mumbai blast
-
అతి త్వరలోనే ముంబైని పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపులు
ముంబై నగరం ఎప్పుడూ ఉగ్రవాద సంస్థ హిట్ లిస్టులో ఉంది. ఎప్పుడు, ఏ రూపంలో ఉగ్రదాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. తాజాగా ముంబై పోలీసు శాఖకు రెండు బెదిరింపులు వచ్చాయి. ముంబై నగరాన్ని బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు ఓ వ్యక్తి పోలీస్ శాఖకు ట్వీట్ చేశారు. ‘ముంబైను అతి త్వరలోనే బాంబు పెట్టి పేల్చబోతున్నాను’ అని ట్వీట్ వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో ముంబై పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి 26\11 తరహాలో ఉగ్రదాడులకు పాల్పడుతామంటూ పూర్తిగా మాట్లాడకుండానే ఫోన్ కట్ చేశాడు. తను రాజస్తాన్ నుంచి మాట్లాడుతున్నానని 26\11 తరహాలో దాడులు చేస్తామని చెప్పిఫోన్ కట్ చేశాడు. ఈ ఫోన్ కాల్‌ను సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఫోన్ ఎవరు. ఎక్కడి నుంచి చేశారనేది ఆరా తీస్తున్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి బెదిరింపు ఫోన్ చేశాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆ దిశగా పోలీసుల బృందం దర్యాప్తు చేస్తుంది. కాగా గత ఏడాది కాలంగా ముంబై పోలీస్ శాఖకు బెదిరింపు ఫోన్స్ కాల్స్, మెసెజ్‌లు ఎక్కువగా వన్నాయని పోలీసులు తెలిపారు. తీ క్రమంలో ఇప్పటికే విమానాశ్రయం, మంత్రాలయ, బీఎస్ఈ తదితర కీలక కార్యాయాల వద్ద ప్రార్థనా స్థలాల వద్ద భారీ పోలీసులు బందో బస్తు ఉంటుంది. బెదిరింపు ఫోన్లు వస్తే భద్రత మరింత కట్టుదిట్టం చేస్తారు. చదవండి: భారత్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్.. నేపాల్‌లో సినీ ఫక్కీలో అరెస్ట్ -
ఉగ్ర సయీద్ అరెస్ట్
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. త్వరలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్‌ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇదే జైలులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. ఉగ్రవాది హఫీజ్ సయీద్ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తంచేశారు. -
ఆ హీరో సంపాదన.. రూ. 450
పుణె ఎరవాడ జైలు నుంచి గురువారం విడుదల కానున్న సంజయ్ దత్‌కు జైలు అధికారులు 450 రూపాయలు అందజేయనున్నారు. ఇన్నాళ్లు ఖైదీగా జైల్లో పేపర్ బ్యాగులు తయారు చేసిన సంజయ్, రోజుకు 50 రూపాయల చొప్పున రూ. 38,000 వరకు సంపాదించాడు. అయితే జైల్లో తన అవసరాల నిమిత్తం చాలావరకు ఖర్చు చేయటంతో విడుదల సమయంలో కేవలం రూ. 450 మాత్రం అతని చేతికి రానున్నాయి. 1993లో జరిగిన ముంబై పేలుళ్ల కేసులో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్ దత్ శిక్ష అనుభవించాడు. 2013లో సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునివ్వగా అప్పటికే 18 నెలల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నాడు. మిగతా కాలాన్ని కూడా పూర్తిచేసుకున్న సంజయ్.. ఈ గురువారం విడుదలవుతున్నాడు. సంజయ్ దత్‌ను లీడ్ రోల్లో తీసుకుని పలు చిత్రాలు నిర్మించడానికి బాలీవుడ్ సినీ పరిశ్రమ సమాయత్తమవుతోంది. -
చనిపోయిన ఏడుగురు ఒకే కాలేజీ విద్యార్థులు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై హోటల్లో భారీ పేలుళ్ల ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుర్లాలోని సిటీ కినారా హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో చనిపోయిన 8 మందిలో ఏడుగురు ఒకే కాలేజీకిచెందిన వారు కావడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం చైనీస్ ఫుడ్ సెంటర్ లో జరిగిన సిలిండర్ పేలుడులో డాన్ బాస్కో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సజీవ దహనమైపోయారు. తమ కాలేజీకి అతి సమీపంలో ఉండటంతో వారు ఈ హోటల్ ను ఎంచుకున్నారు. చనిపోయిన వారిని సర్జిల్ షేక్, సాజిద్ షేక్, ఆకాషి థాపర్, బ్రియాన్ ఫెర్నాండెజ్, బెర్నాడెట్ డిసౌజా, ఇర్విన్ డిసౌజా, తాహాగా గుర్తించారు. వీరంతా ఇంజనీరింగ్ రెండు, మూడో సంవత్సరాలు చదువుతున్నారు. కాగా ఎనిమిదో వ్యక్తిని స్టెర్లింగ్ సంస్థలో డిజైనర్ ఇంజనీర్ అరవింద్ కనౌన్జియా(31) గా గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం గ్యాస్ లీకవ్వడంతో మంటలంటుకుని సిలిండర్ పేలింది. దీంతో హోటల్లోని మొదటి అంతస్తులో కూర్చున్న విద్యార్థులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా మెట్ల దగ్గర అగ్నికీలలు ఎగసిపడటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కిటికీలకు స్టీల్ గ్రిల్ ఉండడంతో, కనీసం కిటికీలోంచి దూకే ఛాన్స్ లేక, వారు అగ్నికి ఆహుతైపోయారు. భవన నిర్మాణంలో కనీస జాగ్రత్తలేవీ పాటించలేదని కుర్లా డివిజన్ ఎసీపి శ్రీరంగ తెలిపారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరివల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. బాధుల్యపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో మరికొంత మందికి కూడా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. -
'చీకటిని చూసి భయపడుతున్నాడట'
ముంబై: ఎందరో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముంబై మారణహోమం కేసులో కీలక నిందితుడు అబూ జుందాల్ వ్యవహరశైలి అనుమానాస్పదంగా మారింది. వందలమంది జీవితాల్లో చీకట్లు నింపిన అబూ జుందాల్... ఇప్పుడు అదే చీకటిని చూసి భయపడుతున్నాడట. తనకు గాలి, వెలుతురు కావాలని పేచి పెడుతున్నాడట. ముంబైలోని అర్థర్ జైలులో ఖైదీగా ఉన్న అబూ జుందాల్ నిరాహార దీక్షకు దిగాడు. తనను చీకటి గది నుంచి వెలుతురు ఉన్న గదిలోకి మార్చాలంటూ దీక్ష చేపట్టాడు. చీకటి గదిలో ఉండడం వల్ల తాను మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని జుందాల్ తెలిపాడు. తన డిమాండ్లను పేర్కొంటూ బుధవారం మోకా కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్‌ను నిఘా వర్గాలు 2012లో సౌదీ అరేబియాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
10 ఏళ్లలో మూడు మరణశిక్షలు
న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్షను ఖరారుచేసింది. అనేక చర్చోపచర్చలు, వాదనల తర్వాత టాడా అతనికి విధించిన డెత్ వారెంట్ శిక్షను సమర్ధించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం యాకూబ్ మెమన్ ఉరితీసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రెండోసారి కూడా తిరస్కరిస్తే గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు కావడం ఖాయం. గత పదేళ్లలో కోర్టులు విధించిన మరణశిక్షలు, అమలైన ఉరిశిక్షను ఒకసారి పరిశీలిస్తే.. భారతదేశంలో 2004 నుంచి 2013 మధ్య కాలంలో నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 1303 మందికి మరణశిక్షలు విధించారు. అయితే వీరిలో ముగ్గురికి మాత్రమే ఈ శిక్ష అమలైనట్టు లెక్కలు చెబుతున్నాయి. గత పదేళ్లలో మూడు ఉరిశిక్షలు 1. పశ్చిమ బెంగాల్ (2004): ఒక బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఉదంతంలో ధనుంజయ్ చటర్జీని ఆగస్టు 14 అలీపూర్ కేంద్ర కారాగారంలో ఉరితీశారు. యాదృచ్ఛికంగా ఆ రోజు అతని 42 వ పుట్టినరోజు. 2. మహారాష్ట్ర (2012): 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను పుణే ఎర్రవాడ జైలులో నవంబర్ 21న ఉరి తీశారు. 3. న్యూఢిల్లీ(2013): 2001 పార్లమెంటు దాడి కేసులో ఉగ్రవాది మహమ్మద్ అఫ్జల్ గురుకు సుప్రీం విధించిన మరణశిక్ష ఫిబ్రవరి 9 న అమలైంది. ఇదిలా ఉంటే రేపు జూలై 30న యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలైతే, పుట్టినరోజు నాడు ఉరిశిక్ష అమలైన దోషులలో మెమన్ రెండో వాడవుతాడు. కాగా సుమారు 3,751 మంది దోషులకు విధించిన ఉరిశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ముస్లిం కాబట్టే మెమన్ ను ఉరితీస్తున్నారన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 170 (మెమన్‌తో కలిపి) మందికి ఉరిశిక్ష పడితే వారిలో 15 మంది ముస్లింలకు ఉరిశిక్షలు అమలయ్యాని బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. అయితే సుమారు 60 మంది ముస్లింలను (వారి ఇంటిపేర్ల ఆధారంగా) ఉరితీశారని ఏఎన్ఐ రిపోర్టు. మరోవైపు యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారుకావడంలో ముంబై పేలుళ్ల బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇది మా జీవితంలో మర్చిపోలేని రోజన్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ బంధువుల ఆత్మలకు 22 ఏళ్ల తరువాత శాంతి చేకూరిందని దేశ్‌ముఖ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలని కోరుతున్నారు. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశ న్యాయచరిత్రలో ఇది చీకటిరోజని ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది సతీష్ మానే షిందే వ్యాఖ్యానించారు. దేశంలో వివిధ నేరాల కారణంగా ఉరికంబాలు ఎక్కుతున్నవారిలో పేదలు, వెనుకబడిన వర్గాల వారే అధికంగా ఉంటున్నారని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏపీ షా గతంలో వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌కలాం కూడా మరణశిక్షలను వ్యతిరేకించారు. డీఎంకే నేత కనిమొళి, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తదితరులు మరణశిక్షలను వ్యతిరేకించిన వారిలో ఉండగా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మరణశిక్షలను సమర్థించింది.