4 వేల మందిని ఉరితీసిన ఐఎస్ఐఎస్
లండన్: ప్రపంచ అగ్రదేశాలపై దాడులు చేస్తూ వస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్. అయితే ఈ ఉగ్ర సంస్థ గత రెండేళ్ల కాలంలో 4 వేల కంటే ఎక్కువ మందిని ఉరితీసింది. ఈ విషయాన్ని యూకేకు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అధికారులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఇప్పటికైనా ఈ విషయాన్ని తీవ్రమైన నేరాలుగా భావించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమాయకులను ఉరితీయడంతో పాటు కాల్పులు జరపడం, బాంబు దాడులకు పాల్పడటం లాంటి హేయమైన చర్యలకు ఐఎస్ఎస్ పాల్పడుతుందని వారు ఆవేదన చెందారు. 4,144 మందిని ఉరితీసినట్లు మానవ హక్కుల సంస్థ అధికారికంగా వెల్లడించింది.
సున్నీలు, కుర్దిష్ సిటిజన్లే ఈ మృతులలో 2,230 మంది ఉన్నారు. గుఢచర్యానికి పాల్పడుతున్నాడన్న అనుమానంతో సొంత సోదరుడినే హత్య చేస్తున్న ఘటనలు ఐఎస్ఎస్ సంస్థ కార్యకలాపాలతో భాగమవుతున్నాయి. కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఈ ఏదాడి మార్చి నాటికి 80 మందిని హత్య చేయగా అందులో చిన్నారులు, ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారని యూకే సంస్థ వెల్లడించింది. 13 ఏళ్ల చిన్నారులు కూడా చేతుల్లో భయంకరమైన ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని, కొన్ని నెలల కిందట ఏకే 47లతో ఆరుగురి తలలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్యచేయడంపై ఎస్ఓహెచ్ఆర్ ఉన్నతాధికారి విచారం వ్యక్తంచేశారు.