పంజా విసురుతున్న పులి | 315 People Have Died In Tiger Attacks In Country In Last Five Years, See Details Inside | Sakshi
Sakshi News home page

పంజా విసురుతున్న పులి

Published Fri, Jul 5 2024 4:18 AM | Last Updated on Fri, Jul 5 2024 11:04 AM

315 people have died in tiger attacks in country in last five years

దేశంలో గత ఐదేళ్లలో పులుల దాడుల్లో 315 మంది మృత్యువాత

సాక్షి, అమరావతి: దేశంలో వివిధ రాష్ట్రాల్లో 2019–23 మధ్య పులుల దాడి కారణంగా 315 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో పులుల దాడి కారణంగా 110 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. మహారాష్ట్రలోనే పులుల దాడిలో 200 మంది మరణించగా ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లో 34 మంది మృత్యువాత పడ్డారు. మానవ–వన్యప్రాణుల మధ్య సంఘర్షణ కారణంగా జరుగుతున్న ఈ దాడుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ సంఘర్షణను తగ్గించే చర్యల్లో భాగంగా దేశంలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద ప్రాజెక్టు టైగర్‌ పేరుతో వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధికి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. మానవ వన్యప్రాణుల సంఘర్షణల హాట్‌ స్పాట్‌లను గుర్తించడంతో పాటు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖలకు సూచించినట్లు పేర్కొంది. ఎక్స్‌గ్రేషియాలను 24 గంటల్లోనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది.

పంట పొలాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించకుండా నిరోధించేందుకు ముళ్ల కంచె, బయో ఫెన్సింగ్, ఇతర అడ్డంకులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్లు తెలిపింది. వన్యప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్లు తెలిపింది. తీవ్ర గాయాలపాలైతే రెండు లక్షల రూపాయలు, చిన్న గాయా­ల చికిత్స­లకు 25 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement