executions
-
ఉరితో రేప్‌లకు చెక్!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు భారత రాష్ట్రపతి కూడా తిరస్కరించడంతో నలుగురుకి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా నిర్భయ తల్లి ఆశాదేవీని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. నేరస్థులకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ గత ఏడేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున ఆశాదేవీ క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదు. పైపెచ్చు ఉరిశిక్ష వల్ల తనకు న్యాయం జరిగిందంటూ ఆమె సంతప్తి కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. రేప్‌లకు ఉరిశిక్షలు అమలు చేయాలంటూ ఆందోళనలు చేస్తున్న సామాజిక కార్యకర్తలంతా స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలు కూడా జరుపుకోవచ్చు. అసలు ఉరిశిక్షల వల్ల మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయా ? అన్నది ప్రస్తుతం ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. నిర్భయ అత్యాచారం, హత్య సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగిన నేపథ్యంలో దారుణమైన అత్యాచార సంఘటనల్లో ఉరిశిక్షలు విధించేందుకు వీలుగా కేంద్రం 2013లో చట్ట సవరణ తీసుకొచ్చింది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం 2015 నుంచి 2017 మధ్య దేశంలో 31 శాతం మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. ఎక్కువ కేసుల్లో మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం హత్యలు చేశారు. ఇది అంతకుముందు చాలా అరుదుగా జరిగేది. బాధితురాలు బతికుంటే తమకు మరణ శిక్షలు పడే అవకాశం ఉందన్న భావంతోనే ఈ హత్యలు జరిగాయని న్యాయ నిపుణులు విశ్లేషించారు. వీటికన్నా అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగితేనే సానుకూల ప్రభావం ఉంటుందని, శిక్షలు కఠినం అవుతున్న కొద్దీ విచారణ ప్రక్రియ చాలా జాప్యం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2018లో జరిగిన అత్యాచార కేసుల్లో 85 కేసుల్లో చార్జిషీట్లు నమోదు కాగా, వాటిలో శిక్షలు పడేవరకు వెళ్లిన కేసులు కేవలం 27 శాతం మాత్రమే. పైగా అత్యాచార కేసుల్లో నేరస్థులు ఎక్కువగా పరిచయస్థులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారే ఉంటున్నారు. అపరిచితులు తక్కువగా ఉంటున్నారు. పరిచయస్థులు కనక కేసులవుతే మరణ శిక్షలు ఖాయమనుకొని సాక్ష్యాధారాల నిర్మూలనలో భాగంగా మహిళలను ఎక్కువగా హత్య చేస్తున్నారని సామాజిక విశ్లేషకులు తెలిపారు. నిర్భయ లాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు భావోద్వేగాలకు గురై కఠిన చట్టాల కోసం ఆందోళనలకు దిగడం సహజం. ప్రజల భావోద్వేగాలకు అనుకూలంగా న్యాయ నిర్ణేతలు చట్టాలు తీసుకరావడం ప్రమాదకరం. కఠిన చట్టాలే పరిష్కారమైతే నిర్భయ చట్టం తర్వాత హైదరాబాద్‌లో ‘దిశ’ దారుణ అత్యాచార, హత్య సంఘటన జరిగి ఉండేది కాదు. మరణ శిక్ష పడుతుందనే భయాందోళనలతోనే ఆ కేసులో నేరస్థులు దిశను కాల్చివేశారు. చదవండి : దోషులను క్షమించడమా... ఆ ప్రసక్తే లేదు! ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం -
అమెరికాలో మళ్లీ మరణశిక్షలు
వాషింగ్టన్: దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది. అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ ఓ ప్రకటన చేస్తూ, ‘నీచమైన నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని న్యాయ శాఖ ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలను కూడా కోరుతూ వచ్చింది. చట్టాలు సరిగ్గా అమలయ్యేలా న్యాయ విభాగం చూస్తుంది. బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఆ విభాగంపై ఉంది’ అని తెలిపారు. మరణ శిక్షలను అమలు చేయాలంటూ జైళ్ల శాఖను విలియం ఇప్పటికే ఆదేశించారు. అమెరికాలో మరణశిక్ష అంటే మన దగ్గరలా ఉరిశిక్ష విధించకుండా, విషపూరిత మందులు ఇచ్చి నేరస్తులు చనిపోయేలా చేస్తారు. -
చైనా ఫస్ట్.. టాప్-5 నుంచి అమెరికా అవుట్!
మరణశిక్షలు అమలు చేయడంలో చైనా ముందు ఉంది. గతేడాది చైనాలో వెయ్యి మందికి పైగా ఉరి తీశారని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 1,032 మందికి మరణ దండన విధించినట్టు తెలిపింది. 2015తో పోలిస్తే గతేడాది మరణశిక్షలను అమలు చేయడంలో 37 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొంది. మరణశిక్షల్లో 90 శాతం చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, పాకిస్తాన్ లోనే అమలవుతున్నాయన్న చేదు నిజాన్ని బయటపెట్టింది. ఆశ్చర్యకరంగా 2006 తర్వాత అమెరికా టాప్-5 నుంచి తప్పుకుంది. గతేడాది అగ్రరాజ్యంలో 20 మందికి మరణశిక్ష అమలు చేసినట్టు ఆమ్నెస్టీ తెలిపింది. 1991 తర్వాత అతి తక్కువ గణాంకాలు నమోదు కావడం ఇదే తొలిసారని వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పాకిస్తాన్ లో నిరుడు ఉరిశిక్షల అమలు గణనీయంగా తగ్గింది. 2015లో పాకిస్తాన్ లో 326 మందిని ఉరి తీయగా గతేడాది ఈ సంఖ్య 87కు పరిమితమైంది. 2014, డిసెంబర్ లో పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబాన్ల దాడి తర్వాత మరణశిక్షపై ఏడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయడంతో 2015లో ఉరిశిక్షల అమలు పెరిగింది. ఇరాన్ లోనూ ఉరిశిక్షలను అమలు చేయడం గణనీయంగా తగ్గింది. దీనికి గల కారణాలు వెల్లడించలేదు. ప్రపంచ దేశాలన్నిటీలో అమలైన వాటికంటే చైనాలో విధించబడ్డ మరణదండనలే ఎక్కువని ఆమ్నెస్టీ తెలిపింది. చైనాలో ఉరిశిక్షల అమలుకు సంబంధించి అధికార గణాంకాలు లేవని పేర్కొంది. -
ప్రశ్నిస్తే రాజద్రోహమా?
సాక్షి, సిటీబ్యూరో: ఉరిశిక్షలు వద్దన్నందుకు.. భావ ప్రకటనా స్వేచ్ఛ కావాలన్నందుకు... హింసను ఖండించినందుకు... మతోన్మాదాన్ని ప్రశ్నించినందుకు దేశంలో రాజద్రోహ నేరం మోపుతున్నారని జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజద్రోహ నేరం కింద ఎవరినైనా అరెస్టు చేయాలంటే ముందుగా స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుంటున్న వారిని చేయాలన్నారు. ‘రాజకీయ ఖైదీల హక్కుల దినం’ సందర్భంగా కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్’ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. బ్రిటిష్ వారు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తెచ్చిన చట్టాలను ఈనాడు మన దేశ ప్రజలపైనే ప్రయోగించడం అన్యాయమన్నారు. సీఆర్పీపీ కార్యదర్శి బల్ల రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.వై.రత్నం మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛకు, మేథో వికాసానికీ పునాదిగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు మతోన్మాద శక్తుల చేతిలో బందీలుగా మారాయన్నారు. ఫాసిస్టు శక్తులు విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించి అధ్యాపకులు, విద్యార్థుల గొంతు నొక్కేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాలిని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న హింస బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేసేందుకు ఎన్కౌంటర్ల పేరుతో‡కట్టు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. గ్రీన్‌హంట్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నదంతా ఇదేనని అన్నారు. విరసం నాయకులు వరవరరావు మాట్లాడుతూ రాజకీయ ఖైదీల హక్కుల కోసం జైళ్లలోనూ.. బయట జరుగుతున్న ఉద్యమాలను పాలకులు ఎంతోకాలం అణచలేరని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మౌలానా నసీరుద్దీన్, సిఎల్సి నారాయణ, చైతన్య మహిళా సంఘం సావిత్రి తదితరులు మాట్లాడారు. -
ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు?
న్యూఢిల్లీః ఇండియాలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీవలి కాలంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ అమిర్ కసబ్, పార్లమెంట్ దాడుల్లో కీలక నిందితుడైన అఫ్జల్ గురు కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగడం అలా ఉంచి.. ఈ ఉరిశిక్షను తెల్లవారు జామునే ఎందుకు అమలు చేస్తారు? అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతుంది. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయడం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు మరి కొందరు పోలీసులు మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తారు అన్నదానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగల్గుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక శిక్షను అమలు చేసేందుకు ముందు, తర్వాత ఎన్నో విధానాలను పాటించాల్సి రావడం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటిని పలురకాల రిజిస్టర్లలో నమోదు చేయడం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు.. అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, అదేరోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే... అంటే రోజు ప్రారంభం కాకముందే మరణ శిక్షను అమలు చేయకుంటే.. శిక్ష అనుభవించాల్సి వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజంనుంచీ ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారినుంచీ ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో.. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఐఎస్ఐఎస్ దారుణాలు ఇవి!
రక్కా, మొసుల్ పట్టణాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఇటీవల సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో వారు డమాస్కస్‌లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. డమాస్కస్‌లో తమ పాలనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పబ్లిష్ చేసింది. ఈ ఫోటోల్లో కొన్ని ఐఎస్ ఉగ్రవాదులు అమలు చేస్తున్న క్రూరమైన శిక్షలతో పాటు.. వారి ఆంక్షలకు సంబంధించినవి ఉన్నాయి. హోమో సెక్సువల్ నేరానికి పాల్పడినందుకు గాను ఓ వ్యక్తిని బిల్డింగ్ మీద నుంచి తోసివేసిన ఫోటోతో పాటు.. ఓ ముసుగువేసిన ఖైదీని మోకాళ్లపై కూర్చోబెట్టి షూట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అలాగే టీషర్ట్‌లపై ఉన్న బ్రాండ్ లోగోలను తొలగిస్తూ, ప్యాంటు పొడవు కొలతలు చూస్తూ వారు విధించిన ఆంక్షలకు సంబంధించిన ఫోటోలు ఐఎస్ఐఎస్ విడుదల చేసింది. -
4 వేల మందిని ఉరితీసిన ఐఎస్ఐఎస్
లండన్: ప్రపంచ అగ్రదేశాలపై దాడులు చేస్తూ వస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. అయితే ఈ ఉగ్ర సంస్థ గత రెండేళ్ల కాలంలో 4 వేల కంటే ఎక్కువ మందిని ఉరితీసింది. ఈ విషయాన్ని యూకేకు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అధికారులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఇప్పటికైనా ఈ విషయాన్ని తీవ్రమైన నేరాలుగా భావించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమాయకులను ఉరితీయడంతో పాటు కాల్పులు జరపడం, బాంబు దాడులకు పాల్పడటం లాంటి హేయమైన చర్యలకు ఐఎస్ఎస్ పాల్పడుతుందని వారు ఆవేదన చెందారు. 4,144 మందిని ఉరితీసినట్లు మానవ హక్కుల సంస్థ అధికారికంగా వెల్లడించింది. సున్నీలు, కుర్దిష్ సిటిజన్లే ఈ మృతులలో 2,230 మంది ఉన్నారు. గుఢచర్యానికి పాల్పడుతున్నాడన్న అనుమానంతో సొంత సోదరుడినే హత్య చేస్తున్న ఘటనలు ఐఎస్ఎస్ సంస్థ కార్యకలాపాలతో భాగమవుతున్నాయి. కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఈ ఏదాడి మార్చి నాటికి 80 మందిని హత్య చేయగా అందులో చిన్నారులు, ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారని యూకే సంస్థ వెల్లడించింది. 13 ఏళ్ల చిన్నారులు కూడా చేతుల్లో భయంకరమైన ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని, కొన్ని నెలల కిందట ఏకే 47లతో ఆరుగురి తలలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్యచేయడంపై ఎస్ఓహెచ్ఆర్ ఉన్నతాధికారి విచారం వ్యక్తంచేశారు. -
10 ఏళ్లలో మూడు మరణశిక్షలు
న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్షను ఖరారుచేసింది. అనేక చర్చోపచర్చలు, వాదనల తర్వాత టాడా అతనికి విధించిన డెత్ వారెంట్ శిక్షను సమర్ధించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం యాకూబ్ మెమన్ ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రెండోసారి కూడా తిరస్కరిస్తే గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు కావడం ఖాయం. గత పదేళ్లలో కోర్టులు విధించిన మరణశిక్షలు, అమలైన ఉరిశిక్షను ఒకసారి పరిశీలిస్తే.. భారతదేశంలో 2004 నుంచి 2013 మధ్య కాలంలో నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 1303 మందికి మరణశిక్షలు విధించారు. అయితే వీరిలో ముగ్గురికి మాత్రమే ఈ శిక్ష అమలైనట్టు లెక్కలు చెబుతున్నాయి. గత పదేళ్లలో మూడు ఉరిశిక్షలు 1. పశ్చిమ బెంగాల్ (2004): ఒక బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఉదంతంలో ధనుంజయ్ చటర్జీని ఆగస్టు 14 అలీపూర్ కేంద్ర కారాగారంలో ఉరితీశారు. యాదృచ్ఛికంగా ఆ రోజు అతని 42 వ పుట్టినరోజు. 2. మహారాష్ట్ర (2012): 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను పుణే ఎర్రవాడ జైలులో నవంబర్ 21న ఉరి తీశారు. 3. న్యూఢిల్లీ(2013): 2001 పార్లమెంటు దాడి కేసులో ఉగ్రవాది మహమ్మద్ అఫ్జల్ గురుకు సుప్రీం విధించిన మరణశిక్ష ఫిబ్రవరి 9 న అమలైంది. ఇదిలా ఉంటే రేపు జూలై 30న యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలైతే, పుట్టినరోజు నాడు ఉరిశిక్ష అమలైన దోషులలో మెమన్ రెండో వాడవుతాడు. కాగా సుమారు 3,751 మంది దోషులకు విధించిన ఉరిశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ముస్లిం కాబట్టే మెమన్ ను ఉరితీస్తున్నారన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 170 (మెమన్‌తో కలిపి) మందికి ఉరిశిక్ష పడితే వారిలో 15 మంది ముస్లింలకు ఉరిశిక్షలు అమలయ్యాని బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. అయితే సుమారు 60 మంది ముస్లింలను (వారి ఇంటిపేర్ల ఆధారంగా) ఉరితీశారని ఏఎన్ఐ రిపోర్టు. మరోవైపు యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారుకావడంలో ముంబై పేలుళ్ల బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇది మా జీవితంలో మర్చిపోలేని రోజన్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ బంధువుల ఆత్మలకు 22 ఏళ్ల తరువాత శాంతి చేకూరిందని దేశ్‌ముఖ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని కోరుతున్నారు. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశ న్యాయచరిత్రలో ఇది చీకటిరోజని ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది సతీష్ మానే షిందే వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ నేరాల కారణంగా ఉరికంబాలు ఎక్కుతున్నవారిలో పేదలు, వెనుకబడిన వర్గాల వారే అధికంగా ఉంటున్నారని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏపీ షా గతంలో వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌కలాం కూడా మరణశిక్షలను వ్యతిరేకించారు. డీఎంకే నేత కనిమొళి, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తదితరులు మరణశిక్షలను వ్యతిరేకించిన వారిలో ఉండగా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మరణశిక్షలను సమర్థించింది. -
డ్రగ్స్ మీద పోరాటం కోసమే ఉరితీత!
సిలకేప్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఎనిమిది మందిని ఇండోనేషియా ప్రభుత్వం ఈ తెల్లవారుజామున ఉరితీసింది. వారిలో ఏడుగురు విదేశీయులు ఉన్నారు. పలు దేశాలు ఈ చర్యను ఖండించాయి. అయితే ఇండోనేషియా అటార్నీజనరల్ ఈ చర్యను సమర్ధించుకున్నారు. తమ దేశం మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించిందని, అందులో భాగంగానే మాదకద్రవ్యల కేసులలో నేరస్తులైన ఏడుగురు విదేశీయులతోపాటు ఒక స్వదేశీయుడిని ఉరితీసినట్లు ఇండోనేషియా అటార్నీజనరల్ చెప్పారు. మాదక ద్రవ్యాల నేరాలను ఎదుర్కొంటున్న తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలోనే ఈ శిక్షలు అమలు చేసినట్లు ఆయన సమర్ధించుకున్నారు. నేరస్తుల కుటుంబ సభ్యులు, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరిని, ఆఫికాకు చెందిన నలుగురిని, బ్రెజిల్, ఇండోనేషియాలకు చెందిన ఒక్కొక్కరిని మొత్తం ఎనిమిది మందిని ఉరి తీశారు. తమ పౌరులకు మరణశిక్ష విధించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండోనేషియాపై మండిపడింది. ఇండోనేషియాలోని తమ రాయబారిని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెనక్కు పిలిపించింది. ఫ్రాన్స్ కూడా ఉరితీతను ఖండించింది.