= ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఎస్‌ఐ భార్య వినతి
పంజగుట్ట (హైదరాబాద్), న్యూస్‌లైన్ : గుల్బర్గాలో ఓ పేరుమోసిన రౌడీషీటర్‌తో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన కర్ణాటక రోజా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మల్లికార్జున్ బండెను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని ఆయన భార్య మధు బండె కోరారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 8న గుల్బర్గాలో చోటారాజన్ గ్యాంగ్‌కు చెందిన కాలాకుత్తా గ్యాంగ్ సభ్యుడు మున్నా ఉన్నాడన్న సమాచారంతో ఎస్‌ఐ మల్లికార్జున్ అతడిని పట్టుకొనేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మున్నా హతమైనప్పటికీ.. అయితే, అతను కాల్చిన బుల్లెట్ ఎస్‌ఐ తలలో దూసుకెళ్లింది. మెరుగైన వైద్యం కోసం ఎస్‌ఐ మల్లికార్జున్ బండెను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐదు రోజులవుతున్నా ఇంకా తన భర్త ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, కోమాలోనే ఉన్నాడని మధు బండె ఆవేదన వ్యక్తంచేశారు.
యూకేలోని క్వీన్ ఎలిజిబెత్ ఆస్పత్రి వైద్యులనైనా హైదరాబాద్‌కు రప్పించాలని లేదా.. తన భర్తనైనా యూకేకు తరలించాలని ఆమె కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో పాకిస్తాన్‌కు చెందిన మలాల కూడా ఇదే విధంగా బుల్లెట్ గాయానికి గురైతే యూకే క్వీన్ ఎలిజిబెత్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం చేసి ఆమెకు నయం చేశారని, అదే విధంగా తన భర్తకు కూడా చికిత్స చేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
అక్కడికి తీసుకెళ్లడం కుదరకపోతే కనీసం ఢిల్లీ ఎయిమ్స్‌కు అయినా తీసుకెళ్లి అతనికి చికిత్స అందించాలని ఆమె కోరింది. కర్ణాటక నుంచి అక్కడి హోం మినిస్టర్, జిల్లా మంత్రి హైదరాబాద్‌కు వచ్చి మల్లికార్జున్ బండెను చూశారని, త్వరలోనే విదేశాల్లో వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు కానీ అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మల్లికార్జున్ బండె స్నేహితులు సునీల్, శంకర్‌గౌడా తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లండి
Published Tue, Jan 14 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement