లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. | Ranji Trophy 2024 Karnataka Dramatic Collapse In Gujarat Thriller Siddharth | Sakshi
Sakshi News home page

లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి..

Published Tue, Jan 16 2024 3:48 PM | Last Updated on Tue, Jan 16 2024 5:19 PM

Ranji Trophy 2024 Karnataka Dramatic Collapse In Gujarat Thriller Siddharth - Sakshi

ఏడు వికెట్లతో చెలరేగిన గుజరాత్‌ బౌలర్‌ (PC: BCCI Domestic X)

Ranji Trophy 2024 Guj Vs Kar: రంజీ ట్రోఫీ-2024లో భాగంగా కర్ణాటక- గుజరాత్‌ మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆట ఆసక్తి కలిగించింది. విజయం కోసం నువ్వా- నేనా అంటూ జట్లు పోటీపడిన తీరు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. కాగా అహ్మదాబాద్‌ వేదికగా జనవరి 12న మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కర్ణాటక.. గుజరాత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్‌ను 264 పరుగులకు ఆలౌట్‌ చేసింది. గుజరాత్‌ బ్యాటర్లలో క్షితిజ్‌ పటేల్‌ 95 పరుగులతో సత్తా చాటగా.. ఉమాంగ్‌ కుమార్‌ 72, కెప్టెన్‌ చింతన్‌ గజా 45 పరుగులతో రాణించారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్‌ నాలుగు, ప్రసిద్‌ కృష్ణ రెండు, విజయ్‌కుమార్‌ వైశాక్‌ రెండు, రోహిత్‌ కుమార్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు 374 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ ముగించింది. తద్వారా 110 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత గుజరాత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. 219 పరుగులకు ఆలౌట్‌ అయి కర్ణాటకకు 110 పరుగుల లక్ష్యం విధించింది.

'సిద్దార్థ్‌ సంచలన ప్రదర్శన
ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 50 పరుగుల దాకా ఒక్క వికెట్‌ కూడా కోల్పోని కర్ణాటక విజయం నల్లేరు మీద నడకేనని భావించింది. కానీ గుజరాత్‌ యువ స్పిన్నర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌(Siddharth Desai) కర్ణాటక ఆశలను అడియాసలు చేశాడు.

పెవిలియన్‌కు క్యూ కట్టిన కర్ణాటక బ్యాటర్లు
ఏకంగా ఏడు వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. తొలుత కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(19)ను పెవిలియన్‌కు పంపిన సిద్ధార్థ్‌.. దేవ్‌దత్‌ పడిక్కల్‌(31), నికిన్‌ జోస్‌(4), మనీష్‌ పాండే(0), సుజయ్‌ సతేరి((2), విజయ్‌కుమార్‌ వైశాక్‌(0), రోహిత్‌ కుమార్‌(0) వికెట్లు తీశాడు.

మరో స్పిన్నర్‌ రింకేశ్‌ వఘేలా కూడా సిద్దార్థ్‌తో పాటు రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి దెబ్బకు సోమవారం నాటి ఆఖరి రోజు ఆటలో.. మరో 53 పరుగుల వ్యవధిలోనే కర్ణాటక అనూహ్య రీతిలో ఆలౌట్‌ అయింది. దీంతో విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

ఈ ఉత్కంఠ పోరులో ఆఖరికి గుజరాత్‌నే గెలుపు వరించింది. తన అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన సిద్దార్థ్‌ దేశాయ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా తొమ్మిది వికెట్లు తీయడం విశేషం. ఈ నేపథ్యంలో సిద్దార్థ్‌ అద్భుత స్పెల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

చదవండి: టీమిండియాలో రీఎంట్రీ ఇస్తా.. 100 టెస్టులు ఆడటమే లక్ష్యం: రహానే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement