ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు?
న్యూఢిల్లీః ఇండియాలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీవలి కాలంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ అమిర్ కసబ్, పార్లమెంట్ దాడుల్లో కీలక నిందితుడైన అఫ్జల్ గురు కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగడం అలా ఉంచి.. ఈ ఉరిశిక్షను తెల్లవారు జామునే ఎందుకు అమలు చేస్తారు? అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతుంది.
సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయడం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు మరి కొందరు పోలీసులు మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తారు అన్నదానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగల్గుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది.
అంతేకాక శిక్షను అమలు చేసేందుకు ముందు, తర్వాత ఎన్నో విధానాలను పాటించాల్సి రావడం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటిని పలురకాల రిజిస్టర్లలో నమోదు చేయడం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు.. అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, అదేరోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే... అంటే రోజు ప్రారంభం కాకముందే మరణ శిక్షను అమలు చేయకుంటే.. శిక్ష అనుభవించాల్సి వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజంనుంచీ ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారినుంచీ ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో.. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.