ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై హోటల్లో భారీ పేలుళ్ల ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుర్లాలోని సిటీ కినారా హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో చనిపోయిన 8 మందిలో ఏడుగురు ఒకే కాలేజీకిచెందిన వారు కావడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.
శుక్రవారం చైనీస్ ఫుడ్ సెంటర్ లో జరిగిన సిలిండర్ పేలుడులో డాన్ బాస్కో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు సజీవ దహనమైపోయారు. తమ కాలేజీకి అతి సమీపంలో ఉండటంతో వారు ఈ హోటల్ ను ఎంచుకున్నారు. చనిపోయిన వారిని సర్జిల్ షేక్, సాజిద్ షేక్, ఆకాషి థాపర్, బ్రియాన్ ఫెర్నాండెజ్, బెర్నాడెట్ డిసౌజా, ఇర్విన్ డిసౌజా, తాహాగా గుర్తించారు. వీరంతా ఇంజనీరింగ్ రెండు, మూడో సంవత్సరాలు చదువుతున్నారు. కాగా ఎనిమిదో వ్యక్తిని స్టెర్లింగ్ సంస్థలో డిజైనర్ ఇంజనీర్ అరవింద్ కనౌన్జియా(31) గా గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం గ్యాస్ లీకవ్వడంతో మంటలంటుకుని సిలిండర్ పేలింది. దీంతో హోటల్లోని మొదటి అంతస్తులో కూర్చున్న విద్యార్థులు చిక్కుకుపోయారు. ముఖ్యంగా మెట్ల దగ్గర అగ్నికీలలు ఎగసిపడటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కిటికీలకు స్టీల్ గ్రిల్ ఉండడంతో, కనీసం కిటికీలోంచి దూకే ఛాన్స్ లేక, వారు అగ్నికి ఆహుతైపోయారు. భవన నిర్మాణంలో కనీస జాగ్రత్తలేవీ పాటించలేదని కుర్లా డివిజన్ ఎసీపి శ్రీరంగ తెలిపారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరివల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. బాధుల్యపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో మరికొంత మందికి కూడా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
చనిపోయిన ఏడుగురు ఒకే కాలేజీ విద్యార్థులు
Published Sat, Oct 17 2015 1:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM
Advertisement