before
-
ఢిల్లీ ధర్మాసుపత్రిలో దారుణం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం. తక్కువ బరువుతోపుట్టిన శిశువు మరణించిందని అక్కడి డాక్టర్లు ప్రకటించారు. అయితే శిశువు ఖననం చేయబడటానికి తీసుకెళ్లినపుడు సజీవంగా ఉన్నట్లు బంధువులు గుర్తించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే బదర్పూర్కు చెందిన ఓ మహిళ పూర్తిగా నెలలు నిండకముందే ఆదివారం ఉదయం పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప ఊపిరితీసుకోవడం లేదని గుర్తించిన నర్సింగ్ సిబ్బంది చిన్నారి మరణించినట్టుగా ధ్రువీకరించి తండ్రి రోహిత్ కు అప్పగించారు. అయితే ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోవడంతో తల్లి ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. దీంతో పాపను ఇంటికి తీసుకెళ్లి సమాధి చేయడానికి సిద్ధపడుతుండగా, పాప చిన్నగా ఏడ్వడాన్ని రోహిత్ సోదరి గమనించింది. వెంటనే అక్కడున్నవారిని అప్రమత్తం చేసింది. ప్యాప్ విప్పి చూశారు. పాప ఊపిరి తీసుకుంటూ కాళ్లూ, చేతులూ కదుపుతూ కనిపించింది. వెంటనే పీసీఆర్ చికిత్స అందింని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. డాక్టర్ల బాధ్యతారాహిత్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. డబ్ల్యుహెచ్వో మార్గదర్శకాల ప్రకారం 22 వారాల ముందు జన్మించిన శిశువులు 500 గ్రా. బరువుతో పుడతారని దాదాపు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని సఫ్దర్‌జంగ్ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే రాయ్ చెప్పారు. ఇలాంటి ప్రీ మెచ్యూర్ డెలివరీ శిశువులను చనిపోయినట్లు ప్రకటించటానికి ముందు కనీసం సుమారు ఒక గంట పాటు పరిశీలనలో ఉంచాలని మరో డాక్టర్ చెప్పారు. -
పరీక్షలయ్యాక బడికెళ్లాల్సిందే
నల్లజర్ల : వార్షిక పరీక్షలు పూర్తవ్వగానే వేసవి సెలవులు వచ్చేసేవి. ఇకపై ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఇచ్చేందుకు నిర్ణయించినా.. పరీక్షల షెడ్యూల్ మాత్రం మారింది. మరోవైపు వేసవి సెలవులకు నెల రోజుల ముందుగానే విద్యార్థులకు పై తరగతిలో ప్రవేశం కల్పించి.. ఆ పాఠాలను బోధించనున్నారు. ఈ విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తోంది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జి.గంగాభవాని తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విద్యావిధానంలో కొత్త పద్ధతులు అమల్లోకి రానున్నాయని..ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను సరిచేసి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం కూడా తరగతులు కొనసాగుతాయన్నారు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరి నెల రోజుల్లో రెండో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తామని, ఇలా 1నుంచి 9వ తరగతి విద్యార్థులందరికీ పై పాఠాల బోధన ఉంటుందని వివరించారు. దీనివల్ల విద్యార్థులు పై తరగతిలోకి వెళ్లేసరికి వారికి పాఠ్యాం శాలు కొట్టిన పిండిలా మారతాయన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 22వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినమని, అప్పటివరకు దాదాపు నెల రోజులపాటు సంసిద్ధత తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో తదుపరి తరగతులకు సన్నద్ధం చేస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. సీబీఎస్ఈ విధానంలోనూ ఇదే పద్ధతి అమల్లోకి వస్తుందన్నారు. తొలిసారి సమగ్ర మూల్యాంకనం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం చేపట్టేందుకు రంగం సిద్ధమైందని డీఈఓ చెప్పారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో అన్ని సబ్జెక్ట్‌లకు 80 మార్కులకే ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. మిగిలిన 20 మార్కులకు విద్యార్థులు అంతకు ముందు రాసిన పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్నెల్ మార్కులు కలపనున్నట్టు చెప్పారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తుండటం వల్ల ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండబోదన్నారు. టెన్త పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు జిల్లాలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఈఓ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 246 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు 60వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఆమె వెంట కొయ్యలగూడెం డీవైఈవో తిరుమల దాసు ఉన్నారు. -
భారీగా పతనమైన ఆయిల్ ధరలు
న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కీలకమైన ఒపెక్ సమావేశం ప్రారంభానికి ముందే క్రూడ్ ధరలు ఢమాల్ అన్నాయి. చమురు సరఫరాల నియంత్రణపై ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్‌యేతర దేశాలతో ఒపెక్ దేశాలు సమావేశంకానున్న నేపథ్యంలో ధరలు 4 శాతం పతనం కావడం ఆందోళన రేపింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 3.7 శాతం(1.76 డాలర్లు) దిగజారి 45.89 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ మరింత అధికంగా 4 శాతం(1.84 డాలర్లు) పడిపోయి 44.48 డాలర్ల వద్ద నిలిచింది. గత రెండేళ్లుగా నష్టాలను మూడగట్టుకుంటున్న ముడిచమురు ధరలను నిలబెట్టేందుకు సరఫరాలపై నియంత్రణలు తీసుకురావాలని సౌదీ అరేబియా ఇటీవల పేర్కొంది. అయితే సెప్టెంబర్ 26-28 మధ్య నిర్వహించనున్న సమావేశంపై ప్రతికూల అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సమావేశం విఫలంకావడం ఈ అంచనాలకు ఆధారమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒపెక్ సమావేశాల్లో 'నో డీల్' ఫలితం రానుందని మాక్క్వారీ కాపిటల్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. అల్జీరియా మీట్ మరో మీట్ చారిత్రక వైఫల్యం కానుందని పేర్కొంది. ఇది డిసిసేషన్ మేకింగ్ సమావేశం కాదని, కేవలం సంప్రదింపులు మాత్రమేనని సౌదీ ఆయిల్ అధికారులు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించాయి. అలాగే ఫిజికల్ కమెడిటీస్ లో బ్యాంకుల జోక్యం పై ఆంక్షలు విధించాలన్న యోచనలోఉన్న ఫెడరల్ రిజర్వ్ విధానం, బలపడుతున్న డాలర్ విలువ, విద్యుత్ ధరలు, పెరిగిన చైనా ఎగుమతులు, ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య నెలొకొన్న విబేధాలు బ్రిటన్ కంపెనీల కష్టాలు ముఖ్యమైన అంశాలుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే నాన్ ఒపెక్ దేశం, ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దారు అయిన రష్యా ఈవారంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడం కూడా ఒక కారణమని తెలిపాయి. కాగా నాన్‌ఒపెక్ దేశమైన రష్యా ఈ ప్రతిపాదనకు మద్దతు పలకడంతో చమురు దేశాలకు ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అల్జీర్స్ లో వచ్చే వారం ఒపెక్ సమావేశానికి నిర్ణయించింది. -
అధికారుల ముందే బియ్యం మాయం
నిజామాబాద్ అర్బన్: విద్యాశాఖ అధికారుల తనిఖీల్లో ఆటోనగర్‌లోని ఖలీల్‌వాడి పాఠశాలలో అక్రమాలు వెలుగు చూశాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా నమోదు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం పక్కదారి పడుతుండడం, టీచర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువగా సాధారణ సెలవులు (సీఎల్) వాడుకున్నట్లు తేలింది. ఈ పాఠశాలను డీఈవో లింగయ్య శనివారం తనిఖీ చేయవగా, టీచర్ల గైర్హాజరుతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరపాలని డిప్యూటీ డీఈవో కృష్ణారావు, ఎంఈవోలను సోమవారం విచారణకు పంపించారు. వారు పాఠశాలలో ఉండగానే, హెచ్ఎం ఆటోలో ఏడు సంచుల బియ్యాన్ని అక్కడి నుంచి తరలించారు. దీన్ని గమనించిన ఎంఈవో హెచ్ఎంను నిలదీసి, డీఈవోకు సమాచారమిచ్చారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, బియ్యం నిల్వలను లెక్కించారు. అదనంగా నాలుగున్నర క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే, పాఠశాలలో కాకుండా మరోచోట కూడా మధ్యాహ్న భోజనం వాడుతున్నామని, బియ్యం సంచులు ఇక్కడ ఉంచినట్లు ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు. మరోచోట 100–150 మంది విద్యార్థుల పేర్లు నమోదు చేసి, అదనపు బియ్యం పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. తరలించిన బియ్యాన్ని తెచ్చి, సీజ్ చేశారు. ఇక, 10 మంది టీచర్లు అదనంగా సెలవులు (సీఎల్) వాడుకున్నట్లు గుర్తించారు. మరోవైపు 2014–15కు సంబంధించిన రిజిస్టర్ లేకపోవడంపై డిప్యూటీ డీఈవో మండిపడ్డారు. హెచ్ఎం బియ్యాన్ని తీసుకెళ్లమన్నాడని ఏజెన్సీ నిర్వాహకుడు సమీర్ అధికారులకు వివరించాడు. పాఠశాలలో అనేక లోపాలు గుర్తించామని, నివేదికను డీఈవోకు అందజేస్తామని అధికారులు తెలిపారు. -
కలెక్టరేట్ ఎదుట టీడీపీ ధర్నా
ఖమ్మం అర్బన్: టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముందుగా, పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీగా ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. ధర్నాలో ముఖ్య అతి«థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దనసరి సావిత్రి (సీతక్క) పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని ప్రభుత్వ అధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. భూనిర్వాసితుల పరిహారానికి సంబంధించి 123 జీఓను హైకోర్టు కొట్టివేయడంపై పై కోర్టుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడాన్నిబట్టి.. ౖరైతులపై ఆయనకుగల ప్రేమ ఏపాటితో తేటతెల్లమైందని అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుల్లూరి బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ సగం గడిచినప్పటికి కూడా రుణ మాఫీ మొత్తాన్ని జమ చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని అన్నారు. ఎంసెట్–2 లీకేజీలో కేసీఆర్ సమీప బంధువుల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ టీఆర్ఎస్ పెద్దలుగానీ, ప్రభుత్వంగానీ స్పందించడం లేదని విమర్శించారు. ధర్నా అనంతర ం జాయింట్ కలెక్టర్‌కు నాయకులు వినతిపత్రమిచ్చారు. ధర్నాలో పార్టీ ఉపా«ధ్యక్షుడు గొర్ల సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణమూర్తి, నాయకులు కురపాటి వెంకటేశ్వర్లు, తోటకూరి శివయ్య, ఏలూరి శ్రీనివాసరావు, రామనాధం, స్వర్ణకుమారి, భవానిశంకర్, రాందాస్, ఫణీశ్వరమ్మ, వెంకటరామయ్య, అప్పారావు, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, తాళ్లూరి జీవన్‌కుమార్, వాకదాని కోటేశ్వరరావు, జట్ల శ్రీను, గొల్లపూడి హరిక్రిష్ణ, సుమంత్, గొడ్డెటి మాధవరావు, భిక్షపతి, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు?
న్యూఢిల్లీః ఇండియాలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీవలి కాలంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ అమిర్ కసబ్, పార్లమెంట్ దాడుల్లో కీలక నిందితుడైన అఫ్జల్ గురు కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగడం అలా ఉంచి.. ఈ ఉరిశిక్షను తెల్లవారు జామునే ఎందుకు అమలు చేస్తారు? అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతుంది. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయడం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు మరి కొందరు పోలీసులు మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తారు అన్నదానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగల్గుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక శిక్షను అమలు చేసేందుకు ముందు, తర్వాత ఎన్నో విధానాలను పాటించాల్సి రావడం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటిని పలురకాల రిజిస్టర్లలో నమోదు చేయడం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు.. అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, అదేరోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే... అంటే రోజు ప్రారంభం కాకముందే మరణ శిక్షను అమలు చేయకుంటే.. శిక్ష అనుభవించాల్సి వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజంనుంచీ ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారినుంచీ ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో.. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇక ఫ్రీడం రూ.251 అంతేనా?
న్యూఢిల్లీ: నోయిడా కు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ దారు రింగింగ్ బెల్స్ భారీ కష్టాల్లో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. ప్రపంచంలో నే అతి చవకైన ఫోన్ అంటూ సంచలనం సృష్టించిన ఫ్రీడం రూ. 251 స్మార్ట్ ఫోన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నవాళ్లు ఇక నీళ్లు వదలు కోవాల్సిందేనా అన్న అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాల పడుతూ వస్తున్న ఈ ఫోన్ల్ జారీ ప్రక్రియ ..తాజా వార్తల నేపథ్యంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఫిబ్రవరిలో ఫోన్ ఆవిష్కరణ తర్వాత భారీ బుకింగ్స్ ను సాధించిన ప్పటికీ, తన మొదటి ఫోన్ డెలివరీ ఇంకా స్టార్ట్ కాకముందే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కంపెనీ వాగ్దానం చేసినట్టుగా ఫోన్లను అందించడంలో పలుమార్లు విఫలమైన సంస్థ యాజమాన్యం మధ్య విభేదాలు చెలరేగినట్టు తెలుస్తోంది. మేనేజ్మెంట్ స్థాయిలో ఆర్థిక పరంగా తీవ్రమైన విభేదాలు నెలకొన్నట్టు సమాచారం. దీంతోపాటు ఫ్రీడం 251 ఫోటోను వెబ్ సైట్ (రింగింగ్ బెల్స్.కో.ఇన్) నుంచి తొలగించడం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అలాగే మిగతా స్మార్ట్ ఫోన్ల కోసం వెతికినపుడు, బై నౌ బటన్ ప్రెస్ చేస్తే.. 72 గంటల్లో అమ్మకాలు పూర్తయ్యాయని ... తొందర్లోనే బుకింగ్ మొదలు కానున్నాయి అన్న సందేశం దర్శనమిస్తుండడం విశేషం. కంపెనీ అధ్యక్షుడిగా పరిచయమైన అశోక్ చద్దా సీఈవో మోహిత్ గోయల్ మధ్య తీవ్రమైన ఆర్థిక విభేదాలు వచ్చాయినీ.. అందుకే సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండడం లేదని తెలుస్తోంది. అయితే దీనిపై చద్దాను వివరణ కోరినపుడు రింగింగ్ బెల్స్ కి తాను పనిచేయడంలేదనీ సలహాదారుగా మాత్రమేనని సమాధానం చెప్పారు. అటు సీఈవో మొహిత్ గోయల్ కు ఫోన్ చేసినపుడు ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు నష్టాల్లో ఉన్న కంపెనీ గట్టెక్కించే నాధుడు కోసం వేచి చూస్తోంది. కాగా ఈ ఫ్రీడం ఫోన్ తయారీకి 1200 రూ. ఖర్చవుతోందని , కానీ వినియోగదారుల కోసం రూ.251 కే అందించనున్నామని ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో ఒక్కో యూనిట్ కు సుమారు రూ 900 ల భారీ నష్టానికే సరఫరా చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారీ నష్టాలు.. వివాదాల్లో రింగింగ్ బెల్స్ కూరుకు పోయిన సంగతి తెలిసిందే. అయితే జులై 7న తమ ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందించినున్నట్టు ఇటీవల గోయల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతును కోరునున్నట్టు ప్రకటించడం గమనార్హం. -
24మంది భార్యలు.. 200మంది పిల్లలు!
బీజింగ్ః బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండి, జీవితకాలాన్ని వీలైనంత పెంచుకునేందుకు ప్రతివారూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు చేసిన ప్రయత్నాలు , వారి సాధన ఒక్కోసారి తగిన ఫలితాలను కూడ ఇస్తుంటుంది. కానీ అరవై ఏళ్ళ ఆయుర్దాయం ఉండటమే కష్టంగా మారిన తరుణంలో ఓ వ్యక్తి వందేళ్ళు బతికితే ఎంతో గొప్పగా ఫీలవుతాం. నిజంగా గ్రేట్ అని సంబర పడిపోతాం. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి 256 సంవత్సరాలు బతికాడంటే నమ్ముతారా? ఎప్పుడూ ఎవ్వరూ జీవించనంతకాలం ఆయన బతికినట్లు ఇటీవల ఓ పత్రికా కథనం ద్వారా ఆధారాలు దొరికాయి. చైనాకు చెందిన లీ చింగ్ యన్ 1933 మే 6న మరణించాడు. అయితే అప్పటికి ఆయన వయసు 256 ఏళ్ళని, అన్నేళ్ళు జీవించడం చరిత్రలోనే మొదటిసారి అని ఓ పత్రిక తన వ్యాసంలో పేర్కొంది. ఆ సుదీర్ఘ వయస్కుడి వివరాలు ఏ ఒక్కరో శోధించినవి కాదని, ఆయన అన్నేళ్ళు బతికాడనేందుకు ఎన్నో సాక్ష్యాధారాలను సేకరించి మరీ నిర్థారించింది. లీని ఆయన 150వ పుట్టినరోజు సందర్భంగా 1827 లో అభినందిచినట్లు ఓ డాక్యుమెంటేషన్ లో చెంగ్డూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వు చుంగ్ రాశారని, చైనా ప్రభుత్వ రికార్డుల్లోనూ లీ చింగ్ 150వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినట్టు ఉందని, అనంతరం ఆయన 200 పుట్టినరోజు సందర్భంగా 1877లోనూ లీని అభినందిస్తూ ఎన్నో వ్యాసాలు, పత్రాలు వెలువడ్డాయని తెలుస్తోంది. ఆయనకు పొరుగునే ఉన్న ఓ వ్యక్తి... తమ చిన్ననాటినుంచే ఆయన్ను వృద్ధుడుగా చూసినట్లు తెలిపినట్లు సదరు పత్రిక వెల్లడించింది. సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ పదేళ్ళ వయసునుంచే ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ అనేక ప్రాంతాల్లో తిరిగాడట. ఆ సమయంలో దాదాపు నలభై ఏళ్ళ పాటు అడవుల్లో దొరికే మూలికలు, గోజీపండ్లు వంటి ఆహారాన్నే భుజించాడట. ఆయుర్వేద వైద్యుడిగా అనేకచోట్ల కాలం గడిపిన ఆయన.. 71 ఏళ్ళ వయసులో 1749 లో చైనీస్ సైన్యం లో యుద్ధ కళల శిక్షకుడిగా, సలహాదారుడుగా చేరాడు. తర్వాత కనీసం వంద సంవత్సరాల పాటు ఆయన మంచి ఆహారంతోపాటు, ఔషధాలు, రైస్ వైన్ తీసుకున్నాడు. తన కమ్యూనిటీలో ప్రత్యేక సభ్యుడుగా ఉండే లీ.. 23 సార్లు వివాహం చేసుకోవడంతోపాటు, సుమారు 200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడట. కుటుంబంలో 11 తరాలను చూసిన ఆయన... 1933లో మరణించాడు. ఆయన్ను ఎవరైనా తన సుదీర్ఘ జీవితకాలం గురించి సీక్రెట్ ఏమిటి అని అడిగితే మాత్రం... నిశ్శబ్దమైన మనసుతో ఉండి, తాబేలులా కూర్చొని, పావురంలా హుషారుగా పరిగెడుతూ, కుక్కలా నిద్రపోవడమే కారణమని చెప్పేవాడట. ఆయన పుస్తకంలో (జీవితం) ఒక పేజీ చదివినా... ఈ కాలంవారికి ఎంతో స్ఫూర్తిదాయకం అయ్యే అవకాశం ఉంది. -
కంటి చికిత్సకు ముందు మ్యూజిక్ వింటే...
ఫ్రాన్స్ః సంగీతం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి, మానసికోల్లాసాన్ని కలిగించే సంగీతం ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు కూడ సహకరిస్తుంది. సంగీతం అనేక బాధలనుంచి స్వాంతన పొందేట్టు చేస్తుంది. అయితే కంటికి శస్త్ర చికిత్స చేయించుకునే ముందు కాసేపు సంగీతం వినడం ఆందోళన తగ్గించేందుకు మంచి సాధనం అంటున్నారు ఫ్రాన్స్ పరిశోధకులు. కాసేపు సంగీతం విన్న తర్వాత శస్త్ర చికిత్సకు వెళ్ళడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. మ్యూజిక్ వినండం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని, ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేయించుకునే వారు ఎనస్థీషియా తీసుకునేందుకు ముందు.. కొద్ది సమయం మ్యూజిక్ వినడంవల్ల ఆందోళన తగ్గుతుందని అంటున్నారు ఫ్రాన్స్ లోని కొచిన్ యూనివర్శిటీ ఆస్పత్రికి చెందిన గిల్లెస్ గ్యూరియర్. ముఖ్యంగా శస్త్ర చికిత్స సమయంలో మెలకువతో ఉండటం రోగులకు ఆందోళనను, ఒత్తిడిని కలుగజేస్తుంది. అదే నేపథ్యంలో కాసేపు సంగీతం విన్నవారు, వినకుండా సర్జరీకి వెళ్ళిన వారిపై అధ్యయనాలు జరిపిన పరిశోధకులు ఇద్దరికీ మధ్య ఆత్రుతలో గణనీయమైన తేడా కనిపించినట్లు కనుగొన్నారు. ముఖ్యంగా ప్రతి వందమందిలో సంగీతం విన్నవారికంటే... వినకుండా సర్జరీకి వెళ్ళినవారికి మత్తుమందుల అవసరం ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. సంగీతం విన్న పేషెంట్లకు మత్తు మందులు 16 శాతం అవసరమైతే, లేని వారికి 32 శాతం అవసరమైనట్లు చెప్తున్నారు. అంతే కాక మ్యూజిక్ విన్నవారిలో ఆపరేషన్ తర్వాత కూడ ఫలితాలు పాజిటివ్ గా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల కంటి శస్త్ర చికిత్సలకు ముందు సంగీతం అందిస్తున్నామని, అలాగే లోకల్ ఎనస్థీషియా ఇవ్వాల్సి వచ్చే ఎముకలతో సహా ఏ రకమైన ఆపరేషన్ కైనా సంగీతం వినిపించే పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు యోచిస్తున్నామని గ్యూరియర్ చెప్తున్నారు. కాటరాక్ట్ సర్జరీ చేయించుకునే ముందు పేషెంట్లు దాదాపు 15 నిమిషాల పాటు జాజ్, ఫ్లామెన్కో క్యూబన్, క్లాజికల్, పియానో, వంటి విభిన్న శైలుల్లోని సంగీతం వినడంవల్ల నొప్పిని తట్టుకొని, ఆందోళన చెందకుండా, ఆత్రుత పడకుండా ఆపరేషన్ సమయంలో చక్కగా వ్యవహరించగలిగినట్లు తమ పరిశోధనల్లో తేలిందని, శస్త్ర చికిత్స వల్ల కలిగే భయయాన్ని పోగొట్టేందుకు వినిపించే మ్యూజిక్ వినడానికి ముందు, తర్వాత... సర్జికల్ ఫియర్ క్వశ్చనీర్ (ఎస్ఎఫ్ క్యూ) ను ఉపయోగించి ఆందోళనను అంచనా వేసినట్లు పరిశోధకులు లండన్ యూరో ఎనస్థీషియా 2016 లో నివేదించారు. -
గర్భంలోనే వృద్ధాప్యం నిర్థారణ
కొంతమంది యువకులు.. పుట్టుకతో వృద్ధులు అన్నారు. కొందరు అతి చిన్న వయసులోనే వృద్ధాప్యం మీద పడినట్లు కనిపిస్తారు. మరి కొందరు వయసు మళ్లినా యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనంతటికీ గర్భధారణ సమయమే ప్రధానమట. గర్భంతో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం, పోషకాలను బట్టే ఈ ప్రక్రియ ఆధారపడి ఉంటుందంటున్నారు లండన్ కు చెందిన పరిశోధకులు. గర్భంలోని పిండానికి అందే పోషకాల ఆధారంగానే పుట్టిన తర్వాత వారి యవ్వన, వృద్ధాప్య దశలు ప్రారంభమౌతాయని తాజా పరిశోధనలలో తేలింది. పుట్టక ముందే ముదిమి లక్షణాలు నిర్థారణ అవుతాయని లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. గర్భధారణ, పిండ అభివృద్ధిని ఎలుకలపై ప్రయోగించి చూశారు. గర్భధారణ సమయంలో తల్లి గర్భంలో ఆక్సిజన్ తగ్గడం, ధూమపానం వంటి అలవాట్లతో పుట్టే పిల్లల్లో యవ్వనం, వృద్ధాప్యం వంటి లక్షణాలు సంక్రమిస్తాయని, చిన్నతనంలోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందని కనుగొన్నారు. మనుషుల్లో 23 జతల క్రోమోజోములుంటాయి. ప్రతి క్రోమోజోమ్ చివరి భాగాన్ని టెలోమేర్గా పిలుస్తారు. షూలేస్ చివరి భాగంలోని ప్లాస్టిక్ లా ఉండే ఈ టెలోమేర్లు క్రోమోజోములను బయటకు వెళ్లకుండా నివారిస్తుంటాయి. ఈ టెలోమేర్లు చిన్నివిగా మారడాన్ని బట్టి మనిషి వయసును, వృద్ధాప్యాన్ని లెక్కించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ప్రయోగాల్లో భాగంగా పుట్టిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ఉండే టెలోమేర్ల పొడవును కొలిచారు. అవి గర్భంలో ఉన్నప్పుడు తల్లి పొందిన యాంటీ ఆక్సిడెంట్లు, ఆక్సిజన్ ను బట్టి ఉన్నట్లు తెలుసుకున్నారు. గర్భంలో పిండం పెరుగుదల వారికి అందే ఆక్సిజన్ ను బట్టి ఉంటుందని, అది పుట్టిన తర్వాత వచ్చే లక్షణాలకు కారణమౌతుందని చెప్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నపుడు తక్కువ ఆక్సిజన్ ను ఆమ్లాలను పొందిన ఎలుక పిల్లలు కాస్త ఎక్కువ వయసున్నట్లుగా కనిపించాయని, అవి గుండె సంబంధిత వ్యాధులను కూడా కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాంటి పిల్లలు తక్కువ పొడవున్న టెలోమేర్స్ ను కలిగి ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. సరైన ఆక్సిజన్, యాంటీ ఆక్సిడెంట్లు అందిన పిల్లలు ఆరోగ్యంగానూ, తక్కువ వయసున్నట్లు కనిపించడంతోపాటు.. టెలోమేర్ల పొడవు కూడా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఎలుకలపై చేసిన తమ ప్రయోగాలు పుట్టిన తర్వాతే కాక గర్భంలో ఉన్నప్పుడే పిల్లల పెరుగుదల, లక్షణాలకు కారణమైనట్లుగా నిర్థారిస్తున్నాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులు డినో గిస్పాని చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణాన్ని బట్టి, అలవాట్లను బట్టి మన జన్యువుల్లో వచ్చే లోపాలు ఊబకాయానికి, గుండె జబ్బులకు కారణాలవుతున్నట్లు మనకు తెలుసని, అయితే ప్రస్తుత పరిశోధనలు గర్భంలోఉన్నపుడే ముదిమి లక్షణాలు, గుండె జబ్బులు నిర్ధారణ అవుతాయని నిరూపించినట్లు ఫ్యాసబ్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనలో తెలిపారు. -
ఎంసెట్.. గంట ముందే హాల్లోకి
-
ఎంసెట్.. గంట ముందే హాల్లోకి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షను ఈ నెల 22వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. ఈసారి పరీక్ష రోజున విద్యార్థులను హాల్లోకి గంట ముందుగానే అనుమతించనున్నట్లు చెప్పారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోరని స్పష్టం చేశారు. విద్యార్థులకు అరగంట ముందుగానే ఓఎంఆర్ జవాబు పత్రాన్ని అందజేస్తామని, సూచనలను జాగ్రత్తగా చదివి వివరాలను పొందుపరచాలని సూచించారు. ఒకసారి పెన్నుతో రాసిన తరువాత దిద్దుబాటుకు అవకాశం ఉండదు కాబట్టి ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని వివరాలను నమోదు చేయాలన్నారు. పరీక్ష సమయానికి 5 నిమిషాల ముందు బుక్లెట్ ఇస్తారని తెలిపారు. ఎంసెట్ కన్వీనర్ ‘సాక్షి’కి వెల్లడించిన మరిన్ని అంశాలు.. ఎంసెట్‌కు రూ. 10 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు ఆదివారంతో ముగిసింది. పరీక్ష నిర్వహణకు 16,600 మంది సిబ్బందిని నియమించారు. 800 మంది అబ్జర్వర్లు, 50 స్పెషల్ అబ్జర్వర్లు ఉంటారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష కేంద్రాల్లో 227 మంది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుంది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు, ఇప్పటికే కాలేజీల్లో చేరి మళ్లీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారు, 2012కు ముందు ఎంసెట్ రాసి మళ్లీ మళ్లీ రాస్తున్న వారిపై నిఘా పెట్టారు. వారి సెల్‌ఫోన్ నంబర్లను పోలీసులకు అందజేశారు. విద్యార్థులకు సూచనలు... 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గం టలకు వరకు అగ్రికల్చర్ పరీక్ష ఉంటుంది. విద్యార్థులను గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. గతంలో జరిగిన సంఘటన నేపథ్యంలో విద్యార్థులు టాయిలెట్‌కు కూడా పరీక్ష హాల్లోకి రావడానికి ముందుగానే వెళ్లి రావాలనే నిబంధన విధించారు. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తు ప్రింట్‌ను పరీక్ష హాల్లో అందజేయాలి. నెగిటివ్ మార్కుల విధానం ఉండదు. కనీస అర్హత మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు ఏమీ లేనందున వారు కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలి. పరీక్ష హాల్లోకి తీసుకు రాకపోతే జూన్ 1లోగా ఎంసెట్ కార్యాలయంలో సమర్పించాలి. ఎంసెట్ పరీక్షా కేంద్రాలు: 750 ఇంజనీరింగ్ : 527 మెడికల్ : 227 ఇంజనీరింగ్ దరఖాస్తులు : 2,81,695 విద్యార్థులు : 1,75,365 విద్యార్థినులు : 1,06,330 మెడికల్ అండ్ అగ్రికల్చర్ : 1,11,777 విద్యార్థులు : 40,879 విద్యార్థినులు : 70,898 రెండిటికీ దరఖాస్తు చేసిన వారు : 1,071 -
భయాలను భయపెట్టండి
మనసుల్లో దాగి ఉన్న అంతర్గత భయాలు మనుషులు ముందుకెళ్లకుండా అడ్డుపడతాయి. వీటిని వదిలించుకుంటే అనుకున్నది సాధించవచ్చు. భయాలను జయించాలంటే చేయాల్సింది.. ధైర్యంగా వాటికి ఎదురెళ్లడం. మనిషి ఎదురు తిరిగితే భయం తోకముడిచి వెనక్కి పారిపోవడం ఖాయం. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేని వ్యక్తులే జీవితంలో విజేతలుగా నిలుస్తారు. ఒక రుషి.. రెండు శునకాలు పూర్వం ఒక గొప్ప రుషి ఉండేవారు. ఆయన ఒకనాడు హిమాలయాల్లోని ప్రఖ్యాత ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆలయ విశేషాలు తెలుసుకొనేందుకు అక్కడున్న ఒక స్థానికుడిని తన వెంట సహాయకుడిగా నియమించుకున్నారు. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద భీతి కలిగించే సన్నివేశం రుషి కంటపడింది. రెండు బలమైన శునకాలు ఆలయం గేటుకు గొలుసుతో కట్టేసి ఉన్నాయి. అవి వీరిని చూడగానే బిగ్గరగా మొరగడం ప్రారంభించాయి. వాటి రౌద్రరూపం చూస్తే ఎంతటివారికైనా గుండెలదిరిపోతాయి. రుషి మనసులోని భావాన్ని సహాయకుడు పసిగట్టాడు. ‘భయపడకండి గురుదేవా! ఆ శునకాలను గొలుసులతో బంధించారు. తెంచుకొనే అవకాశమే లేదు. అవి మనల్ని ఏమీ చేయలేవు’ అంటూ ధైర్యం చెప్పాడు. ఇద్దరూ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టారు. ప్రధాన ఆలయం వైపు నడక ప్రారంభించారు. గుడి గురించి సహాయకుడు చెబుతున్న విశేషాలు రుషి మనసులోకి చేరడం లేదు. ఆయన పదేపదే వెనక్కి తిరిగి శునకాల వైపు చూస్తున్నారు. వాటి అరుపులు ఆయన చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈసారి రుషి వెనక్కి తిరిగి చూడగానే.. ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. గొలుసులను తెంచుకున్న రెండు శునకాలు వీరి వైపు వేగంగా పరుగెత్తుకొస్తున్నాయి. వాటి నోటికి చిక్కితే బతుకుపై ఆశ వదులుకోవాల్సిందే. రుషి తక్షణమే అప్రమత్తమయ్యారు. మెరుపు వేగంతో పరుగందుకున్నారు.. శునకాల వైపు! అప్పుడేం జరిగిందో ఊహించండి. తమవైపు దూసుకొస్తున్న గురువు గారిని చూసి శునకాలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. బుద్ధిగా వెనక్కి తిరిగి ద్వారం వద్దకు వెళ్లిపోయాయి. పారిపోతే.. జీవితాన్ని కోల్పోతాం! మనుషుల్లోని భయాలు కూడా ఆ శునకాల్లాంటివే. మనమంతా భయాలకు భయపడి, వాటికి దూరంగా పారిపోతుంటాం. అప్పుడు అవి మనల్ని ఏమీ చేయలేవని అనుకుంటున్నాం. కానీ, దానివల్ల జీవితంలో ఏం కోల్పోతున్నామో తెలుసుకోలేకపోతున్నాం. భయాలు ఎదురైనప్పుడు రుషిలాగే వాటికి ఎదురొడ్డి ముందుకెళ్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. భయాలను ఎదుర్కోండి, భయాలను భయపెట్టండి. ఎంతటి భయంకరమైన భయాలైనా మిమ్మల్ని ఏమీ చేయలేవని తెలుసుకుంటారు. ఎదిరించి గెలవలేమా? ఓడిపోతామనే భయంతో మనుషులు బతుకులీడుస్తుంటారు. ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించలేకపోతుంటారు. భయానికి ఎందుకు భయపడాలి? దాన్ని ఎదిరించి గెలవలేమా?.. మీకు నీళ్లంటే భయమా? అయితే, ధైర్యంగా ఈత నేర్చుకోండి. స్విమ్మింగ్ క్లాసులో చేరండి. నలుగురిలో మాట్లాడాలంటే భయమా? దాన్ని అధిగమించండి. మాట్లాడేందుకు ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా నిర్భయంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తే నష్టం వస్తుందని భీతి చెందుతున్నారా? అయినా ప్రారంభించండి, ఏం జరుగుతుందో చూద్దాం! నష్టం వచ్చినా, లాభం వచ్చినా... ఒకటి మాత్రం తథ్యం. మీలో భయం కచ్చితంగా అంతమైపోతుంది. భయం అంటే నిరర్థక ఊహే! భయం అంటే.. తప్పుడు ఊహలను వాస్తవాలుగా భ్రమించడం. భయం అనేది కేవలం మనసులో జనించే ఒక నిరర్థకమైన ఊహేనని అర్థం చేసుకుంటే దాన్ని పూర్తిగా వదిలించుకోవచ్చు. మీలోని భయాన్ని మీ ముందున్న ఒక గోడగా భావించండి. మీ సంతోషాలు, విజయాలు గోడకు ఆవలి వైపున ఉన్నాయనుకోండి. అప్పుడేం చేస్తారు? గోడ నుంచి దూరంగా పారిపోతారా? విజయాన్ని అందుకోవాలంటే గోడను అధిగమించాల్సిందే. మీరు ధైర్యంగా అడుగు ముందుకేస్తే గోడ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. భయం కూడా అంతే.. దాని తీవ్రతను ఎక్కువగా ఊహించుకుంటే ఇంకా భయపెడుతుంది. భయంపై కపిల్‌దేవ్ జయం క్రికెట్ అభిమానులకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో 1990లో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ గుర్తుండే ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లకుగాను 653 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ 9 వికెట్లను కోల్పోయి 430 పరుగుల వద్ద ఆట కొనసాగిస్తోంది. కపిల్ దేవ్ మైదానంలోకి వచ్చారు. ఫాలోఆన్ తప్పాలంటే 24 పరుగులు చేయాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. భారత జట్టులో భయం, ఆందోళన పెరిగిపోతున్నాయి. విపరీతమైన ఒత్తిడిలోనూ కపిల్ దేవ్ నిబ్బరంగా ఆట కొనసాగించారు. వరుసగా నాలుగు సిక్సులు బాదారు. కావాల్సిన 24 పరుగులు సాధించారు. భయాలను ఎదుర్కోవడం అంటే అదే.. మీరు కూడా భయాలను దూరంగా తరిమేయండి. పరుగులు రావాలంటే భయాలను బ్యాటుతో బాది, స్టేడియం బయటకు పంపించాల్సిందే! -కెరీర్స్ 360 సౌజన్యంతో -
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లండి
= ఎన్కౌంటర్లో గాయపడిన ఎస్ఐ భార్య వినతి పంజగుట్ట (హైదరాబాద్), న్యూస్‌లైన్ : గుల్బర్గాలో ఓ పేరుమోసిన రౌడీషీటర్‌తో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన కర్ణాటక రోజా పోలీస్‌స్టేషన్ ఎస్ఐ మల్లికార్జున్ బండెను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని ఆయన భార్య మధు బండె కోరారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 8న గుల్బర్గాలో చోటారాజన్ గ్యాంగ్‌కు చెందిన కాలాకుత్తా గ్యాంగ్ సభ్యుడు మున్నా ఉన్నాడన్న సమాచారంతో ఎస్ఐ మల్లికార్జున్ అతడిని పట్టుకొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో మున్నా హతమైనప్పటికీ.. అయితే, అతను కాల్చిన బుల్లెట్ ఎస్ఐ తలలో దూసుకెళ్లింది. మెరుగైన వైద్యం కోసం ఎస్ఐ మల్లికార్జున్ బండెను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐదు రోజులవుతున్నా ఇంకా తన భర్త ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, కోమాలోనే ఉన్నాడని మధు బండె ఆవేదన వ్యక్తంచేశారు. యూకేలోని క్వీన్ ఎలిజిబెత్ ఆస్పత్రి వైద్యులనైనా హైదరాబాద్‌కు రప్పించాలని లేదా.. తన భర్తనైనా యూకేకు తరలించాలని ఆమె కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో పాకిస్తాన్‌కు చెందిన మలాల కూడా ఇదే విధంగా బుల్లెట్ గాయానికి గురైతే యూకే క్వీన్ ఎలిజిబెత్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం చేసి ఆమెకు నయం చేశారని, అదే విధంగా తన భర్తకు కూడా చికిత్స చేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అక్కడికి తీసుకెళ్లడం కుదరకపోతే కనీసం ఢిల్లీ ఎయిమ్స్‌కు అయినా తీసుకెళ్లి అతనికి చికిత్స అందించాలని ఆమె కోరింది. కర్ణాటక నుంచి అక్కడి హోం మినిస్టర్, జిల్లా మంత్రి హైదరాబాద్‌కు వచ్చి మల్లికార్జున్ బండెను చూశారని, త్వరలోనే విదేశాల్లో వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు కానీ అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మల్లికార్జున్ బండె స్నేహితులు సునీల్, శంకర్గౌడా తదితరులు పాల్గొన్నారు.