నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పరీక్ష ఎంసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచి, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విద్యార్థులను మధ్యాహ్నం 1:30 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించరు. అందువల్ల విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని విధిగా పరీక్ష కేంద్రంలో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు లేనందున ఎంసెట్‌లో వారి అర్హతను, ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని నిర్ధారించేందుకు వీలుగా కుల ధ్రువీకరణ పత్రాన్ని కచ్చితంగా పరీక్ష కేంద్రంలో అందజేయాలని లేనిపక్షంలో జూన్ 1వ తేదీలోగా ఎంసెట్ కన్వీనర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విద్యార్థులు అరగంట ముందుగా ఇచ్చే ఓఎంఆర్ జవాబుపత్రాన్ని తీసుకొని జాగ్రత్తగా చూసుకొని వివరాలను నింపాలన్నారు. అలాగే పరీక్ష హాల్లోకి వెళ్లడానికంటే ముందుగానే టాయిలెట్‌కు వెళ్లిరావడం ద్వారా మధ్యలో ఇబ్బంది పడకుండా చూసుకోవాలని సూచించారు.
9న ర్యాంకుల ప్రకటన!
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,93,472 మంది విద్యార్థులు (ఇంజనీరింగ్‌కు 2,81,695 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 1,11,777 మంది) ఎంసెట్‌కు హాజరుకానున్నారు. ఎంసెట్ పేపర్ సెట్‌ను గురువారం ఉదయం 6 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి పేపర్ సెట్‌ను ప్రకటించనున్నారు. ప్రాథమిక ‘కీ’ని ఈనెల 24న విడుదల చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, జూన్ 9న ర్యాంకులను ప్రకటించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలావుండగా ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాస్తున్న విద్యార్థుల కోసం ‘సాక్షి’ వేర్వేరుగా విడుదల చేసిన కౌన్సెలింగ్ బుక్‌లెట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంసెట్ పరీక్షా కేంద్రాల వద్ద గురువారం అందుబాటులో ఉండనున్నారుు.
నేడే ఎంసెట్
Published Thu, May 22 2014 1:41 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement