పరీక్షలయ్యాక బడికెళ్లాల్సిందే
Published Thu, Feb 16 2017 1:55 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
నల్లజర్ల : వార్షిక పరీక్షలు పూర్తవ్వగానే వేసవి సెలవులు వచ్చేసేవి. ఇకపై ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఇచ్చేందుకు నిర్ణయించినా.. పరీక్షల షెడ్యూల్ మాత్రం మారింది. మరోవైపు వేసవి సెలవులకు నెల రోజుల ముందుగానే విద్యార్థులకు పై తరగతిలో ప్రవేశం కల్పించి.. ఆ పాఠాలను బోధించనున్నారు. ఈ విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తోంది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జి.గంగాభవాని తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విద్యావిధానంలో కొత్త పద్ధతులు అమల్లోకి రానున్నాయని..ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను సరిచేసి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం కూడా తరగతులు కొనసాగుతాయన్నారు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరి నెల రోజుల్లో రెండో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తామని, ఇలా 1నుంచి 9వ తరగతి విద్యార్థులందరికీ పై పాఠాల బోధన ఉంటుందని వివరించారు. దీనివల్ల విద్యార్థులు పై తరగతిలోకి వెళ్లేసరికి వారికి పాఠ్యాం శాలు కొట్టిన పిండిలా మారతాయన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 22వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినమని, అప్పటివరకు దాదాపు నెల రోజులపాటు సంసిద్ధత తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో తదుపరి తరగతులకు సన్నద్ధం చేస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. సీబీఎస్‌ఈ విధానంలోనూ ఇదే పద్ధతి అమల్లోకి వస్తుందన్నారు.
తొలిసారి సమగ్ర మూల్యాంకనం
10వ తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం చేపట్టేందుకు రంగం సిద్ధమైందని డీఈఓ చెప్పారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో అన్ని సబ్జెక్ట్‌లకు 80 మార్కులకే ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. మిగిలిన 20 మార్కులకు విద్యార్థులు అంతకు ముందు రాసిన పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్నెల్ మార్కులు కలపనున్నట్టు చెప్పారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తుండటం వల్ల ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండబోదన్నారు.
టెన్‌త పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు
జిల్లాలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఈఓ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 246 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు 60వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఆమె వెంట కొయ్యలగూడెం డీవైఈవో తిరుమల దాసు ఉన్నారు.
Advertisement