భారీగా పతనమైన ఆయిల్ ధరలు
న్యూయార్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. కీలకమైన ఒపెక్ సమావేశం ప్రారంభానికి ముందే క్రూడ్ ధరలు ఢమాల్ అన్నాయి. చమురు సరఫరాల నియంత్రణపై ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్‌యేతర దేశాలతో ఒపెక్ దేశాలు సమావేశంకానున్న నేపథ్యంలో ధరలు 4 శాతం పతనం కావడం ఆందోళన రేపింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 3.7 శాతం(1.76 డాలర్లు) దిగజారి 45.89 డాలర్లకు చేరింది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ మరింత అధికంగా 4 శాతం(1.84 డాలర్లు) పడిపోయి 44.48 డాలర్ల వద్ద నిలిచింది.
గత రెండేళ్లుగా నష్టాలను మూడగట్టుకుంటున్న ముడిచమురు ధరలను నిలబెట్టేందుకు సరఫరాలపై నియంత్రణలు తీసుకురావాలని సౌదీ అరేబియా ఇటీవల పేర్కొంది. అయితే సెప్టెంబర్ 26-28 మధ్య నిర్వహించనున్న సమావేశంపై ప్రతికూల అంచనాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సమావేశం విఫలంకావడం ఈ అంచనాలకు ఆధారమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒపెక్ సమావేశాల్లో 'నో డీల్' ఫలితం రానుందని మాక్క్వారీ కాపిటల్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. అల్జీరియా మీట్ మరో మీట్ చారిత్రక వైఫల్యం కానుందని పేర్కొంది. ఇది డిసిసేషన్ మేకింగ్ సమావేశం కాదని, కేవలం సంప్రదింపులు మాత్రమేనని సౌదీ ఆయిల్ అధికారులు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించాయి.
అలాగే ఫిజికల్ కమెడిటీస్ లో బ్యాంకుల జోక్యం పై ఆంక్షలు విధించాలన్న యోచనలోఉన్న ఫెడరల్ రిజర్వ్ విధానం, బలపడుతున్న డాలర్ విలువ, విద్యుత్ ధరలు, పెరిగిన చైనా ఎగుమతులు, ఒపెక్, నాన్ ఒపెక్ దేశాల మధ్య నెలొకొన్న విబేధాలు బ్రిటన్ కంపెనీల కష్టాలు ముఖ్యమైన అంశాలుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే నాన్ ఒపెక్ దేశం, ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దారు అయిన రష్యా ఈవారంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడం కూడా ఒక కారణమని తెలిపాయి. కాగా నాన్‌ఒపెక్ దేశమైన రష్యా ఈ ప్రతిపాదనకు మద్దతు పలకడంతో చమురు దేశాలకు ఆశలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అల్జీర్స్ లో వచ్చే వారం ఒపెక్ సమావేశానికి నిర్ణయించింది.