఫలయత్నం చేసిన వారిని టర్కీ ప్రభుత్వం క్రూరంగా హింసిస్తోందా.. అవుననే అంటోంది అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. సైనిక తిరుగుబాటులో సహకరించిన 13,165 మందిని ఇప్పటివరకు టర్కీ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వీరిలో సైనిక అధికారులు, లాయర్లు, జడ్జీలు, పోలీసు అధికారులు, పౌరులు ఉన్నారు. అయితే.. వీరందరిపట్ల టర్కీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని ఆమ్నెస్టీ వెల్లడించింది. అదుపులోకి తీసుకున్న వారికి అహారం అందించకుండా, తీవ్రంగా కొడుతూ.. కొందరిపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆమ్నెస్టీ సంస్థ సోమవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, మానవహక్కులను కాలరాయొద్దని ఆ సంస్థ టర్కీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ఇవాళ ప్రభుత్వ మద్దతుదారులు రాజధాని ఇస్తాంబుల్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బంధీలను తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన విషయాలను టర్కీ ప్రభుత్వం తోసిపుచ్చింది. మానవహక్కులను కాలరాసే పనులను తమ ప్రభుత్వం చేయడంలేదని టర్కీ అధికారులు వెల్లడించారు. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం చూస్తున్న తమ దేశం అనుచిత చర్యలకు పాల్పడదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. -
శరణార్థుల పయనం ఎటువైపు..?
ప్రపంచ దేశాలలో ముఖ్యమైన సమస్యల్లో వలస ఒకటని చెప్పవచ్చు. కొన్ని దేశాల వారు బతుకుదెరువు కోసం వలస వెళతారు. మరికొన్ని దేశాల ప్రజలు రక్షణ కరువైందని శరణార్థులుగా మారతారు. ఏది ఏమైతేనేం.. పొరుగు గడ్డకు పరుగులు తీయడం మాత్రం తప్పనిసరిగా మారింది. అయితే పొరుగు దేశాల ప్రజలు తమ దేశంలో ప్రవేశిస్తే తమ ఉద్యోగ, పని అవకాశాలు దెబ్బతింటాయని చాలా దేశాల అధినేతలతో సహా ప్రజలు భావిస్తుంటారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ శరణార్థులపై ఓ సర్వే నిర్వహించింది. శరణార్థులుగా వచ్చిన వారు ఉద్యోగాలు తెచ్చుకుని వలస దేశాలలో జీవనం కొనసాగించడం, వారి స్థితిగతులు మెరుగుపడుతున్నాయా అనే ఇతర ముఖ్యమైన అంశాలపై ఈ సర్వేలో కొన్ని వాస్తవాలు వెల్లడయ్యాయి. శరణుకోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటున్న దేశాలలో 85 పాయింట్లతో చైనా అగ్రస్థానం ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ(2), యూకే(3), కెనడా(4), ఆస్ట్రేలియా(5), స్పెయిన్(6), గ్రీస్(7), జోర్డాన్(8), అమెరికా(9), చిలీ(10) ఉండగా.. భారత్ 12వ స్థానంలో నిలిచింది. ప్రతి వంద మందిలో 80పైగా వ్యక్తులకు ఆశ్రయమిస్తున్న దేశాలు కేవలం మూడు మాత్రమే ఉండటం గమనార్హం. -
12 నెలల్లో 175 మందికి ఉరి
దుబాయి : గడిచిన 12 నెలల్లో దాదాపు 175 మందికి సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరి శిక్ష వేసింది. ఈ మేరకు ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ మంగళవారం వెల్లడించింది. అందుకు సంబంధించి కిల్లింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జస్టిస్ : ద డెత్ పెనాల్టీ ఇన్ సౌదీ అరేబియా పేరిట 43 పేజీల పేజీల నివేదికను ఈ సందర్భంగా విడుదల చేసింది. 1985 జనవరి నుంచి 2015 జూన్ వరకు 2,208 మందికి దేశంలో ఉరిశిక్షను అమలు చేసినట్లు అందులో పేర్కొంది. అయితే ఉరిశిక్ష పడిన ప్రతి ఒక్కరి పేరు ఆ నివేదకలో పొందుపరచబడిందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 109 మందికి ఉరిశిక్షలు అమలయ్యాయని పేర్కొంది. అదే 2014 సంవత్సరంలో ఇదే కాల వ్యవధిలో 83 మందికి ఉరిశిక్ష పడినట్లు తెలిపింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అత్యాచారాలు, హత్యలను సౌదీ అరేబియా ఉక్కుపాదంతో అణివేసేందుకు కఠినతరమైన శిక్షలు అమలు చేస్తున్న విషయం విదితమే.