10 ఏళ్లలో మూడు మరణశిక్షలు
న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్షను ఖరారుచేసింది. అనేక చర్చోపచర్చలు, వాదనల తర్వాత టాడా అతనికి విధించిన డెత్ వారెంట్ శిక్షను సమర్ధించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం యాకూబ్ మెమన్ ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రెండోసారి కూడా తిరస్కరిస్తే గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు కావడం ఖాయం. గత పదేళ్లలో కోర్టులు విధించిన మరణశిక్షలు, అమలైన ఉరిశిక్షను ఒకసారి పరిశీలిస్తే..
భారతదేశంలో 2004 నుంచి 2013 మధ్య కాలంలో నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 1303 మందికి మరణశిక్షలు విధించారు. అయితే వీరిలో ముగ్గురికి మాత్రమే ఈ శిక్ష అమలైనట్టు లెక్కలు చెబుతున్నాయి.
గత పదేళ్లలో మూడు ఉరిశిక్షలు
1. పశ్చిమ బెంగాల్ (2004): ఒక బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఉదంతంలో ధనుంజయ్ చటర్జీని ఆగస్టు 14 అలీపూర్ కేంద్ర కారాగారంలో ఉరితీశారు. యాదృచ్ఛికంగా ఆ రోజు అతని 42 వ పుట్టినరోజు.
2. మహారాష్ట్ర (2012): 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ను పుణే ఎర్రవాడ జైలులో నవంబర్ 21న ఉరి తీశారు.
3. న్యూఢిల్లీ(2013): 2001 పార్లమెంటు దాడి కేసులో ఉగ్రవాది మహమ్మద్ అఫ్జల్ గురుకు సుప్రీం విధించిన మరణశిక్ష ఫిబ్రవరి 9 న అమలైంది.
ఇదిలా ఉంటే రేపు జూలై 30న యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలైతే, పుట్టినరోజు నాడు ఉరిశిక్ష అమలైన దోషులలో మెమన్ రెండో వాడవుతాడు.
కాగా సుమారు 3,751 మంది దోషులకు విధించిన ఉరిశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ముస్లిం కాబట్టే మెమన్ ను ఉరితీస్తున్నారన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 170 (మెమన్తో కలిపి) మందికి ఉరిశిక్ష పడితే వారిలో 15 మంది ముస్లింలకు ఉరిశిక్షలు అమలయ్యాని బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. అయితే సుమారు 60 మంది ముస్లింలను (వారి ఇంటిపేర్ల ఆధారంగా) ఉరితీశారని ఏఎన్ఐ రిపోర్టు.
మరోవైపు యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష ఖరారుకావడంలో ముంబై పేలుళ్ల బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇది మా జీవితంలో మర్చిపోలేని రోజన్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ బంధువుల ఆత్మలకు 22 ఏళ్ల తరువాత శాంతి చేకూరిందని దేశ్ముఖ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని కోరుతున్నారు.
అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశ న్యాయచరిత్రలో ఇది చీకటిరోజని ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది సతీష్ మానే షిందే వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ నేరాల కారణంగా ఉరికంబాలు ఎక్కుతున్నవారిలో పేదలు, వెనుకబడిన వర్గాల వారే అధికంగా ఉంటున్నారని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏపీ షా గతంలో వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌కలాం కూడా మరణశిక్షలను వ్యతిరేకించారు. డీఎంకే నేత కనిమొళి, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తదితరులు మరణశిక్షలను వ్యతిరేకించిన వారిలో ఉండగా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మరణశిక్షలను సమర్థించింది.