గర్భంలోనే వృద్ధాప్యం నిర్థారణ
కొంతమంది యువకులు.. పుట్టుకతో వృద్ధులు అన్నారు. కొందరు అతి చిన్న వయసులోనే వృద్ధాప్యం మీద పడినట్లు కనిపిస్తారు. మరి కొందరు వయసు మళ్లినా యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనంతటికీ గర్భధారణ సమయమే ప్రధానమట. గర్భంతో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం, పోషకాలను బట్టే ఈ ప్రక్రియ ఆధారపడి ఉంటుందంటున్నారు లండన్ కు చెందిన పరిశోధకులు. గర్భంలోని పిండానికి అందే పోషకాల ఆధారంగానే పుట్టిన తర్వాత వారి యవ్వన, వృద్ధాప్య దశలు ప్రారంభమౌతాయని తాజా పరిశోధనలలో తేలింది.
పుట్టక ముందే ముదిమి లక్షణాలు నిర్థారణ అవుతాయని లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. గర్భధారణ, పిండ అభివృద్ధిని ఎలుకలపై ప్రయోగించి చూశారు. గర్భధారణ సమయంలో తల్లి గర్భంలో ఆక్సిజన్ తగ్గడం, ధూమపానం వంటి అలవాట్లతో పుట్టే పిల్లల్లో యవ్వనం, వృద్ధాప్యం వంటి లక్షణాలు సంక్రమిస్తాయని, చిన్నతనంలోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందని కనుగొన్నారు. మనుషుల్లో 23 జతల క్రోమోజోములుంటాయి. ప్రతి క్రోమోజోమ్ చివరి భాగాన్ని టెలోమేర్‌గా పిలుస్తారు. షూలేస్ చివరి భాగంలోని ప్లాస్టిక్ లా ఉండే ఈ టెలోమేర్లు క్రోమోజోములను బయటకు వెళ్లకుండా నివారిస్తుంటాయి. ఈ టెలోమేర్లు చిన్నివిగా మారడాన్ని బట్టి మనిషి వయసును, వృద్ధాప్యాన్ని లెక్కించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ప్రయోగాల్లో భాగంగా పుట్టిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ఉండే టెలోమేర్ల పొడవును కొలిచారు. అవి గర్భంలో ఉన్నప్పుడు తల్లి పొందిన యాంటీ ఆక్సిడెంట్లు, ఆక్సిజన్ ను బట్టి ఉన్నట్లు తెలుసుకున్నారు. గర్భంలో పిండం పెరుగుదల వారికి అందే ఆక్సిజన్ ను బట్టి ఉంటుందని, అది పుట్టిన తర్వాత వచ్చే లక్షణాలకు కారణమౌతుందని చెప్తున్నారు.
తల్లి గర్భంలో ఉన్నపుడు తక్కువ ఆక్సిజన్ ను ఆమ్లాలను పొందిన ఎలుక పిల్లలు కాస్త ఎక్కువ వయసున్నట్లుగా కనిపించాయని, అవి గుండె సంబంధిత వ్యాధులను కూడా కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాంటి పిల్లలు తక్కువ పొడవున్న టెలోమేర్స్ ను కలిగి ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. సరైన ఆక్సిజన్, యాంటీ ఆక్సిడెంట్లు అందిన పిల్లలు ఆరోగ్యంగానూ, తక్కువ వయసున్నట్లు కనిపించడంతోపాటు.. టెలోమేర్ల పొడవు కూడా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఎలుకలపై చేసిన తమ ప్రయోగాలు పుట్టిన తర్వాతే కాక గర్భంలో ఉన్నప్పుడే పిల్లల పెరుగుదల, లక్షణాలకు కారణమైనట్లుగా నిర్థారిస్తున్నాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులు డినో గిస్పాని చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణాన్ని బట్టి, అలవాట్లను బట్టి మన జన్యువుల్లో వచ్చే లోపాలు ఊబకాయానికి, గుండె జబ్బులకు కారణాలవుతున్నట్లు మనకు తెలుసని, అయితే ప్రస్తుత పరిశోధనలు గర్భంలోఉన్నపుడే ముదిమి లక్షణాలు, గుండె జబ్బులు నిర్ధారణ అవుతాయని నిరూపించినట్లు ఫ్యాసబ్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనలో తెలిపారు.