చైనా ఫస్ట్.. టాప్-5 నుంచి అమెరికా అవుట్!
మరణశిక్షలు అమలు చేయడంలో చైనా ముందు ఉంది. గతేడాది చైనాలో వెయ్యి మందికి పైగా ఉరి తీశారని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 1,032 మందికి మరణ దండన విధించినట్టు తెలిపింది. 2015తో పోలిస్తే గతేడాది మరణశిక్షలను అమలు చేయడంలో 37 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొంది. మరణశిక్షల్లో 90 శాతం చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, పాకిస్తాన్ లోనే అమలవుతున్నాయన్న చేదు నిజాన్ని బయటపెట్టింది.
ఆశ్చర్యకరంగా 2006 తర్వాత అమెరికా టాప్-5 నుంచి తప్పుకుంది. గతేడాది అగ్రరాజ్యంలో 20 మందికి మరణశిక్ష అమలు చేసినట్టు ఆమ్నెస్టీ తెలిపింది. 1991 తర్వాత అతి తక్కువ గణాంకాలు నమోదు కావడం ఇదే తొలిసారని వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పాకిస్తాన్ లో నిరుడు ఉరిశిక్షల అమలు గణనీయంగా తగ్గింది. 2015లో పాకిస్తాన్ లో 326 మందిని ఉరి తీయగా గతేడాది ఈ సంఖ్య 87కు పరిమితమైంది. 2014, డిసెంబర్ లో పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబాన్ల దాడి తర్వాత మరణశిక్షపై ఏడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయడంతో 2015లో ఉరిశిక్షల అమలు పెరిగింది.
ఇరాన్ లోనూ ఉరిశిక్షలను అమలు చేయడం గణనీయంగా తగ్గింది. దీనికి గల కారణాలు వెల్లడించలేదు. ప్రపంచ దేశాలన్నిటీలో అమలైన వాటికంటే చైనాలో విధించబడ్డ మరణదండనలే ఎక్కువని ఆమ్నెస్టీ తెలిపింది. చైనాలో ఉరిశిక్షల అమలుకు సంబంధించి అధికార గణాంకాలు లేవని పేర్కొంది.