పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ఐరాస సెక్రెటరీ జనరల్ డిమాండ్
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో భారతీయ మాజీ సైనికాధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే(46) బలయ్యారు. గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో అతడు ప్రయాణిస్తున్నవాహనం ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన అనిల్ కాలే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ విచారం వ్యక్తం చేసింది. తమ సైన్యం చేసిన దాడిపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అనిల్ కాలే ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బి.ఎ. చదివాడు. ‘బిహేవియరల్ సైన్స్’, ‘ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియల్ లా’లో డిగ్రీలు సాధించారు.
ఐఐఎం–లక్నో, ఐఐఎం–ఇండోర్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. 2004 ఏప్రిల్‌లో భారత సైన్యంలో చేరారు. 2009, 2010లోఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కంటింజెంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సేవలందించారు. సైనికుడిగా జమ్మూకశీ్మర్‌లో పని చేశారు. 2022లో భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే ఐక్యరాజ్యసమితి డిపార్టుమెంట్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ(డీఎస్‌ఎస్)లో సెక్యూరిటీ కో–ఆర్డినేషన్ ఆఫీసరుగా చేరారు.
అనిల్ కాలే సోమవారం ఉదయం ఐక్యరాజ్యసమితి వాహనంలో మరో డీఎస్‌ఎస్ అధికారితో కలిసి రఫాలోని యూరోపియన్ హాస్పిటల్‌కు బయలుదేరగా ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో అనిల్ కాలే మృతిచెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు.
ఐరాస సెక్రెటరీ జనరల్ గుటేరస్ ది్రగ్బాంతి
కల్నల్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర విషాదానికి గురిచేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్ కాలే మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఇజ్రాయెల్‌ను డిమాండ్ చేశారు. అనిల్ కాలే కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. గాజాలో విధి నిర్వహణలో ఉన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను గుటేరస్ ఖండించారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.
బందీలను విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. కల్నల్ వైభవ్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళవారం సంతాపం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం మొదలైన తర్వాత గాజాలో ఇప్పటివరకు 190 మందికిపైగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది మరణించారు. గాజాలో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన తొలి విదేశీయుడు అనిల్ కాలే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన అనిల్ కాలే కుటుంబం పుణేలో స్థిరపడింది.
మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయతి్నస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యుడు రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రశాంత్ కర్దే చెప్పారు. పుణేలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అనిల్ కాలేకు భార్య అమృత, కుమారుడు వేదాంత్, కుమార్తె రాధిక ఉన్నారు. ఆయన సోదరుడు విశాల్ కాలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెపె్టన్‌గా పనిచేస్తున్నారు. సోదరుడి వరుసయ్యే కల్నల్ అమేయ్ కాలే భారత సైన్యంలో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment