కోల్‌కతా:పశ్చిమబెంగాల్‌లో 2020లో యువకుడిని ముక్కలుముక్కలుగా చేసి హత్య చేసిన కేసులో ఏడుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇది అత్యంత క్రూరమైన రీతిలో జరిగన హత్య కావడం వల్లే నిందితులకు మరణశిక్ష విధిస్తున్నట్లు చిన్సూర సెషన్స్‌కోర్టు తెలిపింది. ఓ ముక్కోణపు ప్రేమకథలో బిష్ణుమాల్(23) అనే యువకుడిపై బిశాల్ అనే యువకుడు కోపం పెంచుకున్నాడు.
స్నేహితుల సహకారంతో బిష్ణును అతడి ఇంటివద్ద నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఓ ఇంట్లో బిష్ణు శరీరాన్ని ఆరు ముక్కలుగా చేసి హత్యచేశారు. బిష్ణుమాల్‌ను ముక్కలుగా చేసిన తతంగాన్ని మొత్తం నిందితులు వీడియో చిత్రీకరించారు. అనంతరం శరీరభాగాలను పలు ప్రాంతాల్లో పారవేశారు. ఈ కేసులో బిష్ణు ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న యువతి సాక్ష్యం కీలకంగా పనిచేసిందని ప్రాసిక్యూటర్ తెలిపారు.
బిష్ణు హత్యలో నేరుగా పాల్గొన్న ఏడుగురు నిందితులకు మరణశిక్ష పడగా నిందితులకు సహకరించిన మరొకరికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. కేసులో అందరు నిందితులను హత్యజరిగిన వెంటనే పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ప్రధాన నిందితుడు బిశాల్ మాత్రం నెల రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. బిశాల్ అరెస్టయిన తర్వాతే మృతుడి తల భాగాన్ని పోలీసులు రికవర్ చేయగలిగారు. తలను ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి బిశాల్ తన ఇంట్లో దాచుకోవడం అప్పట్లో సంచలనం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment