అధికారుల ముందే బియ్యం మాయం
Published Mon, Aug 22 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
నిజామాబాద్ అర్బన్:
విద్యాశాఖ అధికారుల తనిఖీల్లో ఆటోనగర్‌లోని ఖలీల్‌వాడి పాఠశాలలో అక్రమాలు వెలుగు చూశాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా నమోదు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం పక్కదారి పడుతుండడం, టీచర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువగా సాధారణ సెలవులు (సీఎల్) వాడుకున్నట్లు తేలింది. ఈ పాఠశాలను డీఈవో లింగయ్య శనివారం తనిఖీ చేయవగా, టీచర్ల గైర్హాజరుతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరపాలని డిప్యూటీ డీఈవో కృష్ణారావు, ఎంఈవోలను సోమవారం విచారణకు పంపించారు. వారు పాఠశాలలో ఉండగానే, హెచ్‌ఎం ఆటోలో ఏడు సంచుల బియ్యాన్ని అక్కడి నుంచి తరలించారు. దీన్ని గమనించిన ఎంఈవో హెచ్‌ఎంను నిలదీసి, డీఈవోకు సమాచారమిచ్చారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, బియ్యం నిల్వలను లెక్కించారు. అదనంగా నాలుగున్నర క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే, పాఠశాలలో కాకుండా మరోచోట కూడా మధ్యాహ్న భోజనం వాడుతున్నామని, బియ్యం సంచులు ఇక్కడ ఉంచినట్లు ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు. మరోచోట 100–150 మంది విద్యార్థుల పేర్లు నమోదు చేసి, అదనపు బియ్యం పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. తరలించిన బియ్యాన్ని తెచ్చి, సీజ్ చేశారు. ఇక, 10 మంది టీచర్లు అదనంగా సెలవులు (సీఎల్) వాడుకున్నట్లు గుర్తించారు. మరోవైపు 2014–15కు సంబంధించిన రిజిస్టర్ లేకపోవడంపై డిప్యూటీ డీఈవో మండిపడ్డారు. హెచ్‌ఎం బియ్యాన్ని తీసుకెళ్లమన్నాడని ఏజెన్సీ నిర్వాహకుడు సమీర్ అధికారులకు వివరించాడు. పాఠశాలలో అనేక లోపాలు గుర్తించామని, నివేదికను డీఈవోకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement