సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షను ఈ నెల 22వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. ఈసారి పరీక్ష రోజున విద్యార్థులను హాల్లోకి గంట ముందుగానే అనుమతించనున్నట్లు చెప్పారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోరని స్పష్టం చేశారు. విద్యార్థులకు అరగంట ముందుగానే ఓఎంఆర్ జవాబు పత్రాన్ని అందజేస్తామని, సూచనలను జాగ్రత్తగా చదివి వివరాలను పొందుపరచాలని సూచించారు. ఒకసారి పెన్నుతో రాసిన తరువాత దిద్దుబాటుకు అవకాశం ఉండదు కాబట్టి ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని వివరాలను నమోదు చేయాలన్నారు. పరీక్ష సమయానికి 5 నిమిషాల ముందు బుక్‌లెట్ ఇస్తారని తెలిపారు. ఎంసెట్ కన్వీనర్ ‘సాక్షి’కి వెల్లడించిన మరిన్ని అంశాలు..
ఎంసెట్‌కు రూ. 10 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు ఆదివారంతో ముగిసింది.
పరీక్ష నిర్వహణకు 16,600 మంది సిబ్బందిని నియమించారు. 800 మంది అబ్జర్వర్లు, 50 స్పెషల్ అబ్జర్వర్లు ఉంటారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష కేంద్రాల్లో 227 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుంది.
ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు, ఇప్పటికే కాలేజీల్లో చేరి మళ్లీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారు, 2012కు ముందు ఎంసెట్ రాసి మళ్లీ మళ్లీ రాస్తున్న వారిపై నిఘా పెట్టారు. వారి సెల్‌ఫోన్ నంబర్లను పోలీసులకు అందజేశారు.
విద్యార్థులకు సూచనలు...
22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గం టలకు వరకు అగ్రికల్చర్ పరీక్ష ఉంటుంది. విద్యార్థులను గంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.
గతంలో జరిగిన సంఘటన నేపథ్యంలో విద్యార్థులు టాయిలెట్‌కు కూడా పరీక్ష హాల్లోకి రావడానికి ముందుగానే వెళ్లి రావాలనే నిబంధన విధించారు.
ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు ప్రింట్‌ను పరీక్ష హాల్లో అందజేయాలి.
నెగిటివ్ మార్కుల విధానం ఉండదు. కనీస అర్హత మార్కులు సాధించాలి.
ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు ఏమీ లేనందున వారు కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలి. పరీక్ష హాల్లోకి తీసుకు రాకపోతే జూన్ 1లోగా ఎంసెట్ కార్యాలయంలో సమర్పించాలి.
ఎంసెట్ పరీక్షా కేంద్రాలు: 750
ఇంజనీరింగ్ : 527
మెడికల్ : 227
ఇంజనీరింగ్ దరఖాస్తులు : 2,81,695
విద్యార్థులు : 1,75,365
విద్యార్థినులు : 1,06,330
మెడికల్ అండ్ అగ్రికల్చర్ : 1,11,777
విద్యార్థులు : 40,879
విద్యార్థినులు : 70,898
రెండిటికీ దరఖాస్తు
చేసిన వారు : 1,071
ఎంసెట్.. గంట ముందే హాల్లోకి
Published Mon, May 19 2014 1:53 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement